Tags

, ,

Image result for narendra modi authoritarian

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా ఒక్కసారిగా చమురు ధరలు 30శాతం వరకు పతనమయ్యాయి. ఒక్క మంత్రి లేదా సామాజిక మాధ్యమంలో ఒక్క బిజెపి కార్యకర్తగానీ ఈ మేరకు వినియోగదారులకు ధరలు తగ్గుతాయి అని చెప్పటం లేదు. గతంలో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం ప్రారంభం కాగానే దాన్ని మనకు అనుకూలంగా మలచుకుంటామని కబుర్లు చెప్పారు. అదేమిటో ఎక్కడా చెప్పరు. కానీ జరుగుతున్నదేమిటి ? ధరలను మరింతగా పెంచారు. దానిలోకి వెళ్లే ముందు అసలేం జరుగుతోందో చూద్దాం.
2013 సెప్టెంబరు 16న మనం దిగుమతి చేసుకొనే రకం చమురు ధరలు, పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
పీపా ధర రూ. 117.58 డాలర్లు.
డాలరుకు రూపాయి విలువ 66.02.
చమురు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రూ.50.02
డీలర్లకు విక్రయించిన ధర              రూ.52.15
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ   .9.48
డీలర్‌ కమిషన్‌                             రూ. 1.79
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం            రూ.12.68
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ. 76.10
2020 మార్చి 14న వివరాలు
డీలర్లకు విక్రయించిన ధర              రూ.28.50
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ.22.98
డీలర్‌ కమిషన్‌                              రూ. 3.54
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం           రూ.14.85
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ.69.87
నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా రూపాయి విలువ ఎలా పతనమైందో దిగువ వివరాలు ఉన్నాయి.ఇప్పుడు 74 రూపాయలకు పతనమైంది. అదే పతనం కానట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా డీలర్లకు విక్రయించే ధర ఇంకా తగ్గి ఉండేది. వినియోగదారులకు ఇంకా చవకగా అంది వుండేది. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పన్ను మొత్తాన్ని రూ.9.48 నుంచి రూ.22.98కి పెంచింది. అదే లేనట్లయితే డీలరు కమిషన్‌ పెంచినా పెట్రోలు రూ.56.37కు వచ్చి ఉండేది.
చమురు ధరలను గణనీయంగా తగ్గించాల్సిన పెద్ద మనిషి శనివారం నాడు పెట్రోలు మీద రూ.19.98గా ఉన్న ఎక్సయిజ్‌ పన్నును రూ.22.98కి పెంచారు. ఈ పెంపుదల దూరదృష్టితో చేసినదని, ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న ద్రవ్య స్ధితిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వనరులు అవసరమని ఒక అధికారి సన్నాయి నొక్కులు నొక్కారు. గడచిన నాలుగు మాసాల్లో చమురు ధరలు తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకే గణనీయంగా పోయిందని సమర్ధించుకున్నారు. అంటే తగ్గిన మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించకూడదన్నది మోడీ సర్కార్‌ విధానం అన్నది స్పష్టమైంది.పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నది సామెత. మంచి రోజులను తెస్తానని చెప్పిన నరేంద్రమోడీకి అధికారమిస్తే చేసినదాన్ని ఏమనాలి?
మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు, 2020 మార్చి 13వ తేదీన పీపా ముడి చమురు ధర రూ.2,342 గా ఉంది. ఇదే రోజు రూపాయి విలువ 73.74గా ఉంది.నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఆయన సమర్ధత కారణంగా ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు మన కరెన్సీ విలువ పెరిగి వుంటే చాలా చవకగా పెట్రోలు, డీజిలు అందుబాటులోకి వచ్చి ఉండేది. ఒక పీపాలో ముడి చమురు 159 లీటర్లు ఉంటుంది. దాన్నుంచి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్‌,20 లీటర్ల కిరోసిన్‌ లేదా విమాన ఇంథనం, ఆరు లీటర్ల ప్రొపేన్‌, 24 లీటర్ల ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఇవి రావటానికి ముడి చమురుకు ఇతర ఉత్పత్తులను జత చేయాల్సి ఉంటుంది. ఒక పీపా నుంచి ఒక వంద లీటర్లు పెట్రోలు, డీజిల్‌ అనుకుంటే ఇతర ఉత్పత్తుల మీద వచ్చే ఆదాయం శుద్ధి చేసిన ఖర్చుకు పోతుంది అనుకుంటే మోడీ గారి పన్ను బాదుడు లేనట్లయితే చాలా తక్కువకు జనం పొంది ఉండేవారు. అది మిగతా వస్తువుల ధరలను కూడా తగ్గించేందుకు దోహదం చేసి ఉండేది.
మోడీ సర్కార్‌ ఇతర అన్ని రంగాలలో విఫలమైందని అనేక అంశాలు నిరూపించాయి. మన ఎగుమతులతో జనానికి కలిగిన లబ్ది ఏమిటో తెలియదు గానీ దిగుమతుల్లో సింహభాగమైన ముడిచమురును ఒక ఆదాయవనరుగా మార్చుకొని వినియోగదారులను ఎలా లూటీ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ లూటీ అనే పెద్దమాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మోపిన పన్ను భారాన్ని జన సంక్షేమానికి ఖర్చు చేయలేదన్న కారణంగానే.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి పదకొండు రకాల ఖాతాల నుంచి గణనీయ మొత్తంలో ఆదాయం వస్తోంది.2014-15లో అంటే మోడీ సర్కార్‌ తొలి ఏడాదిలో వచ్చిన ఆదాయ మొత్తం రూ.1,72,065 కోట్లు, అది 2018-19 నాటికి రూ. 3,48,041 కోట్లకు పెరిగింది, రెట్టింపైంది. ఇదే కాలంలో ఈ మొత్తంలో ఎక్సైజ్‌ పన్ను రూ.99,068 కోట్ల నుంచి రూ 2,14, 369 కోట్లకు పెరిగింది( ఒక ఏడాది రూ 2,42,691 కోట్లు వచ్చింది), అంటే దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.Image result for narendra modi authoritarian
బిజెపి మరుగుజ్జులు ఈ లూటీని తక్కువ చేసి చూపేందుకు చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలు విధించే వ్యాట్‌ (పన్ను) కారణమని తప్పుడు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలు కూడా పన్ను వేస్తున్నాయి, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టిలోకి తెచ్చి తమ ఆదాయాన్ని పూడ్చాలని రాష్ట్రాలు చేస్తున్న వినతిని కేంద్రం పట్టించుకోవటం లేదు. దీని వెనుక రెండు కారణాలు ఒకటి జిఎస్‌టి పద్దతిని అమలు జరిపితే రాష్ట్రాలకు పంచకుండా దొడ్డిదారిన పన్నులు వేసి తన బొక్కసానికి చేర్చుతున్న మొత్తాన్ని కేంద్రం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవది రాష్ట్రాలకు తగ్గిన మేరకు ఆదాయాన్ని పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు వ్యాట్‌తో సహా ఆరు రకాల ఖాతాల ద్వారా పొందిన ఆదాయం రూ.1,60,554 నుంచి రూ.2,27,591 కోట్లు ఉంది, దీనిలో వ్యాట్‌ పెరుగుదల రూ.1,37,157 నుంచి రూ.2,01,265 కోట్లు మాత్రమే. కేంద్రం మోపిన భారం ఎక్కువన్నది స్పష్టం.