Tags

, , , , , ,

Image result for chamcha channels-journalist chamcha cartoons
ఎం కోటేశ్వరరావు
ఇటీవలి కాలంలో మీడియా పాత్ర వివాదాస్పదం అవుతోంది, ఇదే సమయంలో మీడియా యాంకర్ల ప్రవర్తన కూడా అంతకంటే వివాదాస్పదం, కొన్ని సందర్భాలలో జుగుప్సాకరంగా తయారవుతోంది. రాజును మించిన రాజభక్తి మాదిరి యాజమాన్యాల వైఖరికి అనుగుణ్యంగా తాన్వొక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరించటం ఒక పద్దతి. దాన్ని మించి యాంకర్లు స్వయంగా రెచ్చిపోవటం పెరిగిపోతోందంటే అతిశయోక్తి కాదు. ఇది జాతీయ ఛానళ్లకే కాదు, కొన్ని తెలుగు వాటికి కూడా ఈ జబ్బు అంటుకొని కొందరు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తాజా ఉదంతాలకు వస్తే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కొందరు యాంకర్ల తీరు జర్నలిస్టు లోకానికే కళంకం, వృత్తి ప్రమాణాలు, నైతికనియమావళికే విరుద్దం. ఇలా చెబుతున్నామంటే అన్ని ఛానళ్లు, యాంకర్లు అందరూ అలా ఉన్నారని కాదు. పురుషుల్లో పుణ్యపురుషులుంటారయా అన్నట్లుగా ఛానళ్లు, యాంకర్లలో కూడా అలాంటి వారు ఉన్నారు కనుకనే మీడియాకు ఇప్పటికీ విశ్వసనీయత మిగిలి ఉంది.
జి న్యూస్‌ ఎడిటర్‌ మరియు యాంకర్‌గా పని చేస్తున్న సుధీర్‌ చౌదరి జిందాల్‌ కంపెనీని వంద కోట్ల రూపాయల ప్రకటనల కోసం బొగ్గుకుంభకోణంలో బ్లాక్‌మెయిల్‌ చేసిన ఉదంతం తెలిసిందే. ఆ కేసులో పోలీసు కస్టడీలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చిన పెద్దమనిషి, పక్కా బిజెపి మనిషి అని అందరికీ తెలుసు. ఒక యాంకర్‌కు బిజెపి కార్యకర్తకు ఉన్న తేడాను చెరిపి వేశాడు. చివరికి బిజెపి కార్యకర్తలు లేదా నేతలు కూడా ప్రయివేటు సంభాషణల్లో ఏ అంశం గురించి అయినా ఎంత చెత్త మాట్లాడినప్పటికీ బహిరంగంగా అందునా టీవీ ఛానళ్లలో అలా మాట్లాడేందుకు సాహసించరు. కానీ యాంకర్‌ ముసుగులో అతగాడు అన్ని రకాల గీతలను చెరిపివేశాడు. హద్దులు మీరి వ్యవహరించాడు. అలాంటి వ్యక్తిని ఎడిటర్ల సంఘం ఏమి చేస్తుందో తెలియదు. ఒక వేళ ఏదైనా చర్యకు సాహసిస్తే సదరు సంఘం ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని భయపడుతుందేమో !
కునాల్‌ కమ్రా అనే ఒక కమెడియన్‌ ఒక రోజు తాను ప్రయాణిస్తున్న విమానంలో రిపబ్లిక్‌ టీవీ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామిని చూసి టీవీ చర్చల్లో ఎదుటి వారి మీద ఎందుకలా విరుచుకుపడతావు, అదేం పద్దతి అంటూ చెడామడా కడిగేశాడు. ఆర్నాబ్‌ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. అయితే సదరు విమాన పైలట్‌ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే కునాల్‌ను ఆ విమాన కంపెనీతో పాటు మరో మూడు సంస్ధలు తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. కునాల్‌ కమ్రా బిజెపిని విమర్శిస్తాడు , ఆర్నాబ్‌ గోస్వామి అడ్డగోలుగా సమర్ధిస్ధాడు కనుక కేంద్ర ప్రభుత్వ మౌఖిక లేదా ఇతర ఆదేశాలతో ఈ చర్య తీసుకున్న విషయం తెలిసిందే. సుధీర్‌ చౌధురి మీద కూడా ఎడిటర్ల సంఘం చర్య తీసుకుంటే మరో రూపంలో సంపాదకులు ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావచ్చు.

Image result for chamcha channels-delhi polls
ఇక సుధీర్‌ చౌధురికి ఢిల్లీ జనం ఏడాది కాలంలో రెండు రకాలుగా కనిపించారు. ముందుగా గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జనం ఎలా కనిపించారో చూద్దాం ” ఈ రోజు మోడీ మద్దతుదారులు సంతోషంగా ఉండి ఉండాలి. మరోవైపు మోడీ వ్యతిరేకులు విచారిస్తూ ఉండి ఉంటారు. వ్యతిరేకించేవారి బుర్రల్లో తప్పుకుండా ఆ ఒక్క వాక్యం తప్పక ఉండాలి, నాకు నిజం చెప్పండి ఇది నిజం కాదా” అని వ్యాఖ్యానించిన పెద్ద మనిషి ఢిల్లీ జనం మోడీ మద్దతుదారుల్లో లేరని చెప్పలేదు.
కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నరేంద్రమోడీ అండ్‌కోకు దిమ్మదిరిగే విధంగా ఉండబోతున్నాయనే సూచనలు వెలువడగానే కల్లుతాగిన కోతిలా మారిపోయాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. అవమానించాడు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం వాటి సారాంశం ఇలా ఉంది.” ఢిల్లీ ఓటర్లకు ఏ సమస్య పట్టింది, ఏది పట్టలేదు అని అతనే ప్రశ్న వేసుకున్నాడు. దానికి తానే సమాధానం చెప్పుకుంటూ వారు సొమ్ము చెల్లించి ఏదీ పొందాలనుకోవటం లేదు, అన్నీ ఉచితంగా ఇచ్చే పార్టీలను కోరుకుంటున్నారు. ఢిల్లీ జనం సోమరిపోతులు. వారి సగటు ఆదాయం రూ30,000 అయినా అన్నీ ఉచితంగా కావాలని కోరుకుంటారు. అందరూ చదువుకున్నారు, కార్లు, ద్విచక్రాలు ఎక్కువ మందికి ఉన్నాయి, అయినా ఓటింగ్‌కు రారు.సామాజిక మాధ్యమ ఎన్నికల్లోనే వారు పాల్గొంటారు.
ఢిల్లీ జనం కేవలం ఉచితం కోసమే చూస్తారు, ఇందుకోసం వారే మిగతా దేశం గురించి పట్టించుకోరు,హిందుస్ధాన్‌-పాకిస్ధాన్‌ పట్టదు, కాశ్మీర్‌ పట్టదు, రామమందిరాన్ని పట్టించుకోరు, ఇంకా ఏవైనా ఇతర జాతీయ సమస్యలున్నా వాటినీ లెక్కచేయరు. మొఘల్‌ పాలన తిరిగి వస్తుంది. రామమందిరం, ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ ఇవేవీ ఢిల్లీ జనం దృష్టిలో అర్ధం లేనివి, దేశం ముక్కలవుతున్నా వారికి పట్టదు. వారికి రోజూవారీ జీవితాలే ముఖ్యం. మిగతా దేశం ఏమైనా వారు లెక్కచేయరు. ఈ జాతీయ సమస్యలను టీవీలలో చూడటం, పత్రికల్లో చదవాల్సినవి తప్ప తమకు గొప్పవి కాదని ఢిల్లీ జనం చెబుతున్నారు. మనం ఎక్కడికైనా పార్టీకి పోతే తాగుతాము ఇలాంటి విషయాలను చర్చించుకుంటాము, అదే మనం ఓటు వేయటానికి పోతే మాత్రం మనకు ఉచితంగా ఏమి వస్తుందా అని చూస్తాము, తాము సోమరిపోతులమని ఢిల్లీ జనం రుజువు చేశారు.”
ఇక్కడ గమనించాల్సిందీ, సుధీర్‌ చౌధురి వంటి వారు కళ్లుండీ చూడలేనిదీ, చెవులుండీ వినిపించుకోనిదీ మెదడుండీ అర్ధం చేసుకోనిదీ ఏమంటే కాలేజీలకు వెళ్లే యువతులకు ఉచితంగా సైకిళ్లు, ఎలక్ట్రానిక్‌ స్కూటర్లను ఉచితంగా ఇస్తామని ఢిల్లీ బిజెపి ఎన్నికల మానిఫెస్టో పేర్కొన్నది. అంతే కాదు మోడీ సర్కార్‌ స్వయంగా ఉచితంగా మరుగుదొడ్లు, ఎల్‌ఇడి బల్బులు, గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు గత ఐదు సంవత్సరాలుగా ప్రచారం చేసుకుంటున్న విషయం మరిచిపోయినట్లు నటిస్తున్నాడా ?
ఇలాంటి జర్నలిస్టులు చర్చలను ఎలా నడుపుతారో వేరే చెప్పనవసరం లేదు. తమ తమ లేదా తమ రాజకీయ యజమానుల అజెండాలోకి ఇతరులను లాగేందుకు ప్రయత్నిస్తారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అదే జరిగింది. కేజరీ వాల్‌, ఆమ్‌ ఆద్మీపార్టీని బిజెపి వలలోకి లాగేందుకు ప్రయత్నించారు. జాతీయ రాజకీయాల గురించి వ్యాఖ్యానించాలని యాంకర్లు పదే పదే కోరగా తాను ఢిల్లీ అభివృద్ధికే కట్టుబడి ఉన్నానని ఆయన పదే పదే చెబుతూ చిరునవ్వు నవ్వారు.
ఈ ఎన్నికల్లో బిజెపి ప్రచారం మొత్తం నరేంద్రమోడీ చుట్టూ తిప్పింది. దాన్ని ఆమ్‌ ఆద్మీ ఒకే చిన్న ప్రశ్నతో ఎదుర్కొన్నది. మాకు కేజరీ వాల్‌ ఉన్నారు. మరి మీకు ఎవరున్నారు? మోడీ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి కాలేరు కదా, అవుతారా చెప్పండి అంటే ఎలాంటి సమాధానం లేదు. షాహిన్‌ బాగ్‌ నిరసనకారులు ఆ ప్రాంత జనాన్ని ఇబ్బంది పెడుతున్నారనే పేరుతో కేజరీవాల్‌ను ఇబ్బంది పెట్టేందుకు బిజెపి పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావించింది. తొలుత కేజరీవాల్‌ దానిని పట్టించుకోలేదు. బిజెపి ముప్పేటదాడికి దిగి ఆ పేరుతో ఓటర్లను విభజించి హిందూఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. ఒక ఇంటర్వ్యూలో కేజరీవాల్‌ దానిని ఇలా తిప్పికొట్టారు. నిరసనతెలుపుతున్నవారిని తొలగించే బాధ్యత ఢిల్లీ పోలీసులకు లేదా ? కేంద్ర హౌం మంత్రికి వారు ఆ విషయాన్ని నివేదించలేదా ? అంతటి శక్తివంతుడైన హౌం మంత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ఆధీనంలో ఉంటారు, శాంతి భద్రతల సమస్య బాధ్యత కేంద్రానిదే అన్న విషయం తెలిసినదే. కేజరీ వాల్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు మీడియా, బిజెపి నేతలు ప్రయత్నించారు. ఒక ఛానల్‌ యాంకర్‌ ఉన్నట్లుండి మీరు నిజంగా హనుమాన్‌ భక్తులే అయితే హనుమాన్‌ చాలీసా చదవగలరా అన్న సవాల్‌ విసిరారు. వెంటనే కేజరీవాల్‌ చదివి వినిపించారు. దాంతో యాంకర్‌తో పాటు బిజెపి కూడా కంగుతిన్నది.
యాంకర్లు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఎన్‌డిటీవీ హిందీ యాంకర్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ యాంకర్లు ప్రచారమనే సరకును చేరవేసే రోజూ కుర్రాళ్ల మాదిరి తయారయ్యారని వ్యాఖ్యానించారు. టీవీల్లో అజెండా, చర్చ ఎలా ఉండాలో ఒక చోట తయారవుతాయి, వాటిని యాంకర్లు సరఫరా చేస్తారు. న్యూస్‌ యాంకర్ల భాష పూర్తి హింసాపూరితంగా, బెదిరింపులతో ఉంటోంది, మీడియాలో ప్రతిపక్షానికి చోటు ఉండటం లేదు, ప్రతి రోజూ ప్రతిపక్షాన్ని మీడియా చంపివేస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని హతమార్చేందుకు ప్రధాన స్రవంతి మీడియా ఎంతో కష్టపడుతోంది. రాజీపడని జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వారిని సంస్దల నుంచి బయటకు గెంటివేస్తున్నారు, అయినా కొందరు జర్నలిస్టులు తెగించి పని చేస్తున్నారు అన్నారు.

Image result for chamcha channels-journalist chamcha cartoons
అనివార్యమై ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌సు అన్ని ప్రధాన ఛానళ్లు ప్రసారం చేశాయి.ఓటర్ల నాడిని ముందే పసిగట్టిన అనేక మంది ఎదురులేని మనిషి మోడీ ఎదురీదుతున్నారని, ఓటమి ఖాయమని ముందే పసిగట్టాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రచారానికి వెళ్లి వచ్చిన బిజెపి చోటా మోటా నాయకులు తమ పార్టీ ఓడిపోతున్నదనే సమాచారంతోనే తమ స్వస్ధలాలకు తిరిగి వచ్చారు. చిత్రం ఏమంటే ఫలితాలు వెలువడుతుండగా సాయంత్రం మూడు గంటల తరువాతనే తాము ఓటమిని అంగీకరిస్తామని, ఫలితాలు తమకు అనుకూలంగా మారతాయని ఆశాభావంతో టీవీ చర్చలలో వాదించటం గమనించాల్సిన అంశం. మొత్తం మీద ఢిల్లీ ఫలితాలు టీవీ ఛానళ్ల యాజమాన్యాలకు, రెచ్చిపోయి వ్యవహరించే యాంకర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇదే సమయంలో జర్నలిస్టు పాత్రలో సంయమనం పాటించాల్సిన వారు పార్టీ కార్యకర్తలుగా మారితే ఛానళ్లు ఎలా ప్రజావ్యతిరేకంగా మారతాయో, ఎలా నిందిస్తాయో చూపాయి. అయినా ఇంకా మీడియా పక్షపాతం చూపదని ఎవరైనా నమ్ముతుంటే చేయగలిగిందేమీ లేదు. దేనికైనా కొన్ని మినహాయింపులు, ఏటికి ఎదురీదే చేపలు ఎప్పుడూ ఉంటాయి. మీడియాలోనూ అలాంటి వున్నాయని, వాటిని రక్షించుకోవాలని మరచి పోరాదు.