Tags

, ,

Image result for jagan three capitals

ఎం కోటేశ్వరరావు
తాను అనుకున్న పద్దతుల్లోనే రాజధాని రాజకీయాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా స్వయంగా కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారా, అవే చివరకు గుది బండలుగా మారతాయా? రాజకీయంగా పతనానికి నాంది పలుకుతాయా ? జగన్‌ తలకెత్తుకున్న మూడు రాజధానుల రాజకీయం నల్లేరు మీద నడకంత సులభంగా సాగుతుందా, అసలు అనుకున్న గమ్యస్ధానం చేరుతుందా ? గతంలో ఉత్తర ప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమకు హైకోర్టు బెంచ్‌లు కావాలని చేసిన తీర్మానాలన్నీ ప్రస్తుతం చెత్తబుట్టలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఉన్న హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం, అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు ఏర్పాటు చేయాలని జగన్‌ కోరగానే అమలు జరపటానికి సిద్దంగా ఉన్నదెవరు ? ఉత్తర ప్రదేశ్‌ 22 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రం తమ అవసరాలకు ఐదు హైకోర్టు బెంచ్‌లు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి కంటే ప్రధాని నరేంద్రమోడీ దగ్గర జగన్‌కు పలుకుబడి ఎక్కువ ఉందా లేదా తన పలుకుబడి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? నిజానికి అంత ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి ప్రత్యేక హౌదాను ఎందుకు సాధించలేకపోయార? దాన్ని సాధించి ఉంటే కేంద్రం ఇచ్చే రాయితీలతో, పరి శమలకు ఇచ్చే మినహాయింపులతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలూ అభివృద్ది చెందుతాయి కదా ? జగన్‌ అజెండాను, రాజకీయాన్ని కేంద్రంలోని బిజెపి అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీని, దాన్ని నమ్ముకున్న వారి పరిస్ధితి ఏమిటి? ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొన్నట్లుగా జగన్‌ తీరు కనిపిస్తోంది. కులాల కళ్లద్దాలతో చూస్తే సదరు కులానికి ఉన్న బలమైన లాబీ కంటే కేంద్రంలో జగన్‌కు పలుకుబడి ఎక్కువా ? తీరా ఏదీ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని ఎన్నికల బరిలో దిగుతారా ? అసలు అభివృద్ది అజెండాను పక్కన పెట్టి ఆ పేరుతో మూడు రాజధానుల రాజకీయ చదరంగాన్ని ప్రారంభించి తప్పుటడుగు వేశారా ? ఎవరు ఎవరిని కట్టడి చేస్తారు, ఎవరు ఎవరిని హతమారుస్తారు. ఇదే కదా చదరంగం !
రాజకీయాల్లో ముఖ్యంగా కక్షపూరితంగా వ్యవహరించే కుమ్ములాటల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ! జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని భావిస్తున్నట్లు కనిపించటం లేదు. ఓదార్పు యాత్రల బ్రాండ్‌ అంబాసిడర్‌ లేదా ఓదార్పుకు మారు పేరుగా ఖ్యాతి పొందిన వ్యక్తికి ఆందోళన చెందుతున్న వారి భయాలను పోగొట్టాలనే బాధ్యత ఉందనే స్పృహ ఉన్నట్లు లేదు. గత ఐదు సంవత్సరాలలో ఏదో ఒక పేరుతో జనానికి దగ్గరైన వ్యక్తి అనుకున్న అధికారాన్ని సాధించగానే జనానికి దూరమై ప్రతిపక్ష నేతలు ఓదార్పు యాత్రలను ప్రారంభించేందుకు తొలి ఆరునెలల్లోనే నాంది పలికారా ?
ఓట్లు, సీట్లతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యల మీద గళమెత్తే వామపక్ష పార్టీలు పోలీసుల దెబ్బలు తింటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ నిరంతరం తమ కార్యక్రమాలను చేస్తాయన్నది తెలిసిందే. అలాగాక కేవలం అధికారం, దానితో రెండు చేతులా ఎలా సంపాదించుకోవాలా అని తప్ప మరొకటి పట్టని, రాజకీయంగా దెబ్బతిన్న తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీలకు ముఖ్యమంత్రి రాజకీయ ఉపాధి కల్పిస్తున్నారు. అసమ్మతి తెలిపిన వారికి పోలీసు దెబ్బలను రుచి చూపుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నపుడు ఒక విధంగా లేనపుడు మరోతీరునా ప్రవర్తించే తీరు తెన్నులను తెలుగుదేశం నేత చంద్రబాబులో, కొంత మేరకు పవన్‌ కల్యాణ్‌లో జనం చూశారు. గతంలో జగన్‌ ప్రతిపక్ష రూపాన్ని జనం చూ శారు. ఇప్పుడు తన రెండో రూపాన్ని జనానికి స్వయంగా చూపుతున్నారు.

Image result for ap capital news
తాము కన్న కలలను కల్లలుగా చేస్తున్నారనే భావనతో రాజధాని ప్రాంత గ్రామాల జనం ప్రారంభించిన శాంతియుత ఆందోళనను పట్టించుకోకపోగా పోలీసులతో అణచివేయించటం ఆందోళనకరం, గర్హనీయం. గతంలో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నపుడు రాజధాని భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు, ఇతర పార్టీలు, వ్యక్తులు, సంస్ధల వారు తమ అభిప్రాయాలను జనానికి చెప్పేందుకు ఆ గ్రామాలకు వెళ్లినపుడు వారిని అక్కడి జనం పట్టించుకోలేదు, చెప్పేది వినిపించుకొనేందుకు సైతం సిద్దపడలేదు. కొన్ని చోట్ల మరింత రెచ్చిపోయి గ్రామాల వారు, వారికి మద్దతుగా అధికార పార్టీ పెద్దలు, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించారో, అసలు గ్రామాల్లోకే రానివ్వని రోజులను చూశాము. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కూడా పోలీసులతో అదే పని చేయిస్తున్నది. అప్పుడు పూలింగ్‌ పద్దతుల్లో నష్టపోతారు, పాలకపార్టీలు కల్పించే భ్రమలను నమ్మవద్దని చెప్పిన వారిని రైతులు పట్టించుకోలేదు, అధికారపార్టీ, ప్రభుత్వం వ్యతిరేకించింది. రాజధాని అంశాన్ని తిరగదోడిన జగన్‌ సర్కార్‌ ఇప్పుడు అదే చేస్తున్నది. భూములిచ్చిన రైతులకు న్యాయం కలిగించాలని కోరుతున్నవారిని అధికార పార్టీ వ్యతిరేకిస్తున్నది, ప్రభుత్వం అడ్డుకుంటున్నది, మహిళలు అనే విచక్షణ కూడా పాటించకుండా లాఠీలతో కొట్టిస్తున్నది, కేసులు బనాయిస్తున్నది. రైతులను నిస్సహాయులను చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
రాజధానిని మార్చాలని అనుకుంటే దాన్ని సూటిగానే చెప్పవచ్చు. అది మంచిదా చెడ్డదా,ఏమి చేయాలో జనం నిర్ణయించుకుంటారు. ఒక పెద్ద మనిషి అమరావతిని ఎడారి అన్నారు, మరొకరు శ్మశానం అన్నారు. ఇలా నోరు పారవేసుకున్న వారు ఆ ఎడారి లేదా శ్మశానంలోనే రోజూ రాకపోకలు సాగిస్తున్నారు, పాలన చేస్తున్నారు. ఇక వైసిపి నామినేటెడ్‌ పదవులు పొందిన సినీనటుడు పృద్ధ్వి,కొందరు నేతల నోళ్లు ఏం మాట్లాడుతున్నాయో అదుపులేని స్ధితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిని కల్పించిన వారికి సహజంగానే భయం పట్టుకున్నట్లుంది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని జనానికి బేడీలు వేసి ఇండ్లలో నిర్బంధించలేరు. అందువలన రోడ్లపై ప్రయాణించే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకరు, ఇతర నోటితుత్తర నేతలకు ఏమి జరుగుతుందో తెలియదు. దాంతో పోలీసులు రాజధాని గ్రామాల్లోని రోడ్డు పక్క ఇండ్ల నుంచి రాళ్లు , ఇతర వస్తువులను విసిరినా తగలకుండా చూసేందుకు తెరలతో కాపలాలు కాస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చిత్రాలతో సహా దర్శనమిచ్చాయి.(అవి ఇక్కడివా మరొక చోటివా అన్నది నిర్ధారించుకోవాలి) ఒక వేళ అవేగనుక నిజమైతే ఒక ప్రభుత్వానికి అంతకంటే అవమానకరం లేదు, లేదా పోలీసులే అలా చిత్రించి మంత్రులకు రక్షణ లేదు అని చెప్పటానికైనా కావచ్చు.
రాజధానికి భూములిచ్చిన రైతులను స్వార్ధపరులుగా వైసిపి నేతలు చిత్రిస్తున్నారు. అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావాలన్న స్వార్ధ పరులు అంటున్నారు, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని ఎదురుదాడి చేస్తున్నారు. వారందరూ భూస్వాములు, వారి పిల్లలందరూ విదేశాల్లో, లేదా దేశంలోని ఇతర పెద్ద పట్టణాల్లో ఉంటారు, వ్యవసాయం చేయరు, ఒకే కులానికి చెందిన వారంటూ ముద్రవేస్తున్నారు. రాయలసీమ వారందరూ రౌడీలు, ఫాక్షనిస్టులని కొందరు ఎలా నిందిస్తారో ఇది కూడా అలాంటిదే. రాజధానికి స్వచ్చందంగా లేదా బలవంతంగా, ప్రలోభాలకు గురి చేసిగానీ సేకరించిన భూమి 33వేల ఎకరాలు, యజమానులు 29వేల మంది. ఎక్కడైనా వూరికి ఐదు పది మంది చొప్పున ఐదు పది ఎకరాలు కోల్పోయిన వారు ఉంటే ఉండవచ్చుగానీ వారందరూ చిన్న, సన్నకారు రైతులు. ఎక్కడైనా పట్టణాలలో ఒకే కులానికి చెందిన లేదా మతాలకు చెందిన వారి అపార్ట్‌మెంట్లు ఉన్నాయోమో గానీ, ఒకే కులానికి చెందిన గ్రామాలు ఎక్కడా లేవు. కొన్ని చోట్ల కొన్ని కులాల వారు అత్యధికంగా వుంటే ఉండవచ్చు. రాజధాని ప్రాంతం ఉన్న తాటికొండ నియోజకవర్గం షెడ్యూలు కులాలవారికి రిజర్వు చేసినది. అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఆ కులాలకు చెందిన వారు గణనీయంగా ఉన్నారనేది నిర్ధారణ. ఒక వేళ ఒకే కులం, ఒకే పార్టీకి చెందిన వారు 29 గ్రామాల్లో ఉంటే వారి ఓట్లన్నీ ఒకే పార్టీకి గుండుగుత్తగా పడి ఉంటే అక్కడ వైసిపి గెలిచే అవకాశాలే లేవు. భూములిచ్చిన వారిలో అన్ని పార్టీలకు చెందిన, కులాల వారు ఉన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికి భూములిచ్చిన వారి ఆందోళన ప్రత్యేకమైనది. ఇతర ప్రాంతాలలో ప్రాజెక్టులు లేదా పారిశ్రామిక ప్రాంతాలు లేదా ఇతర అవసరాలకు ప్రభుత్వాలు భూములు సేకరించి వారికి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాయి. అది ఎక్కువా తక్కువా, సమంజసమా అంటే అవునని ఎవరూ చెప్పరు. వాస్తవ ధరకంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకే పరిహారం వుంటుంది. ఒకసారి సొమ్ము తీసుకున్న తరువాత భూములతో వారికి పని ఉండదు. అటు బొందితో స్వర్గానికి పోలేక ఇటు భూమి మీదకు తిరిగి రాలేక మధ్యలో విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గంలో తలకిందులుగా వేలాడిన త్రిశంకుడి మాదిరి అమరావతి ప్రాంత రైతుల పరిస్ధితి తయారైంది. దీనికి ఎవరిది బాధ్యత ?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రియలెస్టేట్‌ ద్వారా డబ్బులు సంపాదించి రాజధానితో పాటు నవనగరాలను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు భ్రమరావతికి తెరలేపారు. ఆ మైకంలో పడిన రైతాంగం తమ భూములన్నింటినీ సమర్పించుకుంది. రియలెస్టేట్‌ ఎండమావులను చూసి వర్షించే మేఘాలని భ్రమపడింది. పది సంవత్సరాల పాటు వారిచ్చిన భూములకు కౌలు చెల్లిస్తామని, పద్దెనిమిది నెలల్లో భూముల్లో కొన్ని ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇస్తామన్నది ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన. ఆ మేరకు కౌలు చెల్లిస్తున్నారు తప్ప ప్లాట్లను అభివృద్ధి చూసి ఇంకా పూర్తిగా అప్పగించలేదు. కొత్త ప్రభుత్వం ఆపని చేస్తుందని ఆ శలు పెట్టుకున్న రైతాంగం అసలుకే మోసం తలపెట్టిన సర్కార్‌ తీరును చూసి హతాశులయ్యారు. జగన్‌ అసెంబ్లీలో చెప్పినట్లుగా, కమిటీలు సూచించినట్లుగా, రాబోయే హైపవర్‌ కమిటీ సూచించబోయేవాటి ప్రకారం అమరావతిని ఏడాదికి పది లేదా పదిహేను రోజుల పాటు జరిపే అసెంబ్లీ సమావేశాలకు(నెల రోజుల పాటు జరిగే వేసవి లేదా బడ్జెట్‌ సమావేశాలను విశాఖలో జరపాలనే సిఫార్సును అమలు చేస్తే) పరిమితం చేసి సచివాలయం, హైకోర్టు ఇతర కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలిస్తే జరిగేదేమిటి? గడువు ముగిసిన తరువాత కౌలు మొత్తాన్ని నిలిపివేస్తారు, కేటాయించిన ప్లాట్లకు డిమాండు పడిపోతే లేదా కొనుగోలు చేసే వారు లేకపోతే తమ పరిస్ధితి ఏమిటి అన్నది ఆ ప్రాంత రైతుల ఆవేదన.
అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాలంటూ ఒక్క ఆర్ధిక, సామాజికవేత్త కూడా లేకుండా పట్టణ ప్రణాళికల నిపుణులతో మాజీ అయ్యేయెస్‌ అధికారి జిఎన్‌రావు కన్వీనర్‌గా ఒక కమిటిీని వేశారు. అది తన నివేదికలో ఏమి సిఫార్సు చేస్తుందో తెలియక ముందే కడుపులో ఉన్నదానిని దాచుకోలేక గానీ లేదా సదరు నివేదికలో ఏమి రాయాలో చెప్పిన విషయం గుర్తుకు వచ్చిగానీ మూడు రాజధానులు, ఎక్కడ ఏమివస్తాయో కూడా సూచన ప్రాయంగా అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తరువాత కమిటీ ఏమి ఇవ్వనున్నదో ముందే తెలిసిపోయింది. రాజధానుల గురించి చెప్పిన ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నామో, దానికింద ఏమేమి చేయబోతున్నామో కూడా చెప్పి ఉంటే అదొక తీరు. కమిటీ సిఫార్సులు, వాటికి ఉన్న చట్టబద్దత లేక ఆచరణ సాధ్యమా అన్న అంశాలు ఒక ఎత్తు. ఆ కమిటీతో పాటు బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు సలహా అంటూ మరొకదాన్ని ముందుకు తెచ్చారు. లెక్కలేనంత మంది సలహాదారులు జగన్‌ చుట్టూ కొలువు తీరి ఉన్నారు. జనం సొమ్ము నుంచి ప్రతినెలా లక్షల రూపాయల ప్రతిఫలం, ఇతర సౌకర్యాలు పొందుతూ వారేమి సలహాలు ఇస్తున్నారో పాలకులేమి తీసుకుంటున్నారో మనకు తెలియదు. గతంలో చంద్రబాబు సలహాదారులు కూడా ఏమి చెప్పారో తెలియదు.(వారిచ్చిన సలహాలే తెలుగుదేశం పార్టీకి ఘోరపరాజయాన్ని చేకూర్చాయనే వారి అభిప్రాయాలను కాదనలేము. అదే బాటలో జగన్‌ సలహాదారులు కూడా ఉన్నారన్నది ఏడు నెలల పాలన చెబుతున్నది)
జిఎన్‌ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ సలహాలన్నింటినీ కలగలిపి సిఫార్సులు చేయాలంటూ పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులతో ఉన్నతాధికార కమిటీ అంటూ మరొకటి వేశారు. వీరేమి చేయబోతున్నారనేందుకు బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. జిఎన్‌రావు రాష్ట్రాన్ని నాలుగు అభివృద్ధి మండలాలుగా చేయాలంటే, బోస్టన్‌ ఆరు అని చెప్పింది. పదహారు మంది కమిటీ రెండింటినీ కలిపి పది అని చెప్పవచ్చు లేదా పదిని రెండుగా చేసి ఐదు అనవచ్చు, ఇలాంటి కమిటీల నుంచి అంతిమంగా ముఖ్యమంత్రులు ఏది చెబితే అదే బయటకు వస్తుందన్నది గత అనుభవం. మీరేది చెబితే అదే కరెక్టు అనే మంత్రులు, అధికారులే తాజా కమిటీలో కూడా ఉన్నారు.
మూడు రాజధానుల గురించి వైసిపి నేతలు తాము తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యతిరేకించాలి అని కొందరు, రాజ్యాంగంలో ఒక్క చోటే రాజధాని ఉండాలని ఉందా అని మరి కొందరు, మూడు చోట్ల అభివృద్ధి అవసరం లేదా అంటూ మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అంటే సమాధానం లేదు. అభివృద్ది అవసరం లేదని ఎవరు అన్నారు, మూడు రాజధానులతో అభివృద్ది ఎలా చేస్తారో చెప్పమంటే కంటి చూపులే తప్ప నోటమాటలు లేవు, తరువాత వెల్లడిస్తామంటారు.
మూడు చోట్ల కాదు కొత్త రాజధాని ఎక్కడ అనే చర్చ సమయంలో ముప్ఫయి చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతి పాదించి ఆమోదం పొందితే ఎవరికీ అభ్యంతరం లేదు.జగన్‌ మోహనరెడ్డి నాడు అసెంబ్లీలో భూ సేకరణ గురించి భిన్నాభి ప్రాయం వ్యక్తం చేయటం తప్ప అమరావతిని రాజధానిగా అంగీకరించారు. ముప్పయివేల ఎకరాలు కావాలన్నారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల గురించిన ప్రస్తావన అప్పుడే కాదు, తరువాత గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ రాజధాని గురించి లేదా బహుళరాజధానుల గురించి చర్చ లేదు, కోరినవారూ లేరు. అధికారానికి వచ్చిన తరువాతే వైసిపి నాయకత్వంలో పునరాలోచన, కొత్త ఆలోచనలు పుట్టుకు వచ్చాయి. మూడు చోట్ల ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు, పదమూడు జిల్లాల్లో లేదా లోక్‌సభ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన అంటున్నారు కనుక 25 చోట్ల కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ తేలాల్సింది ఎవడబ్బ సొమ్మని రామ చంద్రా అని భక్త రామదాసు అడిగినట్లుగా ఎవరి జేబుల్లో సొమ్ముతో అన్ని రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే అసలు సమస్య.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రం. అది మూడు రాష్ట్రాల్లో నాలుగు ముక్కలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో యానామ్‌, తమిళనాడులో పుదుచ్చేరి, కరైకాల్‌, కేరళలో మాహే ప్రాంతాలు ఉన్నాయి. దానికి లేని రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తుంది. రాజధానులతోనే అభివృద్ది జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రాజధాని ఢిల్లీ నుంచి ఒక ముక్కను ఏర్పాటు చేయాలని జగన్‌ సర్కార్‌ ఎందుకు కోరటం లేదు. దక్షిణాదిన సుప్రీం కోర్టు బెంచ్‌ పెట్టాలన్న డిమాండును వైసిపి ఎందుకు చేయటం లేదు ? ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కును సాధించుకున్న చరిత్ర తెలిసిందే. దాని వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. దానికి ముడిఇనుప గనులను కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర పట్టించుకోవటం లేదు. అది చేయకపోగా దాన్ని విదేశీ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు పూనుకుంటే దాని గురించి మాట్లాడని జగన్‌ సర్కార్‌ విశాఖ అభివృద్ది గురించి కాకమ్మ కబుర్లు చెబుతోంది.
చంద్రబాబు నాయుడు అమరావతి గురించి అతిగా మాట్లాడి, ప్రచారం చేసి దాన్నొక రియలెస్టేట్‌ ప్రాజెక్టుగా మార్చేందుకు చూశారు. ఒక్క రైతాంగాన్నే కాదు, అనేక మందిలో భ్రమలు కల్పించి చేతులు కాల్చుకొనేట్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రచారాన్నే అస్త్రంగా చేసుకొని వైసిపి రాజధాని రాజకీయానికి తెరలేపింది. గందరగోళాన్ని సృష్టించింది. అక్కడే లక్ష కోట్లు తగలేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతేమిటని ప్రాంతీయ మనోభావాలను రెచ్చగొడుతోంది. ఎవరు కట్టమన్నారు, తాత్కాలిక ఏర్పాట్లలోనే పాలన సాగించవచ్చు, అసంపూర్ణంగా ఉన్నవాటిని పూర్తి చేసి మిగతా అవసరాలను తరువాత చూసుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా పాలకులుగా కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా ప్రజాకర్షక పధకాలతో జనాన్ని ఆవైపు మళ్లించాయి తప్ప అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాయి. ప్రభుత్వాలు ప్రయివేటు వారికి వేల కోట్ల రూపాయలు లేదా వేల ఎకరాలను రాయితీలు, మరొక రూపంలో అప్పనంగా కట్టబెట్టటం తప్ప తాముగా పరిశ్రమలను నెలకొల్పాలనే విధానాల నుంచి వైదొలిగాయి.
వైసిపి నేతలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతరులు పసలేని వాదనలను ముందుకు తెస్తున్నారు. హైదరాబాదులో అభివృద్ధి కేంద్రీకృతం అయిన అనుభవాన్ని తీసుకోనవసరం లేదా అని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. వారే మరోవైపు హైదరాబాదు తరువాత కాస్త అభివృద్ది చెందిన విశాఖలో పెట్టాలని అంటారు. నూతన ఆర్ధిక విధానాలకు తెరలేపిన తరువాత హైదరాబాదులో గానీ మరొక రాష్ట్ర రాజధాని లేదా ఇతర పట్టణాలలో గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు పెట్టలేదు. హైదరాబాదు, విశాఖ వంటి చోట్ల గతంలో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి గనుకనే వాటితో పాటు వాటి అనుబంధ పరిశ్రమలు ప్రయివేటు రంగంలో అభివృద్ధి చెందాయి. అందువలన ఉపాధి అవకా శాలు, రియలెస్టేట్‌ పెరిగింది. ఇలాంటి నగరాలలో మూతపడిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి, అవి పునరుద్దరణకు నోచుకోలేదు.
ఇక ప్రయివేటు పెట్టుబడుల విషయానికి వస్తే ప్రధాని, ముఖ్యమంత్రుల లావు, ఎత్తూ చూసి రావని తేలిపోయింది.గుజరాత్‌ మోడల్‌ అని, మేకిన్‌ ఇండియా పేరుతో హడావుడి చేసిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆర్ధికాభివృద్ది ఎనిమిది నుంచి నాలుగున్నర లేదా ఐదు శాతానికి పడిపోయింది. కొందరు ఆర్ధికవేత్తల అంచనా ప్రకారం రెండున్నర శాతమే వాస్తవమైనది. ఆంధ్రప్రదే శ్‌లో చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్‌ కూడా పెద్ద హడావుడి చేసి పెట్టుబడుల గురించి లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు ఊదరగొట్టారు. ఆచరణలో అంతసీన్‌ లేదు కనుక ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు మూడు ప్రాంతాలలో రాజధానులతో అభివృద్ధి అంటున్నది వైసిపి నాయకత్వం.
జగన్‌ నాయకత్వంలోని వైసిపి వద్ద నవరత్నాలనే సంక్షేమ పధకాలలో జనానికి ఎంత అందచేస్తారనే నిర్దిష్టత తప్ప ఆర్ధిక వృద్ధికి అసలు ప్రతిపాదనలు లేదా అజెండాయే లేదు. వచ్చే రోజుల్లో నవరత్నాలకు ఎంత మేరకు కోతపెడతారనే ప్రశ్నలకు ఎలాగూ కొద్ది వారాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మూడు ప్రాంతాల్లో అభివృద్ది అంటే కొన్ని కార్యాలయాలను నెలకొల్పితే ఆక్కడ రియలేస్టేట్‌ ధరలు పెరగటం అనేనా లేక ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను పెడతారా ? సందేహాలు తీర్చేవారు లేరు. విశాఖలో ప్రస్తుతం ఉన్న ప్రయివేటు రంగంలోని బడా పరిశ్రమలెన్ని,కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం ఉన్నంత మాత్రాన ప్రయివేటు పెట్టుబడులు ఎలా వస్తాయి? జిఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ చెప్పిన ప్రాంతాల వారీ కమిషనరేట్స్‌తో అభివృద్ది జరగదని కర్ణాటక అనుభవం చెబుతోంది. నయా వుదారవాద విధానాల కాలంలో పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా, విస్తరణకు అవకా శాలుంటే అక్కడికే వెళతాయి తప్ప వెనుక బడిన ప్రాంతాలకు రాలేదన్నది కర్ణాకటలో తేలిపోయింది. అలాంటి లాభ అవకా శాలుంటే పెట్టుబడులు ఎవరూ ప్రయత్నించకుండానే వస్తాయి.

Image result for jagan three capitals
రాజకీయంగా చూస్తే కేంద్రంలో మోడీ సర్కార్‌ తెస్తున్న అన్ని ప్రతిపాదనలనూ బలపరచటంలో తెలుగుదేశం-వైసిపి రెండూ పోటీ పడుతున్నాయి. ఎక్కడ కడితేనేం మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి నేతలను బిజెపి ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. అలాంటపుడు మూడు రాజధానులు, మూడు హైకోర్టులంటూ, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలంటూ వైసిపి ముందుకు తెచ్చిన అజెండాను ఆమోదించి అమలు జరిపితే వస్తే గిస్తే ఆ ఖ్యాతి జగన్‌కు దక్కుతుంది తప్ప బిజెపికి వచ్చేది ఏముంటుంది. సాంకేతికంగా రాజధానిని మార్చకుండా కార్యనిర్వాహక రాజధాని అనో మరొక పేరో తగిలించి కొన్ని కార్యాలయాలను విశాఖకు తరలిస్తే, అసెంబ్లీ సమావేశాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. కానీ హైకోర్టును తరలించటం, మరో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేయటం జరిగేనా ? అది చేయకుండా జగన్‌ విశాఖలో కాపురం పెట్టి నెగ్గుకు రాగలరా ? రాజధానిని మూడు చోట్ల పెట్టిన తరువాత రిజర్వుబ్యాంకు వంటివి లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలు ఎక్కడ పెట్టాలనే విషయంలో ప్రతిదానికీ పంచాయతీలు తలెత్తటం, ఆలస్యం కావటం లేదా వేరేచోట్లకు తరలి పోవటం అనివార్యం. కృష్ణా జలాల బోర్డును హైదరాబాదు నుంచి విజయవాడకు తరలింపు అంశాన్ని రాజధాని ఎక్కడో తేలిన తరువాతే నిర్ణయించాలని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో ఐటిని తానే అభివృద్ది చేసినట్లు చంద్రబాబు స్వంత డబ్బా కొట్టుకుంటారు. ఐటి రాజధానిగా పరిగణించే బెంగళూరు, చెన్నరు, పూనా వంటివి చంద్రబాబు వంటి వారు లేకుండానే అభివృద్ధి చెందాయా లేదా ? చంద్రబాబు పాలన ముగిసిన తరువాత హైదరాబాదులో కంపెనీల విస్తరణ పెరిగింది తప్ప ఆయన లేరనే కారణంగా ఆగిపోలేదు కదా ? చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపి అక్కడి జనాన్ని హతాశులను చేశారు. రాజధాని ప్రాంతం పరిసరాల్లో ఒక్క సీటులో కూడా నెగ్గలేక ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు జగన్‌మోహనరెడ్డి ఆ అనుభవాన్ని విస్మరించి మూడు రాజధానులు-అభివృద్ధి పేరుతో రాజకీయానికి తెరలేపి మరో రెండు భ్రమరావతులకు తెరలేపారు.కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల సమయంలోనే తెలుస్తందన్నది ఒక సామెత, ప్రస్తుతం జగన్‌మోహనరెడ్డి పాలన గురించి మద్దతుదారులతో సహా అనేక మందిలో అదే అనుమానం ప్రారంభమైంది. తెలుగుదేశం అనుభవం వచ్చే ఎన్నికల్లో వైసిపికి పునరావృతం అవుతుందా ? లేక అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలతో జగన్‌ చరిత్రను తిరగరాస్తారా ? తానే సృష్టించిన గందరగోళాన్ని తానే ఏదో ఒక పేరుతో సరి చేసుకొని పాలన మీద దృష్టి కేంద్రీకరిస్తారా ?