Tags

, , ,

Image result for donald trump impeachment
ఎం కోటేశ్వరరావు
అమెరికాకు 1776లో స్వాతంత్య్రం వస్తే రాజ్యాంగం 1789 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు అధ్యక్షులను అభిశంసన ద్వారా గద్దె దించే ప్రయత్నాలు జరిగాయి. రెండు ప్రయత్నాలు విఫలం కాగా, ఒక అధ్యక్షుడు అభిశంసన ప్రక్రియ ప్రారంభానికి ముందే రాజీనామా చేశాడు. నాలుగవ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అతగాడి మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి ఈ నెల 19న పార్లమెంట్‌ దిగువ సభ అమెరికన్‌ కాంగ్రెస్‌(ప్రజాప్రతినిధుల సభ) విచారణ జరిపి ట్రంప్‌ నేరం చేశాడంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అభిశంసన ప్రక్రియ ప్రకారం ఎగువ సభ సెనెట్‌ కూడా అభియోగాలపై విచారణ జరిపి నిజమే అని నిర్ధారిస్తే ట్రంప్‌ ఇంటికి పోవాల్సి ఉంటుంది.
ప్రజాప్రతినిదుల సభలోని 441 స్ధానాలకు గాను 435 మందికి ఓటింగ్‌ హక్కు ఉంటుంది. ప్రస్తుత ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ 198 స్దానాలు, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 232, ఇతరులు ఒకరుండగా, నాలుగు స్దానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతిపక్షానికి చెందిన నాన్సీపెలోసీ స్పీకర్‌గా ట్రంప్‌ మీద అభిశంసన ప్రక్రియను ప్రారంభించటం, మెజారిటీ ఉంది కనుక ఆమోదం జరిగిపోయాయి.అయితే రిపబ్లికన్‌ పార్టీకి వంద స్ధానాలున్న సెనెట్‌లో 53 మంది సభ్యులుండగా ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 45, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. సెనెట్‌ నిబంధనల ప్రకారం మూడింట రెండువంతుల మెజారిటీ కావాల్సి ఉన్నందున అసాధారణ పరిస్ధితి ఏర్పడి రిపబ్లికన్‌ పార్టీలో తిరుగుబాటు వంటివి జరిగితే తప్ప అభిశంసన వీగిపోవటం ఖాయం. ఎందుకంటే అలాంటి తీవ్ర పరిస్దితి, పరిణామాలేమీ ఇంతవరకు లేవు, సూచనలు కూడా కనిపించటం లేదు. ఈ కారణంగానే ఆ పనేదో త్వరగా కానివ్వండి అని ట్రంప్‌ సవాళ్లు విసురుతున్నాడు.
ట్రంప్‌ను అభిశంసించటానికి కారణాలు రెండు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో తనకు ప్రత్యర్ధి అవుతాడు అనుకున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత జోబిడెన్‌, అతని కుమారుడి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారిని కేసులలో ఇరికించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మీద వత్తిడి తేవటం, ఆ క్రమంలో ఆ దేశానికి వాగ్దానం చేసిన మిలిటరీ సాయాన్ని తొక్కిపెట్టారన్నది ఒకటి. దీని మీద అభిశంసన ప్రక్రియను అడ్డుకొనేందుకు ప్రయత్నించటాన్ని మరొక అభియోగంగా విచారణ జరిపి నిర్ధారించారు. ఈ రెండూ అధికార దుర్వినియోగాలుగా పరిగణించారు. జనవరి ఏడవ తేదీన సెనెట్‌ విచారణ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. విచారణ ఎలా జరగాలన్న అంశంపై రెండు పార్టీల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాల నేపధ్యంలో ఆ రోజున ప్రారంభం కావచ్చు లేదా తరువాత అవుతుంది.
ఇంతవరకు ప్రజాప్రతినిదుల సభ స్పీకర్‌ తమకు అభియోగ అంశాల గురించి అధికారికంగా ఎలాంటి వర్తమానం పంపలేదని అందువలన తాము సెలవులను ఆనందంగా గడపటం తప్ప తాము చేసేదేమీ లేదని, విచారణ ఏ రోజున ప్రారంభమయ్యేది చెప్పలేనని సెనెట్‌ సభానాయకుడు మిచ్‌ మెకొనెల్‌ వ్యాఖ్యానించాడు. అయితే సెనేట్‌ వైపు నుంచి ఏం జరుగుతుందో తెలియకుండా తాము తమ ప్రతినిధుల నియామకం చేయలేమని ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. ఇంతవరకు న్యాయసమ్మతంగా ఏమి జరుగుతుందో తమకు కనిపించటం లేదన్నారు. ప్రజాప్రతినిధుల సభలో సాక్ష్యం చెప్పటానికి నిరాకరించిన ట్రంప్‌ యంత్రాంగ అధికారులు నలుగురు సెనెట్‌ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఈ ప్రతిష్ఠంభనకు కారణంగా చెబుతున్నారు. వారిని రప్పించాలని, ట్రంప్‌ కార్యాలయం తొక్కిపెట్టిన కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరుతూ సెనెట్‌లో డెమోక్రటిక్‌ పార్టీ నేత చుక్‌ ష్కమర్‌ గతవారంలో మెకొనెల్‌కు లేఖ రాశారు. ముఖ్యాంశాలను ట్రంప్‌ దాచనట్లయితే ఎందుకు నిరాకరిస్తున్నారని విలేకర్లతో ప్రశ్నించారు. దీనిపై మెకొనెల్‌ ప్రతిస్పందిస్తూ విచారణపై తమకు అభ్యంతరం లేదని, గతంలో రెండు దశాబ్దాల క్రితం బిల్‌ క్లింటన్‌ మీద జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుపుతామని, న్యాయం అందరికీ ఒకటే కదా అన్నారు.
ఇక్కడే తిరకాసు ఉంది. క్లింటన్‌ విచారణ సమయంలో డెమోక్రాట్‌ సెనెటర్‌ చుక్‌ ష్కమర్‌ అప్పుడే సభలో కొత్తగా అడుగు పెట్టారు. ఆ సమయంలో మెకొనెల్‌ కూడా సభ్యుడే. ఆ సమయంలో విచారణ తీరుతెన్నులపై అప్పుడు తీసుకున్న వైఖరికి విరుద్దంగా రెండు పార్టీల వారూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అభియోగాల గురించి సెనెట్‌లో వాదోపవాదాలు ప్రారంభించటం, రాతపూర్వకంగా ప్రశ్నలను అనుమతించటానికి తగిన వ్యవధి ఇచ్చి వాటి ప్రాతిపదికగా సాక్షులను పిలవాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. బిల్‌ క్లింటన్‌ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా తాము అదే పద్దతి పాటిస్తామని రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే ముందుగానే ఫలానా వారిని సాక్షులుగా పిలవాలని డెమోక్రాట్లు ఇప్పుడు కోరుతున్నారు. క్లింటన్‌ విచారణ సమయంలో ప్రజాప్రతినిదుల సభలో అన్ని విషయాలు చర్చించినందున సెనెట్‌లో కొత్తగా సాక్షులను విచారించాల్సిందేమీ లేదని అప్పుడు డెమోక్రాట్లు వాదించగా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కనీసం ముగ్గురు కొత్త సాక్షులను విచారించాల్సిందే అన్నారు. ఇప్పుడు విచారణలో కొత్తగా సాక్షులను పిలవాలని డెమోక్రాట్లు కోరుతుండగా అవసరం లేదని రిపబ్లికన్లు అంటున్నారు, దాన్ని నిర్ణయించటానికి సెనెట్‌లో అవసరమైన బలం రిపబ్లికన్లకు ఉంది కనుక ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నది వారి ఎత్తుగడ. తన వివాహేతర సంబంధాల గురించి బిల్‌ క్లింటన్‌ అసత్యాలు చెప్పారన్న ఆరోపణపై ఆయనను అభిశంసించారు,1999 ఫిబ్రవరి పన్నెండున క్లింటన్‌ నిర్దోషిగా సెనెట్‌ తీర్మానించింది.
అనేక దేశాలలో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణంగా జరుగుతోంది. అమెరికా అందుకు మినహాయింపు కాదు. తమ బలాన్ని, చేసిన దాన్ని చెప్పుకోవటం కంటే ప్రత్యర్దుల బలహీనతలను ముందుకు తెచ్చి ఎదురుదాడి చేయటం ఇటీవలి కాలంలో పెరిగింది. డెమోక్రాటిక్‌ పార్టీనేత జోబిడెన్‌ కుమారుడు ఉక్రెయిన్‌కు చెందిన ఒక గ్యాస్‌ కంపెనీలో పని చేశాడు. ఆసమయంలో పాల్పడిన అక్రమాల వివరాలను తెప్పించుకొని ప్రత్యర్ధిని దెబ్బతీయాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. పార్లమెంట్‌ ఆమోదించిన మేరకు ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించాలంటే తనకు ఆ సమాచారాన్ని ఇవ్వాలని ట్రంప్‌ షరతు పెట్టాడు, ఒత్తిడి తెచ్చేందుకు గాను సాయం అందించకుండా తొక్కి పెట్టాడు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తీరు చూస్తే అంతర్జాతీయ స్ధాయిలో అగ్రనేతలు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం అవుతుంది.
జోబిడెన్‌, అతని కుమారుడి అక్రమాల గురించి సమాచారం సేకరించాలని ట్రంప్‌ ఎంతో ముందుగానే పధకం వేశాడన్నది స్పష్టం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జరిగిన ఎన్నికలలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా వ్లదిమిర్‌ జెలెనెస్కీ ఎన్నికయ్యాడు. అతడి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఐరోపా యూనియన్‌ రాయబారి, ఇంధన శాఖ మంత్రి, ఉక్రెయిన్‌ ప్రత్యేక దౌత్యవేత్తలు ముగ్గురూ తిరిగి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో కథ నడిపించవచ్చని ట్రంప్‌కు చెప్పారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమై అనేక మలుపులు తిరిగింది.ఒక అవగాహన కుదిరిన తరువాత ట్రంప్‌-జెలెనిస్కీ ఫోన్‌ సంభాషణ జరిపారు. ఈ వివరాలను తెలుసుకున్న ఒక ఆకాశరామన్న ఫిర్యాదు చేశాడు. అది తెలిసిన సిఐఏ అధికారి ఒకరు తన ఉన్నతాధికారికి నివేదించాడు. చివరకు ఈ వార్త మీడియాలో వచ్చింది. వెంటనే తొక్కి పెట్టిన మిలటరీ సాయాన్ని విడుదల చేశారు. అధ్యక్షుడి అధికార దుర్వినియోగంపై అభిశంసన జరపాలని డెమోక్రాట్లు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సెప్టెంబరు 24న విచారణకు శ్రీకారం చుట్టారు, డిసెంబరు 19న ప్రజాప్రతినిధుల సభలో అభి శంసన తీర్మానాన్ని ఆమోదించారు. విచారణకు హాజరైన సాక్షులు తమను ట్రంప్‌ ఎలా బెదిరించిందీ వివరించారు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించటాన్ని వెల్లడించారు. నాకిది నీకది అనే పద్దతుల్లో ట్రంప్‌-ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మధ్య సంభాషణలు నడిచాయని తేలింది.

Image result for donald trump impeachment- narendra modi commendation
ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.సెనెట్‌ ముందుకు రావటం, అది అక్కడ వీగిపోవటం లాంఛనమే. అందువలన ఒక వేళ ఆమోదం పొందితే, రాజ్యాంగంలో పేర్కొన్న వరుస ప్రకారం ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతారు. ఒక వేళ ఉపాధ్యక్షుడు లేకపోతే ఎవరు కావాలో ఒక జాబితా ఉంది, సెనెట్‌లో తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు గనుక ఆ వివరాలు అవసరం లేదు. సాంకేతికంగా ట్రంప్‌కు ఎలాంటి ఢోకాలేనప్పటికీ నైతికంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ. అనేక సర్వేలలో ట్రంప్‌ పరిస్ధితి బాగోలేదని తేలినప్పటికీ పుంజుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్‌ జరిపిన సర్వేలో ప్రతిపక్ష డెమోక్రాట్‌ జోబిడెన్‌కు 49శాతం మంది, ట్రంప్‌కు 44శాతం మద్దతు ఇస్తున్నారని వెల్లడైంది. అక్టోబరు కంటే ఐదు పాయింట్లు డెమోక్రాట్లకు తగ్గినట్లు పేర్కొన్నది. ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన కొద్ది గంటల్లో జరిపిన ఒక ఫోన్‌ సర్వేలో 53శాతం మంది ట్రంప్‌ అదికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు 51శాతం మంది అభిప్రాయ పడ్డారు.
ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికా సమాజంలోని పలు తరగతుల నుంచి తీవ్రమైన వత్తిడి, నిరసన వ్యక్తమైన కారణంగానే ప్రజాప్రతినిధుల సభ విచారణకు స్వీకరించాల్సి వచ్చిందనే అంశాన్ని మరచిపోరాదు. ప్రతిపక్షమే తేల్చుకుంటుందిలే అని ఉపేక్షించలేదు. ఇటీవలి కాలంలో అసంతృప్తికి గురవుతున్న యువత, వివిధ తరగతుల ప్రజానీకం వీధుల్లోకి వస్తున్నది.ట్రంప్‌ అక్రమాల గురించి మీడియాలో వెల్లడై అమెరికన్‌ సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లి హౌడీ మోడీ కార్యక్రమం పేరుతో ట్రంప్‌కు మద్దతు పలికి, తిరిగి అధికారానికి రావాలని కోరి వచ్చారు. అక్కడి భారతీయులందరూ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఒక అధ్యక్షుడిగా మీకు డోనాల్ట్‌ ట్రంప్‌ వంటి మిత్రుడు మరొకరు లేరు అని చెప్పగలను అని నరేంద్రమోడీ చెప్పారు. దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న లోకోక్తి తెలిసిందే.