ఎం కోటేశ్వరరావు
శాసన మండలిలో అనూహ్యంగా తగిలిన ఎదురు దెబ్బతో అధికార వైసిపి నాయకత్వం ఒక విధంగా చెప్పాలంటే కకావికలైంది. మూడు రాజధానులు, సిఆర్‌డిఏ రద్దు బిల్లులను సెలెక్టు కమిటికీ పంపే ప్రకటనకు దారి తీసిన చర్చలను శాసనమండలి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటే జనానికి అనేక విషయాలు తెలిసి ఉండేవి. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందుకు పోవటం, మైకులు విరగ్గొట్టటం వంటి తీవ్ర నిరసనలను వ్యక్తం చేయటం తెలిసిందే. కానీ శాసనమండలిలో ఏకంగా కొందరు మంత్రులే కుర్చీలు, బల్లలు ఎక్కి శాసనమండలి అధ్యక్షుడికి నిరసన తెలపటం బహుశా ఎక్కడా జరిగి ఉండదు. శాసనమండలి పరిణామాలతో గురువారం నాడు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను చూస్తే ఆత్మవంచన, పరవంచన గుర్తుకు వస్తోంది.
” శాసనమండలి చైర్మన్.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. అక్కడ డైరెక్షన్ ఇవ్వడానికి తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నది అందరం చూశాం. ”
చట్ట సభల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సభా కార్యక్రమాలకే తప్ప గ్యాలరీల్లో కూర్చున్న వారిని చూపించటానికి కాదు. అయినా చంద్రబాబు కూర్చోవటాన్ని అందరం చూశాం అని సిఎం చెబుతున్నారు. అసలు మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే లేనపుడు అదెలా సాధ్యం . అయినా చట్ట సభల లాబీలు, గ్యాలరీల్లో అనుమతి ఉన్నవారెవరైనా కూర్చోవచ్చు, తిరగవచ్చు. చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి తరువాత వరసలో ఉండే వైసిపి నాయకత్వం కూడా గ్యాలరీలో కూర్చున్నది. లాబీల్లో పచార్లు చేసింది. సభలో కనుసైగలు, ఇతర పద్దతుల ద్వారా స్పీకర్, మండలి అధ్యక్షులకు సూచనలు, ఇతర అంశాలను పంపటం ముఖ్యమంత్రులు, అధికారపక్షం చేస్తున్నది బహిరంగ రహస్యం. గ్యాలరీలో కూర్చొని కూడా మండలి చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వారు ఆరోపించటం వైపరీత్యం తప్ప మరొకటి కాదు. అదే సాధ్యమైతే మంత్రులను పోడియం వద్దకు వెళ్లమని, కుర్చీలు, బల్లలు ఎక్కాలని, మండలి చైర్మన్ ముందు నిరసన తెలపాలని లేదా ఆల్లరి చేయాలని గ్యాలరీల్లో ఉన్నవైసిపి నాయకులు ఆదేశాలు జారీ చేశారని అనుకోవాలా ?
” దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం.అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్‌గా ఆలోచించాలి.”
ముందుగా ఆలోచించాల్సింది, ఇంత పేద రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అవసరమా అన్నది. ఒక వైపు ఎలాంటి ఖర్చు లేకుండా హైదరాబాదులో పది సంవత్సరాల పాటు రాజధానిగా పాలన సాగించే అవకాశాన్ని వదులు కున్నారని తెలుగుదేశం మీద విమర్శలు చేస్తారు. అమరావతిని ఖరారు చేశాక అక్కడ నిర్మించిన భవనాల్లోనే సచివాలయం, ఉభయ సభలు, హైకోర్టు పని చేస్తున్నది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, సిబ్బందికి అవసరమైన నివాసాలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ అర్ధంతరంగా వదలి వేసి విశాఖకు సచివాలయం, కర్నూలుకు హైకోర్టును తరలించాలనటం పొదుపు చర్య అవుతుందా ? దుబారానా ? ప్రజల సొమ్ముకు జవాబుదారీ వహించాల్సిన వారు చేయాల్సిన పనేనా ఇది.
శాసనమండళ్లు అవసరం లేదని, డబ్బు దండగ, అవి రాజకీయ నిరుద్యోగులు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారికి నిలయాలుగా మారాయన్నది సాధారణ విమర్శ. ఆ విషయం జగన్‌మోహనరెడ్డి గారికి ఆకస్మికంగా గుర్తుకు రావటమే చర్చనీయాంశం. ఆకస్మికంగా జ్ఞానోదయం అయిందా ? నిజంగా పేద రాష్ట్రం, ఖర్చు అనవసరం అనుకుంటే తాము గెలిస్తే మండలిని రద్దు చేస్తామని మానిఫెస్టోలోనే పెట్టవచ్చు. అలాంటిదేమీ లేదు. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా తన రాజకీయ అజెండాకు ఎదురు దెబ్బతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు తప్ప గతంలో కనీసం చర్చ జరగాలని కూడా చెప్పిన దాఖలాలు లేవు.
ఇక్కడ మరొక అంశం, కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండలి అన్నవారికి దేశంలో అసలు ఎక్కడా లేని, ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన మూడు రాజధానులు ఎలా బుర్రలోకి వచ్చినట్లు ? అది అదనపు ఖర్చు కాదా ? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వారానికి ఒకసారి కేసుల విచారణకు హైదరాబాదు రావటానికి కొన్ని లక్షల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రికి మూడు రాజధానులకు తిరగటానికి తనకు తన పరివారానికి రోజూ అయ్యే అదనపు ఖర్చు గురించి ఆలోచన రాలేదా ? ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మంచినీటి సీసాల విషయంలో పాటించిన పొదుపు గురించి ఎంతగానో ప్రచారం చేస్తే జనమంతా నిజమే అనుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి గుడివాడ వెళ్లటానికి హెలికాప్టర్ ప్రయాణం పొదుపు చర్య అవుతుందా ?
” రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు. పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా మంత్రులు, సెక్రటరీలకు సూచనలు ఇస్తూ పాలన సాగించవచ్చు. ఇందుకు ఏ చట్టం అవసరం లేదు. ఏ బిల్లూ అవసరం లేదు. ఒక తీర్మానం చేసి ఈ పని చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది. ”
పూర్వం కొందరు రాజులు విలాసాలకు అలవాటు పడి రాజనర్తకి, ఇతర రంగసానుల దగ్గర చేరి ఆస్ధానాలకు రాకుండా పాలన సాగించినట్లు చెప్పే కథలు మనకు తెలిసిందే. సచివాలయానికి రాకుండా తన నివాసం లేదా వ్యవసాయ క్షేత్రం నుంచి పాలన సాగిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నుంచి స్పూర్తి పొంది ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటపుడు రాజధానికి 30వేల ఎకరాలు కావాలని(ప్రభుత్వ భూములు కావాలని అన్నారని ఇప్పుడు వైసిపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు), అమరావతిలో పెట్టాలని 2014లో అసెంబ్లీలో చెప్పినపుడు జగన్‌గారికి ఈ విషయాలు తెలియవా ? అసలు రాజధానే అవసరం లేదని చెప్పే వారు మూడు రాజధానులు కావాలని ఇంత రచ్చ, గందరగోళం సృష్టించటం ఎందుకు ? రాజధానితో నిమిత్తం లేకుండా పాలన సాగించగలిగిన వారికి పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయటం ఒక లెక్కా ! ఆ మాత్రం దానికి ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టటం, ప్రాంతాల మధ్య పోటీ పెట్టటం ఎందుకు !