Tags

, , , ,

Image result for communist specter
ఎం కోటేశ్వరరావు
”ఐరోపాను ఒక భూతం తరుముతోంది. అది కమ్యూనిస్టు భూతం. ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు పాత ఐరోపాలోని అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి.పోప్‌, జార్‌, మెటర్‌నిచ్‌, గురుజోట్‌, ఫ్రెంచ్‌ రాడికల్స్‌,జర్మన్‌ పోలీసు గూఢచారుల వంటి అందరూ దానిలో ఉన్నారు. కమ్యూనిజాన్ని ఒక శక్తిగా ఐరోపా అధికార శక్తులన్నీ ఇప్పటికే గుర్తించాయి ” 1848 ఫిబ్రవరి21న తొలిసారిగా ప్రచురితమైన మార్క్స్‌-ఎంగెల్స్‌ కమ్యూనిస్టు (పార్టీ) ప్రణాళిక పైన పేర్కొన్న పదాలతో ప్రారంభం అవుతుంది. మతం, పాలకుల అండతో తర్జుమా, ముద్రితం అయిన బైబిల్‌ తరువాత ఆది నుంచీ మతం, పాలకుల వ్యతిరేకతను ఎదుర్కొని, కష్టజీవుల మద్దతుతో అత్యధిక భాషలలో తర్జుమా అయిన గ్రంధం కమ్యూనిస్టు ప్రణాళిక తప్ప మరొకటి లేదు. ఐదు అభ్యుదయ తెలుగు పుస్తక ప్రచురణ సంస్ధలు ఫిబ్రవరి 21రెడ్‌ బుక్స్‌ డే సందర్భంగా లక్ష కాపీలను ఉమ్మడిగా ప్రచురించి పాఠకుల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాయి. ఒకటి రెండు రోజుల్లోనే లక్ష కాపీలు అయిపోవటంతో మరో లక్ష ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచురణకర్తలు ప్రకటించారు.
కమ్యూనిస్టు భూతాన్ని అదుపు చేసి భూస్ధాపితం చేశామని మూడు దశాబ్దాల క్రితం సంబరపడిన కమ్యూనిస్టు వ్యతిరేకులందరినీ ఇది మరోసారి భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. అదెక్కడో కాదు, కమ్యూనిజంపై విజయం సాధించామని,ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని సంబర పడుతూ ప్రకటించుకున్న అమెరికా గడ్డమీదే ప్రారంభమైంది.1848లో లండన్‌లోని బిషప్‌ గేట్‌ ప్రాంతంలో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టో 1872లో 24 ఏండ్లకు గానీ ఆంగ్లంలో అమెరికాలో ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో లేదా మరోచోట ఏమి జరిగితే దాన్ని ప్రపంచమంతా చూసేందుకు, చదివేందుకు 24ఏండ్లు అవసరం లేదు. ఇరవై నాలుగు క్షణాలు చాలు. ఎవరి భాషలో వారు వెంటనే అనువదించుకొనే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో నేడు ఏమి జరిగితే రేపు ప్రపంచం దాన్ని అనుకరించుతుంది అని అనేక మంది చెబుతుంటారు. అలాంటపుడు అది సోషలిజం, కమ్యూనిజాలపై జరుగుతున్న మధనానికి ఎందుకు వర్తించదు ?
ఈ ఏడాది నవంబరు మూడవ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. హిరణ్యకశ్యుపుడికి శ్రీహరి నామం వినపడితే తేళ్లూ జెర్రులు పాకినట్లు ఉండేదని, చివరికి కుమారుడు ప్రహ్లాదుడిని కూడా సహించలేదని పురాణాలు చెబుతాయి. అమెరికాలో గతశతాబ్దిలో సోషలిజం, కమ్యూనిజం పదాలు కూడా అలాంటివే. కార్పొరేట్ల కనుసన్నలలో మెలుగుతూ ప్రతిదాన్నీ డాలర్లతో సొమ్ము చేసుకొనే అక్కడి మీడియాకు ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యతిరేకంగా అయినా ఆ పదాలను ఉచ్చరించకతప్పటం లేదు. అనేక మంది రచయితలు పరిణామాలు, పర్యవసానాలను మింగా కక్కలేకుండా ఉన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ఇనుప తెరలను ఛేదించుకొని అమెరికా సమాజం బయట పడుతోందా ?
అమెరికా ఎన్నికల్లో ముందు పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం పన్నెండు మంది డెమోక్రటిక్‌ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. పార్టీకి చెందిన 3,979 మంది ప్రతినిధులలో ఒక అభ్యర్ధి ఎన్నిక కావాలంటే 1991 మంది మద్దతు అవసరం. ఒక వేళ ఎవరూ సాధించకపోతే సభ నిర్వహించి దాని ఓటింగ్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. దీనిలో కూడా అవకతవకలకు ఎన్నో అవకాశాలుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ఇది రాసిన సమయానికి యాభైకి గాను రెండు రాష్ట్రాలలో బెర్నీ శాండర్స్‌ విజయం సాధించారు. వంద మంది ప్రతినిధులు తమ ఓట్లు వేశారు. ఆరుగురు అభ్యర్ధులకు మాత్రమే ఓట్లు పడ్డాయి వారిలో బెర్నీశాండర్స్‌ 45,పేట్‌ బటిగెగ్‌ 25, జోబిడెన్‌ 15, ఎలిజబెత్‌ వారెన్‌ 8, ఆమీ కలుబుచర్‌ 7, తెచ్చుకున్నారు. ఒక్క ఓటూ తెచ్చుకోని న్యూయార్క్‌ నగర మాజీ మేయర్‌, కుబేరుల్లో ఒకడైన మైఖేల్‌ బ్లూమ్‌ బెర్గ్‌ తన అర్ధబలంతో అభ్యర్ధిగా నెగ్గాలని చూస్తున్నాడు. కార్పొరేట్‌ మీడియాను ఇప్పటికే పాకేజ్‌లతో కట్టడి చేశాడని స్పష్టమైంది.

Image result for bernie sanders 2020
టైమ్‌ మాగజైన్‌ విలేకరి చార్లెటీ ఆల్టర్‌ ఈ ఫలితాలను చూసిన తరువాత ఒక విశ్లేషణ చేస్తూ గత రెండు వారాలుగా 78ఏండ్ల సోషలిస్టు బెర్నీశాండర్స్‌కు అనేక మంది యువత ఎందుకు ఆకర్షితులౌతున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటూ కొన్ని అంశాలు రాశారు. వాటి సారాంశం ఇలా ఉంది.’ ప్రచ్చన్న యుద్ద సమయంలో (1991కి ముందు) పెరిగిన వారికి సోషలిజం జనాన్ని కమ్యూనిజానికి తీసుకుపోతుంది, కమ్యూనిజం అమెరికా స్వేచ్చకు ముప్పుగా పరిణమిస్తుంది అన్నట్లుగా కనిపించేది. అప్పుడు వారు సోషలిజం అంటే సోవియట్‌ యూనియన్‌, దాని నిర్బంధ శ్రామిక శిబిరాలు,లోపభూయిష్టమైన ఆర్ధిక వ్యవస్ద గురించి ఆలోచించేవారు. కానీ శాండర్స్‌ లేదా ఎలిజబెత్‌ వారెన్లకు మద్దతు పలుకుతున్న సహస్రాబ్ది యువతరం ఆ కథలతో పెరగలేదు. వారిలో పెద్ద వారు బెర్లిన్‌ గోడ కూల్చివేత సమయానికి ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వారిలో అత్యధికులకు సోషలిజం అంటే ఐరోపాలోని అనేక ప్రాంతాలలో ఉన్న అందరికీ ఆరోగ్యం,శిశు సంరక్షణ,కళాశాల ఉచిత విద్య. నా వయస్సు వారికి సోషలిజం కాదు తిరోగమిస్తున్న పెట్టుబడిదారీ విధానం, జీవితాలను చితక్కొట్టిన ప్రభావం తెలుసు. 2008 ద్రవ్య సంక్షోభం సమయంలో వచ్చిన సహస్రాబ్ది యువతకు విద్యారుణాల భారం విపరీతంగా పెరిగింది, స్వంత ఇల్లు, కార్ల వంటి అనేక అంశాలకు తలిదండ్రులున్నారనే భరోసా లేదు.వాతావరణ సంక్షోభంతో సంఘర్షించారు, అది తమ పిల్లలు జీవించటానికి వీలులేని అనేక ప్రాంతాలను ప్రపంచంలో సృష్టించనుంది. అందుకే వారు వామపక్షం వైపు మొగ్గుతున్నారు. నేను ప్రజాస్వామ్య సోషలిజానికి అనుకూలంగా వాదించటం లేదు. ఒక జర్నలిస్టును, కార్యకర్తను కాదు. కానీ అనేక మంది ఈ ధోరణిని సంపూర్ణంగా అపార్ధం చేసుకున్నారు అని నాకు అర్ధమైంది.

Image result for bernie sanders : is really communist specter of america
సహస్రాబ్ది యువత తాము సోషలిస్టులమని చెప్పినపుడు దాని అర్ధం తాము ఎన్నుకున్న ప్రతినిధులు అందరికీ అందుబాటులో ఇండ్లు, ఆరోగ్య రక్షణ, కాలేజీ ట్యూషన్‌ ఫీజు, పర్యావరణ రక్షణకు గట్టిగా పాటుపడటం వంటి వాటిని నెరవేర్చేందుకు పని చేయాలని కోరుతున్నారని అర్ధం చేసుకోవాలి. ఇందుకోసం ధనికులపై అధిక పన్నులు వేయాలని కోరుతున్నారు. సామాజిక సమస్యల పరిష్కారం అమెరికా ప్రభుత్వం తాహతుకు మించినట్లుగా ఉందని చెబుతుంటారు. పురోగమన వాదులు కనీసవేతనాన్ని, ఆదాయపన్ను ప్రవేశ పెట్టారు, బాలకార్మిక వ్యవస్ధను నిర్మూలించారు. అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సామాజిక భద్రతను ఏర్పాటు చేశారు, కోట్లాది మందిని రోడ్లు, వంతెనలు, పాఠశాలల నిర్మాణంలో నిమగం కావించారు. లిండన్‌ జాన్సన్‌ వృద్ధులకు ఆరోగ్య రక్షణ, పేదలకు వైద్యసాయం చేశారు. తప్పో వప్పో, ఇతర అమెరికన్ల మాదిరి మన వర్తమాన చరిత్రలో బెర్నీ శాండర్స్‌,ఎలిజబెత్‌ వారెన్‌ వంటి వారు పెద్ద సంస్ధాగత మార్పుల గురించి మాట్లాడుతున్నారు. మీకు వారు కోరుతున్నవాటిని అభిమానించకపోవచ్చు, కానీ, మంచి సమాజం కోసం పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు పెద్ద ఆలోచనలతో ఈ పురోగమనవాదులు కనీసం ప్రయత్నం చేస్తున్నారు.”
సోషలిజం పట్ల ప్రస్తుతం అమెరికన్‌ సమాజంలోని వృద్ధ తరాల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత మిగతా వారిలో లేదన్నది స్పష్టం. దీనర్ధం వారంతా సోషలిజానికి వెంటనే ఓటు వేస్తారని కాదు. సోవియట్‌ సోషలిస్టు విధానం గురించి వారు ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. అది అంతరించి పోయిన తరువాత పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తున్నదో ప్రత్యక్షంగా చూశారు. అదింకేమాత్రం తమను అభివృద్ధి చేయలేదనే అభిప్రాయాన్ని కలిగిన వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. పెట్టుబడిదారీ విధాన సమర్దకులు వారిలో ఆ వ్యవస్ధ పట్ల విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారు. అమెరికా పాలకవర్గం చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఒక వైపు సైద్ధాంతిక దాడి చేస్తున్నది. మరొక వైపు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోక తప్పని స్ధితిలోకి అమెరికాను నెట్టింది. గతంలో సోవియట్‌ కాలంలో ఇలాంటి పరిస్ధితి లేదు. ప్రతి వస్తువుకూ చైనాపై ఆధారపడుతూ అక్కడి సోషలిజం విఫలమైంది అంటే నమ్మేవారు లేరు. రోజు రోజుకూ అది తమతో పోటీపడగలిగిన బలమైన ఆర్ధిక వ్యవస్ధగా తయారు కావటాన్ని యువతరం, ఇతరులు గమనిస్తున్నారు. అమలులో లోపాలు లేకపోతే సోషలిస్టు వ్యవస్ధలో సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని నమ్ముతున్నారు. అందుకే మిగతా దేశాలలోని కమ్యూనిస్టుల మాదిరి వారు సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన ఎదురుదెబ్బల గురించి తల్లడిల్లటం లేదు. సోషలిజం పట్ల అభిమానం పెంచుకుంటున్నారు. అయితే అది కమ్యూనిస్టు పార్టీలు చెప్పే పద్దతుల్లోని వ్యవస్ధా ? అమెరికన్‌ పెట్టుబడిదారీ వర్గం ఆ భావజాల వ్యాప్తిని అనుమతిస్తుందా ? ఇలాంటి అనేక సందేహాలు బయటివారికి కలగటం సహజమే. మౌలిక వర్గ వ్యవస్ధకు ముప్పు కలగనంత వరకు ఏ దేశంలో అయినా పురోగామి శక్తులను పాలకవర్గాలు అనుమతించాయి. తరువాతే అణచివేతకు పూనుకున్నాయి. అమెరికా దానికి మినహాయింపు ఎలా అవుతుంది? తమ అనుభవాల నుంచి సోషలిజం పట్ల అభిమానం పెంచుకున్న వారు దానికి ప్రతిఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో, ముందుకు పోవాలో, సరైన దారిలో నడవకపోతే మార్పు గురించి ఆలోచించలేరా ? ప్రతి దేశంలో విప్లవాలు గానీ, సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణాలు గానీ ఆయా దేశాల పరిస్ధితులను బట్టి ఉంటాయి తప్ప ఒక నమూనా లేదు. చైనా వంటి దేశాలలో తొలి రోజుల్లో సోషలిస్టు వ్యవస్ధ ఎదుర్కొన్న సవాళ్లు-అక్షరాస్యత, వైద్యం వంటి సమస్యలు – అమెరికా లేదా అభివృద్ధి చెందిన ఐరోపా సమాజాలకు ఎదురు కావు.

Image result for bernie sanders 2020
దాదాపు శతాబ్దం పాటు సోషలిజం, కమ్యూనిజాలను భూతాలుగా చూపుతూ భయపెట్టిన స్ధితిని ఛేదించుకొని నేడు అమెరికాలో సోషలిజం ప్రాచుర్యం పొందుతోంది.అన్ని జీవన రంగాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోశారు. మన దేశంలో చార్వాకులు, వారి సిద్ధాంతాలను అణచివేసి వారిని నిందించే క్రమంలో రాసిన వాటి ఆధారంగానే వారేమి చెప్పారనే అంశాలను ఒక చోటికి పేర్చి అర్ధం చేసుకున్నట్లుగా అమెరికాలో పురోగమన వాదుల గురించి వారేమి చెబుతున్నారనేదాని కంటే వారిని ఎలా దూషించారు అనే అంశాలకే మీడియా ప్రాధాన్యత ఇస్తోంది గనుక సమగ్ర సమాచారం పొందటంలో సమస్యలు ఎదురవుతున్నాయి. బెర్నీ శాండర్స్‌ చెప్పేది శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతానికి అనుగుణ్యంగా ఉందా మరొకటా అన్నదానిని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. సోషలిజాన్ని సాధించటానికి ఎన్నో దశలు ఉన్నట్లుగానే, సమాజంలోని వ్యక్తులు శాస్త్రీయ సోషలిస్టు పద్దతుల్లో తయారు కావటానికి కూడా ఎన్నో దశలు ఉంటాయి. ముందే ఫలానా విధంగా ఉంటేనే నిన్ను సోషలిస్టు శిబిరంలోకి రానిస్తాము, సోషలిస్టుగా పరిగణిస్తాము అంటే కుదరదు. మౌలికమైన అంశం దోపిడీని అంతం చేయాలి, సామాజిక న్యాయం సాధించాలి వంటి అంశాలతో ఏకీభావం వుందా వ్యతిరేకత ఉందా అన్నది గీటురాయిగా ఉండాలి. అమెరికాలో సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వ్యక్తిగా చూస్తున్న దశలో నేను సోషలిస్టునే అని చెప్పుకొనేందుకు, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, సోషలిస్టు వ్యవస్ధకు ఒకసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటూ యువత ముందుకు రావటాన్ని ఆహ్వానించాలా లేదా ?
బెర్నీ శాండర్స్‌ ఒక కమ్యూనిస్టు, ప్రచ్చన్న యుద్ద కాలంలో సోవియట్‌ యూనియన్‌తో ముడి వేసుకున్నాడు అని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ మీడియా ప్రచారం చేస్తోంది. ట్రంప్‌ పుట్టుకతోనే అబద్దాల కోరు, నేను కమ్యూనిస్టును కాదు, మాస్కోతో ముడివేసుకోలేదు,అయితే యరోస్లావల్‌ నగరంతో సోదర పట్టణ కార్యక్రమం కింద సోవియట్‌ యూనియన్‌ సందర్శించాను అక్కడ జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగ, దేశీయ విధానాలను విమర్శించాను తప్ప మరేమీ లేదని శాండర్స్‌ వ్యాఖ్యానించాడు. ఒక వేళ మీరు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి అయితే నేను ప్రజాస్వామ్య సోషలిస్టును అని గర్వంగా చెప్పుకుంటాను అని గతంలో అన్న దానితోనే ప్రచారం చేస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడు. అనేక అంశాలను చూస్తే మనది ఇప్పటికే సోషలిస్టు సమాజం, మనకు పెద్ద బడ్జెట్‌ ఉంది, అన్ని రంగాలకు నిధులు ఖర్చు చేస్తున్నాము అని శాండర్స్‌ చెప్పాడు. దీనిలో అనేక తిరకాసులు లేకపోలేదు.అమెరికన్‌ మీడియా, డెమోక్రటిక్‌ పార్టీలోని ప్రత్యర్దులు శాండర్స్‌ నోటి వెంట సోషలిస్టును అనిపించాలని చూస్తున్నారు, అలా చెబితే ఎన్నికల్లో దాన్నొక అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దంగా ఉన్నారు. కొన్ని అంశాలలో పురోగామి వైఖరిని ప్రకటిస్తూ మరియు జనం కోరుతున్న డిమాండ్లను ముందుకు తెస్తున్న ఒక పురోగామి, సంస్కరణ వాది శాండర్స్‌ అని చెప్పవచ్చు. అమెరికా రాజకీయాల్లో అలాంటి వారు ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు రావటమే పెద్ద మార్పునకు సంకేతం.

Image result for bernie sanders : is really communist specter of america
శాండర్స్‌ గురించి అనేక మంది భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శాండర్స్‌ను కమ్యూనిస్టుగా వర్ణించటాన్ని ఆయన మద్దతుదారులు అంగీకరించటం లేదు, ఒక ప్రజాస్వామిక సోషలిస్టు, ఐరోపాలో అనేక మంది అర్ధం చేసుకుంటున్నట్లుగా శాండర్స్‌ వెనెజులా లేదా ప్రపంచంలోని ఇతర మరొక కమ్యూనిస్టు అనే కంటే స్వీడన్‌ సోషలిస్టులకు దగ్గరగా ఉంటారు అని న్యూస్‌ వీక్‌ పత్రికలో రాసిన జాసన్‌ లెమన్‌ అభిప్రాయ పడ్డారు. ఒక విధంగా ట్రంప్‌ చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం కావచ్చు. నోర్డిక్‌ తరహా సోషల్‌ డెమాక్రాట్‌ శాండర్స్‌ అనేది అబద్దం కనుక కమ్యూనిస్టు అని ట్రంప్‌ చెప్పి ఉండవచ్చు అని లెమన్‌ అంటారు.
శాండర్స్‌ తాను సోషల్‌ డెమోక్రాట్‌ కంటే డెమోక్రటిక్‌ సోషలిస్టును అని చెప్పుకుంటాడు. నోర్డిక్‌ సోషల్‌ డెమాక్రాట్స్‌ సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటారు, పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తారు. ప్రభుత్వ అదుపును వ్యతిరేకిస్తారు. శాండర్స్‌ విషయానికి వస్తే పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి పలకాలనే అభిప్రాయాలను బలపరిచాడు. ప్రయివేటు ఆస్ధిని రద్దు చేయాలని, ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని చెబుతాడు. కమ్యూనిస్టు కాస్ట్రో, ఇతర నేతలను శాండర్స్‌ బలపరిచాడు, తాను మేయర్‌గా ఉన్న సమయంలో తన కార్యాలయంలో సుత్తీ కొడవలి ఉన్న ఎర్రజెండాను వేలాడతీశాడు.నాటి సోవియట్‌ యూనియన్‌ అసమ్మతివాదులను కలిసేందుకు నిరాకరించాడు. నోర్డిక్‌ సోషల్‌ డెమోక్రాట్స్‌ వ్యతిరేకించారు. ఇలాంటి అనేక అంశాలు ఉన్నందున శాండర్స్‌ను పూర్తిగా కొట్టి పారవేయటం వలన ప్రయోజనం లేదు. సోషలిస్టు మహాప్రస్తానంలో ఎవరు ఎంత వరకు వస్తే వారిని అంతవరకు కలుపుకుపోవాలి తప్ప, అన్నీ సక్రంమంగా ఉంటేనే అంగీకరిస్తామనటం విప్లవానికి తోడ్పడదు.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున శాండర్స్‌ అభ్యర్ధిగా ఎన్నిక అవుతారని అనేక మంది విశ్వసిస్తున్నారు. అది అంత తేలిక కాదు, ఎన్నో ఆటంకాలను అధిగమించాల్సి ఉంది. ఎవరూ భ్రమలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక వేళ నిజంగానే అభ్యర్ధిగా ఎంపిక అయితే అమెరికా చరిత్రలో అదొక అనూహ్యపరిణామమే అవుతుంది. అలాంటిది సాధ్యమా ?