Tags
Coronavirus in India, Coronavirus in Pakistan, Coronavirus outbreak, Narendra Modi, PRIME MINISTER Imran Khan
ఎం కోటేశ్వరరావు
అడుగడుగునా నిర్లక్ష్యం, ఎవరైనా ఎత్తి చూపితే ఈ క్లిష్ట సమయంలో రాజకీయాలేమిటని ఎదురు దాడి చేస్తారు. ఎవరూ ఏమీ చెప్పకపోతే, సద్విమర్శలు కూడా చేయకపోతే అధికార యంత్రాంగానికి, దాని మీద ఆధారపడిన పాలకులకు తెలిసేది ఎలా ? నిర్లక్ష్యంలో వారు వీరను తేడా లేదు, పాకిస్ధాన్‌తో తబ్లిగీ జమాత్ సమావేశాలను రద్దు చేయాలని చెప్పినా వినకుండా అక్కడ నిర్వహించారు. ఇక్కడ అలాంటి ఆదేశాలే ఇవ్వలేదు. రెండు చోట్లా జరిగిన సమావేశాలకు హాజరైన విదేశీయులు కరోనా వైరస్‌ను ఎలా అంటించి రెండు దేశాలను ఎలా ఇబ్బందుల పాలు చేశారో చూస్తున్నాము. మరి పాలకుల తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ?
మార్చి 22న జనతా కర్ఫ్యూను పాటిస్తూ అదే రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒకేసారి కరోనా మీద పోరు సల్పుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర విభాగాల వారు చేస్తున్న సేవలకు చప్పట్లు,గంటలను మోగించి అభినందనలు, కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ జాతి స్పందించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో వైరస్ అంటకుండా ధరించాల్సిన దుస్తులు, ఇతర రక్షణ పరికరాలతో కూడిన పిపిఇ కిట్ల తయారీకి మార్చి 24వ తేదీ వరకు మార్గదర్శక సూత్రాలనే ఖరారు చేయకుండా ఉన్నట్లు తెలుసా ?
పాకిస్ధాన్ మన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జనాభాకు సమానంగా జనసంఖ్య కలిగి ఉంది. అలాంటి చోట 4,004 కరోనా కేసులు,55మరణాలతో అక్కడి పరిస్ధితి ఉంది. మన దేశంలో 135 కోట్ల జనాభాలో 4,911కేసులు,137మరణాలు సంభవించాయి, దేశమంతటా లాక్‌డౌన్ ప్రకటించాము. ప్రపంచం జిడిపిలో మన పాలకులు దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయారు, పాకిస్ధాన్ విషయానికి వస్తే అది 42వ స్ధానంలో ఉంది. కరోనా పరీక్షల విషయానికి వస్తే అక్కడ ప్రతి పదిలక్షల మందికి 177 పరీక్షలు(ఏప్రిల్ 7నాటికి) చేస్తే అదే రోజుకు మన దేశంలో 102 చేశాము. మన పొరుగునే ఉన్న శ్రీలంకలో 176కేసులే ఉన్నా 152 మందికి, నేపాల్లో తొమ్మిది కేసులే ఉన్నా 52 మందికి పరీక్షలు చేశారు. మన దగ్గర డబ్బు లేక కాదు, జనాన్ని చావకుండా కాపాడాలనే శ్రద్ద ఏమేరకు ఉందో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. ఎవరు ఏమిటన్నది కష్టకాలం వచ్చినపుడే తెలుస్తుంది. అందువలన మన జిడిపి అంత ఇంతా అంటూ గొప్పలు చెప్పుకోవటం తగ్గిస్తే మంచిదేమో? ఇది ఎవరినో విమర్శించటానికి కాదు, అణకువగా ఉండాలని చెప్పేందుకే.
ఇక కరోనా నిరోధ విషయానికి వస్తే పాకిస్ధాన్‌లోని ఆప్ఘన్ సరిహద్దు రాష్ట్రమైన బెలుచిస్తాన్‌లో 202 కేసులు మాత్రమే ఉన్నాయి. అయినా అక్కడి వైద్యులు, సిబ్బంది కరోనా చికిత్సలో అవసరమైన రక్షణ దుస్తులు, పరికరాలను సరఫరా చేయటం లేదంటూ సోమవారం నాడు రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలో వారు వీధులకు ఎక్కాల్సి వచ్చింది. వారిలో పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారని, అందరు పోలీసుల మాదిరే లాఠీలకు పని చెప్పారని వార్తలు. సమీపంలోని అసెంబ్లీ సభ్యులు వచ్చి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. పోలీసు చర్యకు నిరసనగా తాము ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు బహిష్కరిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. డజన్ల మందిని అరెస్టు చేశాము తప్ప లాఠీ చార్చి చేయలేదని పోలీసులు సమర్ధించుకున్నారు. వీడియోలు అబద్దం చెప్పవు కదా ! ఇంతకూ వైద్యులు రోడ్డెందుకు ఎక్కారూ అంటే క్వెట్టా ఆసుపత్రిలో పదమూడు మంది వైద్యులకు కరోనా పాజిటివ్ అని నివేదికలు వచ్చాయి, కారణం వారికి తగిన రక్షణ(పిపిఇ) పరికరాలను సమకూర్చకపోవటమే.ఆ నివేదికలు రాకముందు తమకు రక్షణ పరికరాలను సమకూర్చాలని కోరుతూ ఆందోళనకు పిలుపు నిచ్చిన వైద్యులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సముదాయించటంతో మూడు రోజుల పాటు ఆందోళనను వాయిదా వేశారు. అయినా ఫలితం లేకపోవటంతో సోమవారం నాడు వీధులకు ఎక్కి లాఠీ దెబ్బలను రుచిచూశారు.
పాకిస్దాన్‌లో వైరస్ వ్యాపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. చైనా నుంచి నివారణ చర్యలు గ్రహించామని చెప్పటం తప్ప ఆచరణ లేదు. అక్కడ అనేక పట్టణాలను లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసినా ప్రయాణ ఆంక్షలు కూడా విధించలేదు. అంతర్జాతీయ విమానాలను అనుమతించారు. ప్రయాణీకులను పరీక్షించలేదు, క్వారంటైన్ సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. తబ్లిగీ జమాత్ సభలకు ఇరాన్ సరిహద్దులో ఉన్న బెలూచీస్ధాన్ రాష్ట్ర పట్టణమైన టఫ్ట్‌న్ నుంచి ఇరాన్ వ్యాధి గ్రస్తులు వస్తున్నా నివారించలేకపోవటానికి ఇదే కారణం. అక్కడి క్వారంటైన్‌లో వైద్య సౌకర్యాలు లేవు, అక్కడి నుంచి వచ్చిన వారితోనే వ్యాధి వ్యాపించిందని సింధు అధికారులకు పూర్తిగా తెలుసు.తోటి ఇస్లామిక్ దేశాలైన టర్కీ, ఇరాన్ మసీదుల్లో సామూహిక ప్రార్ధనలను నిషేధించినా ఇమ్రాన్ ఖాన్‌కు పట్టలేదు. ఇటలీలో ఒక మత కార్యక్రమం, ఇతరంగా పెద్ద ఎత్తున జనం గుమికూడిన కార్యక్రమాల కారణంగానే అక్కడ వైరస్ ప్రబలిందని తెలిసినా పట్టించుకోలేదు. నిషేధం గురించి ఆలోచించకపోగా మసీదుల మూసివేత ఉండదని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి ఉలేమాలకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు పాకిస్ధాన్‌లోని నాలుగువేల కేసులలో సగం పంజాబ్‌లోనే ఉన్నాయి. షియా మత పెద్దలైతే తాము మత కూటములను కొనసాగిస్తామని, అక్కడ ప్రార్దనలు జరిపి వైరస్‌ను నివారిస్తామని, తమకు వైరస్ అంటదని మొండిగా వాదించినా పట్టించుకోలేదు. మార్చినెల 21న ఆల్ పాకిస్ధానీ సున్నీ మహాసభ లాహౌర్ సమావేశంలో సంస్ధ నేత మహమ్మద్ అష్రాఫ్ మాట్లాడుతూ దేవుడు తలచుకుంటే తప్ప ఎవరికీ వైరస్ సోకదని చెప్పాడు. అంతే కాదు తమ సంస్ద కారణంగా ఎవరికైనా వైరస్ సోకితే ప్రభుత్వం తనను ఉరి తీయవచ్చు అని చెప్పాడు.
అక్కడి మంత్రుల తీరు ఎంతటి ప్రహసన ప్రాయంగా ఉందంటే ఒక వైపు బహిరంగ సభలను నిషేధించామంటూనే అలాంటి ఒక సభలో పాక్ రక్షణ మంత్రి పెర్వెజ్ ఖట్టక్ మాట్లాడుతూ వైరస్ అదుపులోనే ఉందని చెప్పటం విశేషం. తలిదండ్రుల తప్పిదాల కారణంగా శిక్షగా దేవుడు వారికి వికలాంగులైన పిల్లలను ఇస్తున్నట్లుగానే దేవుడి శిక్షకు గురయ్యే వారికే వైరస్ సోకుతుందని పంజాబ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఫయ్యాజుల్ హసన్ సెలవిచ్చాడు. ఖురాన్‌లో సామాజిక దూరం గురించి చెప్పలేదని, సామాజిక జీవితం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడటం అని చెప్పిన మతపెద్దలు లేకపోలేదు.
మన దేశంలోని కొందరు పెద్దలు పాక్ నేతలకేమీ తీసిపోలేదు. ఆవు పేడ, మూత్రంతో కరోనా నివారణ అవుతుందని అసోం బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు అసెంబ్లీలోనే చెప్పారు. న్యూఢిల్లీలో హిందూ మహాసభ పెద్దలు ఏర్పాటు చేసిన గోమూత్ర పార్టీకి రెండు వందల మంది హాజరై మూత్రం తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ” నాసా పరిశోధనల ప్రకారం ఉష్ణ వాతావరణంలో కరోనా వైరస్ బతకదు. నూటముఫ్పై దీపాలను వెలిగిస్తే తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని ఐఐటి ప్రొఫెసర్ చెప్పారు. కాబట్టి కరోనా ఆదివారం రాత్రి 9.09కి కరోనా వైరస్ మరణిస్తుంది. ఇది మోడీ తిరుగులేని ఎత్తుగడ ” అనే పోస్టును బిజెపి ఐటి సెల్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో వ్యాపింప చేసింది. కరోనా వైరస్ అయినా మరొకటి అయినా అయోధ్యలో రామనవమి ఉత్సవాలను ఆపటానికి వీల్లేదని రామ మందిరం ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస చెప్పారు. ఆపితే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రాముడు విముక్తి పొందిన తరువాత వచ్చిన తొలి నవమి కనుక ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, భక్తులకు ఎలాంటి హాని జరగకుండా రాముడు చూసుకుంటాడని, స్వాములందరూ సురక్షితంగా కార్యక్రమం జరిగేందుకు యజ్ఞం చేస్తారని చెప్పారు.(తరువాత కార్యక్రమాన్ని రద్దు చేశారు అది వేరే విషయం) పాక్ మతవాదులు- మన దేశ మతవాదులు సేమ్ టు సేమ్ తేడా ఏమంటే మతాలే వేరు. మూర్ఖత్వం ఒకటే !
పాకిస్ధాన్‌లో వైద్యులు వీధుల్లోకి ఎక్కారు. సోమవారం నాడు అరెస్టయి పోలీసుల లాకప్పులకు చేరిన వారు తమకు రక్షణ పరికరాలను అందచేస్తే తప్ప లాకప్పుల నుంచి బయటకు పోయేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అక్కడి పరిస్దితికి అదొక మచ్చుతునక కాగా మన దేశంలో పరిస్ధితి ఏమిటి ? వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ గురించి తాము చేసిన ప్రతిపాదన మీద ఐదు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిపిఇ తయారీదార్ల అసోసియేషన్ విమర్శించింది. ఈ వ్యవహారం గురించి ‘ది క్వింట్’ వెబ్ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది. దానిలో వివరాల సారాంశం ఇలా ఉంది. వైద్యులు రెయిన్ కోట్లు, హెల్మెట్లు, ఇతర ప్రత్యామ్నాయాలను ధరిస్తున్నారని గతవారంలో అనేక వార్తలు వచ్చాయి. ఈ సంక్షోభ సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి. కేంద్రం నుంచి స్పందన సకాలంలో రాని కారణంగా మనం ఐదు వారాల విలువైన సమయాన్ని కోల్పోయామని పిపిఇ తయారీదార్ల సంఘం నేత సంజీవ్ చెప్పారు. పిబ్రవరిలోనే తాము కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించి పిపిఇ కిట్లను నిల్వచేసుకోవటం గురించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తమకు మార్చి 21వరకు వర్తమానం రాలేదని ఫిబ్రవరి 21నాటికి గనుక కిట్ల గురించి స్పష్ట ఇచ్చి ఉంటే అవసరమైన మేరకు తయారు చేసి ఉంచేవారం అన్నారు. ఇవి మిగతా కిట్ల వంటివి కాదని, ఇలాంటి మహమ్మారులు తలెత్తినపుడు ఎలా, ఎన్నికావాలో ప్రభుత్వాలు చెబితే తప్ప తాము తయారు చేసేందుకు వీలు ఉండదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉంటే పిబ్రవరి 15న నాటికి వచ్చి ఉండేదని అన్నారు. మార్చి 24న తమకు మార్గదర్శక సూత్రాలు అందాయని, అయితే అంతకు ముందే డిమాండ్ పెరిగిపోయిందని చెప్పారు. మార్చి ఐదు-ఎనిమిది తేదీలలో రాష్ట్ర ప్రభుత్వాలు, సైనిక, రైల్వే ఆసుపత్రుల నుంచి టెండర్లు వెలువడ్డాయని వెల్లడించారు.
జనవరి 31న అన్ని రకాల వైద్య రక్షణ పరికరాల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే వారం రోజుల తరువాత ఫిబ్రవరి ఎనిమిదిన సర్జికల్ మాస్క్‌లు, ఎన్‌బిఆర్ గ్లోవ్‌లు తప్ప మిగిలిన అన్ని గ్లోవ్స్ ఎగుమతికి అనుమతి ఇస్తూ ఉత్తరువులు జారీ చేశారు. ఫిబ్రవరి 27న ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తూ ప్రపంచంలో పిపిఇ కిట్లకు కొరత ఉందని ముఖ్యంగా మాస్కులు, గౌన్లు, గాగుల్స్, రెస్పిరేటర్ల కొరత ఉందని పేర్కొన్నది. మార్చి 18న కేంద్ర జౌళి శాఖ సమీక్షలో అన్ని రకాల పరికరాలకు కొరత ఉన్నట్లు మినిట్స్‌లో నమోదు చేసినట్లు రాయిటర్స్ వార్త తెలిపింది. ఆ మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్యపరికరాలు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్దాల ఎగుమతులపై నిషేధం విధించింది. వైద్య పరికరాలు అవసరాలను బట్టే తయారు చేస్తారు లేదా ఇలాంటి మహమ్మారులు తలెత్తినపుడు అంచనాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది. మార్చి 24వ తేదీన పరికరాల తయారీ మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్ ప్రకటిస్తూ ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో పిపిఇ కిట్ల తయారీదారులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం కోరిన విధంగా కొత్తవి తయారు చేయలేరు, తయారీదార్ల వద్ద ఉన్నవి ప్రమాణాలకు అనుగుణంగా లేవని కొనుగోలు చేయలేదు.
లాక్ డౌన్ లేనట్లయితే రోజుకు 25వేల పిపిఇ కిట్ల తయారీ సామర్ధ్యం ఉంది. పది రోజుల తరువాత కొద్ది మంది పనివారు కంపెనీలకు హాజరవుతున్నారు, కార్మికుల సమస్య ఉంది. ఒక కిట్ తయారు కావాలంటే దానికి జిప్‌లు, ఎలాస్టిక్ వంటి అనేక విడిభాగాలు అవసరం, వాటిని సరఫరా చేసే వారికి సైతం ఇబ్బంది ఉంది. వారికి అనుమతులు చాలా కష్టంగా ఉంది. ఎవరూ ఎవరిదీ వినిపించుకోని స్ధితి.
పశ్చిమబెంగాల్లో తమకు రెయిన్‌కోట్లు ఇచ్చారని వైద్యులు తెలిపారు. పాట్నామెడికల్ కాలేజీ వైద్యులు కూడా అదే చెప్పారు. హర్యానాలోని ఒక ఇఎస్‌ఐ ఆసుపత్రిలో హెల్మెట్ వాడుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది. వైద్యపరికరాల తయారీదార్ల అసోసియేషన్‌లో 20 సంస్ధలున్నాయి. నెలకు ఐదులక్షల చొప్పున ఏడాదికి 62.5లక్షల తయారీ సామర్ధ్యం ఉంది, ప్రస్తుత అవసరాలకు అవి చాలా తక్కువ అని మార్చి 31న ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం ముందు నమూనా కిట్ తయారు చేయాలి, దాన్ని ఆరోగ్యశాఖ ఆమోదించి అనుమతించిన తరువాతే తయారీ ప్రారంభించాలి. అంటే అప్పటి వరకు తయారీదార్లు ఎలాంటి ముడి సరకు లేదా విడి భాగాలను కొనుగోలు చేసేందుకు లేదు. ఇప్పటికీ ప్రభుత్వానికి ఎన్ని అవసరమో స్పష్టత లేదు.
మార్చినెల మూడవ తేదీన మూడులక్షల పిపిఇ కిట్స్ అవసరమని అంచనా, అది 18వ తేదీకి 7.25లక్షలకు, 24వ తేదీకి 10లక్షలకు పెరిగింది. వీటిని తయారు చేసేవి చిన్న చిన్న సంస్దలు, సకాలంలో ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పెరిగిన ఖర్చులకు అనుగుణ్యంగా ధరలు పెంచితే డిమాండ్‌కు తగిన విధంగా ఇప్పటికీ తయారు చేసి ఇవ్వగలమని వారు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు.
ఒక వైపు దేశం నుంచి వైద్య పరికరాల ఎగుమతిని మార్చి 19 నుంచి నిషేధించినా 31 మన దేశం నుంచి 90 టన్నుల వైద్య రక్షణ ఉత్పత్తులు సెర్బియాకు ఎలా పంపారు అన్నది ప్రశ్న. దీని గురించి తనకు తెలియదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పటం విశేషం. తొంభై టన్నుల రెండవ కార్గోవిమానం ఆదివారం నాడు భారత్ నుంచి బెల్‌గ్రేడ్(సెర్బియా)లో దిగినట్లు యుఎన్‌డిపి ట్వీట్ చేసింది. దీని గురించి అడిగిన వివరణకు ఆరోగ్యశాఖ నుంచి వివరణ కోరినట్లు క్వింట్ పత్రిక తెలిపింది.
ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ఏవైనా లోపాలుంటే రాష్ట్ర ప్రభుత్వాలదే తప్ప నరేంద్రమోడీ సర్కార్ మీద విమర్శలు చేయటం ఏమిటని బిజెపి మరుగుజ్జులు గంతులు వేస్తున్నారు. వారే మరో వైపు కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఏర్పడిన అంతర్జాతీయ కమిటీకి మోడీని సారధ్యం వహించాలని ప్రపంచ నేతలు కోరినట్లు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలను సమన్వయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిది అనే విషయాన్ని దాచి రాష్ట్రాలపై నెపం మోపేందుకు ప్రయత్నించటం దారుణం !