Tags

, ,

Image result for harish rao budget

ఎం కోటేశ్వరరావు
రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గత బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెడితే వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి టి హరీష్‌ రావు ప్రవేశపెట్టారు. వారిద్దరూ మేనమామ-మేన అల్లుళ్లన్న సంగతి తెలిసిందే. ఇద్దరి బడ్జెట్లకు ఏమైనా తేడా ఉందా ? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అన్నది ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం.
ఆర్ధిక మంత్రులు అంటేనే అంకెల గారడీ ఆటగాళ్లు. ఈ వర్ణనలో కొత్త దనం ఏమీ లేదు గానీ గారడీ జరిగిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయాల్సి వస్తే బడ్జెట్‌లో పెరుగుదల పెద్దగా లేదు. ఖర్చు చూస్తే గతం కంటే తగ్గిందన్న పచ్చినిజాన్ని చెప్పకతప్పదు. గతేడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 1,82,017 కోట్ల రూపాయలను ప్రతిపాదిన కెసిఆర్‌ తరువాత వాస్తవ బడ్జెట్‌ పేరుతో 1,46,492 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని 1,42,152 కోట్లుగా సవరించిన అంచనాగా పేర్కొన్న హరీష్‌ రావు తన బడ్జెట్‌ 1,82,914 కోట్లుగా ప్రతిపాదించారు. దీనిలో వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తారో ఏడాది తరువాత గానీ తెలియదు.2018-19 సంవత్సర బడ్జెట్‌ను 1,74,454 కోట్లుగా ప్రతిపాదించి దాన్ని 1,61,223 కోట్లకు సవరించారు, దాన్నింకా సవరించి తాజా తాత్కాలిక లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం 1,57,150 కోట్ల రూపాయలు. అందువలన మార్చినెలతో ముగిసే బడ్జెట్‌ ఖర్చు 1,42,152 కోట్ల కంటే తక్కువే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం లేదు. అంటే అంతకు ముందు ఏడాది కంటే కనీసం 20వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గిపోయినట్లే. ఇది అభివృద్ధి అని పాలకులకు అనుగుణ్యంగా ఎవరైనా పొగడకపోతే సన్నాసుల భాష రంగంలోకి వస్తుంది.
తగ్గింపు, కోతలు దేనికి ఉంటాయంటే సంక్షేమ కార్యక్రమాలకు పెడితే జనం ఓట్లు వేయరు గనుక ఆస్ధుల సృష్టికి తోడ్పడే పెట్టుబడి వ్యయాలకు కోత పెడుతున్నారు. అది ఎంతకాలం అంటే ఎంతకాలం సాగితే అంతకాలం .2017-18లో పెట్టుబడి వ్యయం ఖరారైన లెక్కల ప్రకారం రూ.57,768 కోట్ల రూపాయలైతే, తరువాత అది గణనీయంగా పడిపోయింది. 2018-19 బడ్జెట్‌ అంచనా రూ.48,999 కోట్లు కాగా సవరించిన మొత్తం రూ.42,196 కోట్లు, 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదన రూ.35,436 కోట్లు కాగా సవరించిన ఖర్చు రూ.13,165 కోట్లు మాత్రమే. అయినా వచ్చే ఏడాది దాన్ని రూ.22,061 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రాబోయే సంవత్సరం కూడా కాంట్రాక్లర్ల నుంచి ప్రజాప్రతినిధులు కమిషన్లు పొందే అవకాశాలు మరింత తగ్గిపోతాయనే చెప్పాలి. ఎన్నికల్లో వారు పెట్టిన పెట్టుబడులను రాబట్టుకొనేందుకు ఏ ఇతర మార్గాలు వెతుక్కుంటారో చూడాలి. నిధులు లేకపోతే పనులు జరగవు, కాంట్రాక్టర్లు ఉండరు, కమిషన్లు ఉండవు. సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నందుకు సంతోషించాలా, ఆస్ధుల కల్పన నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసించాలా ?
రాబడులు పరిమితం అయి, పెట్టుబడి వ్యయాన్ని మరింతగా కుదించిన తరువాత సంక్షేమ పధకాలకే కోత. రెండు పడక గదుల ఇండ్ల గురించి కొండంత రాగం తీసిన కెసిఆర్‌ ఆచరణలో వైఫల్యం కావటానికి కారణమిదే. అందుకే ఈ బడ్జెట్‌లో కూడా స్వంత ఇంటి స్ధలం ఉన్నవారిని కట్టుకొనేందుకు ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. లేని వారికి ఇండ్ల స్ధలం ఎందుకు ఇవ్వరు ? అయితే పెట్టుబడి వ్యయం బడ్జెట్‌ కేటాయింపుల్లో తగ్గుతున్నప్పటికీ నీటి పారుదల మరికొన్ని రంగాలలో అప్పులు తెచ్చి పెట్టుబడి వ్యయంగా ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు వడ్డీ చెల్లింపు ఉండదు, బయటి నుంచి తెచ్చే అప్పులకు వడ్డీ అదనం. ఇది వినియోగదారుల మీద లేదా అంతిమంగా ప్రభుత్వం మీద భారంగా మారనుంది. ఈ ధోరణి పెరిగితే రాబోయే రోజుల్లో వినియోగ చార్జీల మోత మోగటం లేదా ఎత్తి పోతల వంటి పధకాలు నామమాత్రం కావటం లేదా మూతపడటం తప్ప మరొక మార్గం ఉండదు.
స్వంత డబ్బా కొట్టుకోవటంలో పాలకులకు మించిన వారు మరొకరు ఉండరు. తెలంగాణా అందుకు మినహాయింపు కాదు, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామంటారు. కొన్ని కీలక రంగాలలో కేటాయింపులే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధిని తీసుకుంటే 2019-20 బడ్జెట్‌లో కేటాయింపు 3.5శాతం అయితే అంతకు ముందు సంవత్సరంలో వివిధ రాష్ట్రాల సగటు 6.1శాతంగా ఉంది.ఇదే విధంగా విద్యకు 7.5 అయితే రాష్ట్రాల సగటు 15.9, ఆరోగ్యానికి 4శాతం అయితే రాష్ట్రాల సగటు 4.5శాతంగా ఉంది. పెన్షన్ల వంటి వాటికి అదనంగా ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. హరీష్‌ రావు ప్రసంగంలో చెప్పినదాని ప్రకారం గత ఐదు సంవత్సరాలలో స్వంత రాబడి సగటు పెరుగుదల రేటు 21.5శాతం ఉంటే ఫిబ్రవరి నెలలో 6.3శాతానికి పడిపోయింది. ఈ పూర్వరంగంలో వచ్చే ఏడాది బడ్జెట్‌ లోటును రూ.33,191 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని పూడ్చుకోవాలంటే ఉన్న అవకాశాలేమిటి? అప్పులు తీసుకురావటం, కెసిఆర్‌ చెప్పినట్లు విద్యుత్‌ ఛార్జీలు, మరోసారి ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు, ఇంకా తన పొదిలో ఏమున్నాయో తెలియదు. మరో మార్గం ప్రభుత్వ ఆస్తులు అవి భూములు లేదా మిగిలిన ప్రభుత్వరంగ సంస్దల అమ్మకం వలన గానీ రాబట్టుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం పన్ను ఆదాయాన్ని 71వేల కోట్ల నుంచి 85వేల కోట్లుగానూ, పన్నేతర ఆదాయం 12 నుంచి 30వేల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఈ మొత్తాలను పైన పేర్కొన్న వనరుల నుంచి సేకరిస్తారు. ఇప్పటికే తెలంగాణాలో జనం తప్పతాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వారి నుంచి ఈ ఏడాది రూ.12,600 కోట్లను రూ.16,000 కోట్లకు పెంచనున్నారు. ఇది తాగుడును మరింతగా పెంచటం లేదా మద్యం రేట్లను పెంచటంద్వారాగానీ రాబడతారు.
ఇక వృద్ది విషయానికి వస్తే ప్రభుత్వం చెబుతున్న సీన్‌ కనిపించటం లేదు. 2016 మార్చి నుంచి 2019 మార్చినెల వరకు మూడు సంవత్సరాలలో జిఎస్‌డిపి వృద్ధి రేటు వ్యవసాయం, వస్తూత్పత్తి, సేవారంగాలలో 14,2,14.3,15శాతాల చొప్పున ఉంది. వ్యవసాయ రంగంలో 17.3 నుంచి 10.9శాతానికి పడిపోయింది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఆ రంగంలో దిగజారుడు ఆందోళన కలిగించేదే.

Image result for harish rao budget
రుణభారం ఏటేటా పెరుగుతున్నది. 2017-18లో అన్ని రకాల ప్రభుత్వ రుణాల మొత్తం రూ. 1,52,190 కోట్లు కాగా 2020-21నాటికి ఆ మొత్తం 2,29,205 కోట్లుగా చూపారు. ఇవి గాక మిషన్‌ కాకతీయ, భగీరధ వంటి పధకాలకు తీసుకున్న అప్పులు మరో 40వేల కోట్లు అదనం. ఇతర సంస్దలు తీసుకున్నవాటిని కూడా చేర్చితే ఇంకా పెరుగుతాయి. దీనికి అనుగుణ్యంగానే చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా పెరుగుతుంది. వివిధ పధకాలకు కేటాయింపులు ఘనంగా జరిపినా చివరికి వాటిలో ఖర్చు చేసేదెంత అన్నది ప్రతి బడ్జెట్‌లోనూ ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వస్తున్నది. ఆదాయరాబడి గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు గనుక ఈ బడ్జెట్‌కు అదే ప్రశ్నను మరింత గట్టిగా వేయాల్సి ఉంటుంది.
భజన చేయు విధము తెలియండీ భక్తులారా అన్నట్లుగా రెండు బడ్జెట్లకు కొట్టచ్చినట్లు కనిపించే మార్పు ఏమంటే కెసిఆర్‌ భజన. గత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మామ తన గురించి తాను పొగడుకోలేరు. దాన్ని భర్తీ చేయాలి, గనుక ఈ ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో , ఆర్ధిక మంత్రి ప్రసంగంలోనూ అసలు, వడ్డీతో సహా భజన చేయించుకున్నారు. బడ్జెట్‌ ప్రసంగ పాఠం 79 పేజీల్లోనూ అంతకంటే ఎక్కువగానే కెసిఆర్‌ను ఆకాశానికి ఎత్తారు.