Tags

, , ,

Image result for while china trying to control the coronavirus,media spreading misinformation"

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ తాజాగా ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. ఇది చైనా నుంచి అనేక దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు. భయంకరమైన అంటు వ్యాధులు వ్యాపించటం పెద్ద సంఖ్యలో జనం, ఇతర జీవజాలం మరణించటం మనకు చరిత్ర తెలియనప్పటి నుంచీ వుంది. గతంలో వ్యాధుల గురించి తెలియనపుడు, నివారణ చర్యలను వెంటనే ఒకరికి ఒకరు తెలియచేసుకొనే సాధనాలు లేనపుడు అనేక వైరస్‌లు, బాక్టీరియాలు పెద్ద సంఖ్యలో నష్టం కలిగించాయి. క్షణాల్లో సమాచారం ప్రపంచానికంతటికీ తెలుస్తున్న ఈ రోజుల్లో జనానికి అవసరమైన దాని బదులు భయాన్ని పెంచేది, తప్పుడు సమాచారం ముందుగా జనానికి చేరుతోంది. దాన్ని అంటు వ్యాధితో పోల్చటాన్ని బట్టి ఎంత ప్రమాదకారిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమం ఈ విషయంలో అగ్రస్ధానంలో ఉంటే ఎక్కడ వెనుకబడిపోతామో అన్నట్లు సాంప్రదాయక మాధ్యమం కూడా పోటీపడుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స లేదు. వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా ఊహాన్‌, ఇతర ప్రాంతాల పౌరులను ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. చివరికి దీన్ని తప్పు పడుతూ, వక్రీకరిస్తూ పశ్చిమదేశాల మీడియా కథనాలు రాస్తోంది. తాజా సమాచారం ప్రకారం వ్యాధి సోకిన దగ్గర నుంచి అంటే గత పదిహేను రోజుల్లో మరణించిన వారి సంఖ్య 490కి చేరింది. వారిని దహనం చేయటంతో కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరమంతటా దట్టంగా పొగలు వ్యాపించాయని అతిశయోక్తులు రాశారు.
ఒక వైపు వ్యాధి లక్షణాలు నిర్దారణ కాగానే నివారణకు చైనా, ఇతర దేశాలు తీసుకున్న చర్యలను పొగడకపోయినా జనానికి తెలియ చెప్పటం కనీస ధర్మం. దానికి బదులు వ్యాధి గురించి తప్పుడు ప్రచారం చేసే వారు పొందే లబ్ది ఏమిటో తెలియదు. చైనాలో కోట్లాది మందికి వ్యాధి సోకిందని వీధుల్లో వేలాది మంది కుప్పకూలిపోతున్నారని, ఆరున్నర కోట్ల మంది వరకు మరణించే అవకాశం ఉందని బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ అంచనా వేస్తోందని, మీ చేతిలో కనుక ఒరెగానో ఆయిల్‌ గనుక ఉంటే వారిలో మీరు ఒకరు కాకుండా ఉంటారని సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నట్లు లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది. మన దేశంలో కూడా అదే స్ధాయిలో ప్రచారం ఉంది, భయాన్ని సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గతంలో స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు ఐదు రూపాయల విలువ చేసే మాస్క్‌లను ఎంతకు అమ్మారో,మనం కొన్నామో గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. చైనాలో కరోనా వైరస్‌ను ఎక్కువ భాగం అదుపు చేశారని, అయినా వ్యాపిస్తున్నదని, చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులుతీసుకున్న చర్యల కారణంగా వ్యాప్తి వేగం తగ్గిందని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

Image result for wuhan hospital construction"
ఒక తీవ్రమైన అంటు వ్యాధి వ్యాప్తిని అరికట్టటానికి చైనాలో మాదిరి రోజూ ఇరవైనాలుగు గంటల పాటు ఎనిమిది రోజుల్లో వెయ్యికిపైగా పడకలున్న ఆసుపత్రి నిర్మాణం ఏ దేశంలో అయినా జరిగిందా ? జన చైనా ప్రజాసైన్య నిర్వహణలో సోమవారం నుంచి అక్కడ రోగులను చేర్చుకొని చికిత్స చేస్తున్నారు. 33,900 చదరపు మీటర్ల ప్రాంతంలో ఏడువందల మంది ఇంజనీర్ల స్దాయి నిపుణులు, నాలుగువేల మంది కార్మికులు ఈ మహత్తర నిర్మాణంలో పాలు పంచుకున్నారు.ఆసుపత్రి ప్లాన్‌ జనవరి 24కు సిద్ధం అయింది, అదే రోజు వందకు పైగా నేలను తవ్వే, చదును చేసే యంత్రాలను దించారు. 25వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగానే సిద్దం చేసిన పెట్టెల వంటి మూడు వందల గదులను 29న ఏర్పాటు చేశారు. శనివారం నాటికి వైద్య పరికరాలను అమర్చారు. ఆదివారం నాటికి ఆసుపత్రి పూర్తి కావటాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా ఎనిమిది కోట్ల మంది ఇంటర్నెట్‌లో వీక్షించారు. టీవీల్లో సరేసరి. గతంలో సారస్‌ వైరస్‌ వ్యాప్తి సమయంలో బీజింగ్‌ శివార్లలో ఏడు రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మరింతగా మెరుగుపరిచి ఉపయోగించారు. కరోనా వ్యాపించిన ఉహాన్‌, ఇతర నగరాల్లో కూడా ఇలాంటి త్వరితగతి ఆసుపత్రులను ఇంకా నిర్మిస్తున్నారు.
గతంలో చైనా, ఇరుగు పొరుగుదేశాలలో సారస్‌ వ్యాప్తి చెందినపుడు వ్యాధి సోకిన వారిలో పదిశాతం మంది మరణించగా ప్రస్తుతం కరోనా విషయంలో అది 2.09 మాత్రమేనని అందువలన అంతగా భయపడాల్సిన అవసరం లేదని అనేక మంది చెబుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్దులు, ఇతర వ్యాధులు ఉన్నవారేనని, అంత మాత్రాన వైరస్‌ తీవ్రతను తగ్గించినట్లుగా భావించరాదని హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యుహెచ్‌ఓ) ప్రపంచ అత్యవసర పరిస్ధితిని ప్రకటించిందంటే దాని అర్ధం చైనా మీద విశ్వాసం లేదని కాదు. ఆరోగ్య వ్యవస్ధలు బలహీనంగా ఉన్న దేశాలలో వ్యాప్తి చెందకుండా చూడాలన్నదే ఉద్దేశ్యం. వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉహాన్‌ పట్టణం, పరిసరాల్లో దాదాపు ఐదు కోట్ల మంది జనాన్ని అటూ ఇటూ ప్రయాణించకుండా ఇండ్లకే పరిమితం చేస్తూ కట్టడి చేశారు, వారికి కావలసినవన్నీ అందిస్తున్నారు. దక్షిణ కొరియా లేదా ఒక ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మందికి ఏర్పాట్లు చేయటం ఇంతవరకు మరొక దేశంలో ఎక్కడా జరగలేదు. వైరస్‌ గుర్తింపు తదితర చర్యలు తరువాత, ముందు వ్యాప్తిని అరికట్టటం ముఖ్యమనే వైఖరితో ఈ చర్యలు తీసుకున్నారు. చైనా జనాభా మొత్తానికి ముఖాలకు అవసరమైన వ్యాధి నిరోధక మాస్కుల తయారీని చేపట్టారు. వైరస్‌ను గుర్తించిన పది రోజుల్లోనే దాని డిఎన్‌ఏను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు ఆ వివరాలను ప్రపంచానికంతటికీ అందించారు. వైరస్‌ ప్రబలుతున్న సమయంలోనే ఇంత తక్కువ సమయంలో సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచటం గతంలో ఎన్నడూ జరగలేదు, దాన్ని ఎవరైనా అధ్యయనం చేయవచ్చు, టీకాల వంటి వాటిని తయారు చేయవచ్చు.
ఇలాంటి విపత్తులు వచ్చినపుడు నలుగురూ నాలుగు చేతులు వేసి పరస్పరం సాయం చేయాల్సి వుండగా రాజకీయాలు చేయటం నీచాతి నీచం. ఇలాంటివి జరిగినపుడు బలహీనులను బలిపశువులుగా చేసిన దురహం కారం, దుర్మార్గాన్ని చరిత్ర నమోదు చేసింది. చైనా జాతీయుల కారణంగానే కరోనా వ్యాపిస్తోందని ఆరోపిస్తూ వారిని దేశంలో ప్రవేశించకుండా నిషేధించాలని దక్షిణ కొరియా సియోల్‌ నగరంలో కొందరు ప్రదర్శన చేశారు. కొన్ని చోట్ల అసలు ఆసియా వాసులెవరినీ రానివ్వ వద్దనే వరకు పరిస్ధితి పోయింది. ఎంతగా విద్వేషాన్ని,భయాన్ని రెచ్చగొట్టారో తెలుసుకొనేందుకు ఒక ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చైనా టౌన్‌ రెస్టారెంట్‌ వెలుపల 60 ఏండ్ల ఒక చైనా జాతీయుడు గుండెపోటుతో పడిపోయాడు. అలాంటి వారి గురించి తెలియగానే కృత్రిమ శ్వాస అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే అతను కరోనా వైరస్‌ కారణంగానే పడిపోయాడని అలాంటి చికిత్సను అందించేందుకు తిరస్కరించారు.( కరోనా వైరస్‌ వార్త పేరుతో చైనాలోని ఒక రోడ్డుపై ఆకస్మికంగా పడిపోయిన వ్యక్తి దృశ్యాన్ని మన దేశంలో కూడా మీడియా చూపింది. నిజంగా అతనెందుకు అలా పడిపోయాడో తెలియదు. కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలలో అదొకటని ఎవరూ చెప్పలేదు)
ఇప్పుడు చైనాలో జనాన్ని ఒక చోటి నుంచి మరొక చోటికి కట్టడి చేసిన మాదిరి గతంలో కలరా సోకినపుడు చేయలేదు. వారిని నౌకల్లో అనుమతించిన కారణంగా అది ప్రపంచ వ్యాప్తమైంది.1832లో వలస వచ్చిన ఐరిష్‌ జాతీయులు కలరాను వ్యాప్తి చేస్తున్నారని అనుమానించి వారిని విడిగా ఉంచారు, తరువాత రహస్యంగా చంపిన దుర్మార్గం తరువాత బయటపడింది. తొలి రోజుల్లో ఎయిడ్స్‌ కారకులు హైతీయన్లు అంటూ వారి మీద దాడులు చేసి వేధించారు. 2003 చైనాలో సారస్‌ ప్రబలినపుడు కెనడాలోని చైనా జాతీయుల మీద దాడులు చేసి వారి ఇండ్లు, దుకాణాల నుంచి తరిమివేసిన దారుణాలు జరిగాయి. మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చే జనం కుష్టువ్యాధి, మసూచిని తీసుకు వచ్చి అమెరికాను కలుషితం చేస్తున్నారంటూ 2018లో అమెరికాలోని ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత నోరు పారవేసుకున్నాడు. నిజానికి మసూచిని 1980లోనే ప్రపంచం నుంచి తరిమివేశారు.
కరోనా వైరస్‌తో చైనీయులు జీవ ఆయుధాలు తయారు చేస్తుండగా తప్పించుకొని బయటకు వచ్చిందని, ఆ వైరస్‌ను వారు కెనడా ప్రయోగశాల నుంచి అపహరించారనే కట్టుకధలు అనేకం ప్రచారంలోకి వచ్చాయి. వెనక్కు వెళితే అనేక అంటు వ్యాధులు జనాన్ని సామూహికంగా హతమార్చాయి. వాటికి కారకులు ఎవరు ? 1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా 50 కోట్ల మందికి స్పానిష్‌ ఫ్లూ సోకింది, ఆర్కిటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రదీవుల వరకు ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆరోజు నేటి మాదిరి విమానాలు లేవు, ప్రయాణాలు లేవు. కనీసం ఐదు నుంచి పది కోట్ల మంది వరకు మరణించినట్లు అంచనా. (అంటే నాటి ప్రపంచ జనాభాలో ప్రతి వందమందిలో ముగ్గురి నుంచి ఐదు మంది వరకు) ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో అనేక అంటు వ్యాధులు ఎంతగా ప్రబలాయంటే అమెరికాలో సగటు జీవిత కాలం పన్నెండు సంవత్సరాలు తగ్గిపోయింది. ఫ్లూ పిల్లలను, ముసలి వారినీ ఎక్కువగా కబళిస్తుంది, కానీ అమెరికాలో యువత ఎక్కువ మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అనేక దేశాలు వాస్తవాలను బయట పెట్టకుండా తొక్కిపెట్టాయి. అలాంటి పశ్చిమ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి చైనా మీద అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఫ్లూ కారణంగా స్పెయిన్‌లో రాజు పదమూడవ ఆల్ఫోన్సోతో సహా అనేక మంది సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారు. దాంతో అక్కడి నుంచే అది ప్రబలిందని అందువలన దానికి స్పెయిన్‌ ఫ్లూ అని పేరు పెట్టారు.

Image result for wuhan hospital construction"
గత మూడువందల సంవత్సరాలలో తొమ్మిది సార్లు ప్రమాదకరంగా ఫ్లూ వ్యాపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి దేశంలోనూ సగటున మూడు సార్లు ఫ్లూ వచ్చినట్లు తేలింది. అలాంటి భయంకరమైన వాటిలో 2009లో వచ్చిన ఫ్లూ ఒకటి.దీన్నే స్వైన్‌ ఫ్లూ అని పిలిచారు. మన దేశాన్ని కూడా ఎలా వణికించిందో తెలిసిందే. ఇది తొలుత అమెరికా పక్కనే ఉన్న మెక్సికోలో బయట పడింది. ప్రపంచమంతటా పాకి జనాభాలో పదకొండు నుంచి 21శాతం మందికి సోకినట్లు, 1,51,700 నుంచి 5,75,400 మంది వరకు మరణించినట్లు తేలింది. ఎంతో అభివృద్ది చెందింది, వైద్య పరంగా ముందున్నదని చెప్పుకొనే అమెరికాలో స్వైన్‌ ఫ్లూ 2009-10లో నాలుగు కోట్ల 30లక్షల మంది నుంచి 8.9 కోట్ల మందికి సోకిందని అంచనా. వారిలో లక్షా 95వేల నుంచి నాలుగు లక్షల మూడువేల మంది వరకు ఆసుపత్రి పాలయ్యారని, 8,870 నుంచి 18,300 మంది వరకు మరణించారని అంచనా. మరొక సమాచారం ప్రకారం ప్రతి ఏటా అమెరికాలో సగటున ఫ్లూ కారణంగా కొన్ని సంవత్సరాల సగటు 25వేలు ఉండగా మరికొన్ని సంవత్సరాలలో 36వేల మంది మరణించారని తేలింది. ఒక ఏడాది తక్కువ, మరొక ఏడాది ఎక్కువ ఉండవచ్చు ఇది సగటు అని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పత్రిక వెల్లడించింది. కరోనాకు చైనా కారణం అని చెప్పేవారు అమెరికాలో జరిగే వాటికి కారకులు ఎవరని చెబుతారు ?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమెరికా ఎలాంటి సాయం చేయకపోగా అతిగా స్పందిస్తున్నదని దానిలో భాగంగానే ఏ దేశమూ చేయని విధంగా ఉహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు తీసుకొన్నదని చైనా విమర్శించింది. ఇది అనైతికం అయినా అమెరికా, దాన్ని సమర్ధించే మీడియా చర్యలు ఆశ్చర్యం కలిగించటం లేదు.