Tags

, , ,

Image result for modi - shah duo sad
ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం అని మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక సందర్భంలో చెప్పారు. ఆ వరపుత్రుడు ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ఆత్మవంటి అమిత్‌ షా ద్వయం అబద్దాలు లేదా అవాస్తవాలు చెబుతున్నదా ? జాతీయ పౌర నమోదు(ఎన్‌ఆర్‌సి) గురించి ఇంతవరకు అసలు ఎలాంటి చర్చ జరపలేదని మోడీ మహాశయుడు రామ్‌లీలా(ఒకే మాట మీద నిలిచినట్లు చెప్పే రాముడి పేరుతో ఉంది) మైదానంలో ఒట్టేసి మరీ చెప్పారు. ముందుగా ఆశ్చర్యపోయింది, అవాక్కయింది బిజెపి నేతలు, అభిమానులు అంటే అతిశయోక్తి కాదు. ఏది నిజం, ఏది అవాస్తవం మోడీ మహాశయా అని బయటికి కాకున్నా లోలోపల జుట్టుపీక్కుంటున్నారు. రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ ఏది చెబితే అదే కరెక్టు అసలు ఎన్‌ఆర్‌సిగురించి మేము చర్చించని మాట నిజమే అని మోడీగారి ఆత్మగా పరిగణించుతున్న కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గారు ఒక వార్తా సంస్ధతో చెప్పారు. జాతీయ జన జాబితా, జాతీయ పౌరజాబితా తయారీకి సంబంధం లేదని కూడా అన్నారు.
ఏదో ఒకసారి చెబితే ఎవరికైనా ఇలాంటి సందేహం రావటంలో అర్ధం ఉంది గానీ మోడీ అవాస్తవాల గురించి చర్చ చేయటం ఒక సినిమాలో హీరో మాదిరి ‘చాల బాగోదు’. దేశ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిలో నేర చరితలు లేని, కోటీశ్వరులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు గాని వారెందరు అని బూతద్దం పెట్టి వెతకాల్సిన రోజులివి. అలాగే మోడీ లేదా బిజెపి నేతలు ఎన్ని నిజాలు చెప్పారనేందుకు అంజనం వేసి చూడాలి. లేదా ధర్మపీఠాలను ఎక్కించి నిజాలు పలికించాలి అంటే అన్ని దొరుకుతాయా, మేకిన్‌ ఇండియాలో కూడా తయారు చేయగలమా అన్నది సందేహమే. మోడీ ప్రకటన తరువాత ఎన్ని అబద్దాలు, ఎప్పుడు చెప్పారన్న వివరాలు తెలిపే పనిలో ఊపిరి సలపకుండా గూగులమ్మ తల్లి నిండా మునిగి ఉంది. ఊరట ఏమంటే ఆ మాత తనను కోరిన సమాచారం అందించేందుకు ” ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే” ”మతపరమైన మినహాయింపు” వంటి నిబంధనలు పెట్టలేదు.
మీకు తెలుసా, నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మోడీ, షా ద్వయం అవాస్తవాల గురించి చెప్పవే తల్లీ అని అడిగితే ‘మోడీ లైస్‌.ఇన్‌’ పేరుతో ప్రత్యేకంగా వాటికే పరిమితమైన ప్రత్యేక వెబ్‌ సైట్‌ కూడా ఉంది నాయనా అని గూగులమ్మ ఒక దారి చూపింది. ప్రపంచంలో ఇతర నేతల మీద ఎక్కడైనా వెబ్‌ సైట్‌లు ఉన్నాయోమో నాకు తెలియదు, సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు చెబుతాను. యాభై అంగుళాల ఛాతీతో ధైర్యం ఉన్న మోడీ అభిమానులు కూడా దాన్ని చూసి వివరాలు తెలుసుకోవచ్చు. నిజాలు తెలుసుకొనేందుకు భయపడాల్సిన పనిలేదు !
అన్నం ఉడికిందో లేదో తెలుసుకొనేందుకు కుండలో ఉన్నమొత్తాన్ని చూడనవసరం లేదు ఒక మెతుకును పట్టుకుంటే చాలు. ప్రెషర్‌ కుకర్‌లలో వండే వారికి అలాంటి అవకాశం లేదు. తోటకూర నాడే అడ్డుకోవాల్సింది అన్నట్లుగా కాషాయ దళాలు చెప్పే అవాస్తవాలను ప్రారంభంలోనే నిలదీసి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. అయితే కాంగ్రెస్‌ నిర్వాకాల కారణంగా విసిగిపోయి బిజెపి ఏమి చెప్పినా సరైనదే అనే ఒక అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. వెనుకబడిన సమాజం కనుక ఒకసారి ఒకరిని నమ్మిన తరువాత వారు తప్పులు చేసినా వెంటనే నిలదీయలేని బలహీనత మనలో ఉంది. దేవుడు నైవేద్యం తినడన్నది ఎంత వాస్తవమో, ఆ దేవుడి పేరుతో రాజకీయాలు చేసే కాషాయ పరివారం ఎన్నడూ నిజాలు చెప్పదన్నది పచ్చి నిజం. ఎన్‌ఆర్‌సి గురించి అసలు చర్చించనేలేదని నరేంద్రమోడీ, అమిత్‌ షా స్వయంగా చెప్పినప్పటికీ పూజారుల వంటి ఆనుచరులు ఎలాగూ నమ్మరు. కానీ అనేక మంది కళ్లుతెరిపించారు. స్ధలాభావం రీత్యా పరిమితంగా మోడీ గారి తాజా సుభాషితాల గురించి మాత్రమే చూద్దాం !
నిర్బంధ శిబిరాల గురించి అర్బన్స్‌ నక్సల్స్‌ మరియు కాంగ్రెస్‌ పుకార్లను వ్యాపింప చేస్తోందని ప్రధాని చెప్పారు.
అసలు నిర్భంధ శిబిరాల గురించి ప్రధాని ఎందుకు దాస్తున్నట్లు ? అవి అసోంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వాటిలో ప్రవేశానికి ముస్లింలు, ఇతర మతాల వారు అనే నిబంధనలు లేవు. అక్రమంగా వచ్చి అడ్డంగా దొరికి పోయిన వారందరినీ ముందు అక్కడ వేయాలన్నది వాటి లక్ష్యం. తన మంత్రులు పార్లమెంటులో ఏ సమాధానం, సమాచారం ఇస్తున్నారో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ ఉన్నారా ? 2019 నవంబరు 22 నాటికి తమ రాష్ట్రంలోని ఆరు నిర్బంధ కేంద్రాలలో 988 మంది విదేశీయులున్నారని అసోం లోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సమాచారాన్ని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. 2016 నుంచి 2019అక్టోబరు 13వరకు నిర్బంధితుల్లో 28 మంది శిబిరాల్లో లేదా ఆసుపత్రుల్లో మరణించారని కూడా వెల్లడించారు. అసోంలోని ఆరింటిలో ఒక శిబిరం ఏడు ఫుట్‌బాల్‌(కాలి బంతి) మైదానాలంత విస్తీర్ణంలో ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. అంతేనా అక్రమంగా వలస వచ్చేందుకు వీలున్న అన్ని జిల్లాలు, పట్టణ కేంద్రాలలో దేశమంతటా నిర్బంధశిబిరాలను ఎలా ఏర్పాటు చేయాలో సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక నమూనాను కూడా పంపింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో రెండింటి నిర్మాణాలు పూర్తయ్యాయని, అసోంలో మరో పదింటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమంగా వచ్చిన వారెవరినైనా నిర్బంధించాల్సిందే, అయితే శరణార్దులతో పాటు, అక్రమంగా వలస వచ్చిన వారిలో ముస్లిమేతర మతాలవారికి పౌరసత్వం ఇవ్వాలంటూ పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటంతో ముస్లింలలో భయ సందేహాలు తలెత్తాయి. నిర్బంధ శిబిరాల్లో ముస్లింలను మాత్రమే పెడతారనేది ఒకటైతే, ఎన్‌ఆర్‌సిలో అక్రమంగా వచ్చారంటూ ముస్లింలను పెద్ద సంఖ్యలో విదేశీయులుగా తేల్చి నిర్బంధిస్తారనే అనుమానాలు తలెత్తాయి. బతుకుతెరువు కోసం స్వస్ధాలలను వదలి కొత్త ప్రాంతాలకు వెళ్లిన వారిని స్ధానికులని ఎవరు నిర్ధారిస్తారు, వారి దగ్గర ఆధారాలేముంటాయి అన్నది అసలు సమస్య. ఈ నేపధ్యంలో అసలు నిర్బంధ శిబిరాలే లేవంటూ మోడీ ప్రకటించటం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

Image result for modi - shah duo u turn on nrc
ఎన్‌ఆర్‌సి గురించి అనేక అవాస్తవాలను వ్యాపింప చేస్తున్నారు. మేము దాన్ని రూపొందించలేదు, పార్లమెంటు ముందుకు తేలేదు, అసలు ప్రకటించలేదు, ఎన్‌ఆర్‌సి పదం గురించి కూడా చర్చించలేదు అని నరేంద్రమోడీ అన్నారు.
2019 జూన్‌ 20న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంలో చొరబాటు సమస్యలు తలెత్తిన ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేయటం తన ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. రాష్రపతి ప్రసంగం అంటే ఏదో దారినపోయే దానయ్య మాట్లాడేది కాదు. తమ విధానాలు, ప్రాధాన్యతల గురించి ప్రభుత్వాలు తయారు ఇచ్చే అంశాలతోనే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు తన ప్రభుత్వం అంటూ ప్రసంగిస్తారు, అదీ రాతపూర్వకంగా ఉన్నదాన్ని చదువుతారు. ఒక్క మాట కూడా స్వంతంగా మాట్లాడేందుకు వీల్లేదు. మంత్రివర్గంతో లేదా ప్రధాని కార్యాలయ ప్రమేయలేకుండానే రాష్ట్రపతి ప్రసంగం చేశారా ? ఆయన కూడా అర్బన్‌ నక్సల్‌ జాబితాలోకే వస్తారా ? రాష్ట్రపతి ప్రసంగం నాటికే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసోంలో ఎన్‌ఆర్‌సి జాబితాను రూపొందించే ప్రక్రియ జరుగుతోంది.
ఎన్నికలకు ముందు ఏప్రిల్‌ నెలలో మాట్లాడుతూ ముందు పౌరసత్వ సవరణ బిల్లు తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పిన అంశాలన్నీ మీడియాలో వచ్చాయి. ఏప్రిల్‌ 11న పశ్చిమబెంగాల్‌లోని రారుగంజ్‌లో మాట్లాడుతూ దేశమంతటా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామన్నారు. ఏప్రిల్‌ 23న బిజెపి యూట్యూబ్‌ ఛానల్‌లో పెట్టిన ఒక వీడియోలో తొలుత శరణార్దులకు పౌరసత్వం, తరువాత దేశవ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన పశ్చిమ బెంగాల్లోని బంగావ్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి తయారు చేసి చొరబాటుదార్లను దేశం నుంచి బయటకు పంపివేస్తామని చెప్పారు. నవంబరు 20వ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని నిర్వహిస్తామని చెప్పారు. భాషా పరమైన సర్వే నిర్వహణకు రూపొందించిన వెబ్‌సైట్‌లో సైతం ఎన్‌ఆర్‌సికి ఏర్పాటు చేశారు. డిసెంబరు రెండున ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌ పూర్‌లో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి అమలుకు 2024 చివరి గడువు అని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్ట బిల్లుపై చర్చ సందర్భంగా ఈ బిల్లుకు ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదంటూ త్వరలో ఎన్‌ఆర్‌సిని కూడా తీసుకువస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులోనే ప్రకటించారు. డిసెంబరు 17న ఇటి నౌ ఛానల్‌లో మాట్లాడుతూ సిఏఏ-ఎన్‌ఆర్‌సికి ఉన్న సంబంధం గురించి చెప్పారు. ఎన్‌ఆర్‌సి గురించి భయపడాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. ఇన్ని చెప్పిన వారు, వాటి మీద మీడియాలో వచ్చిన వార్తలను ఒక్కదానిని కూడా ఖండించలేదు, ఇప్పుడు అబ్బే, అంతా ఉట్టిదే అని చెబుతుంటే నమ్మేదెలా !

Image result for modi - shah duo sad
అవాస్తవాలు ఒక అంశానికే పరిమితమా ? కానే కాదు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాం అన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామన్నారు, అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి చేస్తాం చూడండన్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు, కొంత కాలం ఆగాలి అన్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. జనం నిజమే అనుకున్నారు. సంవత్సరాలు గడిచాయి. దేశ అర్ధిక పరిస్ధితి గురించి ఐఎంఎఫ్‌ చెప్పిన అంచనాలను ఉటంకిస్తూ చూడండి మా పనితనాన్ని అంతర్జాతీయ సంస్ధ కూడా నిర్దారించింది అని చెప్పి ఊదరగొట్టారు. అదే సంస్ధ తాజాగా దేశ పరిస్ధితి మరింతగా దిగజారనుందని చెప్పింది. ఇప్పుడు దాని ప్రస్తావనే తీసుకురారు. మన సమాజం నోట్లో వేలు వేసుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉంటే ఐఎంఎఫ్‌ వెనుక కూడా ప్రతిపక్షాల హస్తం ఉంది, అలా చెప్పిస్తున్నాయని, దాని అంకెలు కూడా తప్పులు తడకలని ఎదురుదాడి చేయగల ఘనులు. లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరమే కదా, అలాగే అబద్దాలు చెప్పటం ఎంత మోసమో, నిజాలు చెప్పకపోవటం అంతకంటే పెద్ద మోసం కదూ ! నల్లధనాన్ని వెలికి తీసి ప్రతివారి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన అంశం గురించి ఒకసారి అడిగితే షా గారు తన గడ్డాన్ని సవరించుకొని ఒక నవ్వు నవ్వుతూ జుమ్లా (ఏదో చెబుతుంటాం) అని సమాధానం చెప్పారు. కొద్ది రోజుల తరువాత ఎన్‌ఆర్‌సి గురించి ఆలోచించనే లేదని చెప్పింది కూడా జుమ్లా అంటే !