Tags
Aandhra Pradesh three Capitals, Amaravathi capital, Amaravati capital controversy, ap special status, BJP's capital logic, CM YS Jagan
ఎం కోటేశ్వరరావు
మూడు రాజధానుల రాజకీయం మరో మలుపు తిరిగింది. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనంలో గందరగోళం మరింత పెరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీని గురించి ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. నిజానికి ఇది రాజధాని మార్పును ఆమోదించటమూ కాదు, తిరస్కరించటమూ కాదు. ప్రస్తుతం ఉన్న స్ధితిని తెలియచేయటమే అన్నది ఒక అభిప్రాయం. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పటం వెనుక రాజకీయం లేకపోలేదు.
కేంద్ర బడ్జెట్ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఒకవైపు చెబుతారు, మరోవైపు మంచి బడ్జెట్ అని కితాబు, ప్రత్యేక హౌదా గురించి మరచిపొమ్మని మరోసారి పార్లమెంట్‌లో చెప్పిన తరువాత దాన్ని పరిశీలించాలని లేఖ రాయటం నక్కపోయిన తరువాత బక్క కొట్టుకున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. రాజధాని రాజకీయంలో జనసేన-బిజెపి ఏమి చేయనున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ఆ నిధులను ఎలా ఖర్చు చేశారన్నది ఒక ప్రశ్న. జనానికి కూడా అర్ధం కావటం లేదు. తాము ఇచ్చిన నిధుల ప్రకారం వాటిని నిర్మించిందీ లేనిదీ నిర్ధారించాలని, ఏ దశలో ఉన్నాయో తెలపాలని గానీ కేంద్రం ఇంతవరకు రాష్ట్రాన్ని కోరినట్లు జనానికి తెలియదు. చంద్రబాబు కొన్ని భవనాలను నిర్మించి వాటిలో తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దాని ప్రకారం వాటిలో కార్యాలయాలు తాత్కాలికం తప్ప భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించినవే.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు జనానికి చెప్పటమే తప్ప కేంద్రానికి అధికారికంగా ఇంతవరకు తెలియచేయలేదు. అందుకే వాటి గురించి మీడియాలో మాత్రమే చూశామని కేంద్రం చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో కూడా పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొని చర్యలను ప్రతిపాదించింది తప్ప రాజధానుల ఏర్పాటుగా వాటిని పేర్కొనలేదు. విజిలెన్స్ కమిషన్, ఎంక్వైరీస్ కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో తరలించకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. తన కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొనే సచివాలయాన్ని, హైకోర్టును తరలిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతున్నది. న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. అందుకే బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో పెద్ద తెలివితేటలేమీ లేవు.
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్ సర్కార్ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. ఇక 2015లో వెలువరించిన గజెట్ నోటిఫికేషన్ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్ నరసింహారావు చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న. కేంద్ర వైఖరి గురించి ఆయనకు ఉన్న సాధికారత ఏమిటి ? లేకపోతే బిజెపి-వైసిపి మధ్య కుదిరిన తెరవెనుక ఒప్పందానికి సూచికా, ఎలా అర్ధం చేసుకోవాలి. మొత్తం మీద రాజకీయ దోబూచులాట నడుస్తోంది.
బిజెపి నేతలను ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడగాలి. జివిఎల్ తర్కం ఒక్క అమరావతికేనా దేనికైనా వర్తిస్తుందా ? ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ముగిసిన అనేక అధ్యాయాలను తిరిగి తెరుస్తున్నది బిజెపి, జరిగిన తప్పిదాలను సరిచేస్తామని చెబుతున్నది ఆ పార్టీ, అలాంటపుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చేతులు రావటం లేదా ? ప్రత్యేక హోదా కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందనే సరికొత్త వాదనను బిజెపి నేత ముందుకు తెచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కార్పొరేట్లకు లక్షా 45వేల కోట్ల రూపాయల మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలోనే కేంద్రం ఎలా కట్టబెట్టగలిగింది? తాజా బడ్జెట్‌లో డివిడెండ్ పన్ను చెల్లింపు పన్నుతో సహా అనేక రాయితీలను తాజా బడ్జెట్‌లో ఎలా ప్రకటించారు. వాటికి లేని ఆర్ధిక ఇబ్బందులు ఆంధ్రప్రదే శ్ ప్రత్యేక హోదాకే వస్తాయా ? ప్రత్యేక హోదా డిమాండ్ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే పదేపదే ఈ డిమాండ్ లేవనెత్తితే జగన్ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జివిఎల్ అనటం బెదిరింపా మరోసారి అడగవద్దని హెచ్చరించటమా ?
చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్, కౌలాలంపూర్, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తేడా ఏమిటంటే చంద్రబాబు విదేశీ బూట్లు వేసుకుంటే జగన్ స్వదేశీ తగిలించుకున్నారు. చంద్రబాబు కార్పొరేట్ పరిభాషలో గతంలో తనను సిఇఓగా వర్ణించుకుంటే జగన్ ఫ్యూడల్ పద్దతిలో రాష్ట్రానికి తండ్రినని చెప్పుకున్నారు. విజయవాడ గేట్‌వే హౌటల్‌లో నిర్వహించిన హిందూ పత్రిక కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివ అద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఆరువందల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్యంలో చెన్నై ఒక రేవు పట్టణంగా ఎదిగింది, దానిని 1639లో బ్రిటీష్ వారు తీసుకున్నట్లు చరిత్ర, అదే విధంగా బెంగలూరు నగరం 1535లో, హైదరాబాద్ 1591లో ప్రారంభమైంది. స్వాతంత్య్రం రాకముందే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి. తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి అనేక సంస్ధలను నెలకొల్పారు. వాటి అభివృద్ధిలో అవి పధాన పాత్ర పోషించాయి. అమరావతిలో మౌలిక సదుపాయలకే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవుతుందని, అంతసొమ్ము తాము అక్కడ వెచ్చించలేమని చెబుతున్న జగన్ దానిలో పదోవంతు పదివేల కోట్లతో విశాఖలో సచివాలయం నెలకొల్పితే ఆ మూడు నగరాలతో పోటీబడి అభివృద్ధి చెందుతుందని చెప్పటం అంటే భ్రమలు కొల్పటం గాక మరేమిటి ? ప్రభుత్వ రంగంలో కేంద్రం, లేదా రాష్ట్రం పెట్టుబడులు పెట్టటాన్ని ఎప్పుడో నిలిపివేశాయి. ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు పోతాయి తప్ప మూడు రాజధానులు పెడితే పదమూడు జిల్లాలకు ఎలా చేరతాయి. ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయకుండానే, రాజధానిగాక ముందే విశాఖలో ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు కారణంగా, దానికి ఉన్న రేవు, ఇతర కారణాలతో అభివృద్ధి అయింది. రాబోయే రోజుల్లో కూడా అది కొనసాగుతుంది. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు విశాఖను తామే అభివృద్ధి చేశామని చెప్పుకొనే ఎత్తుగడ తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. ఒక సైబర్‌టవర్ నిర్మించి మొత్తం సైబరాబాద్‌ను, ఐటి పరిశ్రమను తానే తెచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. గొప్పలు చెప్పుకోవటంలో ఆయనతో జగన్ పోటీ పడదలచుకున్నారా ?
కేంద్ర బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిాజగన్ అభినందనలా ?
” ఏపీని ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ అసంత అప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని” సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దఅష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హౌదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్ మీద జనం అసంతృప్తి సరే ముఖ్యమంత్రి జగన్ సంగతేమిటి?
”ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వఅద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.” అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఒక వైపు రాష్ట్రానికి తండ్రినని చెప్పుకుంటారు. మరో వైపు మీ చర్యల కారణంగా మా పిల్లలు అసంతృప్తి చెందారు గానీ నేనైతే అభినందనలు చెబుతున్నా అన్నట్లు లేఖ ఉంది. పిల్లలకు జరిగిన అన్యాయానికి కనీసం నిరసన కూడా తెలపకుండా వేరే విషయాలకు అభినందనలు తెలిపే తండ్రిని ఏమనుకోవాలి? మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే ఉందే అని వెనకటికి ఎవరో అన్నట్లుగా లేదూ !
2020ా-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హౌదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని జగన్ కోరారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హౌదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హౌదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర అసంత అప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు.
బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కనీసం నిరసన తెలపరు, ఆర్ధిక సంఘం పరిధిలో ప్రత్యేక హోదా అంశం లేదని ముందే తెలిసి కూడా బడ్జెట్‌కు హారతులు పడుతూ ప్రత్యేక హోదా కల్పించాలని కోరటం భలే ఉందిలే ! ఇప్పటికే బిజెపి జనం చెవుల్లో పూలు పెట్టింది, ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ కూడా అంతకు మించి మరొకటి కాదు. మోడీగారికి పంపేందుకు పోస్టల్ ఖర్చు దండగ తప్ప లేఖలతో రాష్ట్రానికి ఒరిగేదేముంది ?
రాజధాని అమరావతి విషయమై జనసేన-బిజెపి ప్రకటించిన విజయవాడ లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేశాం అంటారు. మూడు రాజధానులకు పార్టీగా వ్యతిరేకం తప్ప తమ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుకూలం అంటుంది బిజెపి, ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేసేందుకు ఈ ద్వంద్వ మాటలు ? జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రం తోలు వలుస్తారా ? తాట తీస్తారా? పార్టీ నిర్వహణ నిధుల కోసమనే పేరుతో హీరోయిన్లతో తైతక్కలాడుతూ సినిమాలు తీస్తారా ?