Tags

, , ,

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?