Tags
Coronavirus, Coronavirus in Pakistan, Imams were arrested for prayers ban violation, Panic in Pakistan, Tablighi jamaat meet effect
ఎం కోటేశ్వరరావు
తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరై కనిపించకుండా ఉన్నవారి కోసం, రైళ్లలో, ఇతర ప్రయాణ సాధనాలలో వారితో ప్రయాణించిన వారి కోసం యావత్ దేశంలో గాలింపు జరుగుతోంది. దొరికిన వారిని పరీక్షించి వైరస్ సోకినట్లు గమనిస్తే చికిత్సా కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రియమైన పాఠకులారా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తరువాత జమాత్ సమావేశాలు జరిగిన ప్రతి దేశంలోనూ ఇదే జరుగుతోంది అని గమనించ మనవి. ఆ సమావేశాలు ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశాల్లో కూడా జరిగాయి. కుట్ర సిద్ధాంతాన్ని నమ్మేవారు ఆ సమావేశాల్లో పాల్గొన్నవారందరూ హిందూ-ముస్లిం, ఈ దేశమా ఆ దేశమా అనే విచక్షణ లేకుండా తమ తమ ప్రాంతాలకు వైరస్‌ను జయప్రదంగా మోసుకు పోయారు అని తెలుసుకోవాలని మనవి. ముస్లింలు మన దేశంలో వైరస్‌ను వ్యాపింప చేస్తున్నారని పనిగట్టుకొని కొందరు మతోన్మాద వైరస్‌ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దానితో బుర్రలను చెడగొట్టుకోవటం కాదు, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం శుక్రవారం నాడు మసీదుల్లో ప్రార్ధనలకు దూరంగా ఉండాలన్న సూచనను పలు చోట్ల ఉల్లంఘించారు. అంతేకాదు ఇమామ్‌లు జనాన్ని రెచ్చ గొట్టే ప్రసంగాలు చేశారు. కొన్ని చోట్ల ప్రార్ధనలను నివారించేందుకు వెళ్లిన పోలీసుల మీద దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు, నలుగురు చొప్పున ఇమామ్‌లు, ఖతీబ్‌లను అరెస్టు చేసి మరోసారి ఉల్లంఘించబోమని చెప్పిన వారిని వదలి పెట్టినట్లు డాన్ పత్రిక తెలిపింది. ఆదివారం నాటికి పాకిస్ధాన్‌లో 2,818 కేసులు నమోదు కాగా 41 మంది మరణించారు. మలేసియాలో 3,483 కేసులు, 57 మరణాలు సంభవించాయి.
మార్చినెలలోనే పాకిస్ధాన్‌లోని లాహౌర్ పట్టణానికి 43కిలోమీటర్ల దూరంలోని రాయవింద్ పట్టణంలో తబ్లిగీ జమాత్ వార్షిక సమావేశాలు జరిగాయి. మూడు రోజులకు కుదించిన ఈ సమావేశాలకు ప్రపంచమంతటి నుంచీ రెండున్నరలక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. ప్రభుత్వం వైపు నుంచి తీవ్ర వత్తిడి, వర్షాల కారణాంగా గానీ సమావేశాలకు వచ్చిన వెళ్లిపోయారు. అక్కడ ముగిసిన రోజే మన దేశంలో ప్రారంభమైంది. మన నిజాముద్దీన్ సమావేశాలను రద్దు చేయాలని లేదా ముగించమని గానీ మన పాలకులు ఎలాంటి వత్తిడి తేలేదు. నరేంద్రమోడీ పాలనలో మత సామరస్యం ఎలా వెల్లివిరిసిందో చూడండి అని భజన చేసే వారికి ఇదొక ఉదాహరణగా మిగులుతుంది. అసలు కథ ఏమంటే పది లక్షల మందితో మార్చి 25 నుంచి ఏప్రిల్ రెండు వరకు శ్రీరామ నవమి ఉత్సవాలు జరపాలని నిర్ణయించిన పెద్దలు ఈ సమావేశాలకు అభ్యంతరం చెబితే దాని గురించి అడుగుతారని తప్ప మత సామరస్యం కాదు, మట్టిగడ్డా కాదు. పాకిస్ధాన్ ప్రభుత్వం మార్చి 13నాటికే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిలిపివేయటంతో దాదాపు మూడు వందల మంది విదేశీయులు రాయవింద్‌లోనే చిక్కుకు పోయారు. ఘనమైన మన పాలకులు మార్చి 22న ఆ పని చేశారు. అప్పటివరకు నిజాముద్దీన్‌లో ఉన్నవారు చిక్కుకు పోయారు. పాక్ ప్రభుత్వం సమావేశాలను రద్దు చేయాలని చెప్పినా అప్పటికే అనేక మంది వచ్చి ఉన్నారని, చివరి నిమిషంలో రద్దు చేయటం కుదరదని జమాత్ నేతలు మంకు పట్టుపట్టి సమావేశాలను నిర్వహించారు. ప్రభుత్వ భయాందోళనలు వాస్తవమే అని తరువాత రుజువైందని లాహౌర్ డిప్యూటీ కమిషనర్ డానిష్ అఫ్జల్ వ్యాఖ్యానించారు.
జమాత్ సభ్యులు లేదా వారి బంధువులు దురుసుగా ప్రవర్తించినట్లు మన దేశంలో వచ్చిన వార్తల నేపధ్యంలో పాకిస్ధాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని లయ్యా పట్టణంలోని తగ్లిబీ జమాత్ కేంద్రంలో క్వారంటైన్ నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించిన ఒక సభ్యుడు పోలీసును పొడిచాడని తెలుసుకోవాలి. దురుసు దురుసు తనం ప్రతి చోటా ఉంటుంది, అలాంటి ఘటనలను ఖండించాలి తప్ప మతాన్ని ఆపాదించకూడదు. కరాచీ పట్టణంలో గత శుక్రవారం నాడు సామూహిక ప్రార్ధనలు జరపవద్దని కోరిన పోలీసుల మీద లియాఖతాబాద్ మసీదు, ఘౌసియా మసీదు వద్ద జనం పోలీసుల మీద దాడి చేశారు. ఈ ఉదంతంలో నలుగురిని అరెస్టు చేశారు. మన తెలుగు ప్రాంతంలో ఒక గుడిలో పూజలు వద్దని చెప్పిన పోలీసును పూజారీ, పూజలకు వచ్చిన వారు ఎలా దాడి చేశారో సామాజిక మీడియాలో మనం చూశాము.
పాకిస్ధాన్ శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ సమావేశాలను పరిమితం చేయాలన్న తమ సూచనను పెడచెవిన పెట్టి తగ్లిబీ జమాత్, సంస్ధ తిరోగమన భావాలే ఈ ముప్పుకు బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పారు. అనేక ఇస్లామిక్ దేశాలలో మసీదులను మూసివేసినప్పటికీ పాకిస్ధాన్‌లోని సున్నీ, షియా మసీదుల నిర్వాహకులు ప్రభుత్వ సూచనను పెడచెవిన పెట్టారు. అలాంటి వారి మీద ముందుగానే చర్య తీసుకొని ఉంటే ఇంత జరిగేది కాదన్న విమర్శలు పాక్‌లో వెల్లువెత్తుతున్నాయి. అదే మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే రాజకీయం అంటూ ఎదురుదాడి చేస్తున్న పరిస్ధితి.
మన దేశంలో కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వాలే యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయమని ప్రోత్సహించటాన్ని చూశాము. ఇక ఛాందసులు, ఈ పేరుతో మతోన్మాదులు రెచ్చి పోవటం గురించి చెప్పనవసరం లేదు. పాకిస్ధాన్లో కూడా అలాంటి వారికి కొదవ లేదు. పాక్ మతవ్యవహారాల మంత్రి నూరుల్ హక్ ఖాద్రి విలేకర్లతో మాట్లాడుతూ మసీదులు తెరిచే ఉంటాయని, అయితే పిల్లలకు నిషేధమని, పెద్ద వారు 50 మందికి మించి ప్రార్ధనలకు రాకూడదనే నిబంధన విధించినట్లు చెప్పారు. పాకిస్ధాన్ ఉలేమా ఇస్లామిక్ కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా జహిద్ ఖ్వాసమి మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నచోట్లనే ఇండ్లలో ప్రార్ధనలు చేయాలని చెప్పామని, తక్కువగా లేదా లేని చోట ఆరోగ్య సమస్యలను వివరిస్తూ ప్రార్ధనలు కొనసాగిస్తామని, మహమ్మారి వైరస్ నుంచి కాపాడాలని దేవుడిని ప్రార్ధించకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీవీలలో బోధనలు చేసే జమీల్ మాట్లాడుతూ ఎవరికి వైరస్‌ను సోకించాలో ఎవరికి కూడదో దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు మనలను రక్షిస్తాడని సెలవిచ్చాడు. అనేక చోట్ల సామాజిక దూరాన్ని పాటించటం, తమ సాంప్రదాయ కార్యకలాపాలపై ఆంక్షలు విధించటాన్ని తబ్లిగీ జమాత్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. క్షమించమని దేవుడిని అడగటం తప్ప వేరే మార్గం లేదని తెగేసి చెబుతున్నారు.
మత మౌఢ్యం తలకెక్కించిన తరువాత అది హిందూ, ముస్లిం, క్రైస్తవం ఏదైనా ఒక పట్టాన తగ్గదు. పూజారి, ఉలేమా, పాస్టర్ ఎవరైనా ఒకటే. అలాంటి వారే వైరస్‌ను వ్యాప్తి చేసే వాహకులుగా మారతారు,వైరస్‌ను యావత్ సమాజానికి అంటిస్తారు.అందువలన అలాంటి మూఢుల సంగతి జనమే తేల్చుకోవాలి. ముందు బతికి ఉంటే కదా పూజలు, పునస్కారాలు !
పాకిస్దాన్ రాయవింద్ జమాత్‌కు రెండున్నరలక్షల మంది వచ్చారన్నది ఒక అంచనా అయితే లక్షమందికి మించి రాలేదని జమాత్ నేతలు చెబుతున్నారు. అది కూడా తక్కువేమీ కాదు.ఇప్పుడు వారి కోసం దేశమంతటా అధికారులు గాలిస్తున్నారు. నిర్దిష్టమైన జాబితా లేనప్పటికీ హాజరైన వారి మధ్య ఏర్పడిన పరిచయాల కారణంగా పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల మందిని గుర్తించారు. మరో దేశమైన మలేసియాలో కూడా జమాత్ సమావేశాలు జరిగాయి, అక్కడ అంటించుకున్నవారు మన దేశానికి వచ్చారన్నది ఒక సమాచారం. మలేసియాలో 3,483 మందికి సోకింది. వీటిలో 44శాతం కేసులు శ్రీ పెటాలింగ్ మసీదులో ప్రార్ధనలకు వచ్చిన వారి ద్వారా సోకినవే అని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషమ్ అబ్దుల్లా చెప్పారు. మనదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో జమాత్‌కు వచ్చిన వారు లేదా వారు అంటించినవి 30శాతమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరగాల్సింది కరోనాపై పోరు. మతవిద్వేషాలను వ్యాపింప చేయటం కాదు.