Tags

, ,

Granlund cartoon: Fake news - News - Times Reporter - New ...

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కొద్ది వారాల క్రితం రాసింది. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ మీద చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. మరోవైపు తప్పుడు సమాచార అంటు వ్యాధి ఎక్కడ చూసినా తాండవిస్తోంది. మహారాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి అతుల్‌ భత్‌ఖల్కకర్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన (ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అని గుర్తుండకపోయి వుండవచ్చు) ఒకట్వీట్‌ చేశారు.” కరోనా కోసం ఏర్పడిన ప్రత్యేక దళానికి(టాస్క్‌ఫోర్స్‌) నాయకుడిగా నరేంద్రమోడీ ఉండాలని అమెరికా, బ్రిటన్‌తో సహా పద్దెనిమిది దేశాలు కోరుతున్నాయి.భారత్‌కు ఎంత గర్వకారణమైన క్షణం ! మహానేతకు మనమందరం మద్దతు ఇవ్వాలి మరియు మనం కరోనా వ్యతిరేకపోరులో కచ్చితంగా విజయం సాధిస్తాం” అని దాన్లో పేర్కొన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌(బిజెపి) సలహాదారు రజత్‌ సేథీ మరొక అడుగు ముందుకు వేసి ” కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా నిరోధించేయత్నాలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ కేంద్ర స్ధానాన్ని తీసుకుంది. ప్రపంచ నేతలు ట్రంప్‌, బోరిస్‌ జాన్సన్‌, స్కాట్‌మోరిసన్‌ తదితరులు కరోనా వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు మన ప్రధాని మోడీ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది నిజమైన రాజనీతిజ్ఞత ” అని పేర్కొన్నారు.
వైఆన్‌(వరల్డ్‌ ఈస్‌ ఒన్‌ న్యూస్‌) అనే వార్తా ఛానల్‌ మార్చినెల పదిహేనవ తేదీన ఒక వార్తను ప్రసారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవను ప్రపంచ నేతలు హర్షించారు. జి20ని అనుసంధానం చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆస్ట్రేలియా స్వాగతించింది” అని దానిలో పేర్కొన్నారు. న్యూఢిల్లీతో కలసి పని చేయాలని తాము కోరుకుంటున్నట్లు సార్క్‌ దేశాలు భారత చర్యను హర్షించాయి, సార్క్‌ దేశాల నేతలే కాదు ఇతరులు కూడా హర్షించారు అని కూడా ఆ టీవీలో తెలిపారు.అంతే తప్ప ఎక్కడా పద్దెనిమిది దేశాలు, బిజెపినేత, సిఎం సలహాదారు పేర్కొన్న పేర్లు, అంశాలేవీ ఆ వార్తలో లేవు అని ఆల్ట్‌ న్యూస్‌ పేర్కొన్నది. జి న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యంలో నడిచే ఈ ఛానల్‌ జర్నలిస్టులు మోడీ ప్రతిష్టను పెంచేందుకు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిస్తే బిజెపి నేతలు ఇంకే ముంది నిర్ణయం జరిగిపోయింది భజన ప్రారంభించండి అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక వేళ అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఉంది, ఐక్యరాజ్యసమితి ఉంది, ఒక దేశ నేతను ఎన్నుకోవటం అన్నది అతిశయోక్తి. అందునా కరోనాను పారదోలేందుకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని చిట్కా చెప్పిన పెద్దమనిషిని నమ్ముకుంటే ప్రపంచజనాభా దిక్కులేని చావు చస్తుంది. తప్పుడు సమాచార అంటు వ్యాధి మీడియాలో పని చేస్తున్న వారికి సోకితే దాన్ని యావత్‌ సమాజానికి వ్యాపింప చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరు తెన్నులను చూసి ఏ దశలో ఉందో తెలుసుకొనేందుకు మెడికల్‌ డాక్టర్లు కొన్ని లక్షణాలను ఖరారు చేశారు. తప్పుడు సమాచార అంటు వ్యాధి ఏ దశలో ఉందో జర్నలిజంలోని దిగ్గజాలు చెప్పాల్సి ఉంది.

Cartoonists in India battle fake news through their comic strips ...
ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకోవటానికి ఆయుర్వేద ఔషధాలు తోడ్పడ్డాయని, వేల సంవత్సరాల నుంచి పురాతన ఆచరణే దానికి కారణం అని కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ప్రకటించారు. ఇది అవాస్తవం, బ్రిటన్‌లో ఉన్న జాతీయ వైద్య వ్యవస్ధ సూచించిన చికిత్సను తప్ప మరొకదాన్ని దేన్నీ వినియోగించలేదని చార్లెస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. బెంగలూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ యజమాని డాక్టర్‌ ఐజాక్‌ మత్తయ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ప్రిన్స్‌ చార్లెస్‌కు సూచించిన ఆయుర్వేద, హౌమియోపతి చికిత్స ఫలించిందని చెప్పారు. వ్యవస్ధ పనితీరుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి విలేకర్లకు చెప్పారు. కేంద్ర మంత్రులే తప్పుడు సమాచార అంటువ్యాధికి గురయ్యారు. ఒక డాక్టర్‌ నుంచి అలాంటి ఫోన్‌ నిజంగానే వచ్చిందనుకుందాం, ప్రిన్స్‌ చార్లెస్‌ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవాలి.అలాగాక వాట్సాప్‌ యూనివర్సిటీ పండితుల మాదిరి తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటం ఏమిటి ?
మార్చినెలాఖరు వరకు ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్‌ గురించి మూడువందల కోట్ల పోస్టులు, పదివేల కోట్ల సంభాషణలు నమోదైనట్లు అంచనా. ఒక అంశం మీద మానవాళి చరిత్రలో ఇంతగా భిన్న భాషలలో, అనేక వేదికల మీద దేన్నీ చర్చించి ఉండకపోవచ్చని, ఎలక్ట్రానిక్‌ సాధనాలపై ఇంతగా సమయాన్ని వెచ్చిస్తున్నందున నోమో ఫోబియా(ఫోన్‌ ఫోబియా-ఫోన్‌కు అతుక్కుపోవటం) ప్రమాదం కూడా పెరిగిందని సామాజిక మాధ్యమ నిపుణుడు డెనిజ్‌ ఉనరు చెప్పారు. పరిశుభ్రత సంబంధిత అంశాలను సామాజిక మాధ్యమంలో ఎక్కువగా అందుకున్న వారు ఇండ్లలో వాటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి అతిశుభ్రత వ్యాధికి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయని కూడా డేనిజ్‌ హెచ్చరించారు. ముఖాలకు, చేతులకు తొడుగులు ఎక్కువగా వినియోగించటం, సామాజిక దూరాన్ని ఎక్కువగా పాటించటం వలన ఎదుటివారి మీద విశ్వాసాన్ని కోల్పోయేట్లు చేస్తుందని, భయంకర దృశ్యాలుండే సినిమా చూస్తున్న మాదిరి ప్రవర్తించవచ్చని, కరోనా వ్యాప్తి గురించి మితిమించిన ఆత్రత, కుంగుబాటు ఆలోచనలు కూడా జనాలకు ముప్పుగా పరిగణించవచ్చని డెనిజ్‌ హెచ్చరించాడు. వీటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయ సమచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యంగా అధికారిక సంస్ధలు, వ్యవస్ధలు ఇచ్చే వాటి మీద ఆధారపడాలని, లేనట్లయితే తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు.

March | 2020 | HENRY KOTULA
సాధారణ సమయాల్లోనే ఏ దేశానికి ఆదేశం ప్రత్యర్దులపై ప్రచారదాడికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. అందువలన అవన్నీ వాస్తవాలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, మనకు తెలియకుండానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిలో ఒకరిగా మారిపోతాము. తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటంలో అగ్రస్ధానంలో ఉండే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడిందని జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు. అందువలన అది చేసిన ప్రతి హెచ్చరికనూ పెడచెవిన పెట్టి నేడు అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చాడన్నది రుజువైంది. దేవుడు నైవేద్యం తినడు అని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.అలాగే పెద్ద ఎత్తున తాను నిధులు అందచేసే అనేక అంతర్జాతీయ సంస్ధలను తనకు అనుకూలంగా మలచుకొని చెప్పినట్లు చేయించుకుంటున్న అమెరికన్లకు ప్రతిదీ అలాగే కనిపించటం సహజం. చైనా నుంచి సర్వం కావాలి కానీ చైనా చెప్పే సమాచారాన్ని అమెరికా నమ్మదు. కనుకనే కరోనా మహమ్మారి గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ట్రంప్‌ జిగినీ దోస్తుగా ఉన్న నరేంద్రమోడీ కూడా అదే మాదిరి నిర్లక్ష్యం వహించారని తరువాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 15న కోవిడ్‌19 గురించి ఉన్న అపోహలు, ప్రచారాల గురించి మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అడగహనోమ్‌ మాట్లాడుతూ తమ సంస్ధ, ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు కేవలం కరోనా మహమ్మారితోనే కాదు తప్పుడు సమాచార మహమ్మారితో కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పాడు.వైరస్‌ కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపించటం ప్రమాదకరమని అన్నాడు. మార్చి11న కరోనా ప్రపంచ మహమ్మారిగా మారినట్లు డబ్ల్యుహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. నరేంద్రమోడీ వెంటనే స్పందించి ఉంటే తగ్లిబీ జమాతే నిజాముద్దీన్‌ మర్కజ్‌ను మూసివేయించి ఉండేవారు, లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించి ఉండేవారు. మంత్రాల పఠనం, యాగాలు, గోమూత్రం, ఆవు పేడ చిట్కాల ప్రచారం కొంతమేరకైనా ఆగిపోయి ఉండేది.
కుట్ర సిద్దాంతాలు కూడా నకిలీ వార్తల తయారీలో భాగమే. వాటిలో భాగమే జీవ ఆయుధాల తయారీ వార్తలు. ప్రతిదేశమూ అలాంటి కుట్రసిద్దాంతాలకు ప్రాణప్రతిష్ట చేయటం, అలాంటి సిద్ధాంత కర్తలను మేపటం వలన కరోనా విషయంలో కూడా అవి ముందుకు వచ్చి జనాన్ని, పాలకులను కూడా గందరగోళ పరిచాయంటే అతిశయోక్తి కాదు. వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారులు అవసరం లేకపోయినా వాటిని బలవంతంగా ప్రయోగించేందుకు అనుకూల ప్రచారం చేయించారని చెబుతున్నవారు కొందరు. దాని వ్యతిరేక లాబీ వ్యాక్సిన్ల వ్యతిరేక ప్రచారాన్ని చేసింది. భారత్‌, జపాన్‌, మరికొన్ని దేశాల్లో క్షయ నిరోధక బిసిజి వ్యాక్సిన్లు వేస్తున్న కారణంగానే కరోనా మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.దీనికి ఆధారం లేదని మరొక వాదన అయితే , వందేళ్ల నాటి టిబి వైరస్‌ కరోనాను ఎలా నిరోధిస్తుందన్నది మరొక వాదన. క్షయ కేసులు, మరణాలు ప్రపంచంలో నాలుగోవంతు మన దేశంలోనే ఎందుకు ఉన్నాయన్నది ఈ సందర్భంగా అడగకూడని ప్రశ్న. కరోనా వైరస్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదా జనాన్ని తప్పుదారి పట్టించిన వారిలో ప్రధముడు డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాలి.
ఏప్రిల్‌ ఐదవ తేదీన దీపాల వెలుగును సంకల్పబల ప్రదర్శనకు అన్నది మోడీ గారి అభిప్రాయంగా తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అది జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లతో ముగిసింది. అన్ని పార్టీలు పాటించాయి. సంకల్పాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించాలి. ఈ తేదీని ఎంచుకోవటం గురించి అనేక మందిలో సంకల్పం సంగతి తరువాత బిజెపి రాజకీయ అజెండా ఉందనే అనుమానాలు తలెత్తాయి. జనతా పార్టీ నుంచి విడిపోయి బిజెపిగా అవతరించాలని నిర్ణయించిన రోజు ఇది, మరుసటి రోజు నుంచి అంటే 1980ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి బిజెపి ఉనికిలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్న సందర్భాన్ని పాటించేందుకు దాన్ని ఎంచుకున్నారని కొందరి విమర్శ. తెరముందు కనిపించే బిజెపికి తెరవెనుక బిజెపికి తేడా ఉంటుందన్న విమర్శను ఇది రుజువు చేస్తోంది కదా !
రెండవది ప్రతి ఇంటిలో తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు. దీన్ని కూడా సరిపెట్టుకుందాం. వెంటనే దానికి ఒక శాస్త్రీయ సిద్దాంతాన్ని జోడించేందుకు తయారయ్యారు. ” ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్‌ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకి వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్‌ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి ఆటమిక్‌ ఎనర్జీ గా మారుస్తారు. ఆ ఆటమిక్‌ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.” దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా బుర్రలేని వారందరూ దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు.
అంత సులభంగా అటామిక్‌ ఎనర్జీ తయారుచేసుకునే అవకాశం ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు భాగస్వామిగా ఉన్న అణుకంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం,వేల కోట్లు కట్టబెట్టటం ఎందుకు ? వాటితో వచ్చే ప్రమాదాల గురించి రోజూ భయంతో చావటం ఎందుకు ? నిజంగా దీపాల వెలుగుతో కరోనా చచ్చేట్లయితే రోజూ జనాలు వెలిగిస్తున్న దీపాలతో తయారయ్యే శక్తితో ఈ పాటికి అంతరించి ఉండాలి కదా ! ఒక్క వైరస్‌ ఏమిటి జనాన్ని పీడిస్తున్న ఈగలు, దోమలు కూడా ఎప్పుడో అంతరించి ఉండాల్సింది కదా ? రోజూ ప్రపంచ వ్యాపితంగా వెలిగించే దీపాల వెలుగుతో పని చేయకుండా నవ గ్రహాలు రోజూ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? ఎందుకీపోసుకోలు కబుర్లు ?
కరోనా వైరస్‌ మరోసారి కుట్రసిద్దాంత పండితులకు, ఫేక్‌ న్యూస్‌ ఉత్పాదకులకు మంచి అవకాశాలను కల్పించింది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతాలకు బలి అయ్యేవారిలో మెదడును సరిగా ఉపయోగించని వారే ఎక్కువగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ బలహీనతను గమనించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వాటిని ఆయుధాలుగా చేసుకొని జనం మీద దాడి చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు మీరిన, జబ్బులున్నవారి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతానికి వయస్సుతో పని లేదు. ఎవరి మెదడు పని చేయకుండా ఉందా అన్నదే గీటురాయి. వైరస్‌ మాదిరి వీటికిి ఎల్లలు, కులాలు, మతాలు, భాషా, రంగు బేధాలు లేవు. మెదళ్లను ఖరాబు చేయటమే కాదు, ఉన్మాదాన్ని పెంచుతాయి, ప్రాణాలు తీస్తాయి.

Court finds case against Lord Ram, Laxman 'beyond logic', squashes ...
రామాయణ, మహాభారతాలు, అనేక పురాణాల్లో ఫేక్‌ న్యూస్‌, మాయలు కోకొల్లలు. మాయలేడిని చూపి సీతను ప్రలోభపెట్టారు.రాముడి మాదిరి హా సీతా హా లక్ష్మణా అంటూ పారడీ చేసి సీతను గీత దాటించిన ఉదంతం తెలిసిందే. సీత గీత దాటకపోతే రామాయణం అన్ని మలుపులు తిరిగేదా ? ఫేక్‌ న్యూస్‌, మాయ లేడి బాధితులు సీత, రాముడు, లక్ష్మణుడు అన్నది స్పష్టం. మహాభారతంలో అశ్వద్ధామ హత: కుంజర: ఉదంతం తెలిసిందే. ఇలాంటివే చెప్పుకుంటే ఎన్నో. పాలకులకు ఇవి నిత్యకృత్యం. వర్తమాన కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవి ఇంకా పెరిగాయి. ఇందుగల వందు లేవను సందేహము వలదు ఎందెందు చూసిన అందందు గలవు !