Tags

, , ,

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump

ఎం కోటేశ్వరరావు
ఒక వైపు చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్నట్లు వార్తలు రాగా అమెరికాతో సహా అనేక దేశాల్లో అది విస్తరిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. చైనా పౌరుల పట్ల తన బాధ్యతగా ఖర్చుకు వెనుకాడకుండా నివారణ, చికిత్స చర్యలు తీసుకుంటుండగా అమెరికాలో దానికి భిన్నంగా భారాన్ని జనం మీద మోపేందుకు పూనుకున్నట్లు ఇంతవరకు వచ్చిన వార్తలు సూచిస్తున్నాయి. ఇది వ్యాధికంటే జనాన్ని ఆర్ధికంగా దెబ్బతీసేదిగాను, ఆప్పుల పాలు చేసేదిగానూ ఉంది. సోమవారం నాటి వరకు ఆరుగురు మరణించగా 15 రాష్ట్రాలలో వందలాది మందికి సోకినట్లు వార్తలు వచ్చాయి. వ్యాధి నిర్దారణ పరీక్షలకు డబ్బు వసూలు చేయవద్దని న్యూయార్క్‌ గవర్నర్‌ బీమా కంపెనీలను కోరారు. వైరస్‌ విస్తరిస్తున్నా ప్రమాదం లేదని ఎన్నికల సభలను ఆపాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన అనుయాయులను కోరాడు. కావాలంటే డెమోక్రాట్లను చూడండి, వారు కొనసాగిస్తున్నారని కూడా సెలవిచ్చాడు.
ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒక దారి అన్నది ఒక సామెత. ప్రపంచ వ్యాపితంగా కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను ఎలా అదుపులోకి తేవాలా అని చూస్తుంటే అమెరికాలో దాన్నుంచి లబ్ది పొందటం గురించి ఆలోచించే వారున్నట్లు కొన్ని ఔషధ కంపెనీల వాటాల ధరలు పెరగటం సూచిస్తున్నది. డిసెంబరు 31న చైనాలో తొలి వైరస్‌ కేసు బయటపడిన తరువాత అది ఎక్కడైనా కనిపించవచ్చు అన్న హెచ్చరికలు వెలువడ్డాయి. పాకిస్ధాన్‌ వంటి పేద దేశమంటే అర్ధం చేసుకోవచ్చు, అమెరికా వంటి ధనిక సమాజాలు ఎందుకు సిద్దం కాలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అంచనా వేసిన దాని కంటే ఎక్కువగానే అక్కడ వ్యాపించవచ్చని ఆరోగ్య అధికారులు తాజాగా ప్రకటించారు. కోవిద్‌-19 కొత్తది కనుక చికిత్సకు వెంటనే సిద్ధపడలేదు అని చెప్పినా కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఏటా సంభవించే ఫ్లూ(ఇది వైరస్‌తో వచ్చే జలుబు) గురించి తెలిసినా ఈ ఏడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అమెరికాలో మూడులక్షల పదివేల మందికి సోకి ఆసుపత్రుల పాలుకాగా 18వేల మంది మరణించారని వ్యాధుల నియంత్రణ మరియు నిరోధ కేంద్రం(సిడిసి) పేర్కొన్నది. కరోనా వైరస్‌ కూడా దీనికి తోడైతే అతలాకుతలంగాక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానించిన వారి ఆసుపత్రుల బిల్లులు చూస్తే అమెరికా పేదల పరిస్ధితి ఏమిటన్న చర్చ మొదలైంది. సాధారణ సమయాల్లో అమెరికాలో ప్రజారోగ్య భద్రతకు కేటాయింపులు తక్కువ అనే విమర్శ ఇప్పటికే ఉంది. ఇలాంటి మహమ్మారి తలెత్తినపుడు అయ్యే ఖర్చు గురించి చెప్పనవసరం లేదు. చైనా నుంచి అమెరికా పౌరుడు ఫ్రాంక్‌ యుసినిస్కీ, అతని మూడు సంవత్సరాల కుమార్తెను శాండియాగోలోని ఒక ఆసుపత్రిలో ఉంచి పరీక్షలు చేసి పరిశీలించి వ్యాధి సోకలేదని ఇంటికి పంపారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించిన సమాచారం మేరకు అతనికి 3,918 డాలర్ల బిల్లు వచ్చింది, దానిలో వారిని ఆసుపత్రికి తరలించి, తీసుకు వచ్చిన అంబులెన్స్‌ ఛార్జీ 2,600 డాలర్లు. అంత మొత్తం తాను చెల్లించే స్ధితిలో లేనని దాతలు తనకు సాయం చేయాలని గో ఫండ్‌ మీ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్ధన పెట్టాడు. చైనా నుంచి రావటానికి అయ్యే ఛార్జీలను భరించాల్సి ఉంటుందని తనకు తనకు తెలుసునని, ఆసుపత్రికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భావించానని యుసినిస్కీ వాపోయాడు. చైనాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో యజమాని తనకు వైద్యబీమా చేయించారని, అమెరికాలో బీమా లేదని అతను పేర్కొన్నాడు. అనేక మంది పేదలు అమెరికాలో బీమా చేయించుకోలేకపోవటం లేదా ఉన్నా పాక్షికంగా మాత్రమే సౌకర్యాలను కలిగి ఉంటున్నారు. ఈ ఉదంతం మీడియాలో వచ్చిన తరువాత పొరపాటున బిల్లు పంపామని ఆసుపత్రి యాజమాన్యం విలేకర్లకు చెప్పింది. అంబులెన్స్‌ కంపెనీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. విధిగా ఆసుపత్రుల్లో చేరి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించినపుడు దానికయ్యే ఖర్చును ఎవరు భరించాలన్నది తెలియటం లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్య భద్రతా చర్యల్లో భాగంగా పౌరులు తమంతట తాము సంసర్గ నిషేధం(క్వారంటైన్‌) విధించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించవచ్చు. అయితే ఇది అసాధారణంగా జరుగుతుంది కనుక అందుకయ్యే ఖర్చు గురించి ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు కనుక బీమా కంపెనీలు బిల్లులు పంపుతున్నాయి.
మియామీ పౌరుడు ఓస్మెల్‌ మార్టినెజ్‌ చైనా వెళ్లి వచ్చిన తరువాత ఫ్లూ(జలుబు) చేయటంతో ఒక స్ధానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయమని కోరాడు. సిటి స్కాన్‌ చేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పగా ఫ్లూ పరీక్ష మాత్రమే చేయించుకున్నాడు. దానికి గాను 3,270 డాలర్లకు గాను బీమా సొమ్ము పోను 1400 డాలర్లు చెల్లించాలని బిల్లు చేతిలో పెట్టటంతో దిమ్మ తిరిగి జలుబు ఎగిరిపోయింది. అనేక మంది ఇలాంటి బిల్లులను చూసి పరీక్షలు చేయించుకొనేందుకు భయపడుతున్నట్లు ప్రజారోగ్య నిపుణుడైన ఒక ప్రొఫెసర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఫ్లూ లేదా ఆ లక్షణాలు ఉండే కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకొంటే తాము అప్పుల పాలు కావలసిందే అని సామాన్య అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ పరీక్షలు ఉచితం అయినా బీమా వర్తించని ఆసుపత్రిల రూము అద్దెలు, అంబులెన్సులు ఇతర ఖర్చులు తడిచి మోపెడు కానున్నాయి. అసలు బీమా రక్షణ లేని అమెరికన్లు 2.7కోట్ల మంది ఉన్నారు. సాధారణ ఫ్లూ, ఎ, బి వైరస్‌ పరీక్షలు, సిఎంపి రక్త పరీక్షలకు 1295 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే బీమా ఉంటే 587 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.
గడచిన 24 గంటలలో 125 కొత్త కేసుల నమోదు, హుబెరులో 31 మంది మరణించినట్లు మంగళవారం నాడు చైనా ప్రకటించింది. జనవరి 21వ తేదీ తరువాత ఇంత తక్కువగా నమోదు కావటం ఇదే ప్రధమం. అక్కడ మొత్తం 80,151 మందికి సోకగా 2,943 మంది మరణించారు. డెబ్బరు దేశాలలో 90వేల మందికి సోకగా 3,116 మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణకొరియా, ఇరాన్‌, ఇటలీలో ఎక్కువగా వ్యాపిస్తోంది. దక్షిణ కొరియాలో 5,186 మందికి సోకింది. అక్కడి ప్రభుత్వం వైరస్‌పై యుద్దం ప్రకటించింది. ఆర్ధికంగా ఉద్దీపన చర్యలకు 25బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. దక్షిణ కొరియాలో స్ధానిక పౌరులు కానప్పటికీ ఆరోగ్య రక్షణ అక్కడ ఉచితంగా అందిస్తారు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న తన సిబ్బంది ఇండ్ల నుంచే పని చేయాలని ట్విటర్‌ కోరింది. ఇటలీలో 2036 కేసులు నమోదయ్యాయి.

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump
అమెరికాలో కరోనా వైరస్‌ వార్తలు రాగానే కొన్ని కంపెనీలు తాము పరీక్ష కిట్‌లను విక్రయించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి వాటిలో ఒకటి కో డయాగస్టిక్స్‌, కిట్లను విక్రయించనున్నట్లు ప్రకటించగానే దాని వాటాల ధర 59శాతం పెరిగాయి. ఫైజర్‌ కంపెనీల వాటాల ధరలు ఒక్కరోజే పదమూడుశాతం ఎగబాకాయి. వాటాలను కొనేందుకు మదుపుదారులు ఎగబడటం తప్పా ఒప్పా అనే అంశాన్ని పక్కనపెడితే కార్పొరేట్‌ కంపెనీలు వ్యాధులతో జరిపే వ్యాపారాల్లో లాభాలు ఎలా ఉంటాయో కూడా ఇది వెల్లడిస్తున్నది.
2009లో స్వైన్‌ ఫ్లూ(హెచ్‌1ఎన్‌1) విస్తరించిన సమయంలో ఒక్క అమెరికాలోనే 5.9కోట్ల మందికి సోకగా పన్నెండువేల మంది మరణించారు, ప్రపంచ వ్యాపితంగా మూడులక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. కరోనా గురించి నిర్ధారణ కాగానే చైనా తీసుకున్న అసాధారణ నివారణ చర్యలను, స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు అమెరికా తీరును ఒక్కసారి పోల్చి చూడటం అవసరం. వెయ్యి , పదహారు వందల పడకల రెండు ఆసుపత్రులను పది రోజుల వ్యవధిలో చైనా నిర్మించిన తీరు, ఏడుకోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసిన నిర్ణయం కనీవినీ ఎరుగనివి. అమెరికన్‌ వైరస్‌గా అమెరికన్లే పిలుచుకున్న స్వైన్‌ ఫ్లూ విస్తరణ సందర్భంగా నివారణ చర్యలు తీసుకొనేందుకు ఆరునెలల సమయం తీసుకుంది. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు, సంసర్గ నిషేధాలు, సరిహద్దుల్లో తనిఖీలు లేవు. అది మహమ్మారిగా మారి 214 ప్రాంతాలు, దేశాలకు విస్తరించింది. ఇప్పుడు చైనాను నిందిస్తున్న మాదిరి అప్పుడు స్వైన్‌ ఫ్లూ అమెరికాయే కారణమని ఎవరూ నిందించలేదు. సోషలిస్టు చైనా నాయకత్వానికి, లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఉన్న తేడా ఇది.