Tags

, , , ,

Image result for coronavirus corporates making profit and loss impact assessment

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు చైనా తన సర్వశక్తులను వడ్డుతోంది.కరోనా లేదా మరొక వైరస్‌ దేనికీ జాతి, మతం, రంగు, ప్రాంతం, ఖండం అనే విచక్షణ ఉండదు, సరిహద్దులను అసలే ఖాతరు చేయదని గతంలో వ్యాప్తి చెందిన అనేక వైరస్‌లు నిరూపించాయి. అందువలన అలాంటి వాటిని నిరోధించేందుకు యావత్‌ దేశాలు కృషి చేయాల్సి వుంది. కానీ అమెరికా వంటి కొన్ని రాజ్యాలు సహకరించకపోగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తివలన చైనా, ప్రపంచానికి కలిగే ఆర్ధిక నష్టం గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. వాటి గురించి కూడా అతిశయోక్తులు, అర్ధ సత్యాలను వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రబుద్దులు చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి సోషలిస్టు వ్యవస్ధ మీద ఉన్న కసిని కరోనా పేరుతో తీర్చుకొని మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఒకవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు దాన్నుంచి లాభాలను ఎలా పిండుకోవాలా అని ఔషధ దిగ్గజ సంస్ధలు చూస్తున్నాయి.
ఆర్ధిక నష్టం గురించి ఎవరూ ఇదమిద్దంగా అంచనా వేయలేదు. వైరస్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేరు. కరోనాతో నిమిత్తం లేకుండానే సోవియట్‌ యూనియన్‌ మాదిరి చైనా సోషలిస్టు వ్యవస్ధ కూడా కుప్పకూలిపోతుందని అనేక మంది కలలు కన్నారు, ఆకాంక్షించారు. ముహార్తాలు కూడా పెట్టారు. అవి నిజం గాకపోవటంతో నీరసపడిపోయారు. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వారిని నీరసపరచటం ఖాయం.
ప్రపంచ కార్పొరేట్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ‘ ఆసియా నిజమైన వ్యాధిగ్రస్ధ చైనా ‘ శీర్షికతో వాల్టర్‌ రసెల్‌ మీడ్‌ అనే ఒక కాలేజీ ప్రొఫెసర్‌ తనలో ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కాడు. చైనీయులు మురికి, రోగిష్టి మనుషులనే గత కాలపు పశ్చిమ దేశాల దురహంకారం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇది ఒక సూచిక. దీని మీద తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది, చైనా అధికారికంగా నిరసన కూడా తెలిపింది. వాటి మీద వ్యాఖ్యానించేందుకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిరాకరించింది. శ్వేతజాతీయులకు వచ్చే రోగాల కంటే చైనీయులు, ఇతర ఆసియావాసులకు వచ్చే జబ్బులు ప్రమాదకరమైన వంటూ పందొమ్మిదవ శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వారు జాత్యంహకారం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనాను కూడా చైనా జాతికి అంటకట్టే ప్రయత్నం జరుగుతోంది.
చైనా నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15వరకు వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు, తరువాత తగ్గుముఖం పడుతుంది. మేనెల మధ్యనాటికి పూర్తిగా అదుపులోకి వస్తుంది.ఈ లోగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు జరిగే పరిమిత హాని తరువాత కాలంలో పూడ్చుకోవచ్చు. ఎంత ప్రభావం పడినా చైనా జిడిపి 5.6-5.8శాతం మధ్య వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

Image result for coronavirus, corporates cartoons
కరోనా వైరస్‌ ప్రస్తుతం సోకిన ప్రాంత విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70శాతం ఉహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణించిన వారిలో 97శాతం మంది ఈ రాష్ట్రానికి చెందిన వారే. తరువాత తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లో వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే బీజింగ్‌, షాంఘై నగరాలలో ఒక్కొక్కరు మాత్రమే మరణించారు. చైనా జిడిపి తొలి మూడు నెలల్లో 5.2శాతం ఉంటుందని, తరువాత ఏడాది మొత్తం 5.8శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కనిష్టంగా తొలి త్రైమాసికంలో 4.8శాతం, మొత్తం ఏడాదిలో 5.5శాతం ఉంటుందని మరొక అంచనా.చైనాలో అందరూ చెబుతున్నంత అభివృద్ధి లేదని, అంకెల గారడీ చేస్తారని చెప్పే నోళ్లు దీని గురించి ఏమంటాయో తెలియదు.
ఉహాన్‌ పరిసర ప్రాంతాలలో ఆటో, టెలికమ్యూనికేషన్స్‌,ఎలక్ట్రానిక్స్‌, బయోమెడిసిన్‌ సంబంధమైనవి పెద్ద పరిశ్రమలు.హుబెరు రాష్ట్రం, ఉహాన్‌ నగర ప్రాధాన్యత ఏమంటే దేశం మధ్యలో ఉండటంతో రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు, టూరిజం వంటి సేవారంగం కీలకమైన అంశాలు. ఒకసారి వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అవన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటాయి.
2003లో సారస్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా కేవలం ఐదుశాతమే, ఇప్పుడు 16శాతానికి పెరిగినందున ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో స్ధానిక వినియోగం పెరగటం ఒకటి. అందువలన మార్కెట్‌ చోదిత పెట్టుబడులు వెనక్కు పోవటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. చైనాలో కార్మికుల వేతనాలు పెరగటం తదితర ఉత్పాదక ఖర్చుల పెరుగుదల కారణంగా లాభాలు తగ్గి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులలో 70శాతం ఉత్పాదక రంగం నుంచి సేవారంగానికి మరలాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత సేవారంగం తిరిగి పుంజుకుంటుంది. అందువలన తాము ఎలాంటి ఆందోళనకు గురికావటం లేదని చైనీయులు చెబుతున్నారు. ఇప్పటికే గట్టిగా తట్టుకొని నిలిచిన తమ సమాజాన్ని వ్యాధి గ్రస్త దేశమని నోరు పారవేసుకుంటున్నవారు త్వరలో వైరస్‌ను ఎలా ఓడిస్తామో కూడా చూస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు.
చైనా వ్యాధి నిరోధకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో స్పానిష్‌ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి సమయంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. హుబెరు రాష్ట్రం, పరిసర ప్రాంతాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసి వ్యాధి వ్యాపించకుండా చూస్తున్నది. వారికి అవసరమైన ఇతర సాయం చేస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఇండ్లకే పరిమితం అయితే అది ఆర్దిక వ్యవస్ధ మీద, ప్రభుత్వ ఖజానా మీద ప్రభావం చూపకుండా ఎలా ఉంటుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా, విడివస్తువులను అందచేసే గొలుసులో ఒక ప్రధాన లంకెగా ఉన్నందున ఆ గొలుసులో ఉన్న ఇతర దేశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఎలా ఉంటాయి. కనుకనే కార్ల నుంచి వీడియో గేమ్‌ల వరకు ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగితే తీవ్ర నష్టం జరగనుందని అనేక దేశాలు భయపడుతున్నాయి. అయితే జరిగే నష్టం, పడే ప్రభావం ఎంత ఉంటుందో ఎవరూ ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. లండన్‌ కేంద్రంగా పని చేసే కాపిటల్‌ ఎకనమిక్స్‌ అనే సంస్ధ ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 280బిలియన్‌ డాలర్ల మేర నష్టం కలిగించవచ్చని అంచనా వేసింది.
షాంఘై, హాంకాంగ్‌లోని వినోద కేంద్రాలను గత వారం రోజులుగా మూసివేసిన కారణంగా రెండవ త్రైమాసికంలో తమ ఆదాయం 17.5కోట్ల డాలర్లు తగ్గిపోవచ్చని డిస్నీ ఆర్ధిక అధికారి చెప్పారు.చైనా నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయదలచిన ఐదు చిత్రాలను నిలిపివేసినట్లు కెనడా కంపెనీ ఐమాక్స్‌ పేర్కొన్నది. చైనాలోని మకావో దీవిలో 41కాసినోలను మూసివేశారు. వీటిలో ఎక్కువ భాగం అమెరికా జూదశాలలే. ప్రతి రోజూ తమకు 24 నుంచి 26 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టమని వయన్‌ రిసార్ట్స్‌ తెలిపింది.
ఆపిల్‌,క్వాల్‌కామ్‌ కంపెనీలు తమ నష్టాలను అంచనా వేస్తున్నాయి. హుండరు వంటి కార్ల కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు ఆలస్యమయ్యే కారణంగా దక్షిణ కొరియాలో ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలిక మూసివేస్తున్నట్లు తెలపింది. చైనాలో పరిస్ధితులు మెరుగుపడుతున్నట్లు చైనా ప్రభుత్వం చెప్పగానే వారం రోజులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డైల్మర్‌, ఓక్స్‌వాగన్‌ ప్రకటించాయి. విడిభాగాల సరఫరా అంతరాయం కారణంగా ఐరోపాలోని తమ ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం ఉంటుందని ఫియట్‌ ఛిస్లర్‌ పేర్కొన్నది.
గత కొద్ది వారాలుగా అనేక విమాన సంస్ధలు చైనా సర్వీసులను రద్దు చేశాయి, వాటి నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎయిర్‌ చైనా ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోనుంది.స్టార్‌బక్స్‌ మెక్‌డోనాల్డ్‌ వంటి సంస్ధలు అనేక దుకాణాలను తాత్కాలికంగా మూసివేశాయి, మొత్తంగా చూస్తే తమ లాభాల మీద ప్రభావం పెద్దగా పడదని అంటున్నాయి.
వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలలో కార్మికుల కొరత కారణంగా వేతనాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన సంవత్సరాది సెలవులు, ఇదే సమయంలో వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఇండ్లకు పరిమితమై విధుల్లోకి రాని కార్మికులకు పొడిగించిన సెలవు రోజులకు సైతం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి పర్యాటకులను అనుమతించరాదని థారులాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన విహారయాత్రల రంగానికి 10కోట్ల డాలర్ల మేర నష్టమని అంచనా వేశారు.
వైరస్‌ వార్తలు వెలువడిన తరువాత న్యూయార్క్‌, లండన్‌లోని చమురు మార్కెట్‌లో ధరలు 15శాతం పడిపోయాయి. చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలున్న రష్యా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, గల్ఫ్‌ , ఇతర దేశాలకు, చివరికి అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలకు కూడా ఆ మేరకు నష్టం ఉండవచ్చు. ఇదే సమయంలో దిగుమతులపై ఆధారపడిన చైనాకు దిగుమతి బిల్లుతో పాటు అంతర్గతంగా చమురు డిమాండ్‌ తగ్గిపోయి అక్కడి ఆర్ధిక వ్యవస్ధకు ఆమేరకు లబ్ది కూడా చేకూరనుంది.
అమెరికా-చైనా మధ్య కుదిరిన సర్దుబాటు అవగాహన మేరకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెరిగే అవకాశాలకు ఇప్పుడు పరిమితంగా అయినా గండి పడింది. వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడితే ఆ మేరకు తమకు ఉపాధి, ఇతరత్రా మేలు జరుగుతుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ సంతోషం వ్యక్తం చేశారు, అయితే మొత్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధకూ ప్రతికూలమే అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. చైనా యువాన్‌ విలువ పడిపోతే అది అమెరికాకు దెబ్బ.

Image result for coronavirus political cartoons
చైనాతో పెద్దవ్యాపార భాగస్వామిగా ఉన్న మనదేశం మీద పడే ప్రభావం గురించి కూడా కార్పొరేట్‌ సంస్ధలు మదింపు వేస్తున్నాయి. మన దేశం గతేడాది మొత్తం దిగుమతుల్లో 14శాతం చైనా నుంచి తీసుకోగా ఎగుమతుల్లో మన వస్తువులు ఐదుశాతం చైనా వెళ్లాయి. ఆకస్మిక పరిణామంగా వైరస్‌ వ్యాప్తి వలన వెంటనే దిగుమతుల ప్రత్నామ్నాయం చూసుకోవటం అంత తేలిక కాదు, అదే సమయంలో పరిమితమే అయినా అసలే ఇబ్బందుల్లో ఉన్న మన ఆర్ధిక పరిస్దితి మీద ఎగుమతులు తగ్గితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌మీద ప్రభావం ఎక్కువ. చైనా నుంచి పర్యాటకులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినందున ఆ రంగం మీద ప్రభావం తీవ్రంగా పడవచ్చు, విమానరంగం కూడా ప్రభావం కానుంది. చైనాలో వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో సినిమా ధియేటర్లను మూసివేసినందున బాలీవుడ్‌ కూడా ఏంతో కొంత నష్టపోనుంది. అసలే కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు నిలిచిపోతే నష్టం ఇంకా పెరుగుతుందనే అందోళన ఉంది.
కరోనా వైరస్‌ గురించి ఒకవైపు అతిశయోక్తులు, చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు దాన్నుంచి లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నాయి. వ్యాధుల నివారణ, చికిత్సకు వాక్సిన్‌లు, ఔషధాల తయారీ అవసరమే అయితే అయితే చరిత్రను చూసినపుడు జన కల్యాణం కోసం గాక కాసుల కోసమే కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నించాయి. కరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అందుకోసం వంద కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పోలాండ్‌ నిపుణుడు ఒకరు చెప్పగా మరొక అంచనా 150 కోట్ల డాలర్ల వరకు ఉంది. అది ఎంతో ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, తక్షణమే అది ఉపయోగంలోకి రాకపోయినా భవిష్యత్‌లో నష్టాల నివారణకు తోడ్పడుతుంది. అయితే ఇలాంటి వైరస్‌ల నిరోధానికి వాక్సిన్‌ల తయారీ యత్నాలు గతంలో పెద్దగా ముందుకు సాగలేదు. 2003లో వచ్చిన సారస్‌, 2012లో తలెత్తిన మెర్స్‌కే ఇంతవరకు తయారు కాలేదు. ఎబోలా వాక్సిన్‌ పరిస్దితీ అంతే. గతేడాది ఆమోదం పొందిన వాక్సిన్‌ మీద ప్రయోగాలు చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.