Tags

, , ,

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons

ఎం కోటేశ్వరరావు
రూపాయికి కరోనా వైరస్‌ సోకిందా ?  పతనాన్ని అరికట్టటంలో నరేంద్రమోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందా ? మోడినోమిక్స్‌ గురించి గతంలో పొగిడిన వారు ఇప్పుడు నోరు మెదపరేం ? గతంలో రూపాయి పతనాన్ని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఏమంటారు ? ఇలా ఎన్నో ప్రశ్నలు కేంద్ర పాలకులను చుట్టుముడుతున్నాయి. ఒక్కరూ నోరు విప్పరేం. పోనీ రూపాయి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ గురించి నోరు విప్పరు. కానీ సిఎఎ,ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ వంటి అనేక వివాదాస్పద విషయాల మీద మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు అంటూ నోరు వేసుకొని పడిపోతున్నారే !
రూపాయిని కాపాడుకొనేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించనున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. దాంతో రూపాయి శుక్రవారం నాడు కాస్త కోలుకుంది. సోమవారం నాడు మార్కెట్‌లు ప్రారంభం కాగానే మరోసారి పతనమైంది. రోగం ఒకటైతే మోడీ సర్కార్‌ మందు మరొకటి వేస్తోందా ?
చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. గురువారం నాడు రికార్డు స్దాయిలో పతనమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు కోలుకుంది.ఒక్క రోజులో కరోనా వైరస్‌ తగ్గిందీ లేదు, కొత్తగా పెరిగిందీ లేదు. సోమవారం నాడు తిరిగి భారీ స్ధాయిలో పతనమైంది. అసలేమి జరుగుతోంది ? ఏమి జరగబోతోంది ? ప్రభుత్వం చెప్పదు, చెప్పిన మేథావులకు దేశ వ్యతిరేకులనో, కమ్యూనిస్టులనో మరొకటో ముద్ర వేస్తున్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కాని మేథావులకు మన దేశం గొడ్డుపోయిందా ? లేదే, మరి వారెందుకు చెప్పటం లేదు, చెప్పినా మీడియా జనం ముందుకు తేవటం లేదా ?
ఈ పూర్వరంగంలో మన రూపాయి రక్షణ గురించి చూద్దాం. రూపాయి పతనమైతే ఎగుమతిదారులు సంతోషపడతారు, దిగుమతిదారులు ఆగ్రహిస్తారు. రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులు సంతోషిస్తారు, ఎగుమతిదారులు కన్నెర్ర చేస్తారు. మధ్యలో జనం సంగతేమిటి ? 1961లో వంద రూపాయలకు వచ్చే వస్తువులను నేడు కొనాలంటే రూ.7,557 కావాలి మరి ! లేదూ దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 59 సంవత్సరాల క్రితం వంద రూపాయలుంటే దాని నిజ విలువ ఇప్పుడు రూ.1.40కి దిగజారింది. ఈ లెక్క ఎలా వచ్చిందంటారా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు చెప్పినా లెక్కవేసి పెడతారు. ప్రతి ఏటా ప్రభుత్వం వినిమయదారుల ధరల సూచీని ప్రకటిస్తుంది.             అందువలన ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమాన సంవత్సర వినిమయదారుల సూచీని సదరు ప్రామాణి సంవత్సర సూచీతో భాగహారం చేయగా వచ్చే మొత్తాన్ని వందతో హెచ్చ వేయండి. మీకు ఫలితం వస్తుంది.1961 వినిమయదారుల ధరల సూచి 2.57, 2020 సూచీ 194.25. వీటితో పైన చెప్పిన పద్దతిలో భాగహారం చేస్తే 75.58 వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. దీన్ని వందతో హెచ్చవేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు 1961 తరువాత గరిష్ట ద్రవ్యోల్బణం 1974లో 28.6, అంతకు ముందు సంవత్సరం రెండవ రికార్డు 16.94. (ఈ కారణంగానే ఆ రెండు సంవత్సరాలలో దేశంలో అనేక చోట్ల ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళనలు తలెత్తాయి) నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు 2013లో ద్రవ్యోల్బణం 10.91. తరువాత క్రమంగా 6.35 నుంచి 2017లో 2.49గా ఉంది. దీన్ని మోడీ సర్కార్‌, బిజెపి పెద్ద ఎత్తున తమ విజయంగా,మోడీ ప్రతిభగా ప్రచారం చేసుకున్నాయి. మరుసటి ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ 2019లో 7.66కు చేరింది, ఈ ఏడాది ఇంకా ఖరారు కాలేదు. దీన్ని ఎలా చెప్పాలి ? 2019లో రూ.7,019కి వచ్చిన సరకుల ధర 2020లో రూ.7,557 అవుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ద్రవ్యోల్బణం తిరోగమనంలో పయనించింది. 1976లో అది గరిష్టంగా మైనస్‌ 7.63, అందువలన 1975లో రూ.312 రూపాయలకు వచ్చిన సరకులు 1976లో రూ.288కే వచ్చాయి.

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons
రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అని ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ ఈ మాటలు అన్నారు. అదేమి చిత్రమో, గానీ యుపిఏ నాటి కంటే నేడు మరింత దిగజారినా ప్రధానిగా మోడీ నోటి వెంట ఒక్క మాటా రాదు. ఆ పెద్దమనిషి భక్తులకూ నోట మాట పడిపోయింది. గోమాత శాపమా ?
ఎక్సేంజ్‌ రేట్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ రూపి అని గూగుల్‌ తల్లిని వేడుకుంటే కరుణించి అందచేసే సమచారంలో వికీపీడియాను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కళ్లుండీ చూడలేని నమో భక్తుల గురించి జాలిపడదాం. అడ్డంగా వాదిస్తే వాస్తవాలతో పని పడదాం. గత పది సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి విలువ వార్షిక సగటు విలువ ఎలా ఉందో దిగువ చూడండి.
ఏడాది రూపాయి విలువ
2004-05    44.93
2005-06    44.27
2006-07    45.28
2007-08    40.24
2008-09    45.91
2009-10    47.41
2010-11    45.57
2011-12    47.92
2012-13    53.21
2013-14    60.50
2014-15    61.14
2015-16    65.46
2016-17    67.07
2017-18    64.45
2018-19    69.92
2019-20 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సగటున రూపాయి విలువ 70.40. ఈ ఏడాది గత కొద్ది రోజులుగా పడిపోతూ 2018 అక్టోబరు రెండు నాటి రికార్డు పతనం 74.48కి దగ్గరగా 74.44 వరకు దిగజారింది. ఈ పతనానికి కారణాలేమీ చెప్పలేదు గనుక దీనికి కూడా మోడీ సర్కార్‌ అవినీతే కారణం అనుకోవాలి మరి. ఈ రికార్డు పతనంతో నిమిత్తం లేకుండానే పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు దిగజారాయి. ఇంతగా దిగజారింది కనుకనే రిజర్వుబ్యాంకు డాలర్లను విక్రయించేందుకు పూనుకుంది.
రూపాయి పతనమైతే మన సరకుల ధరలు విదేశాల్లో తగ్గి ఎగుమతులు పెరుగుతాయి కదా ! అలాంటపుడు దాన్ని నివారించేందుకు రిజర్వు బ్యాంకు ఎందుకు పూనుకున్నట్లు ? అసలు విషయం ఏమంటే మన సరకులకు విదేశాల్లో డిమాండ్‌ లేదు. పోనీ నరేంద్రమోడీ విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రతి చోటా, మన దేశానికి వచ్చిన ప్రతి విదేశీ నేతను కౌగలింతలతో ముంచెత్తినా వారి నుంచి తాను ప్రశంసలు, పొగడ్తలు పొందటం తప్ప ఎగుమతి మార్కెట్‌ అవకాశాలను కల్పించలేకపోయారు. మన కరెన్సీ పతనాన్ని ఇంకా కొనసాగనిస్తే మనం దిగుమతి చేసుకొనే చమురు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది జనం మీద, ఆర్దిక వ్యవస్ధ మీద మరింత భారం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న స్ధితిలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కాపాడుకొనేందుకు బిజెపి పాట్లు పడుతోంది.
మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. 1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు.
మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.
నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.
విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?
నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?
వక్రీకరణలతో జనాన్ని మోసం చేయలేరు, భక్తులు మోడీని అసలు గట్టెక్కించలేరు. రూపాయి పతనాలు గతంలో జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. దాన్నొక సమస్యగా చేసింది నరేంద్రమోడీ ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ అన్న మోడీని మీ ఏలుబడిలో సంగతేమిటని అడిగే హక్కు అందరికీ వుంది. ఆయన భక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే కిరాయి జనం వున్నారు. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చే నాటికి 2014 మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి తాజాగా 74.34కు పతనం అయింది.

Image

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. దాన్నయినా అదుపు చేయాలి, మోడీ గారిని అయినా అదుపులో పెట్టాలి, లేకపోతే మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గరగా రూపాయిని తీసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.