ఎం కోటేశ్వరరావు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి
ఒక తెలుగు వాడిగా ఈ లేఖ రాస్తున్నా, వాడిగా, వేడిగా ఉందని విసుక్కోకుండా ఒక సారి గడ్డం సవరించుకొని కాస్త తీరిక చేసుకొని చదివి ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని, భవిష్యత్‌లో కాస్త ఆచితూచి మాట్లాడతారని అనుకుంటున్నా. ఒక వేళ మీకు ఎవరైనా స్క్రిప్టు రాసిస్తూ ఉంటే (అదేమీ తప్పు కాదు, ఏం మాట్లాడాలో తెలియనపుడు పెద్ద పెద్ద నేతలందరూ అదే చేస్తారు ) వారికి ఈ లేఖను అందించండి. లేకపోతే ఏదేదో మాట్లాడి మీరు అభాసుపాలౌతారు. మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏదో జరిగినట్లు అని పిస్తోంది. చిల్లంగా లేక చేతబడా మరొకటా ? లేఖ ముగింపుకు వచ్చే సరికి ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చూస్తా !
రాజకీయ పార్టీకి నిజాయితీ ముఖ్యం. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగి ధన్యత పొందాలంటే కుదదరదు. అందునా ప్రజాజీవితంలో ఉన్నపుడు తనను ఎవరూ చూడటం లేదనుకొనే పిల్లి మాదిరి ఆలోచిస్తే ఎదురుతన్నుతుంది. ప్రజా జీవితంలో ఉన్నపుడు
” ఆడిన మాటలు తప్పిన – గాడిద కొడుకంచు తిట్టగా విని,
మదిలో వీడా కొడుకని ఏడ్చును – గాడిదయును కుందవరపు కవి చౌడప్పా ”
అన్న కవి చౌడప్ప పద్యం గుర్తుకు తేవాల్సి వచ్చినందుకు ఏమీ అనుకోవద్దేం ! వహ్వా వహ్వా అనే అభిమానుల పూలే కాదు, ఏమిటిది అనే విమర్శకుల రాళ్లను కూడా సమంగా చూడాలి మరి ! మీకు తెలిసిన సినిమా భాషలో చెప్పాలంటే హిట్లను చూసి పొంగిపోకూడదు, ప్లాప్‌లను చూసి కుంగిపోకూడదు మరి !
ఆదిలోనే హంసపాదు అన్నట్లు మరిచాను. ” నేను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని చెప్పారు మీరు. మీ అంత హీరో చెప్పారు కనుక మేమంతా మీ పుణ్యమా అని కొత్తగా ప్రశ్నించటం నేర్చుకున్నాం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని మేమూ కొన్ని ప్రశ్నలు అడిగేందుకు మీరు అవకాశం ఇచ్చారు. ఊరందరిని ఉల్లిపాయను తినొద్దని చెప్పాను గానీ ఇంట్లో నిన్ను వేయవద్దని చెప్పానా అని పెళ్లాన్ని బాదిన ప్రవచన కారుడిలా మారవదు,్ద వీలైతే నాలుగు సమాధానాలు చెప్పండి.
బిజెపితో జతకడుతున్న మీరు వామపక్షాలకేమి చెబుతారని విలేకర్లడిిగితే అదేమిటి పీకే గారూ ఠకీమని వామపక్షాలకు నేనేమన్నా బాకీ ఉన్నానా అన్నారు. అప్పులు వడ్డీల లెక్కల పద్దతిలో చెప్పాలంటే మీరు బిజెపితో రెండో సారి జతకడుతున్నారంటే మరో పాకేజీయా అనటం లేదు గానీ, బిజెపి మీకు కొత్తగా ఏమన్నా అప్పు ఇచ్చిందా లేక ఇప్పుడు సినిమాలేమీ లేవు, రాబోయే నాలుగున్నరేండ్లు రాజకీయాలే రాజకీయాలు అంటున్నారు గనుక బిజెపి దగ్గర మీరేమన్నా అప్పు తీసుకున్నారా అన్న అనుమానం మాత్రం వస్తోంది. ఎందుకంటే గతంలో మీ ఆర్ధిక పరిస్ధితి ఎంత దిగజారిందో మీరే చెప్పిన విషయం గుర్తుకు వస్తోంది. వామపక్షాలకు నేను చెప్పాల్సిందేమీ లేదు బ్రదర్ అని మామూలుగా చెబితే మీ సొమ్మేం పోయేది, రాజకీయాల్లో అంత ఎటకారాలాడితే, జనం మిమ్మల్ని ఆడుకుంటారనే చిన్న లాజిక్కు మర్చిపోతే ఎలా ! కాస్త మన్నన నేర్చుకుంటే మంచిదేమో !
ఏ పార్టీతో కలవాలో ఏం ఊరేగాలో అది మీ ఇష్టం. దానిలో కాస్త నిజాయితీ ఉండాలి సార్ ! వివిధ సందర్భాల్లో మీరు చేసిన కొన్ని ఆణిముత్యాలందామా లేక గోల్డెన్ వర్డ్స్ అందామా అన్నది తరువాత మాట్లాడుకుందాం. మచ్చుకు కొన్నింటి కోసం పాత సినిమాల్లో లేదా కొత్త సినిమాల్లో మాదిరి అయినా ఒక్కసారి వెనక్కు చూద్దాం. మీకు గతాన్ని గుర్తు చేసినందుకు కోపం రావచ్చు. తప్పదు మరి ?
”చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం” అంటూ ప్రజాపోరాట యాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో సెలవిచ్చారు. సరే ప్రస్తుతం విలీనం లేదు కనుక అది నాకు వర్తించదు అంటారా !
” పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం స ష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయలేదు. నన్ను, బీజేపీని, టీడీపీని భాగస్వాములుగా ప్రజలు భావించారు. అందువల్ల వారికి నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ” సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ నివేదికపై తుది కసరత్తు అనంతరం హైదరాబాద్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి.
”ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివ ద్ధి చేయకుండా మోసం చేశారు. సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన మీద చూపించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారు? ” రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పిన గౌరవ ప్రదమైన మాటలివి. ‘
‘ 10 లక్షల రూపాయల సూట్ వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వ థా చేసేంది ప్రజాధనమే. సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది. ” విశాఖలో మీట్ ది ప్రెస్. ” నా దేశభక్తిని శంకిస్తున్న బీజేపీ నేతలు హద్దుల్లో ఉండాలి. అవాకులు, చెవాకులు పేలితే సహించే ప్రశ్నే లేదు. నేను మొదలు పెడితే బీజేపీ నేతలు నోరు తెరవలేరు. ”చిత్తూరులో జరిగిన బహిరంగ సభలో. ” వెనుకేసుకురావడానికి నాకు బీజేపీ బంధువూ కాదు. మోదీ అన్నయ్యా కాదు. అమిత్‌షా బాబయ్యా కాదు. వారిని ఎందుకు వెనుకేసుకొస్తాను? రాజకీయ జవాబుదారీతనం లేనందునే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హౌదా దక్కలేదు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ మాట తప్పారు. ” విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.
బిజెపితో కమ్యూనికేషన్ గ్యాప్ (సమాచార అంతరం) కారణంగా మధ్యలో విడిపోయామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇది రాజకీయం, సినిమా లావాదేవీల్లో మాదిరి లెక్కల్లో చూపేందుకు వీలుగా ఇచ్చే ప్రతిఫలం ఒకటి, చాటు మాటుగా ఇచ్చేది మరొకటి కాదు కదా ! చెప్పుకోలేని చాటు మాటు వ్యవహారాల్లో సైగలను అర్ధం చేసుకోలేక, బయటకు చెప్పుకోలేక అపార్ధాలతో మేము గత కొంత కాలంగా మౌనంగా ఉన్నామనో మాట్లాడుకోవటం లేదనో, ఇప్పడు మబ్బులు వీడెనులో, తనువులు కలిసెనులే అని పాట పాడుకుంటున్నాం అంటే అర్ధం చేసుకుంటాం. పైన మీరు చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు చూస్తే సమాచార అంతరం కాదు. మీరేమీ మౌనంగా లేరు, 2014-2019 ఎన్నికల సందర్బంగా మాట్లాడిన మాటలను చూస్తే ఎడమ జేబులో ఒక ప్రకటన, కుడి జేబులో ఒక ప్రకటన పెట్టుకొని వచ్చే అనుకూల, వ్యతిరేక సిగల్‌ను బట్టి జేబులో ప్రకటనలు తీసి రెచ్చిపోయి చదివినట్లుగా ఉంది.
రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండాలనుకుంటే అసలు మీ మధ్య వచ్చిన సమాచార అంతరం ఏమిటి, అప్పుడెందుకు అలా మాట్లాడారు, ఇప్పుడు తొలిగిన అంతరం ఏమిటి, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో చెప్పాలి మరి. లేకపోతే మిమ్మల్మి నమ్మేదెలా ? కొంత కాలం తరువాత మరొక వైఖరి తీసుకొని అప్పుడు మరొక సమాచార అంతర కథతో జనాల చెవిలో పూలు పెడితే పరిస్ధితి ఏమిటి ? ఎందుకంటే ఏ సినిమా వ్యక్తిని కదలించినా బోల్డు కధలు ఉన్నాయి అని చెబుతుంటారు కదా !
ప్రత్యేక హౌదా గురించి అడిగితే దాన్ని ఇవ్వాల్సిన నరేంద్రమోడీని అడగండి అని చెప్పాల్సిన మీరు అడ్డం తిరిగి తెలుగుదేశం పార్టీని, వైసిపిని అడగండి అంటారేమిటి స్వామీ ! ఢిల్లీ పర్యటనల తరువాత కిందిది పైన పైది కిందకు కనిపిస్తున్నట్లుగా ఉంది మీకు. తాట తీస్తా, తోలు వలుస్తా అన్న మీకు ఏమీ కాకపోతే ఇవ్వాల్సిన వారినా అడగాల్సింది తీసుకొనే వాళ్లనా ? ఇదెక్కడి విడ్డూరం, ఇదేమి ట్విస్టు, సినిమా కథ అనుకుంటున్నారా ? మీరు హీరో కనుక మీతో సినిమా తీయాలనుకొనే వారు మీరు చెప్పినట్లు కథను మార్చవచ్చు తప్ప, ఇది రాజకీయం, మీ ఇష్టం వచ్చినట్లు మారిస్తే కుదరదు.
ఒకే భావం జాలం కలిగినట్లు చెప్పుకుంటున్న మీరు విరుద్ద భావజాలంతో పని చేసే కమ్యూనిస్టులతో ఎలా కలిశారు, ఒకే భావజాలం కలిగిన బిజెపి వారిని అంత తీవ్రంగా ఎలా విమర్శించారు? ఎన్నికలు ముగిశాక మారు మనసు పుచ్చుకున్నారా, బిజెపి జమానాలో బుర్ర మార్పిడి జరిగిందా? ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ హిట్ అనుకున్న సినిమా అట్టర్ ప్లాఫ్ అయినట్లుగా మీరు అనుకున్న అధికారం రాకపోవటంతో రగిలిన విరహంతో మీరే ఢిల్లీ చూట్టూ ప్రదక్షిణలు చేశారా లేక బిజెపికి రాష్ట్రంలో కిక్కు ఇచ్చేవారెవరూ లేరని వారే మీ కోసం రాయబారాలు(కొందరు మీ వ్యతిరేకులు రాయ బేరాలు అనుకుంటున్నారు) పంపారో చెప్పాలి. గతంలో పాచిపోయింది మీకు మోడీ సర్కార్ ఇప్పుడే తయారు చేసి పెట్టిన ఘుమఘమ లాడుతున్న లడ్డులా అనిపించిందా ? లేక కొన్ని స్వీట్ షాపుల్లో మిగిలిపోయిన స్వీట్లను పారవేయకుండా వాటితోనే కొత్త స్వీట్లు తయారు చేసి వినియోగదారులకు సరికొత్తగా విక్రయించినట్లు మీకు వడ్డించారేమో చూసుకోండి.
సరే చంద్రబాబు ప్రత్యేక హౌదా మీద డింకీలు కొట్టారు. దాని కంటే ప్రత్యేక పాకేజి మెరుగు అన్నారు. అసలు ప్రత్యేక పాకేజిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేకత ఏమిటి ? దాన్నెందుకు కేంద్రం అమలు జరపలేదో తాజాగా జరిపిన ఢిల్లీ ప్రదక్షిణలలో అయినా దేవుడు మోడీని ప్రార్ధించారా ? నిజానికి ప్రత్యేక పాకేజీ మోడీ – చంద్రబాబు లేదా ఇప్పుడు మోడీ-జగన్ ప్రయివేటు వ్యాపారం కాదు. రాష్ట్రానికి చేసిన వాగ్దానం. బాబు గద్దె దిగి పోయారు జగన్ వచ్చారు, కేంద్రం అమలు జరపటానికి వచ్చిన అడ్డంకి ఏమిటి ? ఏడు నెలలుగా ఏమి చేశారు ? పౌర సత్వ సవరణ చట్టం గురించి బిజెపి ఏ పలుకులనైతే వల్లిస్తోందో వాటినే మీరు వల్లించారు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందంటే ఇదే కదా !
చివరాఖరుగా పేపరు కాగితం మీద ఇంక్ సిరాతో మీరు రాసిస్తారో లేక టైపు చేసి ఇస్తారో తెలియదు. జగన్ మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ సరికొత్త ప్రమాదకర రాజకీయానికి తెరతీసింది వైసిపి. దాన్ని జనసేన-బిజెపి కూడా అదే అభివృద్ధి నినాదంతోనే ఎదుర్కొంటామని చెబుతున్నాయి. జగన్ దగ్గర ఒక నిర్ధిష్ట అజెండా లేదా ప్రతిపాదనలు లేవు. మీ దగ్గర ఉన్న మంత్రదండం ఏమిటి ? దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు ? నాలుగున్నర సంవత్సరాల పాటు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తారా ?