Tags

, , ,

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.