Tags
Arvind Kejriwal, Coronavirus outbreak, Naredra Modi, Nizamuddin Markaz, Tablighi Jamaat, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్మాదం తలకెక్కిన మాదిరి కొందరు యాంకర్ల అరుపులు కేకలలో వినిపిస్తున్న పదాలు నిజాముద్దీన్ మర్కజ్, తబ్లిగీ జమాత్ గురించి చెప్పనవసరం లేదు. వార్తలను వార్తలుగా ఇవ్వటంలో తప్పులేదు. యాంకర్లు మరొకరు ఎవరైనా సమస్యను సమస్యగా చర్చించటం, ఎలాంటి మొహమాటాల్లేకుండా మాట్లాడటం వేరు. ఆ పరిధులను మించటమే సమస్య. కరోనా బాధితుల సంఖ్య పదిలక్షలను ఏక్షణంలో అయినా దాటి పోనుంది. రాస్తున్న సమయానికి వున్న సంఖ్య పాఠకులు చదివే సమయానికి మారిపోతోంది. మన దేశంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి ఇతర దేశాలతో పోలిస్తే ఇంకా అదుపులోనే ఉన్నాయి గానీ, పరిస్ధితి ఇలాగే ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న.
అసలేం జరిగింది, నిజాముద్దీన్ కార్యక్రమం ఏమిటి ? 1857లో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామం, దాన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలుస్తాము. అది జరిగి దాన్ని అణచివేసిన పది సంవత్సరాల తరువాత బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా హిందూ-ముస్లింలు ఐక్యంగా పోరాడాలంటూ కొంత మంది ఇస్లాం పండితులు నిర్ణయించారు. దీనిలో రెండు భావాలకు ప్రాతినిధ్యం వహించే వారు ఉన్నారు. ఆంగ్లేయుల పాలన ముస్లిం సమాజాన్ని దిగజార్చేదిగా ఉంది, మత సాంప్రదాయాలు మట్టికొట్టుకుపోగూడదు కనుక ఆ పాలనను వ్యతిరేకించి వాటిని పునరుద్దరించాలనే వారు ఒక తెగ. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో హిందూ-ముస్లిం ఐక్యతకోసం పని చేయాలనే వారు రెండవ తెగ. ఈ రెండు భావజాలాల వారూ కలసి 1867లో దారుల్ ఉలుమ్ దేవ్‌బంద్‌లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. ఆ ఉద్యమంలో భాగమైన కొందరు రాజకీయాల్లో పాల్గొనకుండా లక్ష్యా లను సాధించలేమని భావించి జమాతే ఉలేమా హింద్ అనే పార్టీని 1919లో ఏర్పాటు చేసి దేశ విభజన ప్రతిపాదనను వ్యతిరేకించారు. కొందరు దాన్నుంచి బయటకు వచ్చి విభజనకు అనుకూలంగా మారిపోయారు. ఇస్లామ్‌ను పునరుద్దరించాలని భావించే వారు 1927లో తబిలిగీ జమాత్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, రష్యాలో విప్లవం జయప్రదమై తొలి సోషలిస్టు దేశం ఏర్పడిన తరువాత ప్రపంచంలో అనేక చోట్ల అవాంఛనీయ ధోరణులు ప్రబలిన కాలం. మితవాద, ఫాసిస్టు ధోరణులు, మత పునరుద్దరణ, శుద్ధి, ఇతర మతాలకు చెందిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చాలనే ఆర్‌ఎస్‌ఎస్, హిందూమహాసభ వంటి మతశక్తులు తలెత్తటానికి అనువైన కాలం అది. ఆ పరంపరలోదే తబ్లిగీ జమాత్. ఇస్లామ్‌పు పరిరక్షించేందుకు ఆరు సూత్రాలను ముందుకు తెచ్చిన తబిలిగీ జమాత్ వాటిని ప్రచారం చేసేందుకు ప్రచారకులకు శిక్షణ, పాటించే వారికి బోధన నిమిత్తం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేది. ఆ సంస్ధ క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. సమావేశాలు ప్రాంతీయ, అంతర్జాతీయ స్వరూపాన్ని సంతరించుకున్నాయి. దానిలో భాగంగానే మార్చి 13-15 తేదీలలో నిజాముద్దీన్ సమావేశాలు జరిగాయి. వేలాది మంది వాటిలో పాల్గొన్నారు.
కరోనా వైరస్ అనేక రకాలుగా వ్యాపిస్తోంది. లక్షల మందికి వ్యాపించటానికి దారితీసిన వాటిలో ఏ కారణంతో ఎన్ని అని విశ్లేషించటం ఇప్పుడు సాధ్యం కాదు, దాని కంటే ముందు వ్యాప్తిని అరికట్టి విలువైన ప్రాణాలను ఎలా కాపాడటం అన్నదే ముఖ్యం. అయితే అందరూ అదే కర్తవ్య నిర్వహణలో ఉంటే పేచీ లేదు, కానీ ఇప్పుడు కూడా కొందరు అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. మత విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైనది. దాన్ని అదుపు చేయటం సాధ్యమే అని ఎక్కడైతో పుట్టిందో ఆ చైనాలో నిరూపించారు. మిగతా వైరస్‌ల మాదిరే కొంత కాలం తరువాత కరోనా కూడా ప్రభావాన్ని కోల్పోతుంది, కానీ ఈ సందర్భంగా వ్యాపింప చేసే జాతి, మత విద్వేష కరోనా అనేక మందిలో శాశ్వతంగా తిష్టవేస్తుంది. అది చేసే నష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే మెజారిటీ-మైనారిటీ మత విద్వేషం తాండవం చేస్తోంది. కరోనాతో అది విలయతాండవంగా మారాలని కొందరు కోరుకుంటున్నారు. ఇది మన దేశం, సమాజానికి ఏమాత్రం మంచిది కాదు.
అనేక దేశాలలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న పూర్వరంగంలో ప్రభుత్వాలు అనేక ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో జనం గుమి కూడటాన్ని అనేక చోట్ల నిషేధించారు. ఈ నేపధ్యంలో నిజాముద్దీన్ సమావేశం ఎలా జరిగింది? ఎందుకు అనుమతించారు ? ఎవరు దీనికి బాధ్యులు ? కరోనా గురించి తెలిసిన తరువాత ఇలాంటి సమావేశాలను నిర్వాహకులు ఎలా ఏర్పాటు చేశారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నివారించలేకపోయాయి, అసలు ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయా అన్నది చర్చ. మార్చినెల 22న జనతా కర్ఫ్యూ, వెంటనే మరుసటి రోజు నుంచి గృహబందీ పిలుపులతో నిజాముద్దీన్ మర్కజ్‌లో ఉండిపోయిన వందలాది మంది గురించి అక్కడ దాక్కున్నారని కొందరు ప్రచారం చేస్తే, బయటకు పోయే వీల్లేక, ప్రయాణ సాధనాలు లేక అక్కడే ఉండిపోయారని ఆ సంస్ధ చెబుతోంది. అంతే కాదు, తాము ప్రతిపాదించిన మేరకు వాహనాలకు అనుమతి ఇస్తే వారందరినీ స్వస్ధలాలకు తరలిస్తామని ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఈ విషయాలన్నింటినీ అధికార యంత్రాంగం నివేదించని కారణంగానే ముఖ్య మంత్రి కేజరీవాల్ అవాంఛనీయ చర్యలకు ఆదేశించారని సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది. ఎట్టకేలకు నిజాముద్దీన్‌లో గుమికూడి జనబందీ కారణంగా చిక్కుకు పోయిన వారిని అక్కడి నుంచి తరలించారు. ఈ సమావేశాల్లో పొల్గొని స్వస్ధలాలకు వెళ్లిన చోటల్లా అనేక కరోనా కేసులు వారి నుంచి వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో ఆ సమావేశాలతో నిమిత్తం లేని వారిలో కూడా కేసులు బయటపడుతున్నాయి.
మతపరమైన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున జనం గుమికూడటం, కొన్ని చోట్ల ప్రార్ధనా స్ధలాలకు ప్రతి రోజూ వేల సంఖ్యలో రావటం మన దేశంలో సర్వసాధారణం. దీనికి ఏ మతమూ,సంస్ధా మినహాయింపు కాదు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ అంటే అంతర్జాతీయ సంస్ధ తబ్లిగీ జమాత్ ప్రధాన కేంద్రం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గన్నవారి ద్వారా కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ కావటంతో ఆ సంస్ధ నిర్వాకాన్ని విమర్శించటం, చట్టం అనుమతిస్తే నిర్వాహకులపై కేసులు పెట్టటం కూడా నూటికి నూరుపాళ్లూ సమర్దనీయమే. 1992లో బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నవారు, అందుకు ప్రేరేపించిన వారిమీద కేసులు పెట్టారు, వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ ఉదంతం ఎందరి ప్రాణాలు తీసిందో తెలిసిందే. అలాగే కరోనా విషయాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే జమాత్ సంస్ద నిర్వాహకుల మీద కూడా కేసులు పెట్టవచ్చు. వారేమీ అతీతులు కాదు. అలాంటి కేసులు పెడితే జమాత్‌ను అనుసరించే,అభిమానించే వారు బాధపడటం లేదా నిరసన తెలపాల్సిన అవసరం లేదు. మిగతా మతాల వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించటం లేదా అని సమర్ధించుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. ఎవరో తొడ కోసుకున్నారని మనం మెడ కోసుకుంటామా ?
బాబరీ మసీదు లేదా రామజన్మభూమి పేరుతో సాగించిన కార్యక్రమాలకు, అవాంఛనీయ, నేరపూరిత ఘటనలకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంస్ధలు వాటి మాతృక సంఘపరివార్ తప్ప యావత్ హిందూ సమాజం లేదా హిందువులు కాదు. అలాగే జమాత్ సంస్ధ చేసిన పనికి యావత్ ముస్లిం సామాజిక తరగతిని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం తగని పని, గర్హనీయం. మన దేశంలో అనేక మతపరమైన కార్య క్రమాల సందర్భంగా తొక్కిసలాటలు,ప్రమాదాలు జరిగి పెద్ద ఎత్తున మరణాలు సంభవించటం, అంటు వ్యాధులు రావటం కొత్తదేమీ కాదు.కానీ వాటిని ఆయా మతాలకు లేదా మతాలను అనుసరించే యావత్ ప్రజానీకానికి ఆపాదించలేదు. ఇప్పుడు కూడా తప్పు ఎక్కడ జరిగిందో చూడాలి, తప్పు పట్టాలి. కరోనా సందర్భంగా సామాజిక దూరం పాటించినట్లే జనం మత విద్వేష భావనలకు కూడా దూరంగా ఉండాలి.
నిజాముద్దీన్ పరిణామాలను రెండుగా చూడాలి. జనతా కర్ఫ్యూ-గృహబందీ(లాక్‌డౌన్), జమాత్ సమావేశాలకు ముందు, గృహబందీ తరువాత ఏం జరిగిందో పరిశీలించాల్సి ఉంది. ‘ ది వైర్ ‘ వెబ్ పోర్టల్ వ్యవస్ధాపక సంపాదకుల్లో ఒకరైన సిద్దార్ద వరదరాజన్ చేసిన ట్వీట్లు రాజకీయ ఉద్దేశ్యాలతో కూడినవని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు తాజాగా కేసు చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు అయోధ్యలో రామనవమి ఉత్సవాలు ముందు అనుకున్న విధంగానే యథావిధిగా జరపాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నిర్దేశించినట్లు, కరోనా వైరస్ నుంచి భక్తులను శ్రీరాముడు కాపాడతాడని చెప్పినట్లుగా ఆయన చేసిన ట్వీట్లు అభ్యంతరంగా ఉన్నాయన్నది ఆరోపణ. ఈ కేసు రాజకీయ కోణంలో బనాయించారని వరదరాజన్ వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ భయం ఉన్నప్పటికీ ఆయోధ్య శ్రీరామనవమి ఉత్సవాలను యథావిధిగా జరపనున్నట్లు డెక్కన్ హెరాల్డ్ పత్రిక మార్చి17న ఒక వార్తను ప్రచురించింది. (తరువాత రెండు రోజులకు ప్రభుత్వం రద్దు చేసింది) రెండు సంవత్సరాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు ఉత్సవాలను జరిపేందుకే ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నది ఆ వార్త ప్రారంభంలోనే ఉంది. దానిలో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ పేరు పెట్టలేదు తప్ప అంతటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం గురించి ముఖ్యమంత్రితో చెప్పకుండా అధికార యంత్రాంగం ముందుకు పోతుందని ఎవరైనా ఊహిచగలరా ? అంత పెద్ద సంఖ్యలో జనం గుమికూడే సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందును ఉత్సవాన్ని రద్దు చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రభుత్వాన్ని కోరారు. అంతపెద్ద సంఖ్యలో వచ్చే వారిని పరీక్షించే అవకాశం లేదని కూడా అధికారి ఘనశ్యామ్ సింగ్ చెప్పినట్లు ఆ వార్తలో ఉటంకించారు. అయితే రామాలయ ట్రస్టు అధిపతి మహంత్ పరమహంస మేళాను ఆపటం కుదరదని, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడతాయని రాముడు స్వేచ్చ పొందిన తొలి సంవత్సరంలో ఉత్సవాలు జరపటం ఎంతో ముఖ్యమని, భక్తులకు హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని కూడా చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. ఇదే విషయాన్ని సిద్దార్ద వరదరాజన్ కూడా చెప్పారు. అయితే ఆయన ట్వీట్లలో భక్తులకు హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని యోగి అయోధ్య నాధ్ చెప్పినట్లుగా ఉందని ఆ మాటలు చెప్పింది మహంత పరమహంస అని వరదరాజన్ తన ట్వీట్‌ను సవరించుకున్నారు. మేళాను ఉపసంహరించకున్న తరువాత, గృహబందీ అమలు జరుగుతున్న సమయంలో మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించి మార్చి 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ రామనవమి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటాన్ని వరదరాజన్ తప్పు పట్టారు. దానిలో ఎంత మంది పాల్గొన్నారన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ముఖ్య మంత్రి ఒక కార్యక్రమంలో పొల్గొన్నారంటే కనీసం ఎంత మంది ఉంటారో అందరికీ తెలిసిందే.
నిజాముద్దీన్ మర్కజ్ సభలు జరుగుతున్న సమయంలో దేశంలోని దేవాలయం లేదా చర్చి. మసీదుల్లో ఎక్కడా భక్తులు గుమికూడటం గురించి ఎలాంటి ఆంక్షలు లేవు.అభ్యంతరాలు పెట్టిన వారు లేరు. అంతకు ముందే హౌలీ వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ఒంటి మిట్ట రామాలయంలో రామనవమి ఉత్సవాలను రద్దు చేసిన ప్రకటన వెలువడిన తరువాత కొందరు స్వాములు దానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడుతూ ఎలాంటి ప్రసంగాలు చేశారో సామాజిక మాధ్యమంలో వీడియోలను లక్షలాది మంది తిలకించారు. ఒక మత పెద్దల్లో ఓట్ల రాజకీయం లేదా ఉన్మాదం, మూఢనమ్మకాలు ఇలా ఉన్న తరుణంలో మరోమతం తక్కువ తింటుందని ఎవరైనా అనుకుంటారా ? రాముడు రక్షిస్తాడని ఒక మత పెద్ద చెబితే మా అల్లా మాత్రం తక్కువ తిన్నాడా, రక్షించకుండా వదలి వేస్తాడా అని మరో మతం వారు గుమికూడారని అనుకోవాల్సి వస్తోంది. భక్తి తారా స్ధాయికి ఎక్కిన తరువాత ఏ మతంవారికైనా ఇతరులు చెప్పేది, చుట్టుపక్కల జరిగేది ఏమీ పట్టదు. దానికి వెనుకబాటుతనం, మూర్ఖత్వం ఏ పేరైనా పెట్టవచ్చు.
ఇక తబ్లిగీ జమాత్ విషయానికి వస్తే ఇదొక వివాదాస్పద మత సంస్ధ. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం లేదా ఉగ్రవాదులు దీని ముసుగులో పని చేస్తున్నారనే అభిప్రాయాలు, సమాచారం ఎప్పటి నుంచో ఉంది.గతంలో జరిగిన దీని కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం గుమికూడిన ఉదంతాలు కేంద్రానికి, రాష్ట్రానికి తెలియనిదేమీ కాదు. దాని ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉందని, వివిధ దేశాల నుంచి ప్రతి ఏటా కార్యక్రమాలకు వస్తుంటారన్నది కూడా బహిరంగ రహస్యమే. వచ్చే వారు యాత్రీకుల వీసాలతో రావటం కూడా కొత్త విషయం కాదు. ఈ కార్యక్రమాల కోసమే అని వీసా తీసుకుంటే దానికే పరిమితమై వెనుదిరిగి పోవాల్సి వస్తుంది కనుక యాత్రీకుల పేరుతో తీసుకొని ముందు వెనుక ఇతర ప్రాంతాలను కూడా సందర్శించి వెళ్లటం సర్వసాధారణం. అందువలన ఈ సమావేశాలకు వచ్చిన వారు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని చెప్పటం బాధ్యత నుంచి తప్పుకొనే వ్యవహారమే. వచ్చిన వారిలో కరోనా వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉన్నారు గనుక సరిపోయింది, అదే ఉగ్రవాదులు యాత్రీకుల పేరుతో వచ్చి అవాంఛనీయ ఘటనలకు పాల్పడి ఉంటే ఇలాంటి సమర్ధనకే పూనుకొనే వారా ? మరి తబ్లిగీ జమాత్‌కు బాధ్యత లేదా ?
మలేసియాలో ఇదే సంస్ధ ఫిబ్రవరి 27 నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు కౌలాలంపూర్ పట్టణంలో నిర్వహించిన కార్య క్రమాలకు విదేశీ, స్వదేశీ జనం పదహారు వేల మంది హాజరయ్యారు. అయితే ఆ వచ్చిన వారికి వైరస్ సోకినట్లు మార్చినెల మొదటి వారంలోనే వెల్లడైంది. దీంతో తగ్లిబీ జమాత్‌కు హాజరైన ఐదువేల మందికి వ్యాధి సోకినట్లుగా ఒక అంచనాకు వచ్చి వారిని వెతికి పరీక్షలు చేయటం పదకొండవ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ విషయాలన్నీ మలేసియా మీడియాలో వచ్చాయి. ఇవన్నీ మలేసియాలో మన రాయబార కార్యా లయం లేదా అక్కడి పరిణామాలను పర్యవేక్షించే విభాగానికి తెలియకుండా పోతాయని అనుకోలేము. తెలియలేదు అంటే అవి తమపని తాము చేయటం లేదని చెప్పాల్సి ఉంటుంది. లేదా తెలిస్తే వెంటనే కేంద్రాన్ని అప్రమత్తం చేసి ఢిల్లీ తబ్లిగీ కార్య క్రమాన్ని నిలిపివేయించటం లేదా దానికి హాజరయ్యే మలేసియా, ఇతర దేశాలకు చెందిన వారిని అయినా నిలిపివేయకపోవటానికి లేదా పరీక్షించకపోవటానికి బాధ్యత ఎవరిది ? అప్పటికే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారిని అనుమానంతో పరీక్షలు చేయటం ప్రారంభమైంది, కొన్ని కేసులు బయటపడినపుడు ఈ కనీస చర్యను జమాత్ సభకు హాజరైన వారి విషయంలో ఎందుకు తీసుకోలేదు. మీడియా ఈ విషయాలన్నీ విస్మరించి మన దేశంలో వైరస్‌ను వ్యాపింప చేసేందుకు ముస్లింలు కుట్ర పన్నారనే సిద్దాంతాన్ని బలపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయటం, కార్య క్రమాలను నిర్వహించటం ఏమిటి ? సోషల్ మీడియాలో సరేసరి, ముస్లింలు, క్రైస్తవులు కరోనా వ్యాప్తికి కారకులు అనే ప్రచారాలతో రెచ్చిపోతున్నారు.
నిజాముద్దీన్ మర్కజ్‌లో బోధనా, శిక్షణాకార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మూడు రోజుల నుంచి 40రోజలు, మూడు నెలలు, కొందరు ఏడాది పాటు మకాం వేస్తుంటారు. ఇవిగాక ఏడాది కొకసారి మూడు రోజుల పాటు వార్షిక సభలు జరుగుతుంటాయి. అలాంటిదే మార్చినెల 13-15 తేదీలలో జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గన్నవారు సమీప లేదా ఇతర రాష్ట్రాల్లోని మసీదులను సందర్శించి వారు కూడా బోధనలు చేసి పోతుంటారు. తెలంగాణాలోని కరీం నగర్ జిల్లాకు వచ్చిన ఇండోనేషియన్లు, గృహబందీ కారణంగా ఇతర రాష్ట్రాలోని కొన్ని మసీదుల్లో ఉండిపోయిన వారు అలాంటి వారే.
ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడాల్సి ఉంది. ఢిల్లీ ప్రభుత్వం రెండు వందలకు మించి జనం ఎక్కడా గుమికూడదని మార్చి 13న ఆదేశాలు జారీ చేసింది. దాన్ని నిజాముద్దీన్ మర్కజ్ ఎందుకు పట్టించుకోలేదు? అప్పటికే జనం రావటం ప్రారంభమైది అంటే మరుసటి రోజు నుంచి అయినా రద్దు చేయవచ్చు, కానీ ఆపని చేయలేదు. పోనీ తాను జారీ చేసిన ఉత్తరువును అమలు జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదు ? మార్చి16న కేజరీవాల్ సర్కార్ మరొక ఆదేశం జారీ చేస్తూ 50 మందికి మించి గుమికూడటాన్ని నిషేధించింది. పోనీ దాన్ని అమలు జరిపినా మర్కజ్‌లో అన్ని వందల మంది ఉండేందుకు ఆస్కారం ఉండేది కాదు దాన్నెందుకు అమలు జరపలేదు? జమాత్ సమావేశాలకు వచ్చిన విదేశీయుల గురించి కేంద్ర హౌంశాఖ మార్చి21న తెలియచేసింది. అది కూడా కరీంనగర్‌లో ఇండోనేషియన్ల గురించి బయటపడిన తరువాత అని చెబుతున్నారు. అంటే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
మీడియా విషయానికి వస్తే నిజాముద్దీన్ వ్యవహారంలో ఆ సంస్ధ మార్చి 31న జారీ చేసిన మీడియా ప్రకటనను ఎందరు పరిగణలోకి తీసుకున్నారు. దానిలోని అంశాలతో ఏకీభవించాలా లేదా అనేది వేరే విషయం వారి వాదనను కూడా పాఠకులు, వీక్షకుల ముందు ఉంచాలా లేదా ? చైనాలో తొలి కరోనా కేసులు బయటపడిన తరువాత మన దేశంలో దాదాపు నెలన్నర పాటు ఎలాంటి నిర్ధిష్ట చర్యలనూ తీసుకోలేదనే అంశాన్ని మీడియా పట్టించుకుందా ? దేశంలో ఒక నిర్లక్ష్యపూరిత వాతావరణం ఉన్నది వాస్తవం కాదా ? కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్య మీద ఆంధ్రప్రదేశ్ పాలకపార్టీ, ప్రభుత్వం చేసిన యాగీ దేనికి నిదర్శనం ? పారాసిటమాల్ వేసుకుంటే, బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు అని ముఖ్య మంత్రులే చెప్పిన తరువాత జనం తీవ్రఅంశంగా ఎలా పరిగణిస్తారు ? గృహబందీని తప్పించుకొని అరాచకంగా జనం వీధుల్లోకి వస్తున్నారని మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆకస్మికంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా ప్రకటించిన ఈ చర్య ఒక్కసారిగా జనంలో క్రమశిక్షణ ఎలా తీసుకువస్తుంది? గోమూత్రం తాగితే కరోనా అంటదు,ఆవు పేడ పూసుకుంటే, ఇది తింటే సోకదు అని అనేక మంది ముందుకు తెచ్చిన ప్రచారాలను ఎండగట్టి శాస్త్రీయ అంశాలను జనం ముందుకు తెచ్చిన మీడియా సంస్దలెన్ని ! ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలకు తమదైన ముద్రవేసుకొని ప్రచారం చేయటం తప్ప వాటి మీద ఉన్న రెండో కోణాన్ని వివరించే వారికి అవకాశం కల్పించిన వారెందరు ?
కుట్ర సిద్ధాంతం గురించి ప్రచారం చేసే వారికి, వాటిని నమ్మేవారికి వివేచన, తర్కం ఉండనవసరం లేదా ? ఇదే మీడియా పెద్దలు గతంలో చైనా గురించి చేసిన ప్రచారాలేమిటి ? అక్కడి క్రైస్తవుల చర్చీలను ప్రభుత్వం కూల్చివేసిందని, ప్రార్ధనలను చేసుకోనివ్వటం లేదని, ముస్లింలు ఎక్కువగా ఉన్న గ్జిన్‌జియాంగ్ స్వయం పాలిత రాష్ట్రంలోని ముస్లింలందరినీ నిర్బంధ శిబిరాల్లో పెట్టారని చెడరాసి, ఆధారాల్లేని చిత్రాలను చూపిందే చూపారు కదా ! అది నిజమని ముస్లిం లేదా క్రైస్తవ జీహాదీలు నమ్మితే చైనాకు వ్యతిరేకంగా పని చేయాలి కదా ! ఇప్పుడు కరోనా వ్యాప్తి చెంది మరణాలు సంభవించి అతలాకుతలం అవుతున్న దేశాలన్నీ క్రైస్తవులు, ముస్లింలతో కూడిన అమెరికా, ఐరోపా, ఇరాన్, టర్కీలే కదా ? ఆ చైనాలో పుట్టిన వైరస్‌ను అంటించుకొని ప్రపంచానికంతటికీ వ్యాపింపచేస్తే వారికొచ్చేదేమిటి ? జీహాదీలు అదే కార్యక్రమంలో ఉంటే తోటి అరబ్బు ముస్లింలను ఇజ్రాయెల్ యూదు దురహంకారులు పెడుతున్న హింసలు, దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో ముందుగా వ్యాపింప చేయాలి. లేదా తొత్తులుగా మారిన కొన్ని మినహా యావత్ ఇస్లామిక్ దేశాలు శ త్రువుగా భావిస్తున్న అమెరికాలో ఆ పని చేయాలి. పాకిస్ధాన్ తరఫున మన దేశంలో ఆపని చేస్తున్నారంటే నివారించటంలో వైఫల్యం ఎవరిది ?
కుట్ర సిద్ధాంతాలను తలకెత్తుకొని ప్రచారం చేసే వారికి విచక్షణ ఉండదు. లేదూ జీహాదీలు మన దేశాన్ని దెబ్బతీసేందుకు కరోనాను ఆయుధంగా చేసుకున్నారని కొద్దిసేపు కొందరి మానసిక తృప్తికోసం అంగీకరిద్దాం. నిత్యం లేస్తే జీహాదీల గురించి ప్రచారం చేస్తున్నది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్. దాని నేతలే కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఆ జీహాదీలన దెబ్బతీసేందుకే కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేశామని, ఆర్టికల్ 370 ఎత్తివేశామని చెబుతున్నారు. తబ్లిగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల్లో చైనా వారు ఉన్నారని ఎవరూ చెప్పటం లేదు. మిగతా దేశాల వారు కరోనా ఎక్కడ ఎవరి నుంచి అంటించుకొని మన దేశంలో వ్యాపింప చేసేందుకు వచ్చినట్లు ? ఒక వేళ వస్తే కేంద్రం, మన గూఢచార సంస్ధలు, పర్యవేక్షణ ఏజన్సీలు ఏమి చేస్తున్నట్లు ? ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పదలచుకున్నారా ? ఒక వేళ అదే నిజమైతే మన కేంద్ర పాలకుల దౌత్యం ఘోరంగా విఫలమైనట్లే కదా ? పాకిస్ధాన్‌ను ఒంటరి చేయటంలో జయప్రదం అయ్యా మని చెప్పటం మన జనాన్ని మోసం చేయటమేనా ? దానికి మద్దతుగా ఇతర ఇస్లామిక్ దేశాలను ఆవైపు నెట్టారా ?
ఇక్కడ మరో సంఘటన మరచి పోయారు. Intillegence వ్యవస్థ అంతా మధ్య ప్రదేశ్ ఎమ్మెల్యే ల మీదనే దృష్టి పెట్టినట్టు ఉన్నారు ఆ సమయంలో. ఓట్లు సీట్ల కోసం పని చేసే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరోనా విస్తరించక ఏం చేస్తుందీ!?
LikeLike