Tags

, , ,

Image result for thalinomics"

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ”సుప్రసిద్ధ ఆర్ధికవేత్త ”, కాదని ఎవరైనా అంటే సంఘపరివారం రంగంలోకి దిగి కాళ్లు, చేతులు విరగ్గొడుతుంది. పోలీసులు చూస్తుండగానే తుపాకులతో కాల్పిస్తుంది( న్యూఢిల్లీ షాహిన్‌ బాగ్‌ మోడల్‌). ఆ పెద్దమనిషి కేవలం ఒక ప్రధాన మంత్రి మాత్రమే కాదు, తలచుకుంటే ఫిరంగులు, ట్యాంకులు, విమానాలు, అణ్వాయుధాలతో నిమిత్తం లేకుండా ”నోటి మాటల”తో ఇరుగు పొరుగుదేశాల మీద యుద్ధం చేసి ఓడించగల యోధుడు. మోడినోమిక్స్‌ ద్వారా ఒక్క భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్ధిక వృద్ధికి ఆయన చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతి పొందినట్లు మన విదేశాంగశాఖ స్వయంగా ప్రకటించింది. అర్ధశాస్త్ర పట్టా పుచ్చుకున్న మన్మోహన్‌సింగ్‌ అమాయకుడు, పదేండ్లు పదవిలో ఉండి కూడా ఒక్క మామూలు అవార్డును కూడా పొందలేకపోయారు. విదేశాంగశాఖ చెప్పినదాని ప్రకారం ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును పొందిన, తొలిభారతీయుడిగా కేవలం మూడున్నర సంవత్సరాలలో మోడీ ఆ ఘనతను సాధించారంటే మామూలు విషయమా ? మోడీ నిజం, గతేడాది ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ఆ అవార్డును పుచ్చుకున్నది వాస్తవం.
” అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివృద్ధికి కృషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచ వ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించి మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కృషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది ” అని కూడా మన విదేశాంగశాఖ ప్రకటన పేర్కొన్నది.అలాంటి మేథావి ఏలుబడిలో దేశం అథోగతిలోకి పోవటం ఏమిటో ఎంత ఆలోచించినా తాజా ఆర్దిక సర్వే మాదిరి అర్ధం కావటం లేదు.
నరేంద్రమోడీకి ఈ అవార్డు ఇవ్వటం అంటే గతంలో దాన్ని పుచ్చుకున్న ప్రముఖులందరనీ అవమానించటమే అని దక్షిణ కొరియా మానవహక్కుల సంఘాల వారు అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆర్ధిక విషయాలలో ఆయన సాధికారత గురించి గాక అధికారంలో ఉండి 2002లో గుజరాత్‌లో కావాలనే ముస్లింలపై దాడులను అనుమతించారన్నది వారు చెప్పిన కారణం.
ప్రధాని మోడినోమిక్స్‌ ఉద్యోగాల విషయం అడగ్గానే పకోడనోమిక్స్‌గా మారింది. ఇన్ని గ్యాస్‌ కనెక్షన్లిచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని పాడిందే పాట ఎన్ని రోజులు పాడతారు ! అందుకే మోడీ భక్తులకు మరో నినాదాన్ని యంత్రాంగం అందించింది. అదే తాలినోమిక్స్‌. రానున్న రోజుల్లో ఇంకే మిక్స్‌ వస్తాయో తెలియదు. ఆరు సంవత్సరాలు కూడా గడవక ముందే ఇన్ని ఆర్ధిక విధానాలతో ఏ దేశాన్ని అయినా, ఏ ప్రధాని అయినా ఇన్ని గంతులు వేయించారా ? లేదు, కచ్చితంగా లేరు. మామూలు వారికి ఇది సాధ్యమా అంటే వెంకయ్య నాయుడు చెప్పినట్లు మోడీ వంటి దేవదూతలకు తప్ప ఇతరులకు సాధ్యం కానే కాదు అని చెప్పాలి. అనగా అనగా ఒక ప్రధాని అని భవిష్యత్‌లో ఎవరైనా కథలు, గాధలు చెప్పుకోవాలంటే వారికి విషయాలు తెలియాలి గనుక క్లుప్తంగా అయినా కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పుకుందాం.
మోడినోమిక్స్‌ గురించి గతంలో గొప్పగా పొగిడి, ఆహా ఓహౌ అన్నవారందరూ ఇప్పుడు నత్తి నత్తిగా మాట్లాడుతున్నారు. ఊరించిన ఉద్యోగాలెక్కడ మగానుభావా అని అడిగితే లెక్కలు కట్టటంలో మనవాళ్లు ఉత్తవెధవాయలు, పకోడీలు అమ్ముకొనే వారికి కూడా ఉపాధి కల్పించినట్లే కదా అలాంటి వారి లెక్కలన్నీ వేయలేదు అని స్వయంగా మోడీగారు 2018లో సెలవిచ్చిన విషయం, అది పకోడానోమిక్స్‌గా ప్రాచుర్యం పొందిన సంగతి మరోసారి గుర్తు చేస్తే మోడీ భక్తులు విరుచుకుపడతారు. తమ ప్రధాని కల్పించిన ఉపాధిలో భాగంగా పకోడీలు, బజ్జీలు, గుంటపునుగులు, పులిబొంగరాలు వేసుకొని బతుకుతున్నవారెందరో రెండు సంవత్సరాల తరువాత కూడా ఆయన అధికార యంత్రాంగం చెప్పలేకపోయింది. ఆఫ్టరాల్‌ మా ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్‌కొనేందుకు సైతం వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని బ్రిటానియా కంపెనీ ఎండీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాంటిది అంతకంటే ఎక్కువ వెల ఉండే పకోడీలు, బజ్జీలు తినే వారెందరన్నది అడగకూడని ప్రశ్న.

Image result for thalinomics cartoons"
మోడీ గారు అచ్చేదిన్‌ గురించి 2014ఎన్నికల సమయంలో ఎన్నో కబుర్లు చెప్పారు, తరువాత అసలు వాటి ఊసే ఎత్తలేదు. కానీ చడీ చప్పుడు లేకుండా జనానికి మంచి రోజులు ఎలా వచ్చాయో బడ్జెట్‌కు ముందు వెల్లడించిన ఆర్ధిక సర్వేలో మోడీ యంత్రాంగం ఎంతో వినమ్రంగా చెప్పింది. బహుశా కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో అలా ఉందేమో వాట్సప్‌ యూనివర్సిటీ పండితులు చెప్పాలి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది గానీ కొద్ధి సంవత్సరాల క్రితం వరకు పట్టణాలలో శాఖాహారానికి ఆర్యవైశ్య లేదా బ్రాహ్మణ భోజన హౌటళ్లు అని పేరు పెట్టే వారు. మాంసాహార హౌటళ్లకు మిలిటరీ అని తగిలించే వారు. అధికార యంత్రాంగానికి కనిపించిన దృశ్యాలు, వినిపించిన మాటలు, సేకరించిన లెక్కలు వెల్లడించిన దాని ప్రకారం మోడీ గారి పాలనలో 2019-20లో ధరలు కాస్త పెరిగినా 2015-16 నుంచి అప్పటి వరకు ఆర్యవైశ్య భోజనం మరియు మిలిటరీ భోజనం చేసే వారికి రోజులు బాగున్నాయట. 2014లో అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ తెచ్చిన అనేక సంస్కరణ చర్యలు, పెరిగిన వ్యవసాయ ఉత్పాదకత సామర్ధ్యం, ధరల పారదర్శకతకు వ్యవసాయ మార్కెట్‌లు బాగా పని చేసిన కారణంగా సగటు పారిశ్రామిక కార్మికుల పరిస్ధితి ఏ భోజనం కావాలంటే దాన్ని పొందేవిధంగా తయారైందట. ఎలా ?
2006-07 నుంచి 2019-20 మధ్యకాలంలో కార్మిక కుటుంబాలకు శాఖాహారం అందుబాటులోకి రావటం 29శాతం, మాంసాహారం 19శాతం పెరిగిందట.మోడీ గారు అధికారానికి రాక ముందు మాదిరి ధరలు పెరుగుతూనే ఉంటే ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబం ఏడాదికి అదనంగా శాఖాహారం మీద అయితే సగటున రూ.10,887, మాంసాహారానికి రూ. 11,787 అదనంగా ఖర్చు అయ్యేదని, మోడీ గారు వచ్చి తీసుకున్న చర్యల కారణంగా ధరలు తగ్గినందున ఆమేరకు ఆదా అయినందున అంత మొత్తం ఏడాదికి వచ్చిన లబ్దిగా పరిగణించాలట.
జనమంతా చెవుల్లో కమలం పూలు పెట్టుకొని వింటున్నారనే అంచనాతో ఇలాంటి కబుర్లు చెబుతున్నారా ? లేకపోతే ఈ కథలేమిటి? నిరుద్యోగం నాలుగున్నరదశాబ్దాల రికార్డు స్ధాయిలో ఆరున్నరశాతం పెరిగిందేమంటే లెక్కలన్నీ తప్పు అంటిరి. మరోవైపు ఈ లబ్ది కబుర్లకు ఆధారాలేమిటి? నిరుద్యోగం గురించి అయినా నిత్యావసర వస్తువుల గురించి అయినా అదే యంత్రాంగం సేకరించిన అంకెలే కదా ? నిరుద్యోగం విషయంలో తప్పుడు లెక్కలైతే మరి ఈ తాలినోమిక్స్‌ గణాంకాలకు ఆధారం ఏమిటి, లబ్ది వచ్చిందని ఎలా చెబుతారు. పోనీ నాలుగేండ్లు ధరలు తగ్గించిన పెద్దలు ఐదవ ఏడాదిలో ఎందుకు పెంచినట్లు? ఈ కాలంలో నిజవేతనాలు పడిపోయాయని అంకెలు ఘోషిస్తున్నాయి. ఆహార ఖర్చు తగ్గి ఆదా అయితే ఆ సొమ్మును ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగిస్తారు, అంటే వస్తు వినియోగం పెరుగుతుంది. మరో వైపున వినియోగం తగ్గి మాంద్యంలోకి పోలేదు గానీ మందగించిందని కేంద్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలనను పక్కన పెట్టి సుమతీశతకాన్ని బట్టీ పట్టి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం అంటే ఇదేనా !
కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా వినియోగదారుల ధరల సూచికను ప్రకటిస్తుంది, దాని ప్రాతిపాదికన పెరుగుదలకు అనుగుణ్యంగా కరవు( ధరల) భత్యం చెల్లిస్తుంది. తాలినోమిక్స్‌కు గణాంకాలను తీసుకున్న 2006 నుంచి 2018 వరకు వార్షిక సగటు 123 పాయింట్ల నుంచి 294.33 వరకు పెరిగింది. దీనిలో నరేంద్రమోడీ ఖాతాలో 2014లో 246.91నుంచి వేయాల్సి ఉంది. ధరలు నిజంగా తగ్గితే మరి సూచిక ఎలా పెరిగినట్లు ? ఎక్కువా, తక్కువా అన్నది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా సూచిక నిలకడగా లేదా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే తగ్గిన దాఖలాలు లేవు. అలాంటపుడు తాలి లెక్కలు మాత్రమే కట్టి భారం తగ్గింది లేదా దాన్నే లబ్ది అనుకోమంటే ఎలా? వినియోగదారుల ధరల సూచిక, కరవు భత్యం లెక్కింపు వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. పెరిగిన ఇతర వస్తువులు, సేవల మాటేమిటి ? వాటి భారం ఎంతో జనానికి చెప్పాలా లేదా ? 2016 జూలైలో రెండుశాతం పెరిగిన డిఏ 2017 జనవరికి నాలుగు అయింది. 2018 జనవరికి 7, 2019 జనవరికి 12శాతానికి పెరిగింది. అయితే 2019 జూలైకి ఏకంగా 17శాతం అయింది. అంతకు ముందు ఆరు విడతల సగటు రెండుశాతం అయితే 2019 మొదటి ఆరునెలల్లో అది ఐదుశాతానికి చేరింది. జూలై నుంచి డిసెంబరుకు మరో నాలుగుశాతం ఖరారు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే తొమ్మిదిశాతం అంటే మూడు సంవత్సరాల పొదుపు లేదా లబ్ది ఒక్క ఏడాదిలో కొట్టుకుపోయినట్లే కదా !

Image result for thalinomics cartoons"
ధరలు తగ్గి ఆహారం అందుబాటులోకి వచ్చిందని అనుకుంటే మరోవైపున దేశంలో ఆకలి సూచిక సంగతేమిటి? 2017,18,19 సంవత్సరాలలో ఆహార సూచికలో విశ్లేషణలోకి తీసుకున్న 117 దేశాలలో మన దేశం 100,103,102 స్ధానాల్లో ఉంది. ఇదెలా ? మెరుగుపడాల్సిందిపోయి దిగజారటం ఏమిటి ? పొద్దున్న లేస్తే పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, వాటి దారిద్య్రం గురించి చెబుతారు. ఆకలి సూచికలో శ్రీలంక 66, మయన్మార్‌ 69, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్ధాన్‌ 94వ స్ధానాల్లో ఉన్నాయి. ఈ సూచికను చూసి లెక్కలు సరిగా వేయలేదని మన నీతి ఆయోగ్‌ అధికారులు చిర్రుబుర్రులాడతారు. ఒక ఏడాది అనుభవం చూసిన తరువాత అయినా సూచిక తయారు చేసే వారికి సరైన వివరాలు ఇవ్వకుండా ఏమిటీ వ్యవహారం. గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారా లేక మన అసలు సరకు ఇదేనా ?
మన పొరుగునే ఉన్న చైనా అభివృద్ది గురించి చెబితే కొంత మందికి తేళ్లు జెర్రులు పాకినట్లు ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదండీ అంటారు. ఆకలి సూచికలో అది 25వ స్ధానంలో ఉంది. ఆకలి సూచిక మార్కుల ప్రాతిపదికను చూస్తే ఐదు, అంతకంటే తక్కువ వచ్చిన దేశాలకు ఒకటవ స్ధానం ఇచ్చారు. అలాంటివి 17 ఉన్నాయి. ఐదు-ఆరు మధ్య వచ్చిన దేశాలు ఐదు కాగా ఆరు-ఏడు మధ్య మార్కులు తెచ్చుకున్న ఐదు దేశాలలో చైనా 6.5 మార్కులతో మధ్యలో ఉంది. మరి మన మార్కులు 30.3, పాలకులు మన దేశాన్ని ఆఫ్రికా దేశాల సరసన నిలబెట్టారు. ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో స్వేచ్చగా జనాన్ని ఆకలితో మాడుస్తుండగా లేదని చెబుతున్న చైనాలో , ఇరుగు పొరుగు పేద దేశాలలో బలవంతంగా కడుపు నింపుతున్నారని చెబుతారా ?
మోడినోమిక్స్‌, పకోడానోమిక్స్‌, తాలినోమిక్స్‌ అన్నింటికీ మోడీషామిక్స్‌దే బాధ్యత. జిడిపి వృద్ధి రేటు ఎందుకు పడిపోతోందో చెప్పటానికి మోడీషాలకు సందర్భమూ రాదు, నోరు అంతకంటే రాదు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రం పాకిస్ధాన్‌తో యుద్దం, ఉగ్రవాదం, తుకడే తుకడే గ్యాంగుల భాష వస్తోంది. సిఏఎ, ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్‌ వంటి అంశాల మీద జనాన్ని తప్పుదారి పట్టిస్తారు గాని దిగజారుతున్న ఉన్న జిడిపి, ఎగబాకుతున్న ధరలను ఎలా దారి మళ్లిస్తారో చెప్పరు.
కేంద్ర ప్రభుత్వం సేకరించే ఆహార వస్తువుల ధరల వివరాల ప్రాతిపదిక తాలినోమిక్స్‌ను రూపొందించారు. ఆగ్రనోమిక్స్‌ ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం ఎంతవరకు వచ్చిందో, పెట్రోనోమిక్స్‌ ద్వారా గత ఆరు సంవత్సరాలలో జనం జేబుల నుంచి ఎంత కొల్లగొట్టారో, ఏతా వాతా జనానికి ఏ విధంగా మేలు చేకూర్చారో మోడీ సర్కార్‌ జనానికి వెల్లడిస్తే అసలు విషయాలు తెలుస్తాయి. తాలినోమిక్స్‌ గురించి మరింత వివరంగా మరోసారి చూద్దాం !