Tags
Arvind Kejriwal, BJP, BJP motor mouths, Delhi election result, Delhi Polls, political polarization
ఎం కోటేశ్వరరావు
నోటి తుత్తర గాళ్లు మీడియా ముందు నోరు మూసుకొంటే మంచిదని రెండు సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అదంతా జుమ్లా అని రుజువైంది. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తారని చేసిన నరేంద్రమోడీ వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తే అది జుమ్లా పట్టించుకోవద్దు అని మోడీ ఆత్మ అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదో చెబుతుంటాం, జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అన్నది జుమ్లా అనే ఉర్దూపదానికి భాష్యం. ఢిల్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతల నోటితుత్తరను యావత్ ప్రపంచమూ చూసింది.
మోడీ భజన టీవీ ఛానళ్లతో సహా అన్నీ ఢిల్లీ గద్దె మీద తిరిగి అరవింద్ కేజరీవాల్‌నే ప్రతిష్టించేందుకు జనం నిర్ణయించుకున్నారని ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఏ పార్టీకి ఓటు వేసినా అది కమలం గుర్తుకే పడేట్లుగా ఓటింగ్ యంత్రాల్లో మార్పులు చేస్తారనే ప్రచారాన్ని నేను విశ్వసించను గానీ, అనేక మంది అనుమానిస్తున్నట్లుగా అసలు యంత్రాలనే మార్చివేసి కొత్తవాటిని పెట్టి తీర్పును వమ్ము చేస్తే తప్ప ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు తధ్యం. ఎందుకంటే బిజెపి వారు ఎంతకైనా తెగిస్తారని అనేకసార్లు స్పష్టమైంది.
దేశమంతటా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న వారికి దేశపాలనా కేంద్రంలో అధికారం లేకపోతే తలకొట్టేసినట్లు అవుతుంది. అందుకే ప్రధాని మొదలు గల్లీ నేతల వరకు ఎన్ని పాట్లు పడ్డారో చూశాము. జాత్యంహంకార ఉన్మాదాన్ని రెచ్చగొట్టినపుడు అనేక దేశాల్లో ఎలాంటి ప్రమాదకర ధోరణులు వ్యక్తమయ్యాయో, గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన మతోన్మాదం ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. ఈ ఉన్మాదం కేవలం ముస్లింలకే పరిమితం అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్లే. మతం, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమతో విబేధించే అంశాలన్నింటినీ శాసించేందుకు మతోన్మాదం పూనుకుంటుంది.
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటుంది.బిజెపినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ పుత్రరత్నమైన పరవేష్ వర్మ పశ్చిమ ఢిల్లీ బిజెపి ఎంపీ. ఎన్నికల సమయంలో కేజరీవాల్‌ను ఉగ్రవాది అని నిందించాడు, షాహిన్‌బాగ్‌లో గుడారాలు వేసిన వారు మీ ఇండ్లలోకి ప్రవేశించి మీ కూతుళ్లను, అక్కచెళ్లళ్ల మీద అత్యాచారాలు చేస్తారు, వారిని చంపేయండి, అక్కడ నిరసన తెలుపుతున్న వారికి కేజరీవాల్ బిర్యానీలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారని నోరు పారవేసుకున్నందుకు ప్రచారంలో పాల్గనకుండా రెండు సార్లు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. చివరికి ఓటింగ్ జరుగుతున్న సమయంలో సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను విడుదల చేస్తూ షాహిన్‌బాగ్ జనం పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచారు, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన బిర్యానీ తిని, ఇచ్చిన డబ్బులు తీసుకొన్న వారందరూ రుణం తీర్చుకొనేందుకు ఆ పార్టీకే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. దానికి ప్రతిగా ఇండ్లలో ఉన్న జాతీయవాదులంతా బయటకు రావాలి. మీరు దేశానికి ఎంతో రుణపడి ఉన్నారు. పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచి జాతీయ పార్టీకి ఓటు వేయాలి, అది మాత్రమే చాలదు తమ గుర్తింపు కార్డులను చూపుతూ జై శ్రీరామ్ అని నినాదాలు చేయాలి, దేశభక్తియుత పార్టీకే ఓటు వేస్తామని చెప్పాలి అని దానిలో పేర్కొన్నాడు. మత విద్వేషాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం గాక దీన్నేమనాలి.
అంతే కాదు కర్ణాటక బిజెపి కూడా రెచ్చగొట్టే ట్వీట్లు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలు కాగితాలను (ఆధారాలను) చూపబోము అనే నినాదాన్ని ప్రదర్శిస్తు నిలుచున్న ఫొటోలను చూపుతూ మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి, రేపు ఎన్‌పిఆర్ సందర్భంగా ఇవ్వాల్సి వస్తుందంటూ ట్వీట్లు చేశారు. ఇది మతదురభిమానం తప్ప మరొకటి కాదు. ఒక వైపు ఎన్‌పిఆర్‌కు ఎలాంటి ఆధారాలూ చూపనవసరం లేదని మోడీ సర్కార్ చెప్పేదానికి ఇది విరుద్దం. ఎన్‌పిఆర్, ఎన్‌సిఆర్ గురించి బిజెపి ఏమి చెప్పినప్పటికీ ఆధారాలు లేవనే పేరుతో తమను ఇబ్బందులు పెడతారని ముస్లింలు, సంచార జాతులు, గిరిజనులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఆందోళన చెందుతున్న తరుణంలో అధికార పార్టీ నుంచి ఇలాంటి ట్వీట్లు వెలువడటం వారి కడుపులో ఏముందో వెల్లడి చేస్తున్నది.
ఢిల్లీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు బిజెపి నేతలు రెచ్చగొట్టుడు ప్రచారానికి ప్రభావితులైన వారు ఎలా ప్రవర్తిస్తారో చూశాము. అలాంటి పరిస్ధితినే బిజెపి కోరుకుంటోందని అనేక మంది భయపడుతున్నది నిజమే అని వెల్లడి అయింది. ఈనెల ఐదవ తేదీ రాత్రి రాజస్ధాన్‌కు చెందిన కవి,రచయిత బప్పతీయ సర్కార్ ముంబైలో తన స్నేహితుడిని కలుసుకొనేందుకు ఉబెర్ కాబ్‌ను బుక్ చేసుకున్నాడు. ప్రయాణ సమయంలో తన స్నేహితుడితో ఫోన్‌లో దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి, జైపూర్‌లో ఎలా నిర్వహించాలో చర్చించాడు. కారు డ్రైవర్ రోహిత్ సింగ్ ఆ మాటలు విన్నాడు. గమ్యస్ధానం బదులు శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. కొద్ది సేపటిలో వస్తానని చెప్పి ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకు వచ్చాడు. తన కారులో ఒక కమ్యూనిస్టు ఎక్కాడని, దేశాన్ని ఎలా తగులబెట్టాలో ఇతరులతో చర్చించాడని,దేశం మొత్తాన్ని షాహిన్‌బాగ్‌గా మార్చేందుకు చూస్తున్నాడని, తాను ఆ మాటలన్నింటినీ రికార్డు చేశానని కాబ్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఇదెక్కడి విడ్డూరమయ్యా బాబూ అని డ్రైవర్‌ను ప్రశ్నిస్తే మీరు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ? నేను గాబట్టి వేరే చోట్లకు తీసుకుపోకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చాను సంతోషించండి అని డ్రైవర్ సమాధానమిచ్చినట్లు సర్కార్ తెలిపాడు. పోలీసులు రెండున్నర గంటల పాటు రచయితను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆయన రచనలు,ఇ తర విషయాల గురించి అనేక రకాలుగా ప్రశ్నించి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వదలి పెట్టారు.
భిన్నాభిప్రాయం కలిగి ఉండటం, వ్యక్తం చేయటం దాని ప్రాతిపదికన నిరసన వ్యక్తం చేయటాన్ని దేశద్రోహంగా బిజెపి, ఇతర సంఘపరివార్ శక్తులు చేస్తున్న ప్రచారం ఎలాంటి ప్రభావం కలిగిస్తోందో ఈ ఉదంతం తెలియ చేస్తోంది. అదే డ్రైవర్‌కు ఉన్మాద స్దాయి మరింత పెరిగి ఉంటే రచయిత సర్కార్ పరిస్ధితి ఏమై ఉండేదో ఊహించుకోవటానికే భయమేస్తోంది.
ఢిల్లీలో షాహిన్‌బాగ్ శిబిరం వద్దకు వచ్చిన యువకుడు కపిల్ గుజ్జార్ నిరసన కారులను దూషిస్తూ చంపివేస్తానంటూ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం తెలిసిందే. అతడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అంటూ వెంటనే పోలీసులు ఒక ఫొటోను విడుదల చేసి బిజెపి ఎన్నికల ప్రచారానికి తోడ్పడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీయే అతని చేత అలా చేయించిందని చెప్పటంలో పోలీసులు బిజెపితో కుమ్మక్కయ్యారు. అలా ప్రకటించటం నిబంధనావళికి విరుద్దం. తీరా చూస్తే తమ కుమారుడు నరేంద్రమోడీ భక్తుడు, అమిత్ షా అభిమాని తప్ప అరవింద కేజరీవాల్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కపిల్ తండ్రి, సోదరుడు మీడియాతో చెప్పారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అందరికీ తమ టోపీలు పెట్టి ఓట్లు అడిగిందని, ఆ సందర్భంగా తీసిన ఫొటోను పోలీసులు విడుదల చేశారని, తమ కుటుంబానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ కుమారుడు ఎప్పుడూ హిందుస్తాన్, హిందుత్వ గురించి మాట్లాడుతూ ఉంటాడని కూడా తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి ఎలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుందో ఈ ఉదంతం వెల్లడించింది.
మనకు గిరిరాజ్ సింగ్ అనే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. నోటి నుంచి ఒక్కటీ సరైన మాట రాదు. బహుశా ఆయన నోట్లో పుట్టే విద్వేష వైరస్‌లు అలా మాట్లాడిస్తూ ఉండి ఉండాలి. షాహిన్‌బాగ్ ఆత్మహత్యా దళాలను తయారు చేసే కేంద్రంగా మారిందని ఢిల్లీ ఎన్నికల సమయంలో నోరు పారవేసుకున్నాడు. షాహిన్‌బాగ్‌లో ఒక మహిళ మరణించిన తన కుమారుడు అమరజీవి అంటోంది, ఆత్మహాత్యాబాంబరు కాకపోతే ఏమిటిది అని కూడా ప్రశ్నించాడా పెద్ద మనిషి.
షాహిన్ బాగ్‌లో పాకిస్ధాన్ ప్రవేశించిందని, ఎన్నికలు భారత్-పాకిస్దాన్ మధ్య పోటీగా జరగాలని కపిల్ మిశ్రా అనే బిజెపి అభ్యర్ధి ప్రకటించారు. అలాంటి వారందరికీ ఉపదళపతి అమిత్ షా ఎన్నికల్లో మాట్లాడినదేమిటి ? ఢిల్లీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య పోటీ కాదు. షాహిన్‌బాగ్‌కు మద్దతు ఇస్తున్న రాహుల్ బాబా-కేజరీవాల్ మరియు దేశాన్ని రక్షిస్తున్న ప్రధాని మోడీ మధ్య పోటీ అని చెప్పారు.
మతోన్మాద భావజాలం తలకెక్కిన గుంజా కపూర్ అనే ఒక జర్నలిస్టు తానెవరో బయట పడకుండా ఉండేందుకు బుర్ఖా తగిలించుకొని షాహిన్ బాగ్ శిబిరంలో ప్రవేశించింది. నిజానికి ఆ శిబిరానికి ఎందరో ఆందోళనతో విబేధించే వారు కూడా సందర్శనకు వచ్చారు గానీ ఎవరూ ఇలాంటి ముసుగులతో రాలేదు. బహుశా అంతకు ముందు జెఎన్‌యులో ముసుగులు వేసుకొని దాడులు జరిపిన ఎబివిపి, వారి మద్దతు దారులనుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. అనుమానం వచ్చిన షాహిన్‌బాగ్ మహిళలు అడిగిన ప్రశ్నలకు తడబడటంతో సదరు కాషాయ జర్నలిస్టు అసలు రూపాన్ని బహిర్గతం చేసి మర్యాదగా పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు తుపాకి ధరించిన ఒక వ్యక్తిని శిబిరంలోని వారు పట్టుకున్న విషయం, మరో సందర్భంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్ మీద వెళుతూ శిబిరం సమీపంలో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయిన సంగతి తెలిసిందే.
జరియాను షరియాగా చిత్రించిన బిజెపి నేత
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అమంతుల్లా ఖాన్ షరియా చట్టాన్ని అమలు జరపాలని కోరాడంటూ బిజెపి నేత సంబిత్ పాత్ర వక్రీకరించారు.హమ్ జరియా బనాయేంగే(మనం ఒక మార్గాన్ని కనుగొనాలి) అని వాడిన పదజాలాన్ని షరియా(ఇస్లామిక్ చట్టం)గా పేర్కొని సంబిత్ పాత్ర వక్రీకరించారు.ఇలాంటి పనులు చేయటం పాత్రకు అలవాటే. ఉత్తర ప్రదే శ్ కాంగ్రెస్ నేత ఒకరు కేసు కూడా నమోదు చేశారు.
భావోద్వేగాలను ముందుకు తేవటంలో, వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవటం మీద ఉన్న శ్రద్ద దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపచటం,జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద లేదని ఆరేండ్ల పాలన రుజువు చేసింది. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, అన్ని అంశాలను వివరించేందుకు తప్పలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె స్వయంగా ఇబ్బంది పడి చివరి పేజీలను చదవకుండా వదలి వేశారు. అన్నింటికంటే ఆ బడ్జెట్ అసలు సమస్యల జోలికిపోలేదు.
ముందే చెప్పుకున్నట్లు బ్యాలట్ బాక్సుల తారుమారుకు పాల్పడకపోతే ఎన్నికలకు ముందు, తరువాత సర్వేల ప్రకారం ప్రకారం ఆమ్ ఆద్మీ అధికారానికి వస్తే దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. 2014లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం తరువాత మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్ధానాలను తిరిగి గెలుచుకుంది.ఆమ్ ఆద్మీ పద్దెనిమిదిశాతం ఓట్లతో మూడవ స్ధానంలో కాంగ్రెస్ 22శాతం, బిజెపి 56శాతం ఓట్లతో ముందంజలో ఉంది.ఎనిమిది నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైతే తమకు ఎదురులేదని అని ఛాతీ విరుచుకొనే వారు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పటికే మోడీ మీద అనేక మందిలో భ్రమలు తొలిగాయి, భావోద్రేకాలు లేదా భావోద్వేగాలతో ఓటు వేసిన వారిలో కూడా ఢిల్లీ ఎన్నికలు పునరాలోచనకు, నూతన రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతాయి. ఒక వేళ ఎన్నికలను తారు మారు చేస్తే ఆ పరిణామం కూడా కొత్త సమీకరణలకు మరో రూపంలో నాంది పలుకుతుంది.