Tags

, ,

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి యావత్‌ సమాజం ఆందోళన పడుతోంది. దానితో నిమిత్తం లేకుండా రాజకీయాలు చేయటంలో కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు మునిగిపోయారు. మధ్యప్రదేశ్‌లో కమలం వైరస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. అధికార దాహం వైరస్‌ సోకిన 22 మంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయిన తరువాత కమల తీర్ధం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్దానిక సంస్దల ఎన్నికల వైరస్‌ సోకిన వారి వింత లేదా విపరీత ప్రవర్తన చూశాము. అదింకా కొనసాగుతూనే ఉంది. తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలినా ఎదురుదాడులు చేయటం కొనసాగుతూనే ఉంది. మంత్రులు వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలను చూస్తే అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. అంటే మిగతా సమయాల్లోనే ముఖ్యమంత్రి సర్వాధికారి అన్నది దాని అర్ధం. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. ముఖ్యమంత్రి అనుగ్రహం పొందాలనుకొనే పెద్దలు ఇంకా ఆ ప్రయత్నాలను మానుకోలేదు. ప్రయోజనం సంగతి పక్కన పెడితే ఈ ఉదంతం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలకు, బయటి వారికీ తెలిసింది.
తాజాగా శనివారం నాడు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మీడియాతో మాట్లాడిన విషయాలను చూస్తే సుప్రీం కోర్టు తీర్పు స్పూర్తిని గ్రహించినట్లు లేదు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడిందా లేదా ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారా ? ఇది ఒక విపరీతమైతే తనకు, తన కుటుంబానికీ భద్రత లేదంటూ ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్రానికి ఫిర్యాదు చేయటం, తాను పొరుగు రాష్ట్రం నుంచి పని చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని కోరటం కూడా ఒక విపరీత పరిణామం, దేశ చరిత్రలో తొలిసారి.
బుగ్గన రాజేంద్రనాధ్‌ గారు ఎన్నికల కమిషనర్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. కమిషనర్‌కు అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని విస్మరించకూడదు అన్నారు, సమంజసమే. కోవిడ్‌ నియంత్రణ చర్యలు, గురించి సిఎస్‌ను ఎందుకు సంప్రదించలేదు అని బల్ల చరిచి మరీ ప్రశ్నించారు. తీసుకున్న చర్యలు గురించి సిఎస్‌ లేదా ఆరోగ్యశాఖ అధికారులు ఒక కాపీ రూపంలో అయినా అధికారికంగా ఎన్నికల కమిషనర్‌కు పంపారా లేదా ఒక వేళ పంపితే ఇక సంప్రదించాల్సిన అవసరం ఏముందో మంత్రిగారు చెప్పాలి. అసలు సమీక్షలే చేయలేదన్న విమర్శలు, ఆరోపణలను తగిన ఆధారాలతో ఆయన ఖండించి ఉండాల్సింది.

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire
కోవిడ్‌ను నివారించే సందర్భంలో ఎన్నికల నియమావళి (కోడ్‌) వల్ల ప్రభుత్వ పరిపాలన, నిర్ణయాలకు ఇబ్బంది ఏర్పడదా? అని అమాయకంగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే వర్తించేదిగా ప్రత్యేకంగా ఏమైనా రూపొందించారా ? కాదని మంత్రికి తెలియదా? ఒక వేళ ఇబ్బంది అనుకుంటే కమిషనర్‌ను సంప్రదించే అవకాశాన్ని ఎందుకు వినియోగించకోలేదో చెప్పాలి. ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిసి రమేష్‌కుమార్‌ కేవియట్‌ను ఎందుకు వేయించారు? ఇదేమైనా వ్యక్తిగత తగాదానా? అని ప్రశ్నించిన మంత్రిగారికి రమేష్‌ కుమార్‌ వ్యక్తిగా కాదు, ఎన్నికల కమిషనర్‌గా వెళ్లారని తెలియదా ? జగన్‌మోహనరెడ్డి గారు అధికారాల గురించి ఒక వ్యక్తిగా ప్రశ్నించారా లేక ముఖ్య మంత్రిగా ప్రశ్నించారా, అదే విధంగా ఏ హౌదాతో సుప్రీం కోర్టు తలుపు తట్టారు అన్నది మంత్రిగారు చెప్పాలి మరి !
‘జ్వరం వస్తే పారాసెటిమాల్‌ కాక ఇంకేం వాడతారు? ఎవరైనా డాక్టర్లను అడగండి ఏం చెబుతారో! మీడియా పవర్‌ ఉందని చెప్పి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తారా?’ అని ఎల్లో మీడియాపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు అని ఒక పత్రిక రాసింది.
కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం అరగంటకు పైగా వివరిస్తే అదంతా వదిలి ఎల్లో మీడియా సీఎం పారాసెటిమాల్‌పై మాట్లాడిన మాటలను ప్రసారం చేసిందని మంత్రి ఆరోపించారు. కోవిద్‌ నియంత్రణ లేదా నివారణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద లేదా తీవ్రంగా ప్రభావితమైన చైనా చర్యలను ప్రమాణంగా తీసుకోవాలి, ముఖ్యమంత్రి వాటినే చెప్పాలి లేదా వాటిని చెప్పి అవి పనికిమాలిన విషయాలని కొట్టివేసి పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ గురించి చెప్పి ఉండాల్సింది. వాటితో వైరస్‌ నివారణ అంత సులభమైతే మంత్రిగారే చెప్పినట్లు అరగంటకు పైగా వివరించాల్సిన పనేముంది?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసినట్టు చెబుతున్న లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హౌంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఎందుకు కేవియట్‌ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి?
ఈ ప్రశ్నలు వేసినవారు తరువాత ఏమైందో జనానికి చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ?
అధికారపార్టీ నేతలు పోలీసుల దర్యాప్తును కోరబోయే ముందు తమ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదో ఎందుకు తెలుసుకోలేదు ? లేఖ గురించి అధికారికంగానే కేంద్ర హౌంశాఖను సంప్రదించి నిర్ధారణ చేసుకొనేందుకు ఎందుకు ప్రయత్నించలేదు ? ఆ పని చేయకుండా ఎందుకు కాలక్షేపం చేశారు? పోనీ తరువాత ఆ లేఖ ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచే వచ్చిందని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. దాని మీద వైసిపి, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించటమెందుకు ? ఆ లేఖలోని అంశాలేమిటో బహిర్గతం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండిస్తూ లేదా వివరణ ఇస్తూ రాసిన లేదా రాయనున్న లేఖను కూడా బహిర్గతం చేస్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నికల కమిషనర్‌ కొందరు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుందా లేదా అన్నది కూడా నోరువిప్పి చెప్పాలి. ఎన్నికల కమిషనర్‌ ఎందుకు నోరు విప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై కూడా స్పందించటం లేదని విమర్శలు తలెత్తినపుడు కూడా స్పందించలేదు. అప్పుడు వైసిపి నేతలు చిద్విలాసాన్ని ప్రదర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా అని కూడా గుర్తు చేసిన వారు లేకపోలేదు.
ఇక ఎన్నికల కమిషనర్‌ లేఖ గురించి బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చేసిన వాదనలు చిత్రంగా ఉన్నాయి. కేంద్ర హౌంశాఖకు రోజూ అనేక లేఖలు వస్తుంటాయి. వాటి గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఆ శాఖ స్పందిస్తుంది అన్నారు. అది కొంత మేరకు వాస్తవమే కావచ్చు. ఇక్కడ ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మీద ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తీవ్ర విమర్శలు చేసిన పూర్వరంగంలో ఎన్నికల కమిషనర్‌ పేరుతో ఒక లేఖ మీడియా, సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరింది. ఇంత జరుగుతున్నా రాజకీయంగాక పోతే కేంద్ర హౌంశాఖ మౌనంగా ఉండటంలో అర్ధం ఏమిటి ? సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వెంటనే అసాధారణ రీతిలో స్పందించిన వారు అదే విషయాన్ని బహిరంగంగా చెప్పలేరా ? అందినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించిన తరువాత లేఖలోని అంశాల గురించి రాష్ట్రాన్ని వివరణ అడుగుతుందా, తదుపరి చర్యలు ఏమిటి ? ఇవన్నీ ప్రస్తుతానికి ఎదురు చూస్తున్న ప్రశ్నలు.
ఎన్నికల కమిషనర్‌ లేఖ ఎలా బయటకు వచ్చింది అన్న ప్రశ్నకు పెద్దగా బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. గతంలో అనేక అంశాలు బయటకు వచ్చినట్లుగానే ఇదీ వచ్చింది. వైసిపి పెద్దలు పేర్కొనే ఎల్లో మీడియాలో అంతా చూసినట్లుగా, ఆధారాలతో రాసినట్లుగానే జగన్‌గారి సాక్షి పత్రిక, ఛానల్‌లోనూ అలాంటి వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అందువలన ఈ ఉదంతంలో జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవాలని కోరటం గర్హనీయం. ఎవరి మీడియాలో పని చేసినా వారు నిమిత్త మాత్రులు. ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన తొలి, వివాదాస్పద పత్రికా సమావేశంలో కొందరు జర్నలిస్టుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఎంత మంది వస్తారో అంచనా వేయలేని, తగిన ఏర్పాట్లు చేయలేని దుస్ధితిలో ఉన్నట్లు వెల్లడి అయింది. ఒక వేళ తగినంత స్ధలం లేకపోతే ముందు వచ్చిన వారిని కూర్చోనిచ్చి మిగతావారికి ఖాళీ లేకపోతే ఏమి చేయాలో వారికే వదలి వేయాలి తప్ప కొందరికి ప్రవేశం లేదని ప్రకటించటం తగనిపని, గర్హనీయం. కొందరు రావటం ఇష్టం లేకపోతే ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికే ఆహ్వానాలు పంపటం ఒక పద్దతి, వచ్చిన వారిని అవమానించటం ఏమిటి ?
ఎన్నికల కమిషనర్‌ లేఖపై తెలుగుదేశం పార్టీ రాజకీయం సంగతి ఏమిటి అన్నది చూద్దాం. ఆ పార్టీ గవర్నర్‌ను కలిసి చర్య తీసుకోవాలని కోరింది. ఆ లేఖను తాను రాసిందీ లేనిదీ కమిషనర్‌ నిర్ధారించకుండానే అది వాస్తవమే అన్నట్లుగా అది వ్యవహరించింది. లేఖలోని అంశాల ఆధారంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినంత మాత్రాన ఆ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు ?

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటి కావటంతో వైసిపి నాయకత్వం తట్టుకోలేకపోయింది. ఆ ఉద్రేకం లేదా ఉక్రోషంలో ముఖ్యమంత్రి జగన్‌మోపాన్‌రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతర కరం. తరువాత స్పీకర్‌తో సహా పార్టీ భజన దళం మరింతగా రెచ్చిపోయింది. వెంట వెంటనే వరుసగా జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి ఇబ్బందుల్లోకి నెట్టారు. రాజకీయ పర్యవసానాలను ఎరక్కపోయి తానే ఇరుక్కున్నారు. కరోనా వైరస్‌ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది, అదే వైరస్‌ తాత్కాలికంగా అయినా రాజకీయంగా మరింత నష్టపోకుండా చూస్తోంది. గత తొమ్మిది నెలలుగా జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే, ఎన్నికల కమిషనర్‌ ప్రమేయం ఉన్న ఉదంతం ఒక ఎత్తు. ఇది వీరాభిమానులను అభిమానుల స్ధాయికి తగ్గించింది. పైకి చెప్పకపోయినా ప్రయివేటు సంభాషణల్లో నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఇతరులు చెప్పిందాన్ని వినకపోగా తానుగా తెలుసుకోలేని స్ధితిలో తమ నేత ఉన్నట్లు భావిస్తున్నారు. అది వైసినేతగా ఉన్నపుడు జనానికి దానితో పని లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కుదరదని చెప్పాల్సి వస్తోంది. ఇదే స్ధితి మరికొంత కాలం సాగితే…..అభిమానం కూడా వేసవి కాలంలో మంచులా కరిగిపోతుంది !