ఎం కోటేశ్వరరావు
దేశమంతటా ఎన్‌ఆర్‌సి గురించి అబ్బే అసలు ఆలోచన కూడా చేయలేదని నరేంద్రమోడీ-అమిత్ షా పలికిన ‘సత్య’ వ్యాక్యాలతో వారు అపర సత్యహరిశ్చంద్రులని నమ్మే వారిలో చాలా మందికి దూల తీరింది. వారు కాదన్నా ఎన్‌ఆర్‌సి పెట్టాలంటూ వీరంగం వేసే వారు ఉన్నారు. మోడీ గారి పాలనలో అప్పులు చేయలేదని చెప్పటం కూడా ‘సత్యవాక్పరిపాలన’లో భాగమే. నేతలు అబద్దాలు చెప్పవచ్చు, అంకెలు, అందునా రిజర్వుబ్యాంకు చెప్పదు కదా (ఏమో ఇప్పుడు దాని మీద కూడా అనుమానాలు రావచ్చు)
రిజర్వుబ్యాంకు నివేదికల్లో చెప్పిన దాని ప్రకారం 2014 మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే నాటికి మన స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం :64,11,200 కోట్లు. దీనిలో స్వదేశీ 60,45,007 కోట్లు కాగా విదేశీ 3,66,193 కోట్లు.
నేను గానీ వస్తే మంత్ర దండం వేసి అప్పులు తీర్చివేస్తా, కొత్త అప్పులు చేయను, విదేశాల నుంచి నల్లధనపు నిల్వలు తెస్తా అని ఊరూ వాడా టాంటాం వేసిన నరేంద్రమోడీగారు ఎంత నల్లధనం తెచ్చారో మనకైతే తెలవదు. కానీ అప్పులు మాత్రం 2019 సెప్టెంబరు 15న ఆర్‌బిఐ ప్రచురించిన సమాచారం ప్రకారం 2019 మార్చినెల నాటికి మొత్తం అప్పును 1,02,55,099 (అరవైనాలుగు లక్షల కోట్ల నుంచి అక్షరాలా ఒక కోటీ రెండు లక్షల యాభైఐదు వేల తొంభై తొమ్మిది కోట్లకు) పెంచారు. పోనీ ఇంతా చేసి అభివృద్ధి సాధించారా అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు కూడా ఉంచకపోగా ఐదుశాతానికి లోపుగా దిగజార్చారు.
ఎడా పెడా విదేశాలకు ఎందుకు తిరుగుతున్నారు ప్రధాని గారూ అంటే దేశ పలుకుబడి పెంచటానికి అని చెప్పారు. ఆయన భక్తులైతే మోడీ పలుకుబడితో రాయితీలతో కూడిన అప్పులను పెద్ద మొత్తంలో తెస్తున్నారని భజన చేశారు. ఇది కూడా అబద్దమే. మన్మోహన్ సింగ్ ఏలుబడిలో విదేశీ రుణాల(అన్ని రకాలు కలిపి)లో రాయితీలతో ఉన్న మొత్తం 35.8శాతం నుంచి 10.4శాతానికి పడిపోయింది. విదేశాల్లో పలుకు బడి పెంచి, విశ్వసనీయతను పెంచామని చెప్పిన మోడీ గారి ఏలుబడిలో 2019 నాటికి ఆ మొత్తం 8.7శాతానికి పడిపోయింది. విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతామని చెప్పారు.
2014-15లో (మోడీగారి తొలి ఏడాది) రూపాయల్లో అన్ని రకాల విదేశీ పెట్టుబడుల ప్రవాహ విలువ రూ.4,49,072 (డాలర్లలో 73456 మిలియన్స్) ఉండగా 2019 మార్చినాటికి ఆ మొత్తాలు రూ.2,12,179 కోట్లకు(30094 మిలియన్ డాలర్లు) పడిపోయింది. ట్రంప్‌తో సహా విదేశీ నేతలందరినీ కౌగలించుకోవటం, ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఫొటోలకు ఫోజులివ్వటం తప్ప ఎందుకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయో ఎవరైనా చెప్పగలరా ? మన ఆర్ధిక వ్యవస్ధ మీద, దాన్ని నడిపించే నరేంద్రమోడీ మీద విశ్వాసం తగ్గటానికి ఇది సూచిక కాదా ? గత ఆరు సంవత్సరాలలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీల వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భావోద్వేగాలను రేకెత్తించటం మీద పెట్టిన శ్రద్ద ఆర్ధిక వ్యవస్ధను బాగు చేసేందుకు పెట్టి ఉంటే ఇలా జరిగేదా ? మోడీ అభిమానులు వెనక్కు తిరిగి ఆలోచిస్తారా ?
మోడీ ఏలుబడిలో ఉపాధి తగ్గిందా పెరిగిందా ! ఆర్‌బిఐ సమాచారం ఏమి చెబుతోంది !
భజన బృందం అంటే చెవుల్లో పూలు పెట్టుకొని ఎలా చేయమంటే అలా భజన చేస్తుంది. కానీ అందరికీ కుదరదే. దేశంలో ఎందరికీ ఉపాధి కల్పించారన్నది ఒక బ్రహ్మపదార్ధం. రిజర్వుబ్యాంకు కమ్యూనిస్టు సంస్ధ కాదు, దానిలో పని చేసే వారు తుకడే తుకడే గ్యాంగ్ కాదు. 2019 సెప్టెంబరు మాసాంతానికి ఆర్‌బిఐ అందించిన సమాచారంలో ఉపాధి గురించి ఈ అంశాలున్నాయి.
1996-97లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య దేశ చరిత్రలో గరిష్టం : 195.6లక్షలు
2011-12 నాటికి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :176.1లక్షలు
1996-97లో ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 86.9లక్షలు
2011-12 నాటికి ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :119.7లక్షలు
1996-97లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 374.3లక్షలు
2011-12 లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 401.7లక్షలు
2011-12 తరువాత ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగంలో ఎంతెంత మంది ఉన్నారో విడివిడిగా లెక్కలు లభ్యం కాలేదని ఆర్‌బిఐ పేర్కొన్నది. అయితే మొత్తంగా రిజిస్టర్లలో ఉన్న సంఖ్య సంవత్సరాల వారీ దిగువ విధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆర్‌బిఐ తన గణాంక పుస్తకంలో పేర్కొన్నది.
2012-13లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 447.9లక్షలు
2013-14లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 468 లక్షలు
2014-15లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 482.6 లక్షలు
2015-16లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 435 లక్షలు
తరువాతి సంవత్సరాల సమాచారాన్ని ఆర్‌బిఐ ఇవ్వలేదు.
ధరల పెరుగుదల లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దానికి రుజువుగా ద్రవ్యోల్బణం ఎంత తక్కువ ఉందో చూసుకోమంటారు. 2014 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధరల సూచిక 112.2 కాగా 2019 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో అది 139.6కు పెరిగింది. తరువాత 2020జనవరి నాటికి 145.7కు పెరిగింది. దీన్నేమంటారు ? ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, కొంత మేరకు చెల్లించే యాజమాన్యాలుంటే కార్మికులకు కరవు భత్యం పెరుగుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, ఇతరులు, నిరుద్యోగల పరిస్దితి ఏమిటి ? కాబట్టి భక్తులారా గుడ్డి అభిమానం లేదా దురభిమానంతో మీరు ఎలాగైనా రెచ్చిపోవచ్చు, సామాన్యులారా మోడీ ఏలుబడి గురించి మీకై మీరు నిర్ణయించుకోవచ్చు. దీనిలో పేర్కొన్న అంకెలు వాస్తవం కాదని ఎవరైనా నిరూపిస్తే సంతోషం, లేకపోతే స్వంత బుర్రలతో ఆలోచించటం ప్రారంభించండి, ఇంతకంటే దేశభక్తి మరొకటి లేదు. నేనైతే రాసిన దానికి కట్టుబడి ఉన్నా !