Tags

, , , , , ,

Image result for jnu,

ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యు గురించి వివరాలు తెలుసుకుందాం. రఘునాథ రామారావు గారి ఆంగ్ల లేఖకు తెలుగు అనువాదం మరి కొంత నా సేకరణ. మదన్‌ గుప్త పేరుతో ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దీన్ని చదివి కొంత మంది దానిలోని అంశాలు నిజమే కదా అని నిజంగానే ఆందోళన పడుతున్నారు. కొందరు దీన్ని పూర్వపక్షం చేస్తూ వాస్తవాలు బయటపెడితే బాగుండు అనుకుంటున్నవారు కూడా లేకపోలేదు. ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ గురించి తెలిసిన వారికి కాషాయ తాలిబాన్లు విసిరిన మరొక బాణం ఇది అని ఇట్టే పసిగట్టగలరు. దీనిలో జెఎన్‌యు గురించి కొత్తగా తెలిపిందేమీ లేదు, చదివిన వారు తెలుసుకొనేదీ ఏమీ లేదు.
ముందుగా అడగాల్సింది అసలు ఆ రామారావు ఎవరు, ఆయనెందుకు ఆంగ్లంలో లేఖ రాశారు, ఆపెద్ద మనిషి కవిత్వానికి మదన్‌ గుప్త తనపైత్యాన్ని జోడించటమెందుకు ? ఈ పోస్టు ఎవరిపేరుతో అయితే ఉందో వారి విశ్వసనీయత, అసలు ఆ పేరుతో ఎవరైనా ఉన్నారో కల్పిత వ్యక్తులో తెలియదు. వారు పేర్కొన్న అంశాలకు ఆధారాలేమిటో అసలే తెలియదు కనుక దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జెఎన్‌యు మీద దాడిలో ఇదో కొత్త కోణం. దీపికా పదుకోన్‌ ఆ విశ ్వవిద్యాలయాన్ని సందర్శించి ముసుగు గూండాల దాడిలో గాయపడిన వారికి మద్దతు తెలిపిన అంశం గురించి ‘కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక ‘ అనే శీర్షికతో రాసిన నా విశ్లేషణపై కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరెగిరి పడ్డారు. జెఎన్‌యు కమ్యూనిస్టుల కిస్‌ కల్చర్‌ (ముద్దుల సంస్కృతి) కేంద్రం అని నోరుపారవేసుకున్నారు. ఆ కేంద్రంలోనే బిజెపి నేతలు నిర్మలా సీతారామన్‌, మేనకా గాంధీ వంటి వారు విద్యాభ్యాసం చేశారు. వారెంత మందికి ముద్దులిచ్చారు, ఎంత మందినుంచి ముద్దులు తీసుకొని ఉంటారో చెప్పగలరా అన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు ఎబివిపికి చెందిన ఆమ్మాయిలు, అబ్బాయిలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి సంస్కృతి అక్కడ ఉందనుకుంటే దానిలో కొనసాగటం ఎందుకు, చదువు మానుకొని బయటకు రావచ్చు, వేద పాఠశాలలు, సంస్ధలలో చేరవచ్చు !
అందువలన ఎవరికిి తెలిసిన భాషలో చెబితేనే వారికి సులభంగా అర్ధం అవుతాయి. ఈ పోస్టుకూడా ఇంచు మించు అలాంటిదే కనుక కొన్ని అంశాలను చూద్దాం. మామిడి చెట్టు నాటితే మామిడి కాయలే కాస్తాయి, జాంకాయలు ఎందుకు కాయటం లేదనే కుతర్కం, బుర్రతక్కువ జనాలకు ఏం చెప్పాలి. జెఎన్‌యు సాంకేతిక విద్యా సంస్ధ కాదు. ప్రధానంగా సామాజికాంశాలతో పాటు సైన్సు కోర్సులు కూడా బోధించే సాధారణ విశ్వవిద్యాలయం. అక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. డాక్టరేట్స్‌ను ఇస్తున్నారు. ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక అంశాల అధ్యయనం, పరిశోధనలకు ఐఐటిలు, ఇతర పరిశోధనా సంస్దలు ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలను, వీటినీ రెండింటినీ ఒకే గాటన కట్టటం వక్రీకరణ.
ఈ పోస్టులో లాభనష్టాల గురించి చర్చ చేశారు. విద్యా సంస్ధలు చేసేది వాణిజ్యం కాదు కనుక లాభనష్టాల ప్రమాణాలు వర్తింప చేయటం అనుచితం. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇదే మాదిరి బోధన, పరిశోధన అవకాశాలను కల్పిస్తున్నాయి. కనుక వాటితో పోల్చి చూపితే ఆ పోస్టుపెట్టిన వారి బండారం ఏమిటో తెలిసి ఉండేది. ఆ చిత్తశుద్ది పోస్టులో లేదు. దానిలో పేర్కొన్న కొన్ని అంశాలకు ఆధారాలేమిటో తెలియదు. జెఎన్‌యులో చదివిన వారు ఎందరు ఉపాధి పొందారో తెలియదు అన్నారు. ఆ పరిశోధకుడు, పరిశీలకుడు కలసి ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు పొందిన వారు ఎందరు ఉపాధి పొందారో ఏమి చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా ? లేదా నరేంద్రమోడీ గారు సెలవిచ్చినట్లు పకోడీ బండ్లు ఎందరు పెట్టారో తెలుపగలరా ?

Image result for jnu attack
చెడిపోయిన ప్రజాస్వామ్యానికి జెఎన్‌యు ఓ గొప్ప ఉదాహరణ అట. సరే అంగీకరిద్దాం, బాగున్న ప్రజాస్వామ్యానికి ఓ గొప్ప ఉదాహరణగా ఉన్న విశ్వవిద్యాలయం పేరేమిటో చెప్పి ఉంటే వివేక వంతులు పోల్చి చూసుకొనే వారు. ఇప్పటికైనా చెప్పండి, సవాలు కాదు సవినయంగా అడుగుతున్నాం. అక్కడి విద్యార్ధులకు ఖాళీ సమయం ఎక్కువ కాబట్టి కొత్త సమస్యలు సృష్టించటంపైన, మైండు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి అడ్డమైన భావజాలంతో నింపేస్తారట, అన్నీ ఉచితంగా అందుతూ ఉంటే ముసలి వారైనా అక్కడే వారి జీవితాన్ని గడిపేస్తారుట. సాంఘిక సంస్కరణల ఊసులేదట, ఇలా సాగిన, రాసిన చెత్తకంతకూ సమాధానం చెప్పటం వాణిజ్య భాషలో దండగ, కనుక ఆపని చేయటం లేదు. ఇలాంటి పోస్టులు ఏ మాత్రం విమర్శనాత్మక వైఖరిలేని వారి బుర్రలను ఖరాబు చేస్తాయి. వాటి లక్ష్యమే అది. రెండు రెళ్లు నాలుగే ఎందుకు కావాలి, మూడు ఎందుకు కాకూడదు అని ఎవరైనా వాదించే వారిని సంతృప్తి పరచ చూడటం వృధా ప్రయాస. ఒక సినిమాలో నువ్వు ఎవరు అనే ప్రశ్నతో ఉన్న దృశ్యాలను వారికి చూపటం తప్ప మరొక మార్గం లేదు. దేశంలో పేటెంట్‌లు, పరిశోధనలు తక్కువగా ఉండటానికి కారణం జెఎన్‌యు అన్నట్లుగా చిత్రించిన పెద్దలు ఈ దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, వాటితో సమానమైన సంస్ధలు, ఎన్ని లక్షల మంది వాటిలో చదువుతూ, పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకుంటే జెఎన్‌యులోని ఎనిమిదివేల సంఖ్య ఎంత తక్కువో తెలుస్తుంది. జెఎన్‌యును మూసివేయాలని వాదించేందుకు తెగ ఆయాసపడిపోవటం గాకుండా అసలు మొత్తంగా పరిశోధనలు, పేటెంట్ల నమోదులో దేశం ఎందుకు వెనుకబడి పోయిందో, దానికి పరిష్కారాలు ఏమిటో చెప్పి ఉంటే వారి శ్రమ ఫలించేది.

Image result for jnu attack
పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించే వాతావరణం, అందుకు అవసరమైన పెట్టుబడి వంటి అంశాలను మనం చూడాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఆరునెలల క్రితం చేసిన సిఫార్సులో దేశంలో పరిశోధన మరియు అభివృద్ది కార్యకలాపాలకు 2022నాటికి జిడిపిలో కనీసం రెండు శాతం ఖర్చు చేయాలని కోరింది. గత రెండు ద శాబ్దాలుగా చేస్తున్న ఖర్చు 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉంది. అలాంటిది మరో రెండు సంవత్సరాల్లో రెండుశాతానికి పెరుగుతుందని ఆశించే పరిస్ధితి ప్రస్తుతం ఉందా.


ప్రపంచ నవకల్పన సూచికలో మన దేశ స్ధానం గురించి చెప్పుకోబోయే ముందు పరిశోధనకు వివిధ దేశాలు జిడిపిలో చేస్తున్న ఖర్చును చూస్తే ఇజ్రాయెల్‌ 4.3, దక్షిణ కొరియా 4.2, జపాన్‌ 3.2, అమెరికా 2.8, చైనా 2.1 శాతం ఖర్చు (2017) చేస్తున్నాయి. ఈ మధ్య మన కాషాయ పరివారం ప్రతిదానికి పాకిస్ధాన్‌తో పోల్చుకోవటాన్ని ఎక్కువ చేసింది. దాని ఖర్చు 0.5శాతంగా ఉంది కనుక, మన దేశాన్ని మోడీ సర్కార్‌ దాని కంటే కొన్ని మెట్లు ఎగువ నిలిపిందని గొప్పలు చెప్పుకోవచ్చు.
దేశంలో నేడున్న పరిస్ధితి ఏమిటి? ఆపరేషన్లకు ఎలాంటి విఘ్నం కలగ కూడదని వైద్యులు గణపతికి మొక్కుతారు. పోలేరమ్మలకు సద్ది నైవేద్యాలు పెడతారు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్త్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వరుడిని, సుళ్లూరు పేట గ్రామ దేవతలను వేడుకుంటారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు తామరతంపరగా పెరిగిపోతున్నారు. లక్షల సంవత్సరాల నాడే మన పూర్వీకులు ఎలాంటి ఇంధనం లేకుండా పలు ఖండాలకు ఎటు కావాలంటే అటు తిరిగే, ఎందరు ఎక్కినా మరొకరికి సీటు దొరిక విమానాలు నడిపారని, కృత్రిమ గర్భధారణ పద్దతుల్లో నూరుగురు కౌరవులను పుట్టించారని, ప్లాస్టిక్‌ సర్జరీ తెలిసిన కారణంగానే వినాయకుడికి ఏనుగు తలను అతికించారని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, ఆవు పేడలో ఔషధ గుణాలున్నాయని, వాటి మీద పరిశోధనలు చేయండని చెప్పేందుకు ప్రధాని నుంచి కింది స్ధాయి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వరకు పోటీ పడుతుండటాన్ని చూస్తున్నాము. మూఢనమ్మకాలతో రోజు ప్రారంభమై ముగుస్తున్న సమాజంలో , నరికిన వినాయకుడి తలనే తిరిగి అతికించకుండా ఏనుగు తలను ఎందుకు అతికించారు అనే ప్రశ్ననే అడగకుండా నీకు తెలియదులో నోరు మూసుకో చెప్పింది విను అని మొగ్గలోనే చిదిమేస్తున్నకుటుంబవాతావరణంలో, రాయి రప్పలు, చెట్లు పుట్టలకు మొక్కితే పోయేదేముందిలే అనే తరాలు పెరుగుతున్న తరుణంలో లక్షలు ఎలా సంపాదించాలి, అమెరికా,ఆస్ట్రేలియా ఎలా వెళ్లాలి అనే యావతప్ప శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశోధనల పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది, పరిశోధనల్లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి, అయినా ముందుకు పోవాలంటే ఆసక్తి కలిగిన వారికి ఆర్ధిక భరోసా కలిగించకపోతే, సాధించిన విజయాలకు ప్రోత్సాహం లేకపోతే యువతరానికి ఆ రంగంలో కొనసాగాలనే ఆసక్తి ఎలా ఉంటుంది ?
నవకల్పనల విషయంలో మన దేశ స్ధానం ఎక్కడ అన్నది చూద్దాం. ఈ మధ్యకాలంలో మన ప్రధాని నరేంద్రమోడీ కొత్త విషయాలు చెబుతున్నారు. ఐదేండ్ల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి అని ఊదరగొట్టారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. అంటే వాటన్నింటినీ సాధించారని మనం అనుకోవాలి. రెండో సారి ఎన్నికైన తరువాత 70ఏండ్లలో సాధించలేని వాటిని అన్నింటినీ సాధించామని చెప్పుకుంటున్నారు.మారు మాట్లాడకుండా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని భజన చేయాలి. లేకపోతే దే శద్రోహులం అవుతాం, రాబోయే ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలలో మన పేర్లను పక్కన పెట్టి జాతీయతను నిరూపించుకొనే ఆధారాలు సమర్పించమంటారు.
2014లో ప్రపంచ నవకల్పనల సూచికలో 143 దేశాల జాబితాలో మన దేశం 33.7శాతం మార్కులతో 76వ స్ధానంలో ఉంది. మన ఒక పొరుగుదేశం మోడీ అండ్‌కో నిత్యం కలవరించే పాకిస్ధాన్‌ 24 మార్కులతో 134వ స్ధానంలో, చైనా 46.57 శాతం మార్కులతో 29వ స్ధానంలో ఉంది.( ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌కు వచ్చిన మార్కులు 64.78శాతం). ఐదేండ్ల తరువాత 129 దేశాలలో మోడీ పాలనలో మన మార్కులు 36.58శాతంతో 52 స్ధానాన్ని పొందాము. ఇదే సమయంలో పాకిస్ధాన్‌ 31.62 మార్కులతో 113 స్ధానాన్ని, చైనా 54.82 మార్కులతో 14వ స్ధానానికి చేరింది.ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌ మార్కులు 67.24. దీన్ని బట్టి ఎక్కడ ఎలాంటి ప్రోత్సాహం, పోటీ ఉందో ఎవరికి వారే అర్ధం చేసుకోవచ్చు. అన్ని విజయాలు సాధించిన నరేంద్రమోడీ ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యారు ? చైనా ఐదేండ్లలో తన మార్కులను 8.25, పాకిస్ధాన్‌ 7.62 పెంచుకోగా మనం 2.88కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యాం ?
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేయకుండా ముందుకు పోజాలదు. మన ప్రధాని దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా మార్చుతామని చెప్పటం తప్ప అందుకు అవసరమైన కనీస చర్యలు కూడా చేపట్టలేదు. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు గుండ్రాయిలా తయారు కావాలంటే కుదురుతుందా? పరిశోధనా ఖర్చును ఎందుకు పెంచలేదో ఎవరైనా చెప్పగలరా ? గతేడాది అక్టోబరు ఆరవ తేదీన ఎకనమిక్స్‌ టైమ్స్‌లో జి సీతారామన్‌ రాసిన ఒక విశ్లేషణ వచ్చింది. దాని సారాంశం, వివరాలు ఇలా ఉన్నాయి. ” ప్రపంచ మేథోసంపత్తి సంస్ధ వివరాల మేరకు 2017లో కొన్ని దేశాలలో దాఖలైన పేటెంట్ల దరఖాస్తులు, మంజూరైన పేటెంట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం         దరఖాస్తులు         పేటెంట్ల మంజూరు
చైనా         13,81,594             4,20,144
అమెరికా      6.06,956              3,18,481
జపాన్‌         3,18,481              1,99,577
ఐరోపా         1,66,585              1.05,645
భారత్‌            46,582                12,387
ప్రతి పదిలక్షల మందికి జపాన్‌లో 2,053, అమెరికాలో 904, చైనాలో 899, జర్మనీలో 887 మంది పేటెంట్లకు దరఖాస్తు చేయగా మన దేశంలో కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు. పరిశోధకుల విషయానికి వస్తే యునెస్కో సమాచారం 2015 ప్రకారం ప్రతి పదిలక్షల మందికి గాను జపాన్‌లో 5,210, అమెరికాలో 4,313,ఐరోపాయూనియన్‌లో 3,749, చైనాలో 1,206 మంది ఉండగా మన దేశంలో 216 మాత్రమే ఉన్నారు.
దేశంలోని ఐఐటీల్లో 2018-19లో బొంబాయి ఐఐటి 98 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. మిగతా అన్ని ఐఐటిలు దాఖలు చేసిన వాటిలో ఇవి ఆరోవంతు. ఇదే ఏడాది బొంబాయి ఐఐటి పరిశోధన ఖర్చు 335 కోట్ల రూపాయలు కాగా దానిలో 80శాతం ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం ప్రయివేటు రంగం నుంచి వచ్చింది.”

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌ దేశాల్లో గణనీయ మొత్తాలను ప్రయివేటు కార్పొరేట్లు కూడా ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో పరిశోధనల ఖర్చు పేరుతో రాయితీలు పొందటం తప్ప వాస్తవ ఖర్చు పరిమితం. ఇక వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అపార సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పేవారు వాటిని వెలికి తీసి పేటెంట్‌ దరఖాస్తులను ఎందుకు దాఖలు చేయలేదు ? ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? వారిని అడ్డుకున్నదెవరు ? చైనా, పాకిస్ధాన్ల గురించి సొల్లు కబుర్లతో కాషాయ దళాలు పోసుకోలు కబుర్లు చెప్పటాన్ని పక్కన పెట్టి వేద విజ్ఞానాన్ని ఎందుకు వెలికి తీయించలేకపోయారు? జెఎన్‌యు గురించి ప్రశ్నిస్తున్నవారు సంఘపరివార్‌ నడిపే సరస్వతి శిశుమందిర్‌లు, ఇతర విద్యా సంస్ధలలో శిక్షణ పొందిన వారిలో ఎందరు పేటెంట్‌లు పొందారో, పరిశోధనలు చేసి ఏమి సాధించారో చెబుతారా ?

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
విద్యా సంస్ధలలో లెక్చరర్లు, విద్యార్ధులతో కూడి దేశంలో అతి పెద్ద విద్యార్ధి సంఘం అని చెప్పుకొనే ఎబివిపి ఎప్పటి నుంచో దేశభక్తిని నూరిపోస్తున్నట్లు చెప్పుకుంటుంది. అలాంటి సంస్ధ తన సభ్యులతో ముసుగులు వేసి దాడులు చేయించటాలు, విద్యా సంస్ధల్లో గణేష్‌ పూజలు, తిరోగామి భావాలను ప్రోత్సహించటం వంటి వాటిని పక్కనపెట్టి పరిశోధనల వంటి అంశాలపై తన సభ్యులను పురికొల్పి ఉంటే ఈ పాటికి చైనాతో సహా ఎన్నడో ఇతర అన్ని దేశాలను అధిగమించే వారం కదా ? ఎన్నో పేటెంట్‌లు వచ్చి ఉండేవి కదా ? నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధికంగా ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు, ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కల నెరవేరేది. పరిశోధనలు లేవు, పేటెంట్లను సాధించని కారణంగా జెఎన్‌యును మూసివేయాలని సలహా ఇస్తున్న పెద్దలు ఎబివిపికి లేదా దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు , ఇతర యూనివర్సిటీల గురించి ఏమి సలహా యిస్తారు ? విద్యా సంస్దలను, సంఘపరివార్‌ సంస్ధలను మూసుకొమ్మంటారా, లేకపోతే ఇప్పటి మాదిరే పైవిధంగా ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తారా ? పనికి రానివి, ప్రయోజనం లేనివి ప్రభుత్వ సంస్దలైతేనేం, ప్రయివేటువైతేనేమి ?