Tags
ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఊహాన్ న్యూమోనియాగా పిలుస్తున్న వ్యాధికి కారణమైన వైరస్‌ను అదుపు చేసేందుకు చైనా ప్రయత్నిస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు బుధవారం నాడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాల గురించి చర్చించనున్నారు. చైనాతో పాటు మరో మూడు దేశాల్లో ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. గతంలో 2003లో వ్యాపించిన సారస్ మాదిరి వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నదని చైనా ప్రకటించింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నప్పటికీ అటు చైనాలోనూ, ఇటు ప్రపంచ వ్యాపితంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
మీడియాలో నోవెల్ కొరోనా వైరస్(2019-ఎన్‌సిఓవి), ఉహాన్ సీఫుడ్ మార్కెట్ న్యుమోనియా వైరస్, ఉహాన్ న్యుమోనియా, ఉహాన్ కొరోనావైరస్ అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఒకటే. దీనికి గుడ్లగూబల నుంచి వ్యాప్తి చెందే ఒక వైరస్ లక్షణాలున్నట్లు ప్రాధమికంగా తేలింది. గతనెలలో గుర్తు తెలియని ఈ వైరస్‌తో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఇప్పటి వరకు 9 మంది మరణించారని వార్తలు వచ్చాయి. బుధవారం ఉదయం ఏడు గంటల సమయానికి పద్నాలుగు రాష్ట్రాలలో 324 మందికి వైరస్ సోకినట్లు చైనా ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు లండన్‌లోని ఇంపీరియల్ మెడికల్ కాలేజీ నిపుణులు కనీసం 1700కి సోకి వుండవచ్చునని పేర్కొన్నారు. చైనా వెలుపల దక్షిణ కొరియాలో ఒకరికి సోకినట్లు సోమవారం నాడు, చైనా నుంచి అమెరికా వెళ్లిన ఒక యువకుడికి వైరస్ సోకినట్లు మంగళవారం నాడు అమెరికా వెల్లడించింది. హాంకాంగ్‌లో 117 మందికి సోకినట్లు అనుమానం తప్ప నిర్దారణ కాలేదు.
మధ్యచైనా రాష్ట్రంగా పిలిచే హుబెరు రాష్ట్ర రాజధాని ఉహాన్ పట్టణం. చైనా నూతన సంవత్సర సందర్భంగా కోట్లాది మంది చైనీయులు బంధు, మిత్రులను స్వయంగా కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. పెద్ద ఎత్తున స్వదేశంలోనూ, విదేశాలకు విహార యాత్రలకు వెళతారు. ఈ సమయంలో చైనాలో 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా కాగా ఒక్క ఉహాన్ నగరం నుంచి కోటిన్నర మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఇప్పటికే అనేక మంది తమ ప్రయాణాలను పరిమితం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఇరవై అయిదు నుంచి 30వ తేదీ వరకు అధికారిక సెలవుదినాలుగా ప్రకటించారు. జనవరి పది నుంచి ఫిబ్రవరి 18వరకు వసంత రుతు ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో కనీసం 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనా. ఉహాన్ నగర జనాభా కోటీ పదిలక్షలు, పెద్ద రవాణా కేంద్రం. జనవరి 20-27 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలకు 2,105, విదేశాలకు 231 విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉహాన్ న్యూమోనియా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే చైనా సర్కార్ దేశవ్యాపితంగా శ్వాస సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని గుర్తించి పరీక్షించిన కారణంగా నూతన కేసులు బయట పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేర్కొన్నది. ఉహాన్ నుంచే గాక హుబెరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి మీద కూడ వ్యాధిలక్షణాల గురించి నిఘావేశామని, హాంకాంగ్‌లో వంద మందిని పర్యవేక్షిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అనేక దేశాల విమానాశ్రయాలలో చైనా నుంచి వచ్చేవారిని పరీక్షించే ఏర్పాట్లు చేశారు.
తాజా వైరస్ వార్తలతో యావత్ చైనా సమాజంలో ఒక విధమైన ఆందోళన, అప్రమత్తత కూడా వెల్లడి అయినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి దాయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో గతంలో సారస్ మాదిరి పరిస్దితి లేదని చైనా మీడియా పేర్కొన్నది. 2004 తరువాత ఇంతవరకు చైనాలో సారస్ లక్షణాలు వెల్లడి కాలేదు. ఇదే సమయంలో సారస్ వైరస్‌ను నిరోధించే టీకాలను కూడా ఇంతవరకు రూపొందించలేకపోయారు. ఆ లక్షణాలున్న వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధ చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం సమాచారాన్ని దాచినా దాగదని, అంతర్జాతీయ మీడియా కూడా మిన్నకుండజాలదని చైనా అధికారులు చెబుతున్నారు. సంక్లిష్ట పరిస్ధితులు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించటం ద్వారానే జనానికి భరోసా కల్పించవచ్చని అన్నారు. సారస్ వ్యాప్తి నుంచి చైనా వైద్యనిపుణులు ఎన్నో అనుభవాలను పొందారని, ఇలాంటి పరిస్ధితులను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్ చైనా సమాజాన్ని కదిలించాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదని చెబుతున్నారు.
గతంలో సారస్ వైరస్ దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ రాష్ట్రం షండే ప్రాంతం నుంచి ప్రారంభమై 2002 నవంబరు నుంచి 2003 జూలై మధ్యకాలంలో పద్నాలుగు దేశాల ( పదిహేడు ప్రాంతాలు)లో వ్యాపించింది. మొత్తం 8,273మందికి సోకగా 775 మంది ఐదు దేశాల(ఏడు ప్రాంతాలు)లో మరణించారు, వీరిలో సారస్ సోకినప్పటికీ ఇతర కారణాలతో మరణించిన వారు 60 మంది ఉన్నారు. సగటున 9.6శాతం మంది మృతి చెందారు. దేశాల వారీ చైనా ప్రధాన భూభాగంలో 5,328 మందికి సోకగా 349 మంది మరణించారు, చైనాలో భాగమైన హాంకాంగ్‌లో 1,755 మందికి గాను 299 మంది చనిపోయారు. కెనడాలో 251 మందికి 44, సింగపూర్‌లో 238 మందికి 33, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో 346 మందికి 37, వియత్నాంలో 63కు ఐదు, ఫిలిప్పైన్స్‌లో 14కు రెండు మరణాలు సంభవించాయి. చైనా గ్వాంగ్ డాంగ్‌లో వైరస్ ప్రారంభమైన బీజింగ్ నగరంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. ఆ సమయంలో అక్కడి ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు. చైనాలో ప్రతి ఏటా వసంత రుతు సమయంలో జలుబు సాధారణంగా వస్తుంది. అయితే జలుబు చేసిన వారి శరీర ఉష్ణోగ్రత 37.3 సెంటీగ్రేడ్ డిగ్రీలు దాటితే వారికి ఉహాన్ న్యుమోనియా అనుమానంతో చికిత్స చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మీరు ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేశారని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉహాన్ వెళ్లి వచ్చిన తరువాత జ్వరంలో కూడిన జలుబు చేస్తే పనులకు పోవద్దని, రక్షణ ముసుగులు ధరించాలని సలహా ఇస్తున్నారు. దేశంలో కొన్ని చోట్ల ఉహాన్ న్యుమోనియా లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాధికారక వైరస్, బాక్టీరియాలను పరిశీలించే ప్రయోగశాలల వ్యవస్ధ ఉంది. దేశంలో పన్నెండు ప్రధాన ప్రయోగశాలలు, 91 ప్రాంతీయ, 800 ఆసుపత్రుల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికి తెలిసిన 300 వ్యాధికారక వైరస్‌లను అక్కడ వెంటనే గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయి. 2003 సారస్ విస్తరణ తరువాత వీటిని మరింత పటిష్ట పరిచారు. గుర్తు తెలియని వైరస్‌లను గుర్తించే నిరంతర పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు. సారస్ తరువాత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించేందుకు 17ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇచ్చారు. సాధారణ న్యూమోనియా వైరస్ పది రోజుల కంటే ప్రభావం చూపలేదు, అయితే సారస్ మూడు నెలలకు మించి ఉన్నట్లు విదేశీ నిపుణులు గుర్తించారు.
ప్రస్తుతం వ్యాపించిన ఉహాన్ న్యూమోనియా కోరోనా వైరస్ కేంద్రం నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌గా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని చేపలు, కోళ్ల మార్కెట్లలో అలాంటి లక్షణాలు కనిపించనందున వైరస్ సాధారణ లక్షణాలను నిర్ధారించటం ఆలస్యం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఉహాన్‌లో వైరస్ వ్యాప్తికి తోడ్పడే వాతావరణం ఉండటంతో వైరస్‌ల గుర్తింపు, నివారణ సవాలుగా మారింది. ఈ నగరంలో 198 మందిలో వైరస్‌ను గుర్తించారు, 25 మందికి చికిత్స చేసి ఆసుపత్రి నుంచి పంపారు, తొమ్మిది మంది పరిస్ధితి విషమంగా ఉంది. చికిత్స చేస్తున్న సిబ్బందిలో 15 మందికి సోకినట్లు గుర్తించగా వారిలో ఒకరి పరిస్ధితి తీవ్రంగా ఉంది. అవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని నగరపాలక సంస్ధ సలహా ఇచ్చింది.
చైనాలో కలరా, ప్లేగ్ వంటి వాటికి కారణమయ్యే వైరస్‌ను మొదటి తరగతిగా వర్గీకరించి అధిక ప్రాధాన్యత ఇస్తారు, సారస్, ఎయిడ్స్ వంటి వైరస్‌ల వంటి బి తరగతిలో ఉహాన్ వైరస్‌ను చేర్చారు. అంటే వీటిని ఎదుర్కొనేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. జపాన్, థారులాండ్, దక్షిణ కొరియాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించిన కారణంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్ అధికారులను కోరారు.
ఈ వైరస్ గురించి దీని గురించి చైనా వాస్తవాలను బయటకు వెల్లడించటం లేదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు రాస్తున్నారు. నిజానికి చైనా దాచిందీ లేదు, పశ్చిమ దేశాలు శోధించి కనుగొన్నదీ లేదు. డిసెంబరు 31న ఉహాన్‌లో అంతుబట్టని న్యుమోనియాను గుర్తించినట్లు చైనా ప్రపంచ ఆరోగ్య సంస్దకు తెలియ చేసింది. వ్యాధి వ్యాపించటానికి కారణమైన వైరస్ కేంద్రంగా అనుమానించిన సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ను జనవరి ఒకటిన మూసివేశారు. ఈ వ్యాధి గురించి తమకు తెలిసిందని జనవరి రెండున సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జనవరి ఒకటిన ఈ వైరస్ కారణంగా తమ దేశంలో తొలి మరణం సంభవించినట్లు చైనా తెలిపింది. ఉహాన్ నుంచి వచ్చిన ఒక మహిళకు వ్యాధి సోకినట్లు థారులాండ్‌లో జనవరి 13న గుర్తించారు, పదహారవ తేదీన జపాన్‌లో ఒక కేసు బయట పడింది.పదిహేడవ తేదీన రెండవ,20న మూడవ,21న నాల్గవ వ్యక్తి మరణించారు. ఉహాన్ నుంచి దక్షిణ కొరియాకు వచ్చిన ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి వచ్చే కొన్ని విమానాల ప్రయాణీకులకు పరీక్షలు జరుపుతామని ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇలాంటి అంతుతెలియని ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందినపుడు వాటిని యావత్ అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు తమ అనుభవం, పరిశోధనల సమాచారాన్ని ఏ దేశంలో అయితే వైరస్ ప్రారంభమైందో దానికి అందచేస్తే మానవాళికి మేలు కలుగుతుంది.