Tags

, ,

Image result for andhra pradesh

ఎం కోటేశ్వరరావు
రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాజీ అయ్యేఎస్‌ అధికారి జిఎన్‌ రావు కార్యదర్శిగా నియమించిన ఐదుగురు నిపుణుల కమిటీ ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు కానుకగా తమ నివేదిను అందించింది. దీనిలో ఏదో అలా జరిగిపోయింది గానీ, ముందస్తు ఆలోచనేమీ లేదని జగన్‌ అభిమానులు చెప్పుకోవచ్చు గానీ, అంతర్గతంగా వారే మరోవిధంగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా వచ్చేది లేదు పోయేది లేదు. ఆంధ్రుల గురించి అలారాసి పెట్టి ఉంది, కనుక జరగాల్సింది జరిగింది అనుకోవాలా ?
ఒక్కటి మాత్రం స్పష్టం. అదేమిటో నాకన్నీ ముందే అలా తెలిసిపోతుంటాయి అన్నట్లుగా నివేదిక ఇవ్వక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారు. కాలజ్ఞానం విషయంలో పోతులూరి వీరబ్రహ్మం గారిని మించి పోయారు. గత సర్కార్‌ హయాంలో రాజధాని నిర్ణయం జరగముందే అంతర్గత వ్యాపారం జరిగిందని ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో నివేదిక తయారీకి అంతర్గత బోధ జరిగిందన్నది కూడా అంతే స్పష్టం. అమరావతిలో అంతర్గత వ్యాపారం(ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌) జరిగిందనటానికి జగన్‌ సర్కార్‌ వెల్లడించిన భూముల వివరాలు సాక్ష్యం అనుకుంటే, జగన్‌ ముందే చెప్పినట్లుగానే మూడు రాజధానుల మీద అంతర్గత బోధ (ఇన్‌సైడర్‌ బ్రీఫింగ్‌) జరిగిందనేందుకు జిఎన్‌ రావు కమిటీ నివేదిక తిరుగులేని సాక్ష్యం ! ఈ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపి, ఆమోదం వచ్చిన తరువాత ఎంతవరకు అమలు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది. వీటిలో కేంద్ర ప్రమేయం, రాష్ట్ర అధికారాల గురించి చూడాల్సి ఉంది.
ఇక ఈ నివేదిక పూర్తి పాఠం ఇంకా అందలేదు కనుక జిఎన్‌రావు విలేకర్లతో చెప్పిన అంశాలకే ఈ పరిశీలన పరిమితం. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌గా ఏర్పాటు చేయాలని, ఒక దానిలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రెండవ దానిలో ఉభయ గోదావరులు, కృష్ణా, మూడవ దానిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాలుగవ దానిలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉండాలని పేర్కొన్నారు. విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలని అమరావతి, విశాఖలో డివిజన్‌ బెంచ్‌లు పెట్టాలని సూచించారు. అమరావతిలో భాగం గాని మంగళగిరి ప్రాంతంలో మంత్రుల నివాసాలు, అమరావతిలో గవర్నర్‌, అసెంబ్లీ అని చెప్పారు. విశాఖలో అసెంబ్లీ వేసవి సమావేశాలు జరపాలన్నారు. ఇవన్నీ కూడా పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి జనాభిప్రాయ సేకరణ చేసిన తరువాత చెప్పామన్నారు.
ఈ నివేదిక ఇచ్చేందుకు కమిటీ సభ్యులు పదివేల కిలోమీటర్ల దూరం తిరిగి వారు ప్రయాసకు గురై రాస్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేశారనిపిస్తోంది. నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ను కర్ణాటక తరహాలో అని వారే చెప్పారు. ఇంటర్నెట్‌లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. రెండవది ప్రాంతీయ కమిషనరేట్స్‌ లేదా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అనేవి మనకు తెలియనివి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ముల్కీ నిబంధనల అమలును సుప్రీం కోర్టు సమర్ధించిన తరువాత దానిని రద్దు చేసి ఆరుసూత్రాల పధకంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. తరువాత వాటిని కూడా రద్దు చేశారు. ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమిషనరేట్స్‌ అంటే వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలియదు. కర్ణాటక కమిషనరేట్స్‌ అయితే రెవెన్యూ డివిజన్లు. అంటే రాష్ట్ర కేంద్రం, జిల్లాల మధ్య మరొక అధికార దొంతర ఏర్పడుతుంది. లేదా గతంలో మాదిరి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అయితే రాజకీయనేతలకు ఉద్యోగాలిస్తారు. ఏది చేసినా వీటి ద్వారా ఆయా జిల్లాలను ఎలా అభివృద్ది చేస్తారు ? ఇప్పుడున్న వ్యవస్ధలో అభివృద్దికి అడ్డువస్తున్న ఆటంకా లేమిటి ?
కర్ణాటకలో అలాంటి ఏర్పాటు చేసినా అనేక ప్రాంతాలు వెనుకబడిపోయాయి. నైజాం సంస్ధానం నుంచి విడదీసి కర్ణాటకలో విలీనం చేసిన కన్నడ ప్రాంతాలలో ఇది చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ వరకు దారి తీసింది. ఇప్పటికీ దానిని ముందుకు తెస్తూనే ఉన్నారు. అనేక రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలలో అలాంటి డిమాండ్లే ఉన్నాయి. మొత్తంగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఎక్కడ గతంలో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయో అక్కడే, ఎక్కడ రేవులు, రోడ్డు, ఇతర రాష్ట్రాలకు సులభంగా సరకు రవాణా అవకాశాలుంటాయో అక్కడికే పెట్టుబడులు తరలి వెళుతున్నాయి తప్ప వెనుకబడిన ప్రాంతాలకు రావటం లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇది మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, అనేక సంస్ధలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి తమ అనుయాయలకు తెగనమ్మి కట్టబెట్టే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. అటువంటపుడు నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుకు, అభివృద్ధికి సంబంధం ఏమిటి ? వైసిపి దగ్గర నవరత్నాలు తప్ప ఇతర అభివృద్ధి పధకాల ఊసే లేదు. ప్రయివేటు పెట్టుబడుల గురించి ప్రధాని నరేంద్రమోడీ పలు విమర్శలపాలై పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగా అని చెప్పుకున్నా వచ్చిన పెట్టుబడులు లేవు, మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలం కావటం చూస్తున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఎక్కడి నుంచి తీసుకువస్తారు ?
జిఎన్‌ రావు కమిటీలో ఉన్నదంతా పట్ణణ ప్రణాళికల నిపుణులే కనుక పట్టణీకరణ గురించి ప్రస్తావించి, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిజానికి ఇది సామాన్యులకు కూడా తెలిసిన అంశమే. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ది చేసేది ఎవరనేదే కదా ప్రశ్న. సహజవనరులను దోచుకోవటానికి పెట్టుబడిదారులు ఎక్కడికైనా వెళతారు తప్ప పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేందుకు ఎక్కడా ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టిన చోట్లనే అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. మధ్య కోస్తోలో వ్యవసాయ రంగంలో మిగులు పట్టణీకరణ, వ్యాపారాల అభివృద్ధికి ఒక కారణం తప్ప ఒక్క పట్టుమని పదివేల మందికి ఒక దగ్గర ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ లేదు.
2019 జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో పని చేయటం ప్రారంభమైంది. తిరిగి దానిని కర్నూలుకు తరలించటానికి, విశాఖ, అమరావతిలో బెంచ్‌లు ఏర్పాటు చేయటానికి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏమేరకు ఆమోదిస్తాయన్నది సందేహమే. మద్రాసు ప్రావిన్సులోని తెలుగు ప్రాంతాలలో ఒక విశ్వవిద్యాలయం(తెలుగుకు పర్యాయపదం ఆంధ్రం కనుక ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని స్ధాపించాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై నాటి కాంగ్రెస్‌ నేతల( ఆంధ్రా-రాయలసీమ) మధ్య వివాదం వచ్చింది. చాలా సంవత్సరాల పాటు కొనసాగి చివరికి విశాఖలో 1926లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రాంత నేతలు తన్నుకు పోయారనే అసంతృప్తిలో ఉన్న రాయలసీమ నేతలను సంతృప్తి పరచేందుకు చిత్తూరు, ఇతర రాయలసీమ(సీడెడ్‌) జిల్లాలను మాత్రం దానిలో చేర్చకుండా మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారు. తరువాత మద్రాసు ప్రావిన్సు నుంచి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చినపుడు మరోసారి రాయల సీమకు అన్యాయం జరుగుతుందనే భయాన్ని ఆ ప్రాంత నేతలు వ్యక్తం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఉభయ ప్రాంతాల నేతలు కాశీనాధుని నాగేశ్వరరావు గృహం శ్రీబాగ్‌లో సమావేశమై భవిష్యత్‌లో ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే రాయలసీమలో హైకోర్టు లేదా రాజధానిని ఏర్పాటు చేయాలనే ( పెద్ద మనుషుల )ఒప్పందానికి వచ్చారు. ఆమేరకు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. తరువాత రెండింటినీ హైదరాబాద్‌కు తరలించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత వివిధ చోట్ల హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు ఒక్కదానినీ ఆమోదించలేదు. ఇరవై రెండు కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అలహాబాద్‌లోహైకోర్టు, లక్నోలో బెంచ్‌ ఉంది. మరో ఐదు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి, అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా అలాంటి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల బెంచ్‌లు పెట్టాలన్న ప్రతిపాదనను అంగీకరించటానికి కేంద్రం ఏ ప్రాతిపదికన ముందుకు వస్తుంది అన్నది ప్రశ్న. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని జిఎన్‌ రావు కమిటీ ఉటంకించింది.

Image result for ys jagan mohan reddy
ఈ కమిటీ నివేదిక ఒక ప్రహసన ప్రాయం అన్నది స్పష్టం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఆకాంక్ష వైసిపిలో ఎన్నడూ కనిపించలేదు. వారు కోరుకున్న విధంగా వ్యవహరించేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలంటే దానికి ఒక కమిటీ నివేదిక కావాలి. అందుకోసం ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఏమి రాయాలో రాయించుకున్నారు అన్న అభిప్రాయాలు సర్వత్రా వెల్లడి అవుతున్నాయి. గతంలో రాజధాని నిర్ణయానికి ముందు అనుయాయులకు ఉప్పందించి లబ్ది చేకూర్చేట్లు చేశారని, చంద్రబాబుతో సహా అనేక మంది భూములు కొనుగోలు చేసిన గ్రామాలను రాజధాని పరిధి, భూ సేకరణ నుంచి తప్పించారని వైసిపి చెబుతోంది. ఆమేరకు అసెంబ్లీలో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల వెనుక వైసిపి నేతలు కూడా అదే పనికి పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ వివరాలు ఐదేండ్ల తరువాత కొత్త ప్రభుత్వం వస్తే, వారు బయట పెట్టేంత వరకు అనుమానాలు, ఆరోపణలుగానే ఉంటాయి. ఐదేండ్ల తరువాత వచ్చే పాలకులు మూడు రాజధానుల్లో అనుకున్నట్లుగా అభివృద్ది జరగలేదంటూ మరొక కమిటీని వేసి మరో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ? తన అధికారానికి ఇక తిరుగులేదని వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నట్లే గతంలో చంద్రబాబు కూడా అనుకున్నారు, అయినా వేరేలా జరగలా ? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు !