Tags

,


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ! ఏ క్షణంలో అయినా చైనా సంఖ్యను మించి పోయే పరిస్ధితిలో ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, చివరికి తగినన్ని ముసుగుల(మాస్క్‌లు)కు సైతం కొరత ఏర్పడవచ్చనే అంచనాతో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు తన నుంచి సాయం పొందిన దేశాలనే సాయం అందించమని ఇప్పుడు అడుక్కుంటోంది. దీనిలో కూడా రాజకీయాన్ని చొప్పించి రష్యాను అర్ధించవద్దని రాయబారులను ఆదేశించింది. ” ఫారిన్‌ పాలసీ ” అనే పత్రిక ” యుఎస్‌ అప్పీల్స్‌ టు ఎయిడ్‌ రిసిపెంట్స్‌ ఫర్‌ హెల్ఫ్‌ ఇన్‌ ఫైటింగ్‌ కరోనా వైరస్‌ ” అనే శీర్షికతో మార్చినెల 23న రాసిన వ్యాసంలో ఈ అంశాన్ని పేర్కొన్నది. తూర్పు ఐరోపా, యూరేసియా ప్రాంతంలో అమెరికా సాయం పొందిన దేశాల నుంచి అమెరికాకు అవసరమైన వైద్యపరికరాలు, రక్షణ ఉత్పత్తుల కోసం రంగంలోకి దిగాలని విదేశాంగశాఖ అగ్రశ్రేణి దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది. అమెరికాలో రోజు రోజుకూ వ్యాధి గ్రస్తులు, మృతుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో రాయబారులను అమెరికా రంగంలోకి దింపింది. అయితే అన్ని దేశాలూ కరోనాతో వణికిపోతున్న తరుణంలో అమెరికాకు అవి ఏమాత్రం సాయం చేయగలవో తెలియదు. ఇది రాస్తున్న సమయానికి అమెరికాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 55వేలు దాటిపోయింది. ఆరోగ్యబీమా అందరికీ లేని కారణంగా అనేక కేసులు నమోదు కావటం లేదని వార్తలు వచ్చాయి.
కొద్ది రోజుల క్రితమే తమకు అవసరమైన పరికరాలు, పరీక్షలకు కొదవ లేదని ట్రంప్‌ మాట్లాడిన వెంటనే విదేశాంగశాఖ రాయబారులను రంగంలోకి దించటాన్ని బట్టి వైరస్‌ తీవ్రతను ట్రంప్‌ యంత్రాంగం గమనించలేదన్నది స్పష్టమైంది. మార్చి22న ఐరోపా,యూరేసియా దేశాలకు విదేశాంగశాఖ సీనియర్‌ అధికారి డేవిడ్‌ హాలే పంపిన ఇమెయిల్‌ అంశాలు తమకు లభ్యమైనట్లు ఫారిన్‌ పాలసీ పత్రిక పేర్కొన్నది. ఏ ఏదేశాలు అమెరికాకు అవసరమైన పరికరాలు, ఇతర సరఫరాలను విక్రయించగలవో సంప్రదించాలని రాయబారులను దానిలో కోరారు. అయితే రష్యాను అడగొద్దని ప్రత్యేకంగా పేర్కొన్నట్లు కూడా వెల్లడించింది. వేలాది వెంటిలేటర్లు, ఇతర ఆధునిక పరికరాలు అవసరమని హాలే పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి అనేక దేశాలకు సాయం అందించే చర్యలను సమన్వయం చేసే కార్యాలయం ద్వారానే ఇప్పుడు తమకే సాయం అవసరమని ఆయా దేశాలను అభ్యర్ధించింది.
కొద్ది రోజుల క్రితం అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ వైరస్‌ ప్రబలిన సమాచారం తెలియగానే తమ దగ్గర ఉన్న అత్యంత నిపుణులైన వారిని చైనా వారికి సాయం చేసేందుకు పంపుతామంటే చైనా అనుమతించకుండా వైరస్‌ తీవ్రతను పెంచిందని, ప్రపంచానికి ముప్పు తెచ్చిందని ఆరోపించాడు. ట్రంప్‌ కూడా అదే మాదిరి ఆరోపణలు చేశాడు. ఇప్పుడు అదే చైనా దేశీయంగా వైరస్‌ను అదుపు చేసి అనేక దేశాలకు అవసరమైన సాయం చేస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేసిన అమెరికా తన పౌరుల ప్రాణాలకు పెను ముప్పు తెచ్చింది. ఒక్క చైనా మాత్రమే ఐరోపాకు అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేయగలదని చెక్‌ రిపబ్లిక్‌ హౌం మంత్రి జాన్‌ హామ్‌సెక్‌ చెప్పాడు. ఈ రోజు కాకున్నా రేపైనా అమెరికా సైతం సాయం కోసం చైనాను కోరక తప్పకపోవచ్చు.
అమెరికాలో జనానికి అత్యవసరమైన వైద్య పరికరాలు, ఇతర సరఫరాల కోసం ట్రంప్‌ సర్కార్‌ గట్టి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆయుధ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు వాటి బదులు అత్యవసరమైన వైద్యపరికరాల తయారీ చేపట్టేందుకు వీలుగా డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని ఎందుకు ప్రయోగించటం లేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గతవారంలో అలాంటి చట్టాన్ని వినియోగించేందుకు వీలుకల్పిస్తూ ట్రంప్‌ ఒక ఉత్తరువు మీద సంతకం చేసినా అమలు చేయటం లేదు. పారిశ్రామికవేత్తలు స్వచ్చందంగా ఉత్పత్తులు ప్రారంభిస్తారని ట్రంప్‌ సుభాషితాలు పలకటం తప్ప ఎవరూ ఇంతవరకు ముందుకు రాలేదు. న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ కుమో దీని గురించి చెబుతూ తాను వెయ్యి మాస్క్‌ల కోసం సంప్రదిస్తే ఇరవై నిమిషాల తరువాత ఒక కంపెనీ వారు ఫోన్‌ చేసి ధరలు పెరిగిపోయాయని, మీ కంటే మాకు ఇతరుల నుంచి మంచి ధర వచ్చే అవకాశం ఉందని సమాధానం వచ్చిందన్నారు. ధరలను పెంచే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ ఆదేశించినా ఆ పరికరాల వివరాలు లేకపోవటంతో చర్యలు తీసుకొనే అవకాశ ం లేకపోయింది.
రక్షణ ఉత్పత్తుల చట్టాన్ని అమలు జరిపితే రక్షణ పరిశ్రమలను జాతీయం చేసినట్లుగా వాణిజ్యవేత్తలలో భయాందోళనలు తలెత్తుతాయని ట్రంప్‌ చెప్పటం విశేషం. జాతీయం చేసే దేశం తమది కాదు, అది మంచిది కూడా కాదు అన్నారు. ఇప్పుడు నేను ఒక కంపెనీని వెంటిలేటర్లు తయారు చేయాలని ఆదేశిస్తే వారికసలు వెంటిలేటర్లు అంటే ఏమిటో కూడా తెలియని స్ధితిలో ఉంటారని అయినా మన దగ్గర అవసరమైన మిలియన్ల కొలది మాస్క్‌లు, ఊపిరి తీసుకొనే పరికరాలు ఉన్నాయని వాటితో చికిత్స చేస్తే చాలునని ట్రంప్‌ చెప్పిన తరువాతే విదేశాంగ శాఖ వైద్య సరఫరాల కోసం రాయబారులను రంగంలోకి దించింది. స్వచ్చందంగా వైద్య ఉత్పత్తులు చేయాలని కోరిన తరువాత మద్యం తయారు చేసే ఒక ఫ్రెంచి కంపెనీ తన మూడు యూనిట్లను శానిటైజర్స్‌ తయారు చేయాలని కోరింది. హనీవెల్‌ సంస్ధ ఎన్‌95 మాస్క్‌ల ఉత్పత్తిని పెంచింది, మరో నెల రోజుల్లో కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని చెప్పింది. ఈలోగా పరిస్ధితి దిగజారితే పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ట్రంప్‌ తప్పుదారి ప్రకటనలు కొల్లలుగా చేస్తున్నాడు. జనరల్‌ మోటార్స్‌ మరియు ఫోర్డ్‌ కంపెనీలు వెంటిలేటర్లను తయారు చేస్తున్నాయన్నది వాటిలో ఒకటి. అయితే అది వాస్తవం కాదని తేలిపోయింది. ఉత్పత్తి చేయాలంటే కొన్ని నెలలు పడుతుందని కంపెనీ ప్రతినిధులు ట్రంప్‌ యంత్రాంగానికి చెప్పారు.
అమెరికాలోని పలు ఆసుపత్రులలో వైద్య సిబ్బంది వాడిన మాస్కులనే మరోసారి వాడటమే కాదు, గత్యంతరం లేక నిర్మాణ కార్మికులు వినియోగించే మాస్కులను కూడా వినియోగించాల్సి వస్తోంది. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు తుపాకులు, బుల్లెట్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. వాటికి మాత్రం ఎలాంటి కొరత లేదు. గత మూడు వారాలుగా బుల్లెట్ల కొనుగోళ్లు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడైంది. ఒక వెబ్‌సైట్‌ను చూసిన వారి సంఖ్య ఫిబ్రవరి 23 మార్చి 15 మధ్య 77శాతం పెరిగితే, ఆయుధ లావాదేవీలు 222శాతం పెరగ్గా ఆదాయం 309శాతం ఉంది. ఎటు చూసినా ఏం జరుగుతోందో తెలియని స్ధితిలో తమ దగ్గర ఆయుధం ఉంటే సురక్షితమని జనం భావిస్తున్నకారణంగానే కొనుగోళ్లు అసాధారణంగా జరుగుతున్నట్లు వెబ్‌సైట్‌ ప్రతినిధి చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలినపుడు, అనిశ్చిత పరిస్ధితులు ఏర్పడిన ప్రతిసారీ తుపాకుల కొనుగోళ్లు పెరిగినట్లు గత విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతోంది. అయితే కరోనా వైరస్‌కు దీనికి సంబంధం గురించి చెప్పలేకపోతున్నారు. ఏదైనా జరిగితే రక్షణగా ఉంటుందనే ముందు జాగ్రత్తతోనే కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు చెబుతున్నారు.


ఎప్పుడైనా వేలాది వెంటిలేటర్లు అవసరమౌతాయని ఎవరైనా కలగంటారా అని ట్రంప్‌ వాటి కొరత గురించి అడిగిన వారి మీద ఎదురు దాడి చేశాడు. మహమ్మారులు తలెత్తినపుడు అమెరికా అవసరాలకు ఎన్ని వెంటిలేటర్లు అవసరమౌతాయో సూచిస్తూ పదిహేనేండ్ల క్రితం అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖ ఒక నివేదిక ఇచ్చింది. 1957 మరియు 1968లో తలెత్తిన ఫ్లూ మహమ్మారి వంటివి మరోసారి తలెత్తితే తొమ్మిది లక్షల మంది ఆసుపత్రుల పాలౌతారని వారిలో నాలుగోవంతు మందికి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, వెంటిలేటర్లపై చికిత్స అందించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అప్పుడు 64,875 వెంటిలేటర్లు అవసరమని, అదే 1918-19నాటి స్పానిష్‌ ఫ్లూ పరిస్ధితులు వస్తే 7,42,500 అవసరమౌతాయని అంచనా వేశారు. తరువాత హెచ్‌1ఎన్‌1 ప్లూ వంటివి మహమ్మారులుగా మారితే పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు అవసరమని ఒక విశ్లేషణ వెల్లడించింది. 2006లో బడ్జెట్‌ కార్యాలయం నివేదిక ప్రకారం అమెరికాలో లక్ష వెంటిలేటర్లు ఉన్నాయని, వాటిలో 75వేలు ఏ క్షణంలో అయినా వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే గత 14 సంవత్సరాలలో అంతకు మించి ఒక్కటి కూడా అదనంగా తోడు కాలేదు. దేశంలో లక్ష వెంటిలేటర్లు ఉన్నాయని గతవారంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ చెప్పగా, లక్షా60వేలు ఉన్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వార్త పేర్కొన్నది. కరోనా వైరస్‌ బాధితులకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి గనుక అమెరికాలో వేగంగా పెరుగుతున్న రోగులకు అవసరమైన వెంటిలేటర్లు లభ్యం కావేమో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది ” అన్నారు. వెంటిలేటర్ల సంగతి దేవుడెరుగు, మాస్క్‌లు,గౌన్లు కూడా అందించలేని స్ధితి ఉన్నట్లు వార్తలు వస్తున్నందున అమెరికా ఆరోగ్యవ్యవస్ధను ఎలా నిర్లక్ష్యం చేశారో అర్ధం అవుతోంది.