Tags

, , ,

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.