Tags

, ,

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus

ఎం కోటేశ్వరరావు
కేంద్రంతో సంబంధం, రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు ఏమైందో మీకు తెలుసా ! నాకూ తెలియదు, అలాంటి సంచలనాత్మక కేసులు ఎన్నో మరుగునపడ్డాయి, దాని వలన రాజకీయ వ్యాపారులకు తప్ప జనానికి నష్టం లేదు. కానీ కోడి కాలు, పాల కేసు అలాంటిది కాదు. రెండు రాష్ట్రాల్లోని పాడి, కోళ్ల పరిశ్రమను, వాటి మీద ఆధారపడిన వారినీ దెబ్బతీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు వచ్చిన ఆహ్వానాన్ని, సంతోషంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ విందులో కోడి కాలు, పెరుగు లేకుండా ఉండదు. విందును ఆరగించబోయే ముందు తనకు వడ్డించి కోడి కాలు, పెరుగు స్వదేశీయా, అమెరికాదా అని కెసిఆర్‌ కనీసం సందేహిస్తారా ? అందని ద్రాక్ష పుల్లన అలాగే ఆహ్వానం రాలేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డికి అది గొప్ప విందేమీ కాదు. కనీసం ఆయన అయినా కోడి కత్తి కేసుతో పాటు కోడి కాలు, పాల కేసులను పట్టించుకుంటారా ?
ఒకటి కొంటే రెండు ఉచితంగా ఇస్తాం అన్నట్లుగా అమెరికా సర్కార్‌ మన దేశంతో ”కోడి కాళ్ల ” బేరం ఆడుతోంది. లేకుంటే మన కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తోంది. గతంలో మా కాళ్లు మాకున్నాయి మీ కాళ్లు అక్కర లేదంటూ మన సర్కార్‌ నిషేధం విధించింది. అప్పటి నుంచి వత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు విజయవంతమైనట్లు వార్తలు వచ్చాయి. విదేశీ వద్దు-స్వదేశీ ముద్దు అంటూ జపం చేసిన కాషాయ స్వదేశీ జాగరణ మంచ్‌ మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఏమైందో తెలియదు. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 17 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులులో ఉంది. మన దేశంతో ఉన్న ఆ వాణిజ్య లోటును అమెరికా పూడ్చుకోవాలంటే తనకు అవసరం లేని వాటిని మన మీద రుద్ది లబ్దిపొందాలని చూస్తోంది.
అమెరికా జనం కోడి కాళ్లను తినరు. అందువలన అక్కడి కోల్ట్‌ స్టోరేజీల్లో అవి పెద్ద ఎత్తున నిల్వలుండిపోయాయి. వాటిని మన మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తే మన దేశంలోని వేలాది కోళ్ల ఫారాలు మూతపడతాయి. వాటితో పాటు అనుబంధ రంగాలలో కనీసం 40లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ కారణంగానే గత పాలకులు వాటి మీద నిషేధం విధించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగలించుకున్న నరేంద్రమోడీ ట్రంప్‌ను పడేయాల్సింది పోయి తానే పడిపోయారు. కోడి కాళ్ల దిగుమతులపై ఉన్న పన్ను మొత్తాన్ని వంద నుంచి 25శాతానికి తగ్గించి దిగుమతులకు వీలు కల్పిస్తామని ఆమోదం తెలపగా, కాదు పదిశాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ తెలిపింది. ఇది నిజానికి స్పందన తెలుసుకొనేందుకు వదిలిన లీకు వార్త తప్ప మరొకటి కాదు. దీని మీద మన దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో అబ్బే అలాంటిదేమీ లేని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ట్రంప్‌ రాక సందర్భంగా లేదా తరువాత అయినా దానికి అంగీకారం తెలపవచ్చని భావిస్తున్నారు.
కోడి కాళ్ల దిగుమతులపై అమెరికా కోరిన విధంగా పన్ను తగ్గిస్తే అది ఆ ఒక్కదేశానికే పరిమితం కాదు. బ్రెజిల్‌ వంటి ఇతర అనేక దేశాల నుంచి చౌకగా దిగుమతులు వెల్లువెత్తుతాయి. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ ఒక్కటే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయా రైతులు కూడా ప్రభావితం అవుతారు. నాటు కోళ్లను పెంచే సామాన్య గృహస్తుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా అమెరికా మన మీద తెస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు. బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా 2007 మన ప్రభుత్వం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఫ్లూ సమస్య తొలగిన తరువాత కూడా అది కొనసాగింది. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది.2014లో అమెరికా కేసు గెలిచింది. 2017లో కోడి కాళ్ల దిగుమతులను మోడీ సర్కార్‌ అనుమతించింది. మన దేశమే కోళ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాంటిది అమెరికా నుంచి దిగుమతులను పరిశ్రమ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ప్రస్తుతం వందశాతం పన్ను ఉన్నప్పటికీ అమెరికా నుంచి వస్తున్న కోడి కాళ్ల దిగుమతుల కారణంగా అనేక చోట్ల చిన్న చిన్న కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. అమెరికా తన వద్ద ఉన్న నిల్వలను వదిలించుకొనేందుకు కారుచౌకగా ఎగుమతులు చేసేందుకు పూనుకుంది. మన దేశంలో కోడి కాళ్లు ఆయా సీజన్లనుబట్టి కిలో రూ.150 నుంచి 250 వరకు ధరలు పలుకుతున్నాయి. అమెరికా నుంచి పది హేను రూపాయలకే అందుబాటులోకి వస్తాయని అంచనా. అక్కడి వాస్తవ ధరకంటే తక్కువ చూపి సబ్సిడీలతో ఎగుమతులు చేస్తారు. అందువలన మన దేశం దిగుమతి పన్ను వంద కాదు మూడు వందల శాతం వేసినా మన మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో కోడి కాళ్ల సగటు బరువు 70 నుంచి 90 గ్రాములుంటాయి. అదే అమెరికా కాళ్ల సగటు 160 నుంచి 180 గ్రాములు.
ఇక పాలు, పాల ఉత్పత్తుల విషయానికి వస్తే అమెరికా గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి దిగిన కారణంగా అమెరికా ఉత్పత్తుల మీద చైనా 20శాతం, మెక్సికో 28శాతం చొప్పున దిగుమతి పన్ను పెంచాయి. దాంతో ఉత్పత్తుల నిల్వలు పెరిగిపోతున్నాయి. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది అమెరికా గోదాముల్లో 1.4బిలియన్‌ పౌండ్ల(పౌను అరకిలోకు సమానం) జున్ను నిల్వలు మిగిలిపోయాయి. ఇక పాలపొడి సంగతి సరేసరి. మరోవైపు న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ నుంచి పోటీ పెరుగుతోంది. 2023వరకు ఈ పన్నులు కొనసాగితే అమెరికా పాల రైతులు 12.2బిలియన్‌ డాలర్లు నష్టపోతారు. ఈ కారణంగా తన ఉత్పత్తులను మన మీద రుద్దేందుకు అమెరికా పూనుకుంది.2018లో అమెరికా పాల ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరిచేందుకు మోడీ సర్కార్‌ సూత్రప్రాయంగా ఆమోదించింది. అది అమల్లోకి వస్తే దాదాపు ఎనిమిది కోట్ల మంది మన రైతులు ప్రభావితులౌతారు.

Image result for trump , india ,poultry and milk products cartoons
మొహమాటానికి పోతే…. ఏదో అయిందన్నది ఒక ముతక సామెత. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం పలికి నరేంద్రమోడీ అదే ఇబ్బందులను కొని తెచ్చుకున్నారా ? గత ఏడాది హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన నరేంద్రమోడీ పనిలో పనిగా మీరు ఒకసారి మా దేశానికి రండి అని ట్రంప్‌కు ఆహ్వానం పలికారు. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి డంగై పోయిన ట్రంప్‌తో వీళ్లదేముంది, మీరు ఊహించలేరు, మాదేశం వచ్చినపుడు మిలియన్ల మంది మీకు దారిపొడవునా స్వాగతం పలుకుతారు చూడండి అని నరేంద్రమోడీ గొప్పగా చెప్పి ఉండాలి. లేకపోతే మిలియన్ల మంది నాకోసం వస్తారని మోడీ చెప్పారు, వారు 50 నుంచి 70లక్షల మంది వరకు ఉంటారని మోడీ చెప్పారు అని ఒకసారి, అరవై నుంచి కోటి మంది వరకు వస్తారని మోడీ చెప్పినట్లుగా మరోసారి అమెరికాలో ట్రంప్‌ ప్రకటించారు. అది మన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. రేపు మూడో కుర్ర భార్య, మొదటి భార్య కూతురు, అల్లుడితో సహా వస్తున్న ట్రంప్‌ జనాన్ని చూసి ఎంత మంది ఉంటారని తన వాళ్లను ప్రశ్నించకమానరు. మీ స్వాగతం గురించి మీ మోడీ చెప్పినవన్నీ జుమ్లా(ఏదో అవసరానికి అలా చెబుతాం)యే. మిలియన్ల మంది ఎక్కడా కనిపించలేదు, భారత్‌ మనలను సరిగా చూసుకోవటం లేదు, మోడీ అలాంటి వ్యక్తి కాదు అన్నారు, ఇప్పుడు చూడండి ఎలా అవమానించారో, ఇంత తక్కువ సంఖ్యలో జనమా, ఇది వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం కలిగించదా అని భార్య, కూతురు, అల్లుడు నిషఉ్టరాలాడకపోరు. ట్రంప్‌ను చూసేందుకు గుజరాత్‌లో ఎంత మంది వచ్చిందీ కొందరు విలేకర్లయినా నిజాలను రాయకుండా ఉండరు కదా ! స్వాగతం పలికే జన సంఖ్య గురించి మోడీ ఆంగ్లం ట్రంప్‌కు అర్ధం కాలేదో లేక మోడీయే ట్రంప్‌కు అర్ధమయ్యే రీతిలో చెప్పలేదో ఏం జరిగిందో చెప్పటానికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు గనుక దీన్ని వదలివేద్దాం.

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus
డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలేవీ ఉండవు అని అమెరికా అధికారులు మరింత స్పష్టంగా చెప్పారు. అలాంటపుడు ట్రంప్‌ ఎందుకు వస్తున్నట్లు ? మన ప్రధాని ఎందుకు ఆహ్వానించినట్లు ? ఈ ఏడాది నవంబరు 3న జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా కార్పొరేట్లకు గరిష్ట లబ్ది చేకూర్చేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంతో సహా అన్ని దేశాలపై వత్తిడి పెంచుతున్నారు. దీనికి నరేంద్రమోడీ లొంగుతారా ? లేకపోతే మన దేశం మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా తెస్తున్న వత్తిడి మరింత పెరుగుతుంది. మరి మన మోడీ తట్టుకొని నిలుస్తారా, దేశపిత వంటి మెరమెచ్చు మాటలకు జావగారి లొంగిపోతారా, కోట్లాది మంది రైతాంగ జీవితాలను ఫణంగా పెడతారా ?అమెరికాకే అగ్రస్ధానం అన్న ట్రంప్‌ వైఖరికి అనుగుణ్యంగానే ఈ పర్యటన సాగనున్నట్లు స్పష్టమై పోయింది. మన ప్రయోజనాలే మనకు ముఖ్యం అని చెప్పే మన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు రాజీపడుతున్నట్లు ?