Tags

, , , , ,

The Chinese navy’s Daishandao is the country’s only hospital ship, but that could be about to change. Photo: Reuters
ఎం కోటేశ్వరరావు
జనవరిలోనే వైరస్‌ తీవ్రత గురించి గూఢచార సంస్ధలు హెచ్చరించినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టించుకోలేదని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సంచలన విషయాన్ని తాజాగా వెల్లడించింది. చైనా కటువుగా వ్యవహరించి ఫలితాలు సాధిస్తే, స్వేచ్చా సమాజాల పేరుతో వ్యవహరించిన తీరు కారణంగా ఐరోపా, అమెరికాల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు వాపోతున్నాయి. ఇల్లినాయిస్‌ రాష్ట్రం కూడా జనాలు బయటకు రావద్దని ప్రకటించటంతో అమెరికాలో ఏడున్నర కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినట్లయింది. మరోవైపు తొలుత ఎక్కడైతే వైరస్‌ ప్రబలిందో చైనాలోని ఆ ఊహాన్‌ నగరం, పరిసరాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఎవరు మహమ్మారిని నిర్లక్ష్యం చేశారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరించారో ప్రపంచానికి వెల్లడైంది.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే న్యూయార్క్‌ నగరం కరోనా కేంద్ర స్ధానంగా మారిపోయింది. న్యూయూర్క్‌ రాష్ట్రంలో 8,377 కేసులు నిర్దారణ కాగా ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ఆరు రోజుల వ్యవధిలో 183 నుంచి 5,151కి పెరిగాయి. ఇవి మొత్తం అమెరికాలో మూడో వంతు అని నగర మేయర్‌ పరిస్ధితి తీవ్రతను వివరించారు.రెండు మూడు వారాలకు సరిపడా మాత్రమే వైద్య సరఫరాలు ఉంటాయని కూడా చెప్పారు.
చైనాలో కొత్తగా కేసులేమీ నమోదు కావటం లేదన్న వార్తలను యావత్‌ ప్రపంచం హర్షిస్తోంది. మహమ్మారిని అదుపు చేయటం సాధ్యమే అని రుజువైంది. తాము ఒక మహమ్మారితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తొలుత ప్రకటించారు, అదే విధంగా తొలిసారిగా ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సిపిఎం నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం తన ప్రత్యేకతను వెల్లడించింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనపుడు చైనా కమ్యూనిస్టు దేశంలో ప్రారంభమైన వైరస్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కనుక అక్కడకు వచ్చిందని ప్రచారం చేసిన ప్రబుద్దులు లేకపోలేదు. వైరస్‌ గురించి చైనా సర్కార్‌ దాచి పెట్టిందని జీవ ఆయుధాన్ని తయారు చేస్తూ తన గోతిలో తానే పడిందని దుమ్మెత్తి పోయటంతో పాటు జనాన్ని నిర్బంధించిందని ప్రచారం చేసిన వారికీ కొదవ లేదు. ఇప్పుడు అవే నోళ్లు చైనా, కేరళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అవి నోళ్లా మరొకటా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

H/O: China Robots coronavirus CloudMinds robot in Wuhan with patients at field hospital
చైనా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో కరోనా వైరస్‌ అదుపు కూడా చేరింది. దాని గురించి కొన్ని అంశాలను చూద్దాం. మహమ్మారి దండయాత్ర ప్రారంభమైన ఉహాన్‌ నగరంలోని హాంగ్‌షాన్‌ క్రీడా కేంద్రాన్ని రోబోట్లతో నడిచే ఆసుపత్రిగా మార్చివేశారు. స్మార్ట్‌ ఫీల్డ్‌ హాస్పటల్‌గా పిలిచిన ఆ కేంద్రంలో ఇరవై వేల మందికి వ్యాధిగ్రస్తులకు చికిత్స ఏర్పాట్లు చేశారు. వైరస్‌ విస్తరణ తగ్గుముఖం పడుతున్న సమయంలో తీసుకున్న ఈ చర్య ఆరోగ్యకార్యకర్తల మీద వత్తిడిని తగ్గించేందుకు అన్నది స్పష్టం. జనవరిలో కరోనా వైరస్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకలో వ్యాపించి 712 మందికి సోకి ఏడుగురి ప్రాణాలు తీసింది. ఓడలోని ప్రయాణీకులకు ఆహారం సరఫరా చేసే పళ్లాల(ట్రే) ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని ఒక జపాన్‌ నిపుణుడు వ్యాఖ్యానించిన తరువాత రోబోల ప్రయోగం గురించి ఆలోచన వచ్చింది. చైనా, స్పెయిన్లలో డ్రోన్లను జనాన్ని కట్టడి చేసే ప్రచారానికి, ఔషధాల సరఫరాకు వినియోగించారు. దక్షిణ కొరియాలో వైరస్‌ ప్రబలిన ప్రాంతాలలో రోగ క్రిమి నిర్మూలన మందులు చల్లేందుకు వినియోగించారు. ఈ నేపధ్యంలోనే చైనాలోని క్రీడా కేంద్రాన్ని ఆసుపత్రిగా మార్చి అక్కడ పెద్ద ఎత్తున రోబోలను వినియోగించారు. రోగులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తుండగానే రోబోలు, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఇతర పరికరాలతో రోగులను స్కాన్‌ చేశారు. వారి స్ధితిని తెరల మీద నుంచి వైద్యులు పర్యవేక్షించారు. సిబ్బందికి సైతం కొన్ని పరికరాలను అందచేశారు. అంతేనా రోగులకు అవసరమైన ఆహారం, మంచినీరు, ఔషధాలకే కాదు, ఆసుపత్రిని శుభ్రం చేయటం, రోగులకు ఉల్లాసం కలిగించటం కోసం చివరికి రోబోలతో డ్యాన్సులు కూడా చేయించారు. ఇప్పుడు తీవ్రత తగ్గిపోయినా తిరిగి ప్రబలితే పని చేయించేందుకు వాటిని సిద్దంగా ఉంచినట్లు క్లౌడ్‌ మైండ్స్‌ అనే సంస్ధ తెలిపింది.

GP: Coronavirus China robot disinfectant
రోబోలతో ఆహారాన్ని అందించటం ఇప్పటికే అనేక చోట్ల పరిమితంగా జరుగుతోంది కనుక ఇదేమీ కొత్త కాదు. ఆసుపత్రులలో వినియోగించటమే విశేషం. వందల కిలోమీటర్ల దూరం నుంచి వాటిని విమానాల్లో తెప్పించి ఊహాన్‌ నగరంలోకి ప్రవేశించే అనేక చోట్ల వాటిని వినియోగించారు.వైరస్‌ నిరోధ అవసరాలకు అనుగుణ్యంగా రోబోలలో కొన్ని మార్పులు చేశారు.ఇవి తమకు ఎంతో సహాయకారిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనేక దేశాల నుంచి వీటిని తెప్పించారు. చైనా అనుభవం చూసిన తరువాత కరోనా బారిన పడిన ఇటలీ, ఇతర అనేక దేశాలలో రోబోల వినియోగం పెరిగింది. తాము తయారు చేసిన రోబో ఒక్కొక్కటి విద్యుత్‌ చార్జి చేసిన తరువాత రెండున్నర గంటల పాటు పని చేస్తుందని తొమ్మిది- పది గదులలలో క్రిమి నిర్మూలన మందులను చల్లి శుభ్రం చేస్తుందని, పది నిమిషాల్లో బాక్టీరియా, కొన్ని రకాల వైరస్‌లను నిర్మూలిస్తుందని డెన్మార్క్‌ కంపెనీ ప్రతినిధి చెప్పారు. రోబోలను తయారు చేసే అమెరికా గ్జెనెక్స్‌ కంపెనీ ఉత్పత్తి గత ఏడాది మొత్తంగా చేసిన వాటి కంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 400శాతం పెరిగిందని వెల్లడించారు.

Image result for Covid 19 pandemic, trump cartoons
వైరస్‌ తీవ్రత గురించి చెప్పినప్పటికీ ట్రంప్‌ కొట్టిపారవేశారని, తీవ్రంగా పరిగణించలేదని, అమెరికాలో వ్యాపించే అవకాశం లేదని భావించినట్లు , చైనా అధ్యక్షుడు చెప్పినదానిని నమ్మాల్సిన పనిలేదని అన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. తొలి వారంలోనే నివేదించినప్పటికీ జనవరి 18వ తేదీ వరకు ఆరోగ్య, మానవ వనరుల శాఖల అధికారులు ట్రంప్‌కు నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిపింది. తరువాత ఉన్నతాధికారులను కలసి వారిని ఒప్పించిన తరువాత సమీక్షలు ప్రారంభమైనట్లు కూడా పేర్కొన్నది. చివరకు అమెరికాలో వ్యాపించినట్లు వెల్లడైన తరువాత కూడా దాన్నొక ముప్పుగా ట్రంప్‌ పరిగణించలేదని, వ్యాధి నిరోధక కేంద్రం అధికారిణి నాన్సీ ఫిబ్రవరి చివరిలో హెచ్చరికలను కూడా పట్టించుకోకపోగా ఆమె మదుపుదార్లను భయపెడుతున్నారని ట్రంప్‌ ఫిర్యాదు చేసినట్లు కూడా వాషింగ్టన్‌ పోస్టు వ్యాఖ్యానించింది.
ఉహాన్‌లో యుద్ద ఓడలకు రూపకల్పన చేసే ప్రభుత్వ ఓడల నిర్మాణ సంస్ధ అత్యవసర వైద్య సహాయ ఓడలకు రూపకల్పన పూర్తి చేసినట్లుగా తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఇది కరోనా వైరస్‌లకే కాదు, ఇతర వైరస్‌ చికిత్సలకు సైతం అనువుగా ఉంటుందని పత్రికలు రాశాయి. ప్రస్తుతం చైనా మిలిటరీ ఆధ్వర్యంలో 14వేల టన్నుల బరువు గల ఒక ఆసుపత్రి ఓడ ఉంది. దానిని విదేశాలకు మానవతా పూర్వక సాయం చేసేందుకు శాంతి ఓడ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో 20 ఇంటెన్సివ్‌ కేర్‌, పది క్వారంటైన్‌ పడకలతో సహా మూడు వందల మందికి ఒకేసారి చికిత్సలు చేయవచ్చు.చైనా కొత్తగా రూపకల్పన చేసిన ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత మహమ్మారులు తలెత్తినపుడు బాధితులను తరలించేందుకు, చికిత్సలకు, సముద్రాల్లో రోగుల నుంచి వ్యా ధులు విస్తరించకుండా క్వారంటైన్‌ చేసేందుకు, ఇతర సందర్భాలలో ఇతర అవసరాలకు కూడా వినియోగించవచ్చు. ఈ ఓడ నమూనాతో ప్రయాణీకుల ఓడలను కూడా నిర్మిస్తే వాణిజ్య పరంగా కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయని భావిస్తున్నారు.
చైనా కంటే కరోనా వైరస్‌ ఐరోపాను గట్టిగా తాకింది. ఇది స్వేచ్చా సమాజాలు చెల్లిస్తున్న మూల్యమా అని ప్రశ్నిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక వ్యాఖ్యానం, విశ్లేషణను ప్రచురించింది. ఇది వంకర బుద్ది నుంచి వెలువడిన ఉత్పత్తి అన్నది స్పష్టం. స్వేచ్చా సమాజమా, మరొకటా అన్న విచక్షణ వైరస్‌లు, బాక్టీరియాలకు ఉండన్నది వేల సంవత్సరాల చరిత్ర. అంతెందుకు వర్తమానానికి వస్తే ఫ్లూ(జలుబు)కారణంగా ఏటా అమెరికాలో 27 నుంచి 77వేల మంది వరకు మరణిస్తున్నారని ఇది ఫ్లూ(ఇన్‌ఫ్లూయంజా) కంటే పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదన్నట్లుగా మార్చి నాలుగవ తేదీ డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా సిడిసి సమాచారం ప్రకారం 2010 నుంచి ఏటా అమెరికాలో 93లక్షల నుంచి 4.9 కోట్ల మంది వరకు ఫ్లూబారిన పడుతున్నారు, 37వేల నుంచి 2017-18వరకు 61వేల మధ్య మరణించారు. స్వేచ్చా సమాజానికి ప్రతీకగా ఉన్న అమెరికాలో ఉన్న పరిస్ధితి ఇది. దీనికి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏమి చెబుతుంది ?

Image result for Covid 19 pandemic, trump cartoons
ఫిబ్రవరి 28వ తేదీన కరోనా గురించి ట్రంప్‌ పత్రికా గోష్టిలో మాట్లాడినదేమిటో చూద్దాం. ఒక అద్భుతం లేదా మాయ మాదిరి ఒక్క రోజులో కరోనా మాయం అవుతుంది. వేడి వాతావరణం వైరస్‌ను హరిస్తుంది, వ్యాప్తిని అరికడుతుంది అని చెప్పాడు.(బహుశా ఆ ప్రభావంతోనే బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌తో కరోనాను అరికట్ట వచ్చని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చెప్పారా ?) అలాంటి పెద్ద మనిషి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగా నేడు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది. స్వేచ్చా సమాజం కారణంగానా పాలకుల బాధ్యతా రాహిత్యం వలన ఇది జరిగిందా ? విశ్లేషకులకు ఈ మాత్రం కూడా తెలియదని అనుకోవాలా ? చైనా సకాలంలో స్పందించలేదని విమర్శిస్తున్న వారు అమెరికా, ఐరోపా పాలకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య స్పందనను ఏ విధంగా వర్ణిస్తారు?
ఐరోపా సౌహాద్రత అనేది పుస్తకాలకే పరిమితమైన దేవతా కథల వంటివి. మీరు తప్ప మాకు సాయం చేసే వారు లేరు, డబ్బు మాకు సమస్య కాదు, ఐరోపా యూనియన్‌ నుంచి అవసరమైన పరికరాలు తెచ్చుకోవటం అసాధ్యమని దాని ప్రకటన వెల్లడించింది. ఈ స్ధితిలో మీరు తప్ప మాకు వేరే స్నేహితులు లేరు, మీరే ఆదుకోవాలి, మాకు డబ్బు అవసరం లేదు, మీరు ఏది పంపగలిగితే దాన్ని పంపండి, మేమేమీ దాచుకోవటం లేదు, మమ్మల్ని మేము రక్షించుకోలేని స్ధితిలో ఉన్నాం, చైనా సోదరుల సాయం కోసం ఎదురు చూస్తున్నాం అని ఐరోపా దేశమైన సెర్బియా అధ్య క్షుడు యుసినిక్‌ చైనా రాయబారికి చేసిన వినతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనా సమస్య తలెత్తక ముందు చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని, ఐరోపా నుంచి పెంచుకోవాలని ఐరోపా ధనిక దేశాలు సెర్బియా మీద వత్తిడి తెచ్చాయి. ఇప్పుడు అవే దేశాలు కరోనా కారణంగా తాము వస్తు సరఫరా చేయలేమని చేతులెత్తాశాయి. పరస్పరం సాయం చేసుకోవాల్సిన తరుణంలో తోటి దేశం పట్ల స్వేచ్చా సమాజాల నిజస్వరూపమిది !