Tags

, , ,

Image result for now ys jagan should reveal his development plan

ఎం కోటేశ్వరరావు
నీతులు ఉన్నదెందుకు అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే అన్నట్లుగా ఆంధ్రపదేశ్‌ రాజకీయాలు ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో జరిగిన పరిణామాలను చూస్తే ఇలా జరుగుతుందని పోతులూరి వీరబ్రహ్మం లేదా ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడామస్‌ లేదా తామే చెప్పామనో బతికున్న జ్యోతిష్కులు ఎవరైనా చెబుతారేమో చూడాలి. అధికారపక్షానికి మెజారిటీ ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియంలోకి దూసుకువస్తే తప్పు పట్టిన వారు, తాము మైనారిటీగా ఉన్న శాసనమండలిలో సభ్యులుగాని మంత్రులే ఏకంగా మండలి అధ్యక్షుడి పోడియంను, అధ్యక్షుడినే చుట్టుముట్టారు. ఇదొక వైపరీత్యం. అసెంబ్లీలో ప్రతిపక్షచర్యలను జనానికి చూపేందుకు టీవీల్లో ప్రసారం చే శారు. అదే తమ చర్యలను జనం చూడకుండా చేసేందుకు సాంకేతిక కారణాల పేరుతో మండలి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. అక్కడ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. స్పీకర్లు ఎలా అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తున్నారో విచక్షణ అధికారాన్ని ఎలా ఉపయోగించుతున్నారో గత అసెంబ్లీలోనూ, ఇప్పుడూ చూస్తున్నాము. ఇప్పుడు మండలి చైర్మన్‌ కూడా అదే విచక్షణ అధికారంతో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. అందువలన విచక్షణ అధికారాల వినియోగానికి సంబంధించి నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. దేశ రాజ్యాంగ వ్యవస్ధలను నీరుగార్చుతున్న నేపధ్యంలో ఈ పరిణామాలను చూడాల్సి ఉంది.
మూడు రాజధానుల రాజకీయం ఎటు తిరుగుతుందో, ఎవరి దగ్గర ఎలాంటి తురుపు ముక్కలున్నాయో, వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారో ఊహించి చెప్పలేము. సామాన్య జనం కోసం, ప్రాంతీయ మనోభావాలను రేకెత్తించటానికి మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ చట్టపరంగా అది పాలనా వికేంద్రీకరణ పేరుతో జరుగుతోంది. వాణిజ్య కంపెనీలు లేదా పారిశ్రామిక సంస్ధల నమోదు(రిజిస్టర్డ్‌) కార్యాలయాలు ఒక చోట, కార్యకలాపాల నిర్వహణ పలు చోట్ల ఉండటం తెలిసిందే. రిజిస్టర్డ్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు పరిమితమే. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దానిని అలాగే కొనసాగిస్తూ కార్యకలాపాలను పరిమితం చేస్తూ సచివాలయాన్ని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలని పాలకపార్టీ తలపెట్టింది. అందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అనూహ్యంగా శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బలు తగిలితే వాటి తీవ్రతను బట్టి విరామం ఉంటుంది తప్ప ప్రయాణం ఆగదు. తమ మూడు రాజధానుల అజెండా కూడా అలాంటిదే అని అధికారపార్టీ చెబుతోంది. దాన్ని సాధ్యమైనంత మేరకు ఆలస్యం కావించేందుకు తెలుగుదేశం పార్టీ తాను చేయగలిగిందంతా చేస్తోంది.
పాలన వికేంద్రీకరణను ఒక విధానంగా జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ముందుకు తెస్తోంది గనుక కోర్టులు అభ్యంతర పెట్టే అవకాశాలు పరిమితం అని చెప్పవచ్చు. రాజ్యాంగానికి అనుగుణ్యంగా ఉన్న విధానాలను అభ్యంతర పెట్టే అధికారం కోర్టులకు లేదు. కేంద్రం కూడా అడ్డుకొనే అవకాశాలు అంతంత మాత్రమే. సమస్య హైకోర్టు తరలింపు దగ్గరే ఎదురు కానుంది.అన్ని పార్టీలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అది మాత్రమే చాలదు. రాజధాని ఖరారు సమయంలోనే కర్నూలులోనో మరొక చోటో హైకోర్టును ప్రతిపాదించి కేంద్రానికి పంపి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. దేశ విభజన తరువాత తలెత్తిన పరిస్ధితులలో ఏర్పడిన తూర్పు పంజాబ్‌ హైకోర్టు, తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల నూతన హైకోర్టులు లేదా ఉన్న బెంచ్‌లను హైకోర్టులుగా మార్చటం తప్ప ఒక రాష్ట్రంలో ఒకసారి ఖరారు అయిన హైకోర్టును మరొక చోటికి తరలించిన ఉదంతం మన దేశంలో ఇంతవరకు లేదు. రాష్ట్ర పునర్వ్యస్దీకరణ చట్టం, ఇతర విధి, విధానాల ప్రకారం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం సాధ్యం కాదని కొందరు నిపుణుల తాత్పర్యం. చట్టంలో ఏ అడ్డంకులు ఉన్నా సుప్రీం కోర్టు, రాష్ట్రపతి అనుమతి ఇస్తే మరొక నోటిఫికేషన్‌ ద్వారా తరలించవచ్చన్నది మరొక భాష్యం. తరలింపును వ్యతిరేకిస్తున్నదీ, కోరుకుంటున్న వారిలో న్యాయవాదులు సహజంగానే ముందున్నారు కనుక రెండు వైపులా ఉద్దండులనే న్యాయపోరాటంలో రంగంలోకి దించుతారు.
హైకోర్టు విషయంలో న్యాయ పోరాటం అవసరం లేకపోతే సమస్యే లేదు, రణం తప్పనిసరైతే అదెలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో చూద్దాం. దానిలో జగన్‌ సర్కార్‌ గెలిస్తే హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. ఓడిపోతే అమరావతిలోనే ఉండిపోతుంది. పర్యవసానాలకు జగన్‌మోహనరెడ్డి ఇప్పటి నుంచే సిద్దం కావాల్సి ఉంటుంది. వెలువడుతున్న అభిప్రాయాల మేరకు సెలెక్టు కమిటీ పేరుతో గరిష్టంగా ఆరునెలల పాటు అడ్డుకోవటం తప్ప మండలి చేసేదేమీ లేదు. ఆమోదించినా ఆమోదించకపోయినా అసెంబ్లీ తీర్మానం ఖరారు అవుతుంది. ఆ తరువాతే హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం. దానికి కేంద్రం నుంచి అనుమతి ఎంతకాలానికి వస్తుందో, అసలు రాదో కూడా తెలియదు. హైకోర్టు తరలింపు తక్షణమే జరగదని తెలిసినా దానితో నిమిత్తం లేకుండానే విశాఖకు సచివాలయాన్ని తరలించాలని మౌఖింగా ఆదేశాలు, ఏర్పాట్ల గురించి సూచనలు వెళ్లాయి గనుక హైకోర్టు విషయం తేలేవరకు బండి గుర్రం కళ్ల ముందు గడ్డి ఉంచి పరుగెత్తించినట్లుగా రాయలసీమ వాసులకు కేంద్రాన్ని చూపుతూ కాలక్షేపం చేయవచ్చు. అది ఆలస్యమయ్యే కొద్దీ అధికారపక్షానికి సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. తరలింపు సాధ్యం కాదని తేలితే రాయలసీమలో వైసిపి భవిష్యత్‌ ఏమిటి? రాయలసీమ జనాన్ని సంతృప్తి పరచటం ఎలా అనే సమస్య తిరిగి ముందుకు వస్తుంది. అధికారపక్షానికి అది ఇరకాటమే.
మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైతే అసలు మండలినే రద్దు చేస్తామనే సూచనలు అధికారపక్షం నుంచి వెలువడ్డాయి. అవి బెదిరింపులా, ప్రలోభాలా మరొకటా అన్నది అన్నది ఎవరికి వారే భాష్యం చెప్పుకోవచ్చు. తరువాత అలాంటిదేమీ లేదని వైసిపి నేతలు చెబుతున్నప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. ఒకవేళ నిబంధనలు అంగీకరించి రద్దుకు సిఫార్సు చేస్తే వెంటనే రద్దవుతుందా ? కేంద్రంలోని అధికారపార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఒకే రాజధాని అని చెబుతోంది కనుక ఆ సిఫార్సును వెంటనే ఆమోదించటానికి ఎందుకు చర్య తీసుకుంటుంది? ఆమోదించాలని కోరే పార్టీ వైసిపి తప్ప మరొకటి ఉండదు. రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ ప్రకారం రాజ్యసభ సీట్లకోసం బిజెపి నాయకత్వం ఒక వేళ రాజీపడి శాసన మండలిని వెంటనే రద్దు చేస్తే నష్టపోయే వాటిలో వైసిపి కూడా ఉంటుంది. తక్షణమే మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి ఉద్యోగాలు ఊడతాయి. తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం ముగియగానే తలెత్తే ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వైసిపి రాజకీయ నిరుద్యోగుల ఆశలకు నీళ్లొదులు కోవాల్సిందే. వారిని సంతృప్తిపరచేందుకు పాలకపార్టీ ఆయాసపడాల్సిందే. రెండవది ఇప్పటికే రివర్సు(తిరగదోడే) సర్కార్‌ అని తెలుగుదేశం చేస్తున్న రాజకీయ దాడికి మరొక అస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. రాజశేఖరరెడ్డి కార్యక్రమాలన్నింటినీ సమర్ధవంతంగా అమలు జరుపుతామన్న వైసిపి ఆయన హయాంలో పునరుద్దరణ జరిగిన మండలిని రద్దు చేశారనే సెంటిమెంటును కూడా తెలుగుదేశం ముందుకు తెస్తుంది.
మూడు రాజధానుల ప్రక్రియతో పాటు స్ధానిక సంస్ధలకు ఎన్నికలకు కూడా వైసిపి సిద్దపడింది. రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు ఎక్కిన కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పుడు బిల్లు సెలక్టు కమిటీకి వెళ్లటంతో దాని ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అంతవరకు స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తారా? వేయకపోతే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలు కూడా జరగవచ్చు, సహజంగానే కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తగిలినా ఎక్కువ చోట్ల లబ్ది పొందవచ్చన్న అంచనాతోనే వైసిపి ముందుకు పోవచ్చు. పెద్ద మెజారిటీతో అనుకూల ఫలితాలు వస్తే వాటిని చూపి మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఒక వేళ ప్రతిపక్షాలకు తగినన్ని స్ధానాలు వస్తే ఒకే రాజధాని గురించి సమీకరణలు మరింతగా పెరుగుతాయి.
అధికార వికేంద్రీకరణ ఎత్తుగడతో సచివాలయ తరలింపును సాంకేతికంగా అడ్డుకొనే అవకాశాలు లేవు గనుకనే బిజెపి రాజకీయ పార్టీగా వ్యతిరేకతకు పరిమితమైంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెబుతోంది. లేదా అడ్డుకొనేందుకు ఉన్న నిబంధనా పరమైన అంశాల పరిశీలన, అధ్యయనం కోసం సమయం తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. వైసిపి అజెండాను జయప్రదంగా అమలు జరిగేందుకు సహకరిస్తే లోపాయికారిగా ప్రయోజనాలు పొందవచ్చేమోగానీ రాజకీయంగా బిజెపి దానితో ముడివేసుకున్న జనసేన పని ముగిసినట్లే. అన్ని చోట్లా తన దుకాణామే ఉండాలి, మిగిలిన పార్టీల దుకాణాలు మూతపడాలని కోరుకుంటున్న, అందుకోసం దేనికైనా తెగించే బిజెపి అలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన చర్యలకు పాల్పడుతుందా ? ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో దాని మెజారిటికి ఢోకా లేదు. స్వయంగా దానికే సంపూర్ణ మెజారిటీ వుండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువలన రాజకీయ కోణంలోనే బిజెపి ఆలోచించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల బిజెపి-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను తామే దిగమింగుకోవటం కష్టం.
అనుకోని ఇబ్బందుల్లో పడిన వైసిపి ఇప్పుడేం చేస్తోంది? అసలేం చేయాలి? ఆస్ద్ధులన్నీ కరిగి పోయినా ఫర్వాలేదు, కేసు గెలవటం ముఖ్యం అని ఫ్యూడల్‌ ప్రభువులు వ్యవహరించినట్లుగా తాను తలపెట్టినదాన్ని నెగ్గించుకొనేందుకు ఎంతదాకా అయినా పోతాను అన్నట్లుగా వుంది ప్రభుత్వ తీరు. ఎందరో ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పటికీ అమరావతి కేసుల్లో వాదనలకు ఐదు కోట్ల రూపాయల ఫీజుతో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహతగిని నియమించుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే అలాంటి వారిని మరికొందరిని నియమించుకున్నా ఆశ్చర్యం లేదు, జనం సొమ్ము కదా ! మండలిని పూర్వపక్షం చేసేందుకు ఆర్డినెన్స్‌ తెస్తారా, దానికి గవర్నర్‌ రబ్బరు స్టాంపు వేస్తారా ? వంటి అనేక అంశాలు ఉన్నాయి.
సెలక్టు కమిటీ, ఇతర ఆటంకాల పర్యవసానాలు ఎలా ఉన్నా వైసిపి సర్కార్‌ రోజువారీ పాలన సాగించక తప్పదు. ఎన్నికలకు ముందే ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలను అమలు జరపాల్సి ఉంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షకోట్ల రూపాయలను దాని ఒక్కదానికే ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పింది కనుక ఇప్పుడు ఆ సొమ్మును, ఇతర అభివృద్ధి పధకాల సొమ్ముతో కలిపి పదమూడు జిల్లాల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేయనుందో ప్రణాళికను వెల్లడించాలి. నవరత్నాలను ఎలా అమలు జరుపుతామో వివరంగా చెప్పిన వారికి రాష్ట్ర అభివృద్ది పధకాలు రూపొందించటం ఒక లెక్క కాదు. సెలక్టు కమిటీ తీసుకొనే వ్యవధిని ప్రభుత్వం దీనికి ఉపయోగించుకొని మూడు రాజధానులు అయితే, ఒక వేళ కాకున్నా పదమూడు జిల్లాల అభివృద్ధి సూచికలు ఎంతెంత ఉన్నాయో, రానున్న నాలుగు సంవత్సరాలలో వాటిని ఎంత మేరకు, ఎలా పెంచుతారో జనానికి వెల్లడిస్తూ శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రభుత్వం తానుగా అభివృద్ధికి పెట్టుబడుల సంగతి తేల్చాలి. మూడు రాజధానులతో నిమిత్తం లేకుండానే ఇప్పటికే అమలు జరుపుతున్న అభివృద్ధి పధకాలు ఎలాగూ కొనసాగుతాయి గనుక నిమిత్తం వాటితో లేకుండా వాటిని ప్రత్యేకంగా చేసే అభివృద్ధి ఏమిటో వెల్లడించాలి. అప్పుడే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ పేదలు తమ వలసలను విరమించుకొని ఇక్కడే ఉపాధి పొందేందుకు పూనుకుంటారు. అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జిఎన్‌ రావు కమిటీ, లేదా బోస్టన్‌ కన్సల్టెన్సీ బృందం సమర్పించిన నివేదికలను మధించిన మంత్రుల ఉన్నత సా ్ధయి కమిటీ చేసిన సూచనలేమిటో, పూర్తి నివేదిక ఏమిటో జనానికి అందుబాటులో ఉంచాలి. ఇదేమీ రహస్యం కాదు, పారదర్శకతకు పక్కా నిదర్శనం అవుతుంది. అలాగాక మూడు రాజధానుల అంశం తేలిన తరువాతే మా గుప్పెట తెరుస్తాము లేదా మనసులో ఉన్నది చెబుతాము అంటే అందులో ఏమీ లేదనే అనుకోవాల్సి వస్తుంది.