Tags

, , ,

Image result for WE CANNOT LET THE CURE BE WORSE THAN THE PROBLEM ITSELF: Donald trump
ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి !! చైనా, ఇటలీ తరువాత మూడో స్ధానంలోకి చేరిన అమెరికా !!! వారం రోజుల క్రితం అమెరికాలో కరోనా మరణాలు 85, మంగళవారం రాత్రికి 622కు చేరిక, కోలుకున్న వారు 361 మంది. ఇదే వ్యవధిలో పాజిటివ్‌ కేసులు 4,600 నుంచి 49,594కు పెరిగాయి. సగం కేసులు న్యూయార్క్‌ నగరంలోనే నమోదయ్యాయి. రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పధకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది.దాంతో ఫెడరల్‌ రిజర్వు(రిజర్వుబ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్ధులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న.
ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా ” వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పది హేను రోజుల తరువాత ఏ మార్గంలో మన పయనించాలనుకుంటున్నామో నిర్ణయిస్తాం ” అని ట్రంప్‌ ప్రకటించాడు. దీని అర్ధం ట్రంప్‌కు విలువైన మానవ ప్రాణాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని వేరే చెప్పనవసరం లేదు. సామాజికంగా జనం దూరం పాటించటం వలన కరోనా వైరస్‌ విస్తరణ తగ్గవచ్చు, కానీ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతింటోందనే భావం కార్పొరేట్ల నుంచి వెలువడుతోంది. ఈ నేపధ్యంలోనే సామాజికంగా దూరం పాటించాలన్న మార్గదర్శక సూత్రాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలిపారు.బాధ్యతా రహితంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని ట్రంప్‌ తీరుతెన్నుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు అంటువ్యాధుల జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫాసీ జవాబిస్తూ ”ట్రంప్‌ మాట్లాడుతుంటే ముందుకు దూకి ఆయనను పక్కకు తోసి మైకు లాక్కోలేను కదా ! మాట్లాడేదేదో మాట్లాడనివ్వండి, రెండవ సారి సరి చేస్తాం ” అని సైన్సు పత్రిక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
కరోనా సాయం పేరుతో సామాన్యులకు బదులు ఎన్నికల సమయంలో తనకు అనుకూల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టే యత్నాలను డెమోక్రాట్లు అడ్డుకున్న పూర్వరంగంలో ట్రంప్‌ ప్రేలాపనలివి. అమెరికా కంటే తీవ్రంగా ప్రభావితమైన చైనాలో వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా ప్రభావితం అవుతున్నా ఖర్చుకు వెనకాడకుండా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకూ, ట్రంప్‌ వైఖరికి ఎంత తేడా ఉందో చూడవచ్చు. అదే జనం పట్ల నిబద్దత ఉన్న కమ్యూనిస్టులకు, కార్పొరేట్ల సేవలో తరించే పెట్టుబడిదారీ ప్రతినిధులకు ఉన్న వ్యత్యాసం. అమెరికాలో వేగంగా వైరస్‌ విస్తరిస్తున్న పూర్వరంగంలో ఇప్పటికే పది కోట్ల మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మరోవైపు దానికి వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడుతున్నాడు. ఇటలీ అనుభవాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నా ఇలా వ్యవహరిస్తాడా ?

Image result for coronavirus Donald trump cartoons
తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఒక్కొక్కరికి పన్నెండు వందల డాలర్ల నగదు అందచేతతో సహా రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పధకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఆసుపత్రులు, నగరాలు, రాష్ట్రాలు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, ట్రంప్‌, ఆర్ధిక మంత్రి విచక్షణ మేరకు కార్పొరేట్లకు నిధులు పందారం చేసే ప్రతిపాదనను సెనెట్‌లో డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం ఇలాంటి పధకాలకు సెనెట్‌లోని వంద మంది సభ్యులకు గాను 60 మంది ఆమోదం అవసరం. ప్రతి పక్షం మద్దతు ఇస్తే తప్ప అది కుదరదు. నిరుద్యోగ భృతి చెల్లించాలని అభ్యర్ధిస్తూ వచ్చిన వినతులు గతవారంలో 20లక్షలకు పైగా వచ్చాయని, ఆర్ధిక పరిస్ధితి బాగోలేదనేందుకు ఇదొక సూచిక అని గోల్డ్‌మన్‌ సాచెస్‌ విశ్లేషకుడు చెప్పారు. రానున్న రోజుల్లో 1930దశకం నాటి మహామాంద్యం కంటే ఎక్కువగా నిరుద్యోగం 30శాతం మించవచ్చని కొందరు చెబుతున్నారు.
అమెరికా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఉద్దీపన పధకాన్ని డెమోక్రాట్లు అడ్డుకున్నట్లు కార్పొరేట్‌ అనుకూల అమెరికా మీడియా వార్తలను ఇచ్చింది. అధికార రిపబ్లికన్లు సామాన్యులకు బదులు కార్పొరేట్లకు ప్రజాధనాన్ని అప్పగించే ప్రతిపాదనలు చేసిన కారణంగానే డెమోక్రాట్లు వ్యతిరేకించారన్న విషయాన్ని దాచి పెట్టేందుకు మీడియా ప్రయత్నించింది. లక్ష కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యల గురించి చెబుతూ ఆమొత్తంలో 50వేల కోట్ల డాలర్లను కార్పొరేట్లకే కట్టబెట్టేందుకు ట్రంప్‌ పూనుకున్నాడు. దీన్ని ఆమోదించాలా వ్యతిరేకించాలా ? అది కూడా ట్రంప్‌, ఆర్ధిక మంత్రి ఎవరికి సిఫార్సు చేస్తే వారికి చెల్లించే ప్రతిపాదనలతో నిండి ఉంది. ఎన్నికలకు ముందు ఇలాంటి విచక్షణ అధికారంతో ఎవరు లబ్ది పొందుతారో, అందుకు ఎలాంటి పధకం వేశారో తెలుస్తూనే ఉంది. సెనెట్‌లోని వందమంది సభ్యుల్లో 60 మంది ఆమోదం అవసరం కనుక డెమోక్రాట్లు దాన్ని అడ్డుకున్నారు.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది. దక్షిణ కొరియాలో సాధారణ పరీక్షలను సులభంగా చేయించుకోవచ్చు, ఇక్కడ పొందలేము. కాబట్టి కరోనా వైరస్‌ను పనిచేసే సమాజంలో మాత్రమే అదుపు చేయగలం, ఇక్కడ చేతులు దాటిపోతోంది. మనం దానికి సిద్ధంగా లేము. మనమూ, మన నేతలూ గత నాలుగుదశాబ్దాలుగా బాగా చేస్తున్నదేమంటే మిగతా అంతా కుప్పకూలి పోతుంటే ధనికులు, కార్పొరేట్ల జేబులు నింపుతున్నాం.” అన్నారు.
భయంకరమైన ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్లను అనుమతించే సమయం కాదిది అని డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీశాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కార్పొరేట్ల ఏజంట్లు(లాబీయిస్టులు) ఆయా పరిశ్రమలకు రాయితీల కోసం పైరవీలు చేస్తున్నారు. ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమ ఐదు, విమానయానం 50, హౌటల్స్‌ 150బిలియన్‌ డాలర్లు కోరితే పారిశ్రామికవేత్తలు లక్షా40వేలు, అంతర్జాతీయ షాపింగ్‌ మాల్స్‌ వారు లక్ష కోట్ల డాలర్ల మేర రాయితీలు కావాలని కోరినట్లు శాండర్స్‌ తెలిపారు. జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ను దేశవ్యాపితంగా మూసివేసినప్పటికీ సభ్యత్వాల చెల్లింపు, ఫిట్‌నెస్‌ పరికరాలకు ముందస్తు పన్ను చెల్లింపు సొమ్మును వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ఆడిదాస్‌ కోరింది. ఒక వైపు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి నిలిపివేస్తే అతిధి కార్మికులకు వీసాలు ఇచ్చేందుకు వెంటనే పార్లమెంట్‌ చర్యలు తీసుకోవాలని పందిమాంస కార్పొరేట్స్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అత్యవసర ఆరోగ్య సేవలకోసం ఈ అసాధారణ సంక్షోభ సమయంలో పార్లమెంట్‌ అసాధారణ చర్యలకు ఉపక్రమించాలని శాండర్స్‌ కోరాడు.
మన దేశం విషయానికి వస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ను ముందుగానే ఆమోదించింది. ఇదే సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది సేవలను అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లు చరచాలని ఇచ్చిన పిలుపును అన్ని పార్టీల వారూ ఆమోదించారు, ఆచరించారు. అనేక రాష్ట్రాలు కరోనా కట్టడిలో భాగంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేస్తూ నిర్ణయించటంతో పాటు పేదలను ఆదుకొనేందుకు తమ శక్తికొద్దీ సాయాన్ని ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు నిధులు ఇస్తామని చెప్పటం తప్ప పేదలను ఆదుకొనే నిర్దిష్ట చర్యలేవీ(ఇది రాస్తున్న సమయానికి) ప్రకటించలేదు. జనానికి ఉపశమనం కల్పించాల్సింది పోయి ఈ సమయంలోనే లీటరు పెట్రోలు, డీజిల్‌కు మూడేసి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచింది. మరో ఎనిమిది, పది రూపాయల వరకు పెంచుకొనేందుకు పార్లమెంట్‌ అనుమతి తీసుకుంది. లీటరుకు ఒక రూపాయి పన్ను పెంపుదల ద్వారా కేంద్రానికి ఏటా పద్నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరుతుంది. గత ఆరు సంవత్సరాల కాలంలో మోడీ సర్కార్‌ పెట్రోలు మీద ఎక్సయిజ్‌ సుంకం రూ.9.48 నుంచి రూ. 22.98కి పెంచిన విషయం తెలిసిందే. అంటే జనం మీద ఏటా లక్షా 90 కోట్ల రూపాయల భారాన్ని అదనంగా మోపుతోంది. అయినా కరోనా సంక్షోభంలో కష్ట జీవులను ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు.
ఉద్దీపన చర్యల్లో భాగంగా రెండులక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించాలని పరిశ్రమలు, వాణిజ్య సంస్ధల వారు కేంద్రాన్ని కోరారు. జనధన్‌ బ్యాంకు ఖాతాలున్న వారికి ఐదు వేల రూపాయల నగదును బదిలీ చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఉద్యోగులు, కార్మికులు పనులకు వెళ్లలేని స్ధితిలో ఉంటే కనీసం 80శాతం వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Image result for coronavirus Donald trump cartoons
వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు సామాన్య జనాన్ని ఆదుకొనేవిగా ఉండాలి తప్ప కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా మారకూడదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వాలు తీసుకొనే చర్యలు విమర్శలకు అతీతంగా ఉంటాయని, కొన్ని కంపెనీల ప్రయోజనాలకు తోడ్పడకూడదని ఎవరైనా ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ ఆ విధంగానే కనిపిస్తున్నది. రాఫెల్‌ విమానాల విషయంలో ప్రభుత్వ రంగ సంస్ధను విస్మరించి అంబానీలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పరీక్షలకు ప్రభుత్వ సంస్ధ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి) ఆమోదించిన అన్ని కిట్లను ఉపయోగించకుండా కేవలం అమెరికా, ఐరోపా యూనియన్‌ ఆమోదించిన వాటికే పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటాన్ని ఏమనాలి. పోనీ అవసరాలకు తగ్గట్లుగా అవి సరఫరా అవుతున్నాయా అంటే, లేదు. అలాంటి వాటిని ఉత్పత్తి చేసే సంస్ధ గుజరాత్‌లో ఒక్కటి మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు కంపెనీలు కిట్లతో లాభాలు పిండుకోవటాన్ని వెంటనే నివారించటం అవసరం.