Tags
CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్ హబీబ్ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్ హబీబ్ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్ హబీబ్ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్ కలామ్ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్ గవర్నర్ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్ హబీబ్ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్ మౌలానా అజాద్, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్ అడ్డుకున్నారు అని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ షిరీన్ మూస్వీ చెప్పారు.
గవర్నర్ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్ కౌల్ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్ ఒక ట్వీట్ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.
ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్ హబీబ్ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ అహమ్మద్ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్ అహమ్మద్ అన్సారీ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.