Tags

, , , , , ,

Image result for generation z and millennials support to bernie sanders
ఎం కోటేశ్వరరావు
ఐరోపాను కమ్యూనిస్టు భూతం భయపెడుతున్నదని కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో వ్యాఖ్యానించారు. కమ్యూనిజాన్ని అంతం చేసి విజయం సాధించామని అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు అక్కడే కమ్యూనిస్టు భూతం భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. సోషలిస్టు వ్యవస్ధలకు, కమ్యూనిస్టు సిద్దాంతానికి తగిలిన ఎదురు దెబ్బలు అనేక మందిని నిరాశకు గురి చేశాయి. సమాజం పారే నది వంటిది అనుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కు నెట్టేస్తుంది. అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలు నిరాశకు గురైన వారిలో ఆశలు చిగురింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాలుగు ఖండాలలోని కొన్ని దేశాలలో ఇటీవలి పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం, ఆలోచనలకు పదును పెడదాం.
అమెరికా పాలకవర్గాన్ని, దాన్ని ఆశ్రయించి బతికే పరాన్న జీవులైన మేథావులకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? చైనాతో వాణిజ్య యుద్దంలో ఏమి చేయలేక ఆయాస పడటమా, ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గి ప్రతిఘటన పెరుగుతోందనే ఆందోళనా, మరొకటా, మరకొటా ? ఇవేవీ కాదు, తమ యువతరంలో పెట్టుబడిదారీ విధానం పట్ల దిగజారుతున్న విశ్వాసం, సోషలిజం పట్ల పెరుగుతున్న మక్కువ అంటే అతిశయోక్తి కాదు. అఫ్‌ కోర్సు అమెరికా ప్రచారాన్ని నమ్మి దాన్నే మెదళ్లకు ఎక్కించుకున్న వారు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని కొత్త నీరు వెనక్కు నెట్టేస్తుంది.
జనవరి రెండవ వారంలో బ్రిటీష్‌ మార్కెట్‌ పరిశోధనా సంస్ధ ”యుగవ్‌ ” నిర్వహించిన ఒక సర్వేలో 23-38 సంవత్సరాల యువతరం( మిలీనియనల్స్‌)లో ప్రతి ఇద్దరిలో ఒకరు సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అంతకంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు గుండెలు బాదుకొనే అంశం ఏమంటే ఈ యువతలో 36శాతం మంది కమ్యూనిజానికి జై కొట్టడం. అమెరికన్లు ఏర్పాటు చేసిన అనేక సంస్ధలలో ‘కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌’ ఒకటి. దీని పనేమిటో చెప్పక్కర లేదు. ఆ సంస్ధ కార్యనిర్వాహక డైరెక్టర్‌ మరియాన్‌ స్మిత్‌ సర్వే వివరాల గురించి ఒక ప్రకటన చేశాడు.” సోషలిజం, కమ్యూనిజాల ప్రమాదాల గురించి చారిత్రాత్మక విస్మృతి ఈ నివేదికలో పూర్తిగా కనిపిస్తోంది. గత శతాబ్దిలో కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో పది కోట్ల మంది బాధితులయ్యారనే చారిత్రాత్మక నిజం గురించి మన యువతరానికి తెలియ చెప్పనట్లయితే వారు మార్క్సిస్టు సిద్దాంతాలను అంగీకరిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.” అన్నాడు. పది కోట్ల మందిని కమ్యూనిస్టులు చంపారనే తప్పుడు ప్రచారం నిత్యం ఇంటర్నెట్‌తో అనుబంధం ఉన్న యువతీ యువకులకు తెలియంది కాదు, అవన్నీ కట్టుకధలని కొట్టి పారవేస్తూ నేటి యువత సోషలిజం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారనే చారిత్రక సత్యాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు.
ప్రయివేటు ఆస్ధులన్నింటినీ రద్దు చేస్తే సమాజం మెరుగ్గా ఉంటుందని మిలీనియల్స్‌లో 22శాతం మంది, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని జడ్‌ తరం(1997-2012 మధ్యలో పుట్టిన వారు)లో 45శాతం మంది భావిస్తున్నారని కూడా తాజా సర్వే వెల్లడించింది. ఇరవయ్యవ శతాబ్దపు సోషలిస్టు ప్రయోగాలను చూసిన తరువాత కూడా ఆ సోషలిస్టు భావజాలం ఇంకా ఆకర్షిస్తూనే ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు, మీడియా, సాధారణ సంస్కృతి కారణంగా పెద్ద ఎత్తున సామాజీకరణ పెరగటంతో ఈ భావజాలం విశాల ఆమోదం పొందింది, ఇప్పుడది రానున్న తరాలకు ఒక పటిష్టమైన ఓటు తరగతిగా మారుతోంది, గతంలో సోషలిస్టు ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు విరుచుకుపడినట్లుగా అదే పద్దతుల్లో అమెరికా ఇప్పుడు చేయలేదు అని సర్వేపై విశ్లేషణ చేసిన ఒక రచయిత పేర్కొన్నాడు.
అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా సెనెటర్‌, తాను సోషలిస్టు అని చెప్పుకున్న బెర్నీ శాండర్స్‌ పోటీ పడ్డారు. చివరకు హిల్లరీ క్లింటన్‌ వైపు ఆ పార్టీ మొగ్గింది. తిరిగి ఈ సారి కూడా 78 సంవత్సరాల బెర్నీ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఏమి జరుగనుందో తెలియదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌ రంగంలో లేనందుకు యువత నిరాశ చెందలేదు, తరువాత జరిగిన అనేక సర్వేలలో సోషలిజం పట్ల ఆకర్షితులౌతున్నవారి శాతం పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఎందుకీ పరిణామం అంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యం, దాని పట్ల మోజు తగ్గటమే కారణం. అయితే నాలుగు పదులు దాటిన వారిలో అత్యధికులు పెట్టుబడిదారీ విదానం పట్ల ఇంకా మొగ్గు చూపుతూనే ఉన్నారు. చదువుకోసం చేసిన రుణాలు గుదిబండలుగా మారటం, వేతనాల స్థంభన ముఖ్యమైన కారణాలుగా చెబుతున్నారు.జడ్‌ తరం, మిలీనియల్స్‌లో అత్యధికులు తాము సోషలిస్టు అభ్యర్ధికే ఓటు వేస్తామని ఎటు తిప్పి ఎటు ప్రశ్నించినా ప్రతి సర్వేలో చెబుతున్నారు.
సూపర్‌ మనీ అనే సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 1974 నుంచి 2017 మధ్యకాలంలో 24-34 సంవత్సరాల వారికి ద్రవ్యోల్బణ సవరింపు తరువాత వార్షిక సగటు నిజవేతనాలు 35,426 నుంచి 35,455 డాలర్లకు అంటే కేవలం 29 డాలర్లు మాత్రమే పెరిగాయి. అదే కాలంలో 35-44 సంవత్సరాల వారికి 2,900 డాలర్లు, 45-54 వారికి 5,400 డాలర్లు పెరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో పోల్చితే వేతనాల పెరుగుదల అన్ని వయస్సుల వారిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యువతరంలో మరింత ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్‌ లోన్‌ హీరో సంస్ధ విశ్లేషణ ప్రకారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ట్యూషన్‌ ఫీజు 1980 -2018 మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 213, ప్రయివేటు కాలేజీల్లో 129శాతం పెరిగింది. విద్యకోసం చేసిన రుణాల మొత్తం 1.5లక్షల కోట్ల డాలర్లు, అంటే సగటున 29,800 డాలర్లు. అప్పుచేసి డిగ్రీ సంపాదించి ఉద్యోగం పొంది రుణం తీర్చుదామని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయని సగం మంది మిలీనియల్స్‌ అభిప్రాయపడుతున్నారు. నలభై సంవత్సరాలలో ఇండ్ల ధరలు నలభైశాతం పెరిగాయి. వాయిదాలు చెల్లించలేమనే భయంతో ఇళ్లు కొనుక్కోవటాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నవారిని చూసిన తరువాత అసలు తమకు పిల్లలు వద్దని 13శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు గతేడాది న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అన్ని రకాల జీవన వ్యయం పెరగటం, అందుకు అనుగుణ్యంగా ఆదాయాలు పెరగకపోవటంతో ఓటర్లు వామపక్ష భావజాల అభ్యర్దులవైపు మొగ్గుతున్నారని వ్యాఖ్యాతలు నిర్ధారణకు వస్తున్నారు.
డెమోక్రటిక్‌ పార్టీనేత బెర్నీ శాండర్స్‌ తన ప్రచారంలో ఆర్ధిక అసమానతల తగ్గింపు, అందరికీ వైద్యం, ధనికులపై పన్ను పెంపు వంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ ఇతర నేతలు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, విద్యార్ధి రుణాల రద్దు, పిల్లలందరికీ సామూహిక ఆరోగ్యబీమా వంటి అంశాలను ప్రస్తావించక తప్పటం లేదు. ట్రంప్‌ ప్రభుత్వం విద్యార్ధి రుణాల వ్యవస్ధను మౌలికంగా దెబ్బతీసిందని విమర్శిస్తూ ఆ విభాగంలో పని చేస్తున్న అధికారి ఏ వేయనె జాన్సన్‌ గతేడాది నవంబరులో రాజీనామా చేశాడు.
అమెరికా యువత సోషలిజం పట్ల మక్కువ చూపటానికి కారణం ఏమంటే కాలేజీల్లో ప్రొఫెసర్లలో ఎక్కువ మంది వామపక్ష భావాలు కలిగి ఉండటం అని కొంత మంది తడుముకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఎక్కడైనా కొన్ని సంస్ధలలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు, యావత్‌ దేశమంతటా అదే పరిస్ధితి ఉందా ? స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించే ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ గ్లాసెర్‌ ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేశారు. అనేక విధాలుగా ఆధునిక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ యువత సంక్షేమానికి అనుగుణ్యంగా పని చేయటం లేదు. అనేక ప్రభుత్వ విధానాలు ఉద్యోగం పొందాలంటే ఆటంకంగా ఉన్నాయి, డబ్బు పొదుపు చేసుకోవాలన్నా , ఇల్లు కొనుక్కోవాలన్నా కుదరకపోవటం యువతరాన్ని ఆదర్శభావజాలం గురించి ఆలోచింపచేస్తున్నది, ఒకసారి సోషలిజం ఎలా ఉంటుందో ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకుంటున్నారని గ్లాసెర్‌ అంటున్నారు. ప్రచ్చన్న యుద్ద సమయంలో సోషలిజం గురించి చర్చ ఉండేది కాదు, ఎందుకంటే దాన్ని ఒక దుష్ట ప్రభుత్వంగా చూసి వ్యతిరేకించాము. సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, అణచివేత కారణంగా ఆ వ్యవస్ధ ఆచరణ సాధ్యం కాదని భావించాము. ఆ జ్ఞాపకాలు లేనివారికి, ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ అలాంటిది లేదు అని గ్లాసెర్‌ వాపోయాడు.

Image result for Pedro Sanchez
” స్పెయిన్‌లో మార్క్సిస్టు కమ్యూనిజం పునర్జన్మించింది ”
కమ్యూనిస్టు వ్యతిరేకులు పురోగామి శక్తుల ఉనికిని సహించలేకుండా ఉన్నారు.” బెర్లిన్‌ గోడ కూల్చివేతతో నాశనం అయిందనుకున్న మార్క్సిస్టు కమ్యూనిజం తిరిగి ఆవిర్భవించింది, స్పెయిన్‌లో పాలన సాగించటం ఖాయం, నవంబరులో సంకీర్ణ కూటమి ఎన్నికైనపుడు అనుకున్న లేదా విశ్వసించిన దాని కంటే పరిస్ధితి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది ” అని స్పానిష్‌ బిషప్పుల సంఘం ఉపాధ్యక్షుడు కార్డినల్‌ ఆంటోనియో కానిజారెస్‌ లొవెరా వ్యాఖ్యానించాడు. ఈనెల 11న మత వెబ్‌ సైట్‌లో పోస్టు చేసిన లేఖలో ఈ అభిప్రాయాలను వెల్లడించాడు. వెనిజులా వంటి లాటిన్‌ అమెరికా దేశాల తప్పుల తడకలతో ఉన్న సోషలిస్టు విధానాలను దాదాపుగా స్పెయిన్‌ కాపీ చేస్తున్నదని భావిస్తున్నారు. స్పెయిన్‌ను స్పెయిన్‌గా ఉంచకుండా ఒక ప్రయత్నం జరుగుతోందని ఎంతో బాధతో చెబుతున్నా మరియు హెచ్చరిస్తున్నా. అంతర్యుద్ధం తరువాత నియంత్రత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారాలన్న స్ఫూర్తి ఖాళీ అయింది, మరచిపోయారు. ఎల్లవేళలా విభజించే మరియు ఎన్నడూ ఐక్యం కానివ్వని భావజాలంతో నింపేస్తున్నారు అని ఆరోపించాడు. మరుసటి రోజు మరొక ఆర్చిబిషప్‌ జీసస్‌ శాంజ్‌ మాంటెస్‌ మరొక లేఖ రాస్తూ చరిత్రలో దేశం మరొక తీవ్ర పరిస్ధితిలోకి పోతున్నదని, వివిధ పద్దతుల్లో స్వేచ్చను పరిమితం చేస్తున్నారని ఆరోపించాడు.ఈ నెల ఎనిమిది పోడెమాస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోషలిస్టు పార్టీ నేత పెడ్రో శాంఛెజ్‌ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తూ సాంప్రదాయకమైన శిలువ, బైబిల్‌ మీద ప్రమాణం చేసేందుకు తిరస్కరించాడు. పాఠశాల విద్య పాఠ్యాంశాల నుంచి మతాన్ని తొలగించటంతో సహా లౌకిక విధానాల అజెండాను అమలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాదు, గతంలో అక్రమంగా చర్చ్‌లకు దఖలు పరచిన ఆస్తులను జాతీయం చేస్తామని, విద్యార్ధులకు లైంగిక విద్యను బోధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు సహజంగానే చర్చ్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి సోషలిస్టు పార్టీ గతంలో కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని పురోగామి సంస్కరణలు తప్ప అదేమీ విప్లవకార్యాచరణను చేపట్టటం లేదు. అయినా మతం ఆగ్రహిస్తోంది.

Image result for chin peng
మలేసియాను భయపెట్టిన కమ్యూనిస్టు చితా భస్మం !
కమ్యూనిస్టు వ్యతిరేకులకు కమ్యూనిస్టులే కాదు చివరకు వారి చితా భస్మం కూడా భయపెడుతోందా ? అవును మలేషియాలో అదే జరిగింది. వృద్ధాప్యంతో మరణించిన పూర్వపు మలేషియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్‌ పెంగ్‌ చివరి కోర్కె మేరకు ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత థారులాండ్‌ నుంచి తెచ్చిన చితాభస్మాన్ని సముద్రంలోనూ, పెంగ్‌ సాయుధపోరాటం సాగించిన అడవుల్లోనూ గతేడాది సెప్టెంబరు 16న చల్లినట్లు ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వార్తతో పాటు 1989లో సాయుధ పోరాటాన్ని విరమించి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా దానితో సంబంధం ఉన్న వారు, దాని గురించి తెలిసిన వారు మలేషియాలో కొన్ని చోట్ల సభలు జరిపారని మీడియా పేర్కొన్నది. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకే ముంది ఇవన్నీ మలేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా అణచివేయాలని మాజీ పోలీసు, పారా మిలిటరీ అధికారుల సంఘాల నాయకత్వంలో ప్రదర్శనలు చేసి, చితాభస్మం తెచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సంస్ధలకు చెందిన వారు ఆ సభలో పాల్గొన్నట్లు, వారి నుంచి పోలీసులు సంజాయిషీ కోరి నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటీష్‌ పాలనలోని పూర్వపు మలయా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. తరువాత స్వాతంత్య్రం వచ్చి మలయా, మలేషియాగా రెండు దేశాలు ఏర్పడిన తరువాత కమ్యూనిస్టులు మలేషియాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 1968 నుంచి 1989వరకు పోరాడారు. ఆ ఏడాది మలేషియా సర్కార్‌తో పోరు విరమణకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు పార్టీ నేత చిన్‌ పెంగ్‌ థారులాండ్‌లో ఆశ్రయం పొంది 2013లో అక్కడే 90 ఏండ్ల వయస్సులో మ రణించారు. ఒప్పందం మేరకు మలేషియాకు తిరిగి వచ్చేందుకు అనుమతించిన నేతలు తిరిగి పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అండతోనే పోలీసులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

(Reuters/edited by Ricardo Vaz for Venezuelanalysis.com)
పరువు పోగొట్టుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత గుయడో !
గత సంవత్సరం లాటిన్‌ అమెరికా పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే అరవైకి పైగా దేశాలు వెనిజులా అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన జువాన్‌ గుయడో ఈనెల మొదటి వారంలో పరువు పోగొట్టుకొని అపహాస్యం పాలయ్యాడు. అధ్యక్షుడు మదురో ఎత్తుగడకు చిత్తయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.2018 వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోషలిస్టు నికోలస్‌ మదురో ఎన్నికైనా, అంతకు ముందు పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లను తెచ్చుకోవటంలో సోషలిస్టు పార్టీ విఫలమైంది. దాంతో ప్రతిపనికీ ప్రతిపక్షం అడ్డం పడటంతో పాటు గతేడాది పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న ప్రతిపక్ష జువాన్‌ గుయడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పొలో మంటూ అమెరికా కనుసన్నలలో నడిచే అరవైకిపైగా దేశాలు గుర్తింపును ప్రకటించాయి. మిలిటరీలో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. ఇదే మరొక దేశంలో అయితే అందుకు పాల్పడిన వారిని కాల్చివేయటం లేదా కటకటాల వెనుక ఉంచుతారు. జనం, మిలిటరీ, పోలీసు, పారా మిలిటరీ మద్దతు ఉన్న సోషలిస్టు మదురో అలాంటి చర్యలకు పాల్పడకుండా అతడి వలన ప్రమాదం లేదనే అంచనా, ఇతర కారణాలతో గుయడోను స్వేచ్చగా తిరగనిస్తున్నారు.
అమెరికాతో సహా దాని మిత్ర దేశాలన్నీ మదురోను ఇప్పటికీ అధ్యక్షుడిగా గుర్తించటం లేదు గానీ పార్లమెంట్‌ను గుర్తిస్తున్నాయి.ఈనెల ఐదున పార్లమెంట్‌ స్పీకర్‌ ఎన్నిక జరిగి, దానికి తిరిగి గుయడో ఎన్నికైతేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా కూటమి గుర్తింపు ఉంటుంది. గుయడోను తిరిగి ఎన్నుకొనే పరిస్ధితి లేదు. అయితే ఏదో ఒకసాకుతో పార్లమెంట్‌ను బహిష్కరిస్తే అధికారపక్షం నుంచి లేదా దాని మద్దతు ఉన్నవారు స్పీకర్‌ అవుతారు. గత ఏడాదిలో జరిగిన పరిణామాలలో ప్రతిపక్ష పార్టీలలో చీలిక వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మదురో ప్రధాన ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీశాడు. జనవరి ఐదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా భద్రతా దళాలు తనను పార్లమెంట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ గుయడో కేకలు వేస్తూ తన మద్దతుదార్ల వీపుల మీద ఎక్కి పార్లమెంట్‌ గేట్‌ దూకుతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఫోజులిచ్చాడు. నిజానికి అతగాడి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎన్నికలో చీలిక పక్షనేతకు అధికారపక్షం మద్దతు ఇవ్వటంతో గుయడో ఓడిపోయాడు. తరువాత తన మద్దతుదారులతో తనకు వత్తాసు పలికే ఒక మీడియా కార్యాలయంలో స్పీకర్‌ ఎన్నిక తతంగాన్ని నిర్వహించి తిరిగి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. ఇది అమెరికాను కూడా ఇరకాటంలో పడేసింది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉంటే సోషలిస్టులు దానిలో మెజారిటీ సాధించి మరింత బలపడతారు. విఫల తిరుగుబాట్ల నేపధ్యంలో పోటీ చేస్తే తిరిగి గెలుస్తామన్న ధైర్యమూ ప్రతిపక్షానికి లేదు.
పైన పేర్కొన్న పరిణామాలను చూస్తే దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్ద దోపిడీ కొనసాగినంత కాలం, ఎదురు దెబ్బలు తగిలినా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు వాటిని తట్టుకొని ముందుకు పోతాయి, అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశావాదులు అరగ్లాసు నీటిని చూసి అయ్యోపూర్తిగా నిండలేదే కూలబడితే, ఆశావాదులు సగం గ్లాసు నిండిందనే ధీమాతో ముందుకు పోతారు.