Tags

, , , , , ,

Image result for shaheen bagh"
స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌
జనవరి 26,రిపబ్లిక్‌ దినోత్సవం రోజున రాజ్యాంగం ప్రసిద్దికెక్కుతుంది. కానీ న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో డిసెంబరు 15నే ఆ ఉత్సవం ప్రారంభమైంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వానికి నిరసనగా ముస్లిం మహిళలు ఒక ముఖ్యమైన రోడ్డు మీద ధర్నా ప్రారంభించారు. అయితే అది వెంటనే తాము కూడా రాజ్యాంగానికి బద్దులమైన దేశభక్తులమే అని, దాన్ని ఉల్లంఘిస్తున్న అధికారంలోని వారికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామంటూ ముస్లింల ఉద్రేకపూరితమైన దేశవ్యాపిత ఆందోళనకు మొగ్గ తొడిగింది.
షాహీన్‌బాగ్‌ను సందర్శించిన వారు ఐదువందల మంది మహిళలు ఎంతో కాలం నిలవలేరు లేదా పెద్ద ప్రభావం చూపలేరు అనుకోవచ్చు. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ భారత్‌ను మార్చింది. ఒకనాడు నిర్నినిరోధక శక్తి అనుకున్న నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నమైందంటోంది.
పార్లమెంట్‌లో సిఎఎ గురించి చర్చ జరిగినపుడు ప్రతిపక్ష పార్టీలు దానికి వ్యతిరేకంగా గట్టిగా అభ్యంతరం చెబితే తమను ఎక్కడ దేశవ్యతిరేకులు అంటారోనని పిరికిబారినట్లు కనిపించింది. కానీ తరువాత అనేక నగరాలలో విద్యార్ధుల నిరసనలు చెలరేగాయి. తొలుత షాహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళల ప్రదర్శన తరువాత బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటా ప్రారంభమయ్యాయి. సిఏఏ రాజ్యాంగవ్యతిరేకమని తిరస్కరిస్తూ గళం విప్పేందుకు ప్రతిపక్షాలను ఇది ఉద్యుక్తులను గావించింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో జాతీయ పౌర చిట్టా(ఎన్‌ఆర్‌సి)ను అమలు జరిపేందుకు తిరస్కరించేట్లు చేసింది. దీన్ని అమలు జరపబోమనే దాని అర్ధం సిఎఎ అమలు సాధ్యం కానిదని చెప్పటమే. ఇది షాహీన్‌బాగ్‌లోని మహిళలకు ఒక అపూర్వ విజయమే.
రిపబ్లిక్‌ దినోత్సవం రోజు కేరళలో 620కిలోమీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో మిలియన్ల మంది పాల్గొన్నారు, కొల్‌కతాలో పదకొండు కిలోమీటర్ల హారాన్ని నిర్వహించారు. ఇంతటి ఉద్రేకపూరితమైన, విస్తృత నిరసనను గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఎదుర్కోలేదు.హింసకు గురైన హిందువులకు హానిలేని పద్దతిలో సాయం చేసేందుకే సిఎఎ అని చెప్పుకోవటాన్ని ప్రపంచవ్యాపితంగా అపహాస్యం చేస్తూ కొట్టివేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్‌ పాల్పడిందని మీడియా, అమెరికా, ఐరోపా యూనియన్‌, ఆసియాలోని అగ్ర రాజకీయవేత్తల నిందకు దేశం గురైంది.
భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని మలేసియా ప్రధాని విమర్శించినందుకు ఆ దేశం నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతుల నిలిపివేత ద్వారా బిజెపి దెబ్బతీసింది. మిలియన్ల మంది భారత ముస్లింల వద్ద సరైన పత్రాలు లేవనే పేరుతో ఎన్‌ఆర్‌సి, సిఎఎ అనే పట్టకారులతో అదుపు చేయటం మరియు పౌరసత్వ రద్దుకు పూనుకున్నారని భావిస్తున్న విమర్శకులను ఒప్పించటానికి ఇది మార్గం కాదు.అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ పన్నెండులక్షల మంది హిందువులు, ఏడు లక్షల మంది ముస్లింలతో సహా 19లక్షల మంది దగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడించింది. బంగ్లాదేశ్‌ నుంచి ”అక్రమంగా ప్రవేశించిన వారు మరియు చెదలు ”గా వర్ణించిన వారిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో ఆధారాలు లేని పేదలు దొరికిపోయారు. నమోదు తక్కువగా ఉండే దేశంలో ఇది సాధారణం.
అసోం అనుభవాన్ని బట్టి జాతీయ స్ధాయిలో ఎన్‌ఆర్‌సి ఖర్చు యాభైవేల కోట్ల రూపాయలు కాగలదు, ఎనిమిది కోట్ల మంది నమోదు పత్రాలు లేని వారిని తేల్చుతుంది. మిలియన్ల మంది ముస్లింలను ఖైదు చేయవచ్చనే ఆలోచనతో కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యులు ఉప్పొంగిపోవచ్చు, అది సరైనదే అనుకోవచ్చుగానీ ప్రపంచంలో దేశ గౌరవం మట్టి కొట్టుకుపోతుంది.


జరుగుతున్న ఆందోళన దేశ వ్యతిరేక విద్రోహం అని బిజెపి చిత్రిస్తున్నది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి రాజ్యాంగ పీఠికలోని అంశాలను పెద్ద ఎత్తున ప్రదర్శించే బ్యానర్లు,చిత్రాలు, బోర్టులు కనిపిస్తాయి. దేశ భక్తియుతమైన జాతి పౌరులుగా వాటిని పరిరక్షిస్తామంటూ ముస్లింలు ” భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాత్వత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ” అనే పీఠికను, రాజ్యాంగాన్ని పారాయణం చేయటం చూస్తారు.
ఈ 85పదాలను నిరసన కేంద్రాలలో కేవలం బ్యానర్ల మీద పెద్దగా ప్రదర్శించటమే కాదు, వాటిని ముద్రించిన దాదాపు పదిలక్షల టీషర్టులు పెద్ద ప్రయత్నం చేయకుండానే అమ్ముడు పోయాయి. షాహీన్‌ బాగ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదుల సొమ్ముతో ఏర్పడిన ఒక చిన్న పాకిస్ధాన్‌ అని బిజెపి ప్రతినిధి చిత్రించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఉద్యమానికి పాకిస్ధాన్‌ నిధులు అందచేస్తున్నదని బిజెపి నిజంగానే అనుకుంటున్నదా ? ముస్లింలు నిబద్దులైన దేశభక్త భారతీయులని షాహిన్‌బాగ్‌ చెప్పటం లేదా ? మహాత్మా గాంధీ, బిఆర్‌ అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, సరోజిని నాయుడు బోధనలకు కట్టుబడి లేదా ? షాహీన్‌బాగ్‌ వేదికమీద అలంకరించిన ఈ దిగ్గజాల పెద్ద చిత్రాలు మాట్లాడుతున్నాయి. మహిళలు వంతుల వారీగా ప్రతి రెండు మూడు గంటలకు వచ్చిపోతున్నారు, కాబట్టి గుడారం ఎప్పుడూ నిండుగా ఉంటోంది. ఆందోళన నిరంతరం కొనసాగనున్నట్లు సూచిస్తున్నది. ‘నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను ‘ అని మహిళలు ధరించిన తల నాడాలు(హెడ్‌బాండ్స్‌) చెబుతున్నాయి, జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. బిజెపి పర్యవేక్షణలో ఉన్న దేశ భక్తిని వారు అపహరించారు.
ప్యాసా సినిమాలో గురుదత్‌ పాటను తెలివిగా మలచి ఏర్పాటు చేసిన బ్యానర్‌ నాకు నచ్చింది. ” జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై… కహా హై….కహా హై…( ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?) దానిని షాహిన్‌ బాగ్‌లో ఇలా రాశారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై…యహా హై…యహా హై….యహా హై….( ‘ ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి).

Image result for shaheen bagh"
ఇటీవలి కాలంలో అనేక తీర్పుల విషయానికి వస్తే సుప్రీం కోర్టు బిజెపి వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది.రాజకీయ వాతావరణానికి కోర్టులు ప్రభావితమౌతాయని ప్రపంచ అనుభవం చూపుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి ఒక పెనుగాలి మాదిరి సులభంగా విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలు తమ గాయాలను మాన్చుకుంటూ పార్లమెంట్‌లో సిఎఎను దాదాపు ప్రతిఘటించలేదు. కానీ ప్రతి పక్షాలు మరోసారి గళమెత్తటానికి విద్యార్ధులు, షాహిన్‌బాగ్‌ మహిళలు సాయం చేశారు. రాజ్యాంగ హక్కుల రక్షణ పట్ల తల ఒగ్గని సుప్రీం కోర్టు కూడా తన గళాన్ని విప్పుతుందని ఆశిస్తున్నాను.

గమనిక: స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ ప్రముఖ జర్నలిస్టు. ఎకనమిక్‌ టైమ్స్‌, టైమ్స్‌ఆఫ్‌ ఇండియా కన్సల్టింగ్‌ ఎడిటర్‌గా పని చేశారు. ఆయన రాసిన ఈ వ్యాసం తొలుత ఎకనమిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో జనవరి 28వ తేదీన ప్రచురితమైనది,దానికి ఇది అనువాదం, శీర్షిక మార్చటమైనది.