ఎం కోటేశ్వరరావు
భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని తమ అధ్యయనంలో తేలిందని తాజాగా కొందరు పరిశోధకులు చెప్పారు. రైతాంగం ముఖ్యంగా మన వంటి వర్ధమాన దేశాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం ఒక అంశమైతే, పంట మార్కెటింగ్ మరొక అంశం. ప్రపంచ వాణిజ్య సంస్ద ఉనికిలోకి రాక ముందే ప్రపంచీకరణ, దానిలో భాగంగా నయా ఉదారవాద విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మన దేశంలో ఆ విధానాలు అమలులోకి వచ్చిన 1991 తరువాత అంతకు ముందు తలెత్తినదాని కంటే వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం దానికి సూచికగానే ఆత్మహత్యలన్న విషయం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటు కానందున అనేక మంది వ్యవసాయ మానివేస్తే, అంతకంటే ఎక్కువగా మరోపని లేక కౌలు రైతులు ఉనికిలోకి వచ్చారు. పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి మీద పని చేసే వారి సంఖ్యా ఎక్కువే.
తాజా సమాచారం ప్రకారం మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నవారు 58శాతం ఉన్నారు.మన కంటే వెనుకబడిన, దారిద్య్రంతో మగ్గుతున్న దే శాలలో తప్ప మరే ఇతర వర్ధమాన దేశంలో ఇంత సంఖ్యలో లేరు. గడచిన ఆర్దిక సంవత్సరంలో 28.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. 2015-16లో ఒక రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.96,703ను 2022-23 నాటికి రూ.2,19,724 చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్ వాగ్దానం చేసింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకైతే అంతుబట్టలేదు, నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మరో సందర్భంలో చూద్దాం. మన దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, వందల, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఐరోపా, అమెరికాల్లో ఉండే రైతుల సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే దేశం ఏదైనా భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడైనా ఒకటే. తగ్గుతున్న భూసారం, దెబ్బతింటున్న భూమి ఆరోగ్యం.ఈ సెగ మనకు తగిలిన కారణంగానే ఇప్పటికే మన రైతాంగానికి పది కోట్ల మేరకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఒక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ తరం సూపర్ తిండి తింటున్నది కనుకనే మా తరం మాదిరి గట్టిగా ఉండటం లేదని వృద్ధులు అనటం వింటాం. దానిలో పాక్షిక సత్యం లేకపోలేదు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో భూమి ఆరోగ్యం దిగజారుతోందన్న అంశాలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూ ఆరోగ్య బాగుకు అయ్యే ఖర్చుకూడా రైతుమీదే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది మునిగే పడవకు గడ్డిపోచకూడా భారం మాదిరే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 2.4 కోట్ల ఎకరాల భూమి సారం లేనిదిగా తయారు అవుతున్నదన్నది ఒక అంచనా. ఇది ప్రపంచ ఆహార భద్రతను ప్ర శ్నార్దకం చేయటంతో పాటు భూమి మీద వత్తిడిని పెంచటంతో పాటు మన వంటి దేశాలలో రైతు మీద భారాన్ని కూడా మోపనుంది.
దీనికి రైతులు వ్యక్తిగతంగా చేయగలిగింది పరిమితం, ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగలిగిన అంశం. వ్యవసాయ అభివృద్ధి, విస్తరణ, పరిశోధన బాధ్యతల నుంచి వైదొలిగే విధానాలు అనుసరిస్తున్న పాలకుల నుంచి ఏమి ఆశించగలమన్నది ఒక ప్రశ్న. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏమి జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో చూద్దాం. ఒక దేశంలో జరిగిన అధ్యయనాలు మరొక దేశానికి లేదా ప్రాంతానికి మక్కీకి మక్కీ వర్తించకపోవచ్చుగానీ, ఆయాదేశాల, ప్రాంతాలకు సంబంధించి ఏమి చేయాలన్నదానికి దారి చూపుతాయి.
కొన్ని అంశాలు విపరీతంగా కూడా అనిపించవచ్చు, వాటి మంచి చెడ్డలను శాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన పరిశోధన అంశాల సారం ఏమంటే భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.1930దశకంలో అమెరికా, కెనడాలలో తీవ్రమైన దుమ్ము తుపాన్లు,వర్షాభావ పరిస్ధితులు ఏర్పడి, కొన్ని చోట్ల సాగు నిలిపివేయాల్సి వచ్చింది.కొంత కాలం దున్నకం నిలిపివేసిన తరువాత పంటల దిగుబడి అక్కడ పెరిగిందని, భూ ఆరోగ్య మెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు దాన్నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
రైతులు సాధారణంగా సాగుకు ముందు పాటు కలుపు మొక్కల తొలగింపుకు, ఎరువులు వేసే సమయంలోనూ దున్నటం, విత్తే సమయంలో దున్నటం తెలిసిందే. ఇలా ఎక్కువ సార్లు దున్ని భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేయటం వలన స్వల్పకాలంలో దిగుబడులు పెరగవచ్చుగానీ దీర్ఘకాలంలో భూమి సారం తగ్గుతుందట.భూమికి మేలు చేసే బాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు అంతరిస్తున్నాయి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) 2015నివేదిక ప్రకారం గత నాలుగు దశాబ్దాల కాలంలో మూడో వంతు సాగు భూమిలో సారం తగ్గిందట. పదే పదే భూమి దున్నకం, దాని పర్యవసానాల గురించి అమెరికాలోని సోయా, మొక్కజొన్న సాగు చేసే భూముల మీద చేసిన అధ్యయనం మేరకు ఎంత తక్కువగా దున్నితే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.తక్కువ సార్లు దున్నితే ఆరోగ్యకరమైన భూ యాజమాన్య పద్దతులను ప్రోత్సహించటంతో పాటు, కోతనిరోధం, నీటిని నిలుపుకోవటం మెరుగుపడుతుంది.యంత్రాలను వినియోగించకపోవటం లేదా పరిమితంగా దున్నటం ద్వారా గత సంవత్సరపు పంట కోసిన తరువాత మిగిలే సోయా, మొక్కజన్న దుబ్బులు కూడా భూమికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిమిత దున్నకపు పద్దతులను ప్రస్తుతం అమెరికా ఖండ దేశాలు, ఓషియానా ప్రాంతంలో 37 కోట్ల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.పరిమిత దున్నక సాగు అమెరికా మొక్కజొన్న పొలాల్లో 2012-17 మధ్య పదిహేడు శాతం పెరిగింది. అయితే మొత్తం సాగులో ఇది 3.4శాతమే. అయితే దిగబడులు, లాభాలు తగ్గుతున్నాయని రైతాంగం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గతంలో ఈ పద్దతులను కొన్ని పరిశోధనా కేంద్రాల్లోనే అమలు జరిపారు, అక్కడ కూడా ఉత్పాకత మీద పడే ప్రభావం గాక భూసార మెరుగుదల గురించే కేంద్రీకరించారు.
స్టాన్‌ఫోర్డ్ బృందం ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలు, పరిమిత దున్నకపు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అధ్యయనానికి 2005 నుంచి 2016వరకు కంప్యూటర్లలో సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో పంటల దిగుబడులపై వాతావరణ మార్పులు, పంటల తీరు తెన్నులు, భూమి స్వభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలలో అధ్యయనానికి ఎంచుకున్న కేంద్రాల సమాచారాన్ని విశ్లేషించారు. దీర్ఘకాలం పాటు పరిమితంగా దున్నిన పొలాల్లో సగటున మొక్కజొన్న దిగుబడి 3.3, సోయా 0.74 శాతం చొప్పున ఎక్కువ సార్లు దున్నిన పొలాలతో పోల్చితే పెరిగినట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో ఈ దిగుబడులు గరిష్టంగా 8.1,5.8 శాతాల చొప్పున ఉన్నాయి. కొన్ని చోట్ల 1.3, 4.7 శాతాల చొప్పున మొక్కజన్న, సోయా దిగుబడులు తగ్గినట్లు కూడా గమనించారు. ఇంతటి తేడాలు రావటానికి భూమిలో నీరు, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు ప్రధానంగా పని చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలలో నేలలు పొడిబారటం, నీటిని నిలువ చేసే సామర్ధ్యం తగ్గగా తక్కువ సార్లు దున్నిన ప్రాంతాలలో నేలలో తేమ దిగుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది.
అధ్యయనం వెల్లడైన ధోరణులను వెల్లడించింది తప్ప ఇంకా నిర్దిష్ట నిర్ధారణలకు రాలేదు. మరింత విస్తృత అధ్యయనాలు జరపాల్సి ఉంది.1980దశకం నుంచి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.తక్కువ సార్లు దున్నిన చోట రైతులు పూర్తి స్ధాయిలో లబ్ది పొందేందుకు మొక్కజొన్న విషయంలో పదకొండు సంవత్సరాలు పడితే సోయా విషయంలో రెట్టింపు వ్యవధి తీసుకుంది. తక్కువసార్లు దున్నకం వలన భూమి సారం అభివృద్ధి చెందటం ఒకటైతే యంత్రాల వాడకం, వాటికి అవసరమయ్యే ఇంధనం, కార్మికుల ఖర్చు తగ్గింది. భూసారం పెరిగే కొలదీ దిగుబడులు పెరగటాన్ని గమనించారు.2017 అమెరికా వ్యవసాయ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు, అమెరికాలోని పంటలు పండే భూమిలో 35శాతం వరకు తక్కువ సార్లు దున్నే పద్దతులను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. పరిశోధనా కేంద్రాల నుంచి వెల్లడైన సమాచారానికి, సాగు చేస్తున్న రైతాంగ అనుభవానికి అనేక మార్లు పొంతన కుదరకపోవటంతో రైతుల్లో పూర్తి విశ్వాసం ఇంకా ఏర్పడ లేదు. ఫలితంగా కొందరు రైతులు ఈ పద్దతికి మళ్లేందుకు ముందుకు రాని పరిస్ధితి కూడా ఉంది. తక్కువ ఉత్పాదకత ఉండే భూములను సారవంతవమైనవిగా మార్చవచ్చని క్వీన్‌లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్ధానిక, గిరిజన తెగల సహకారంతో నిస్సారమైన భూములను చాలా చౌకగా, తక్కువ వ్యవధిలోనే పదిల పరచవచ్చంటున్నారు.
ప్రపంచ వ్యవసాయ రంగంలో తీవ్రమైన పోటీ, ఇటీవలి కాలంలో ఉత్పత్తుల ధరలపతనం వంటి అనేక అంశాలు కొత్త పరిశోధనలకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే మన వంటి వ్యవసాయ పరిస్దితులున్న చోట పరిశోధనల ఫలితాలను ఎలా వుపయోగించుకోవాలి, ఎలా వర్తింప చేసుకోవాలి అన్నది ఒక పెద్ద సవాలే. అయినా ఎంత మేరకు వీలైతే అంతమేరకు వినియోగించుకోవటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు.సూక్ష్మ వ్యవసాయం, మార్కెట్ పద్దతుల గురించి ప్రస్తుతం అనేక చోట్ల కేంద్రీకరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ ఇన్‌సైట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అనే సంస్ధ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2025 నాటికి ప్రస్తుతం ఉన్న నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్న సూక్ష్మ వ్యయవసాయ మార్కెట్ పన్నెండు బిలియన్ డాలర్లవరకు పెరగవచ్చని అంచనా వేసింది.
స్మార్ట్ ఫోన్ల మాదిరి స్మార్ట్ వ్యవసాయ పద్దతులకు గాను సమాచారాన్ని, సమాచార వ్యవస్ధలను వినియోగించుకొని రైతాంగానికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల స్ధితిగతులను తెలుసుకొనేందుకు, కంప్యూటర్ వ్యవస్ధలతో పాటు డ్రోన్ల వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూక్ష్మ వ్యవసాయ పద్దతులంటే పరిమిత ప్రాంతాలలో సైతం ఎలాంటి పంటలను సాగు చేయాలి, ఎంత నీరు, ఎరువుల వినియోగం వంటి నిర్ధిష్ట సూచనలు చేసే వ్యవస్ద ఏర్పాటు. ఇందుకోసం 2017లో డచ్ ప్రభుత్వం పంటల సమాచార సేకరణకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. గగనతలం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ద్రోన్స్, సెన్సర్లు, జిపిఎస్ వ్యవస్ధలు, స్మార్ట్ ఫోన్ల వినియోగం 2025నాటికి 70శాతం వరకు ఉండవచ్చని అంచనా. మెరుగైన, పొదుపు పద్దతుల్లో నేల, నీటి వినియోగానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. రానున్న ఆరు సంవత్సరాలలో పరికరాలను గరిష్టంగా, జాగ్రత్తగా వినియోగించటం దగ్గర నుంచి సూక్ష్మ వ్యవసాయ సేవల వరకు మార్కెట్ పెరుగుదల రేటు 27శాతం ఉంటుందని అంచనా. పొలాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొనేందుకు, వాటి నివారణకు తగు చర్యలను తీసుకొనేందుకు 3డి మాపింగ్‌తో సహా అనేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో జరుపుతున్న పరిశోధనలన్నీ కార్పొరేట్ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేస్తున్నవే, వాటిని వినియోగించుకోగలిగింది కార్పొరేట్ సంస్ధలే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ ఫలితాలను మన వ్యవసాయ రంగానికి ఎలా వర్తింప చేయాలి, వినియోగించుకోవాలి అన్నది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి వ్యవస్ధ, సిబ్బంది నియామకం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన ఫలితాల పర్యవసానాలను చూస్తున్నాము. యూరియా, క్రిమి, కీటక నాశనులను అవసరానికి మించి వాడుతున్నందున జరుగుతున్న నష్టాల గురించి చెబితే చాలదు, ఇతర ఎరువుల ధరలు ఆకా శాన్ని అంటిన కారణంగా సబ్సిడీ వున్నందున రైతాంగం యూరియాను ఎక్కువగా వాడుతున్నారన్నది తెలిసిందే. అందువలన రైతాంగాన్ని చైతన్యపరచటంతో పాటు, భూ సారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం, అందుకు అవసరమైన సబ్సిడీలు, బడ్జెట్ కేటాయింపులు చేయటం అవసరం.