Tags

, , , , , , ,

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?