ఎం కోటేశ్వరరావు
చైనా తన గురించి ప్రపంచానికి అనేక విషయాలు చెప్పింది. అది చెప్పేది నమ్మకూడదని పశ్చిమ దేశాలు గత ఏడు దశాబ్దాలుగా నూరిపోస్తున్నాయి. దాని వలన చైనాకు వచ్చిన నష్టమేమీ లేదు గానీ మిగిలిన దేశాలు ఎంతగా నష్టపోతున్నాయో కరోనా మహమ్మారి ఉదంతంలో యావత్ ప్రపంచం చూస్తోంది. ఎక్కడైతే కరోనా తొలిసారిగా కనిపించిందో ఆ ఊహాన్ నగరం దాన్ని అదుపులోకి తెచ్చుకుంది. కరోనా విలయతాండవం సాగిన 76 రోజుల తరువాత తిరిగి బుధవారం నుంచి ఆ నగరం సాధారణ కార్యకలాపాల్లో నిమగం కానుందని అధికారులు ప్రకటించారు. ఈ నిజాన్ని నమ్మని వారిని మానసిక చికిత్సాలయాలకు తరలించటం తప్ప మరొక మార్గం లేదు. ఆ విషయాల గురించి చెప్పుకోబోయే ముందు పశ్చిమ దేశాలు ఇప్పటికీ తమ జనం ప్రాణాలను ఫణంగా పెట్టి ఎలా ప్రయోగాలు చేస్తున్నాయో చూద్దాం.
ముఖాలకు తొడుగులు(మాస్క్‌లు) వేసుకొని కరోనా నుంచి తప్పించుకొనే జాగ్రత్తలలో ఒకటని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో వాటికి ఉన్న పరిమితులు, జాగ్రత్తలను కూడా తెలియ చేస్తున్నారు. కరోనాను జయప్రదంగా అరికట్టిన చైనాలో జనం ముఖ తొడుగులు వేసుకున్నారు. అది ఎన్నో ఫలితాల నిచ్చిందని ఇప్పటికే రుజువైంది. ఐరోపా దేశమైన డెన్మార్క్‌లో మంగళవారం నాటికి 187 మంది మరణించగా 4,681కేసులు నమోదయ్యాయి. ముఖ తొడుగుల వలన ప్రయోజనం ఉందా లేదా చైనా వారు చెప్పేది నిజమా కాదా అని తేల్చుకొనేందుకు బుధవారం నుంచి అక్కడ నెల రోజుల పాటు ఆరువేల మంది మీద ప్రయోగాన్ని తలపెట్టారు. మూడువేల మంది ముఖాలకు తొడుగులు వేస్తారు, మరో మూడువేల మందిని తొడుగులు లేకుండా ఈ నెల రోజుల్లో పరీక్షిస్తారట.
అమెరికన్లు తాము కనిపెట్టిన నూతన ఆయుధాలు ఎలా పని చేస్తాయో చూసేందుకు ఎక్కడో ఒక దగ్గర యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రయోగించి చూడటం మనకు తెలిసిందే. ఇరాక్‌లో అదే పని చేశారు. అన్నింటికీ మించి జపాన్‌పై అణుబాంబులు వేసి బహిరంగ పరీక్ష జరిపిన విషయం గురించి చెప్పనవసరం లేదు. డెన్మార్క్ ముఖతొడుగుల ప్రయోగం చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ముఖతొడుగును ధరించనని, అయితే తమ పౌరులు స్వచ్చందంగా ధరించవచ్చని ప్రకటించాడు. అనేక పశ్చిమ దేశాల్లో ముఖ తొడుగుల మీద వ్యతిరేక ప్రచారం ఉంది. ఈ దేశాల్లో ఉన్న ఆసియన్లు ఎవరైనా ముఖతొడుగులు ధరిస్తే వారిని కించపరచటం, కొన్ని చోట్ల దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ముఖతొడుగుల గురించి నమ్మకం లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలి గానీ జనాన్ని ఫణంగా పెట్టి ప్రయోగాలు చేయటం ఏమిటి ? ఇదేమీ రాజకీయ సిద్ధాంతం కాదు, పరీక్షలు జరిపి నిర్ధారించుకొనే తరుణమూ కాదు. తాము పాటించేదే ప్రజాస్వామ్యం, భావ ప్ర కటనా స్వేచ్చ, తాము కనుగొన్నదే సత్యం, ఇతరులను నమ్మం అనే ఒక దురహంకారం పశ్చిమ దేశాలలో ఉన్నది. ఇప్పుడు ముఖతొడుగుల విషయంలో కూడా దాన్నే వెల్లడించుకుంటున్నారు.
ఇక ఊహాన్ నగరం ఉన్న హుబెరు రాష్ట్రం, పరిసరాలు సాధారణ స్థితికి వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో సోమవారం నాడు హుబెరులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. అయితే అంత మాత్రాన పరిస్ధితి గురించి ఉపేక్షించకూడదని, కరోనా మీద కన్నేసి ఉంచుతామని, ఇంకా ఆనంద, ఉత్సాహాలను ప్రకటించే తరుణం రాలేదని అధికారులు చెప్పారు. రోగ లక్షణాలున్న వారిని పరీక్షలకు పంపే యంత్రాంగం ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి వారికి ఒక ఆరోగ్య కోడ్ ఇచ్చినందున ఎవరైనా హౌటళ్లు, దుకాణాలు, బస్, రైల్వే స్టేషన్లకు వచ్చినపుడు ఆ కోడ్‌ను స్కాన్ చేస్తారు. తిరిగి వ్యాధి అనుమానాలుంటే చికిత్సకు తరలిస్తారు. బుధవారం నుంచి రైళ్లు, విమానాశ్రయాలను కూడా పునరుద్దరిస్తున్నారు. వందలాది మెట్రో, బుల్లెట్ రైళ్లు సిద్ధం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఊహాన్ వాసులు వీధులలోకి వస్తున్నారు, తమకు ఇష్టమైన ఉదయపు ఉపాహారమైన నూడిల్స్‌ను తీసుకుంటూ దుకాణాల వద్ద కనిపిస్తున్నారు. తిరిగి ఫ్యాక్టరీలు, కార్యాలయాలకు పనులకు హాజరయ్యే వారు తాము ఆరోగ్యంగా ఉన్నామని సర్టిఫికెట్‌లను స్మార్ట్ ఫోన్ల మీద సమర్పించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ ఎలా వస్తుందన్నది ఇంకా అంతుబట్టని కారణంగా జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు గత కొద్ది రోజులుగా నగర వాసులను హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు బయట పడకుండా వైరస్ సోకే అవకాశాలు కూడా ఉన్నాయని, అందువలన బయటి నుంచి వచ్చిన వారిని ఫ్యాక్టరీలు,కార్యాలయాల్లో పరీక్షించి నిర్దారించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా లక్షణాలు బయట పడితే వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణించారు అనేది వివరాలు తెలుసుకొని వ్యాధి జాడను కనుగొంటారు. ఇలాంటి పరీక్షలు జరపగా సోమవారం నాడు 78 కొత్త అనుమానితుల కేసులు బయట పడ్డాయి, వాటిలో 40 విదేశాల నుంచి వచ్చిన వారు,ఐదు నిర్దారణ అయ్యాయి. చైనాలో వైరస్ కారణంగా సోమవారం నాటికి మరణించిన వారి సంఖ్య 3,335కు చేరింది, ఇంకా చికిత్సలో ఉన్నవారు 1,299 కాగా వారిలో 211 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
శనివారం నాడు దేశవ్యాపితంగా మృతులకు శ్రద్దాంజలి ఘటించారు. అయితే మరణాల సంఖ్యను దాచి పెడుతున్న చైనా వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు శ్మశానవాటికల వద్ద పెద్ద సంఖ్యలో జనం చేరకుండా నిషేధించిందని అమెరికా పత్రికలు వక్రీకరణ వార్తలు రాశాయి. ఇంకా పెద్ద ఎత్తున జనం గుమి కూడటం ప్రమాదకరమే అని అందువలన జాగ్రత్తలో భాగంగా ఇండ్ల వద్దనే శ్రద్ధాంజలి ఘటించాలని కోరటాన్ని అలా చిత్రీకరించారు.
ఊహాన్ పరిసరాలలో ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్దలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సబ్సిడీలు, పన్నుల తగ్గింపు వంటి చర్యలకు ప్రభుత్వం తొలి విడతగా ఇరవై బిలియన్ యువాన్ల(2.82 బిలియన్ డాలర్లు)ను కేటాయించింది. హుబెరు రాష్ట్రంలో మొత్తం 67,803 కరోనా కేసులు నమోదు కాగా రాజధాని ఊహాన్‌లోనే 50,008 ఉన్నాయి. దేశంలో సాధారణ పరిస్దితులు నెలకొంటున్న నేపధ్యంలో వైరస్ నుంచి రక్షణ కోసం పట్టణాలలో విద్యార్ధులు, తల్లిదండ్రులకు ప్రత్యేక రూట్లు, బస్‌లను ఏర్పాటు చేశారు. పాఠశాల సమయాల్లో ఇలాంటి బస్ రూట్లను కొన్ని చోట్ల గతేడాది అక్టోబరులోనే ప్రారంభించారు. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు ప్రారంభం కావటంతో ముందస్తు జాగ్రత్త చర్యలతో కొత్తగా అనేక చోట్ల ఈ బస్సులను నడుపుతున్నారు. వీటిలో పిల్లలతో పాటు వారిని తీసుకు వెళ్లేందుకు వచ్చి వెళ్లే వారు కూడా ఎక్కేముందు శరీర ఉష్ణ్రోగ్రత ఎంత వుందో పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. బస్ డోర్లకే ఆటోమాటిక్ ధర్మోమీటర్, ముఖాన్ని గుర్తించే పరికరాలు ఉంటాయి. మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్దులు, తలిదండ్రులు ముందుగా నమోదు చేయించుకొన్నవారికే ప్రవేశం ఉంటుంది. వైరస్ నివారణ జరిగినా స్కూళ్లలో పిల్లలు మధ్యాహ్నభోజనం చేసేటపుడు గుంపులుగా ఒక దగ్గరకు చేరకుండా ఏ తరగతి వారు ఎక్కడ తినాలో నిర్ణయించి అమలు చేస్తున్నారు. తరగతి గదిలో కూడా ఒక బల్లకు ఒకరు మాత్రమే కూర్చొనే విధంగా కూడా చూస్తున్నారు. ఎక్కువ భాగం స్కూళ్లు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి.
చైనా ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి కరోనా మహమ్మారి తిరిగి తలెత్తకుండా చూడటం, అంటే ప్రజారోగ్యం. రెండవది దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం. కరోనా వైరస్ నిరోధానికి ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో అంత కంటే ఎక్కువగా మరోమారు తలెత్తకుండా చూసేందుకు దేశవ్యాపితంగా ప్రజారోగ్య వ్యవస్దను మరింత పటిష్టపరచటం సామాన్య విషయం కాదు. వైరస్‌ను నిరోధించేందుకు మానవాళి చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినపుడు తలెత్తే సమస్యలు చైనా యంత్రాంగానికి, సమాజానికి కూడా కొత్తే. వైరస్ కారణాల గురించి తొలి రోజుల్లో ప్రపంచం ఎలా ఆలోచించిందో చైనా సమాజంలో కూడా అలాంటి భావాలు లేవని చెప్పలేము. అయితే రోజులు గడిచే కొద్దీ జరిగిన పరిణామాలు ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చినా, అంతర్గతంగా వెల్లడైన లోపాలు, వాటితో తలెత్తిన వత్తిడి నుంచి ముందు విముక్తి కావాల్సి ఉంది.
ఎవరు ఎలాంటి అంచనాలు వేస్తున్నా, జోశ్యాలు చెబుతున్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోవటం అనివార్యంగా కనిపిస్తోంది. అయితే అది ఏ రూపంలో ఎలా ఉంటుందన్నదే తప్ప మాంద్యం ఖాయం. ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా ఉన్నప్పటికీ మాంద్యం కారణంగా వస్తు వినియోగం పడిపోతే దాని ప్రభావం చైనా మీద తప్పక పడుతుంది. కరోనా కాటు చైనా కంటే అమెరికా, ఐరోపా దేశాలకే పెద్ద చేటు తేనుంది. వైరస్ వ్యాప్తికి చైనాయే కారణం అంటూ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రజాగ్రహాన్ని చైనా మీద మళ్లించేందుకు అమెరికా, ఐరోపా దేశాల నేతలు చేస్తున్న ఆరోపణలు తరువాత కాలంలో అంతర్జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమెరికా ఆర్ధికంగా అగ్రస్దానంలో ఉంది, అదే సమయంలో అప్పులలో కూడా అదే స్దితిలో ఉంది. ద్రవ్యమార్కెట్‌కు మద్దతు ఇచ్చేందుకు రానున్న రోజుల్లో అమెరికా తీసుకొనే చర్యలు ప్రపంచం మీద ప్రభావం చూపుతాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోకి డాలర్లను కుమ్మరించేందుకు ట్రంప్ ప్రభుత్వం పూనుకుంది. వివిధ దేశాలు, విదేశీ సంస్దలకు అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 6.86లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పు పడింది. దీనిలో జపాన్‌కు 1.21లక్షల కోట్ల డాలర్లు, చైనాకు 1.08లక్షల కోట్ల డాలర్ల అప్పు పడింది.అమెరికా ప్రభుత్వ అప్పులను చైనా ఇప్పుడు స్వల్పకాలానికి కొనుగోలు చేయటం లేదా అమ్మటం గానీ చేయదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాలతో పోల్చుకుంటే చైనా పరిస్ధితి ప్రస్తుతానికి స్ధిరంగా, సురక్షితంగానే ఉన్నప్పటికీ ప్రపంచ మాంద్యం తలెత్తితే పరిస్ధితి ఏమిటన్నది సమస్య. చైనా విదేశీ మారకద్రవ్య నిల్వల్లో మూడో వంతు అమెరికా ప్రభుత్వ అప్పురూపంలోనే ఉంది. ఒక వేళ డాలరు దివాళా తీస్తే, విలువ దిగజారితే అనేది ప్రస్తుతానికి ఊహాజనితమే అయినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.