ఎం కోటేశ్వరరావు ,
తెలంగాణాలో పట్టణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రధాన అధ్యాయం ముగిసింది. ఎన్నికల చట్టం లేదా నిబంధనావళిలో ఉన్న లొసుగును ఆధారం చేసుకొని ఓటింగ్ హక్కు ఉన్న ఎక్స్ అఫిసియో సభ్యులైన ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలు ఫలితాలు వెలువడిన తరువాత అధికార పార్టీకి అవసరమైన చోట ఓటు వేసేందుకు వీలుగా తాము ఎక్కడ ఓటు వేయబోయేది తెలియ చేశారు. సరే క్యాంపు రాజకీయాల గురించి చెప్పనవసరం లేదు. అధికార పార్టీలో ముఠా తగాదాలను సర్దుబాటు (అది ఎలా అన్నది అందరికీ తెలిసిందే) కోసం క్యాంపులను నిర్వహిస్తే తమ వారిని లేదా తమకు మద్దతు ఇచ్చే వారిని ఎక్కడ పాలకపార్టీ తన్నుకుపోతుందో అన్న భయంతో ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పరిమితంగా అయినా క్యాంపులను నిర్వహించకతప్పలేదు.
ఇప్పుడు అధికార తెరాస సాధించిన విజయం కంటే యువరాజు కెటిఆర్ పట్టాభిషేకం ఎప్పుడు జరగనుందా అన్న అంశమే ఎక్కువగా రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారా ? హంగ్ ఏర్పడిన చోట ఏమి జరగనుందో అన్న స్ధానిక ఉత్సుకత తప్ప మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్స్, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల అనంతరం అసలైన చర్చ కెటిఆర్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కానున్నారో అన్నదే అసలైన ఆసక్తి అనటం అతిశయోక్తి కాదు. ఆయనకు బ్రహ్మరధం పట్టటం అప్పుడే ఆరంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ఆ పని చేస్తారా లేక తరువాతనా అన్నది తప్ప పట్టాభిషేకం ఖాయం అన్నది స్పష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
దవోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాల్లొ కెటిఆర్ పాల్గొని అక్కడ పలువురు కార్పొరేట్ల ప్రతినిధులను కలసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. దేశంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడిన స్ధితిలో ప్రతి కార్పొరేట్ సంస్ద ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. రెండవది కేంద్రంలోని బిజెపి సర్కార్ సామాజిక విభజన, అశాంతికి కారణమయ్యే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతోంది. ఈ పూర్వరంగంలో పెట్టుబడులు ఏమేరకు వస్తాయన్నది ప్రశ్నార్ధకమే. పక్కనే ఉన్న ఆంధ్రప్రదే శ్ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా దవోస్ వెళ్లి ఆర్భాటం చేసి వచ్చే వారు. అయినా ఆంధ్రప్రదే శ్‌కు వచ్చింది వట్టిస్తరి, మంచినీళ్లు మాత్రమే.
గత చరిత్రలో ఒక రాజు లేదా యువరాజు పట్టాభిషేకం సమయంలో దేశ పరిస్ధితులు, ఇరుగు పొరుగు రాజుల కదలికలు తదితర అంశాల గురించి మదింపు వేసేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు లేకపోయినా రాజకీయ పార్టీలలో వారసత్వాలు ప్రారంభమై కొనసాగుతున్న విషయం దాస్తే దాగేది కాదు. ప్రాంతీయ పార్టీలలో అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రారంభంలో ఏ లక్ష్యంతో, ఏ వాగ్దానాలతో ప్రారంభమైనా కొంత కాలం తరువాత అవి కుటుంబ పార్టీలుగా మారిపోవటం అన్ని రాష్ట్రాలలో చూస్తున్నదే. ఈ కారణంగానే కెటిఆర్ పట్టాభిషేకం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఒక విజయాన్ని పోల్చవలసి వచ్చినపుడు ఏదో ఒక ప్రాతిపదికను తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా విబేధిస్తే చేయగలిగిందేమీ లేదు.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను టిఆర్‌ఎస్ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్ 431, కాంగ్రెస్ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్ పార్టీ 99 స్థానాలు, తన మిత్రపక్షమైన ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు మాత్రమే పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఓటింగ్ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. అయితే అది తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా గ్రామీణ ఎన్నికల్లో దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల తీరు తెన్నులతో పోల్చితే కారు వేగం బాగా తగ్గింది. ఇది యువరాజుకు రుచించని వ్యవహారమే. వంది మాగధులకు వాస్తవాలతో పని ఉండదు కనుక భజన చేస్తారు, ఒక కోణాన్ని చూపి బొమ్మ మొత్తం అదే విధంగా ఉందని మనల్ని నమ్మమంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 71 20 0 1 1
కాంగ్రెస్ 1 10 35 30 26 18
బిజెపి 0 3 4 14 40 59
మజ్లిస్ 0 0 2 1 2 40
ఇతరులు 1 2 11 17 48 41
పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్ 41(12.61) మజ్లిస్ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. ఆ పార్టీ తాము గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ప్రాంతాలకు బదులు ఇతర చోట్ల అనూహ్య ఫలితాలను పొందింది. పార్టీ ఎంపీలు ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో దానికి ఆశించిన ఫలితాలు రాలేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ అభ్యర్ధులతో కుమ్మక్కు అయిన కారణంగానే కాస్త మెరుగైన సీట్లు సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. నిజాంపేట కార్పొరేషన్‌లోని 33 స్ధానాలకు గాను, తెరాస 26 గెలుచుకుంది. గతంలో సిపిఎం ప్రతినిధులు సర్పంచ్‌లుగా ఉన్న ప్రగతి నగర్ ప్రస్తుతం నిజాంపేట కార్పొరేషన్‌లో భాగం. అక్కడ ప్రగతి నగర్ అభివృద్ధి కమిటీ పేరుతో పోటీ చేసిన వారు ఆరుగురు విజయం సాధించారు, ఆ ప్రాంతంలోని మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెను అవకాశంగా తీసుకొని ప్రయాణీకులపై ప్రభుత్వం భారం మోపింది. ఇప్పుడు పురపాలక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో పన్నులు పెంచనున్నట్లు ప్రకటించారు. హైదరాబాదు, ఇతర కార్పొరేషన్లలో కొనసాగుతున్న అనారోగ్యం, అద్వాన్న పరిస్ధితులను చూసిన తరువాత మిగతా ప్రాంతాలలో కూడా పన్నుల బాదుడు తప్ప జనానికి ప్రయోజనాలు అనుమానమే !