Tags

, , , ,

President Tump had supported the Narendra Modi government’s stand on hydroxychloroquine and praised India’s handling of the Covid-19 pandemic.

ఎం కోటేశ్వరరావు
నువ్వే నేను, నేనే నువ్వు, అన్ని విషయాల్లో ఒకే మాటగా ఒకే బాటలో నడుస్తామని చెప్పారు. మాది ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొనే స్నేహం అన్నారు. కావాలంటే చూడండి అని కావిలించుకొని మరీ ప్రపంచానికి ప్రదర్శించారు. వారెవరో ఇంకా చెప్పాలా ! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మన ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ట్రంప్‌ మరో దోస్తును మాక్కావలసిన మందు పంపకపోతే సంగతి చూస్తా బిడ్డా ! అని బెదిరించాడు. అంతకోపమెందుకు అన్నా నీక్కావలసినవి పంపుతున్నా అంటూ వెంటనే మోడీగారు జావగారి పోయారు. తన అవసరం తీరగానే భారత్‌కు, మోడీకి కృతజ్ఞలు అంటూ ఒక ట్వీట్‌ను ట్రంప్‌ మనకు పారేశాడు. మరి ఇదేమి స్నేహమో, ఇదేమి సమానభాగస్వామ్యమో జనం ఆలోచించాలి. ఈ విషయాల మంచి చెడ్డల గురించి మాట్లాడితే కరోనా కష్ట కాలంలో ఇలాంటివా అని మోడీ భక్తులు చెలరేగి పోతారు. మామూలు రోజుల్లోనే సహించరని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇప్పుడు చెప్పనవసరం లేదు. అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది ట్రంప్‌. సాయం కావాల్సింది వారికి, ఎవరైనా మర్యాద పూర్వకంగా అడుగుతారు. బెెదిరించేవాళ్లను-వారికి లొంగిపోయే వారిని ఏమనాలి ? ఇది వ్యక్తుల సమస్య కాదు, దేశం పరువు. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఇలా ప్రవర్తిస్తారా అని షాక్‌ అవుతున్నవారెందరో !
ప్రపంచ మీడియా అంతా అమెరికా బెదిరింపుకు భారత్‌ లొంగిపోయింది అని రాసింది. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్లుగా మోడీ భక్తులకు ట్రంప్‌ అవమానించినందుకు, ప్రపంచ మీడియా అదే విషయాన్ని రాసినందుకు కోపం రాకపోవచ్చు గానీ మన దేశంలో ఎవరైనా దాని గురించి మాట్లాడితే, రాస్తే, విమర్శిస్తే ఎక్కడలేని ఆగ్రహం వస్తుంది. బానిస మనస్థత్వాన్ని ప్రదర్శించారని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేమనుకుంటేనేం ట్రంప్‌ పొగడ్తల ముందు అన్నీ దిగదుడుపే ! నిన్నటిదాకా ప్రపంచ రాజకీయాల్లో సమాన భాగస్వామి అని ప్రకటించిన నరేంద్రమోడీని ట్రంప్‌ అవమానిస్తే అది మోడీకి కాదు, దేశానికే అవమానం. అలాంటిది దీన్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనటాన్ని ఏమనాలి, సాధారణంగా అయితే సిగ్గు చేటు అంటాం. ఈ మాట దేశద్రోహం కిందకు రాదు. రాజకీయం చేసింది, మర్యాద లేకుండా వ్యవహరించింది ట్రంప్‌ !

COVID-19: More Hydroxychloroquine Data From France
కరోనాకు ఇంతవరకు మందు లేదు. ఉన్న మందులు కరోనా సోకిన రోగులకు తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్సకోసం తప్ప మరొకదానికి కాదు. మలేరియాకు బాగా పని చేసే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అనే ఔషధం కరోనా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని ఇంతవరకు ఎవరూ నిర్దారణగా చెప్పలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఫలానా మందు వేస్తే ఏమైనా సుగుణం వస్తుందేమో చూద్దాం అన్ని అందుబాటులో ఉన్న మందులను వాడుతున్నట్లుగా కొన్ని చోట్ల దీన్ని కూడా వాడారు. కొందరికి సుగుణం కనిపించిందని వైద్యులు చెప్పారు, కొందరికి అదే ప్రాణాల మీదకు తెచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మందును ప్రపంచంలో ఎవరైనా తయారు చేయవచ్చు, దీనికి లైసన్సు, పేటెంట్లతో పనిలేదు. అమెరికాలో కూడా ఇప్పటికే తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి దానికోసం ట్రంప్‌ ఇంత యాగీ ఎందుకు చేసినట్లు ? తన దోస్తు పరువు ఎందుకు తీసినట్లు ?
ట్రంప్‌ చర్య బెదరింపు, హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ ,ఇతర వైద్య పరమైన వాటిపై ఎగుమతి నిషేధాన్ని సడలించకపోతే ప్రతికూల చర్యలకు పాల్పడతాం అని చెప్పటం బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. నిర్దారణగాని సదరు ఔషధం కనుక ఎగుమతి చేసినా ఇబ్బంది లేదు, కరోనా పోరులో అవసరమైన మిగతావాటిని కూడా బెదిరింపులకు లొంగి సరఫరా చేస్తే మన జనం సంగతి ఏమిటి అన్నది సమస్య? ఈ విషయాన్ని చర్చించనవసరం లేదా ? ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఏకపక్షంగా చేయకపోతే ప్రతిపక్షాలను ఎందుకు సంప్రదించలేదు ?
సామాజిక మీడియాలో అతిశయోక్తులు ప్రచారం చేయటం, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని అంటగట్టటం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కూడా కాషాయ తాలిబాన్లు వెంటనే విజృంభించారు. సరైన పేరు లేదు గానీ కాషాయ రంగులో ఉండే వైరస్‌ సోకిన కారణంగా మీడియాలో పని చేసే వారందరూ కమ్యూనిస్టులుగానూ, మోడీకి సంబంధించి నిజాలను చూపని వారుగా కనిపిస్తారు. ఒక సారి ఆ వైరస్‌ సోకిన వారికి మెదడు పూర్తిగా చెడిపోతుంది, దాంతో జీవితాంతం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. అది వ్యాధి లక్షణం. అలాంటి ఒక వ్యాధిగ్రస్తుడు లేదా గ్రస్తురాలు సామాజిక మాధ్యమం కోసం తయారు చేసిన పోస్టు ఇలా తిరుగుతోంది. ” కమ్మి కమీనే మీడియా కుళ్ళుతో చెప్పని, ఇంటర్నేషనల్‌ న్యూస్‌ టాపిక్స్‌ లో హాట్‌ గా మారిన వార్త ఇవాళ్టికి ఇదే. మోడీ చాలా టఫ్‌ గురూ…సూపర్‌ పవర్‌ అమెరికాకి హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరం, భారత్‌ కు ఎగుమతి చేసే శక్తి ఉంది.ముందుగా డిమాండ్‌ చేశారు.మోదీజీ ముందు మా అవసరాలు తీరాలని సమాధానం. రెండోసారి బెదిరింపు.మోదీజీ నవ్వుతూ కుదరదని స్పష్టం..మూడోసారి ‘ ఓకే మీకేం కావాలో అడగండి ‘ఇదీ అడిగేపద్దతి..
1.) అమెరికన్‌ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భారత్‌ ఫార్మా కంపెనీలకు అడ్డొస్తున్న నియమాలను సవరించాలి.. డన్‌…2) భారత్‌ ఫార్మా కంపెనీల మీద సహేతుకంగా లేని అమెరికన్‌ ఎఫ్‌డిఏ విధించిన అన్ని లెవీస్‌ ఎత్తివేయాలి… డన్‌. 3.) ఎఫ్‌డిఐ ఇకపై భారత్‌ ఫార్మా కంపెనీల మీద అనవసర పేటెంట్‌ హరాస్మెంట్‌ చేయకూడదు.. డన్‌ . భారత్‌ ప్రతిపాదించిన 3 ప్రధాన డిమాండ్స్‌ నూ..డన్‌..డన్‌..డన్‌ 24 గంటల సమయంలో ఒప్పుకున్న అమెరికా…నిజంగానే మోడీ చాలా టఫ్‌… కొరకరాని కొయ్య..? ఓవరాల్‌గా మన ఫార్మా కంపెనీలు అమెరికా వెళ్ళడానికి కావలిసిన అన్ని అనుమతులు మోడీ గారు దగ్గర ఉండి ఇప్పించారు. అలాగే అమెరికా అడిగిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ కూడా పంపించారు.” ఇదీ మొత్తం పోస్టు.
పాఠకులు గ్రహించాల్సింది ఏమంటే ప్రయివేటు మీడియాలో ఇవన్నీ చూపలేదు సరే, దూరదర్శన్‌, రేడియోలలో పని చేసేది కూడా కమ్యూనిస్టులేనా ? దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలో ఏముంది ? అన్నింటికీ ఒప్పుకుంటున్నట్లు అమెరికా వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదే. మరి సామాజిక మాధ్యమానికి ఎలా అందినట్లు ? ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి ! ఇంతకీ అసలు జరిగిందేమిటి ?
అమెరికా మనలను అడిగేనాటికే మన కేంద్ర ప్రభుత్వం మన అవసరాలను గమనంలో ఉంచుకొని ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు ఈనెల నాలుగవ తేదీ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడింది. అది వెలువడిన కొద్ది గంటల్లోనే అమెరికా నుంచి ఔషధాలు కావాలని అడిగారు. ట్రంప్‌ స్వయంగా సంప్రదించాడు. నిషేధం కారణంగా కుదరదని చెప్పారు. అయితే నేను స్వయంగా ఫోనులో మోడీని అడిగినా ఔషధాలను పంపరా ? మీ సంగతి చూస్తా అంటూ ట్రంప్‌ సోమవారం నాడు బహిరంగంగానే బెదిరించాడు. ఒక రోజు కూడా గడవక ముందే మన సర్కార్‌ నిషేధాన్ని సడలించి పంపుతామని ప్రకటించింది. అంతే తప్ప మన కంపెనీలు నేరుగా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లేందుకు దగ్గరుండి మరీ నరేంద్రమోడీ అనుమతులిప్పించారని చెప్పటం అతిశయోక్తి. కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ విలేకర్లతో మాట్లాడుతూ మన మీద ఆధారపడుతున్న దేశాలకు ఔషధాలను పంపుతున్నామని, అమెరికాకు పంపటాన్ని రాజకీయం చేయవద్దని, ఊహాగానాలు వద్దని కోరాడు తప్ప అమెరికాతో పైన చెప్పినట్లుగా ఒప్పందం గురించి చెప్పలేదు, కాషాయ దళాలు ఆయన్ను కూడా కమ్యూనిస్టు అంటారేమో !
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు చైనాయే మన సాయం కోరింది అని మరొక ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు ప్రచారమే. ఇబ్బందులలో ఉన్నపుడు ఎంత గొప్పవారినైనా మీకేమైనా కావాలా అని అడుగుతాం. వారు కోరకుండానే మనకు తగిన సాయం చేస్తాం. అది మర్యాద, మన్నన. అలాంటి దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి స్దాయి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ రాత పూర్వక సమాధానమిస్తూ చైనాకు మన దేశం 15టన్నుల వైద్య సరఫరాలను ఫిబ్రవరి 26న ఒక ప్రత్యేక విమానంలో తీసుకుపోయి ఊహాన్‌లోని హుబెయ రాష్ట్ర ఛారిటీ ఫెడరేషన్‌కు అందచేశామని, వాటి విలువ 2.11 కోట్ల రూపాయలని, అంతకు ముందు ఎనిమిదవ తేదీన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు గ్జీకి ఒక లేఖ రాస్తూ తమ సౌహార్ద్రతను తెలియచేస్తున్నామని, అవసరమైన సాయం చేయగలమని పేర్కొన్నట్లు ఆ సమాధానంలో తెలిపారు. పంపిన వాటిలో ఒక లక్ష సర్జికల్‌ మాస్కులు, ఐదులక్షల సర్జికల్‌ గ్లోవ్స్‌, 75 ఇన్‌ప్యూజన్‌ పంప్స్‌, 30 ఎంటరల్‌ ఫీడింగ్‌ పంప్స్‌, 21డిఫిబ్రిలేటర్లు, నాలుగువేల ఎన్‌95 మాస్కులు ఉన్నట్లు పేర్కొన్నారు. చైనా అవసరాలతో పోల్చినపుడు ఇవి ఎంత అన్నది సమస్య కాదు, తోటి దేశంగా తోడ్పాటు. అది ఎవరైనా చేస్తారు. దాన్ని గొప్పగా చెప్పుకోవటాన్ని ఏమనాలి ?
చైనాకు చేసిన ఈ సాయం గురించి గొప్పలు చెప్పుకుంటున్న వారికి తెలిసినా తెలియనట్లు నటించే విషయాలను జనం తెలుసుకోవాలి.చైనా, ఇతర దేశాల్లో ఎక్కడ దొరికితే అక్కడ మనకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను కొనుగోలు చేసేందుకు మన దేశం నిర్ణయించిందని మార్చి 31న రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనాన్ని బిజినెస్‌ టుడే ప్రకటించింది.భారత్‌కు మూడు కోట్ల 80లక్షల ముఖతొడుగులు, 62లక్షల వ్యక్తిగత రక్షణ వైద్య పరికరాలు అవసరమని ఆ వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల వైద్యులకు ఇలాంటి పరికరాలు లేక రెయిన్‌కోట్లు వేసుకుంటున్నారని, గతిలేక హెల్మెట్లు పెట్టుకొని తమను తాము రక్షించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మనం చైనాకే ఎగుమతి చేసే స్దితిలో ఉన్నామని గొప్పలు చెప్పేవారు దీని గురించి ఏమి చెబుతారు ?
అమెరికన్ల పట్ల ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి పదే పదే చెప్పుకోవటం నాగరికులకు సిగ్గు చేటు, వదిలేద్దాం. కరోనా చికిత్సకు హైడ్రోక్సి క్లోరోక్విన్‌ పని చేస్తుందని నిర్ధారణ కాలేదు, అయినా ఆ ఔషధం కోసం ట్రంప్‌ గత కొద్ది రోజులుగా ఇంటా బయటా ఎందుకు రచ్చ చేస్తున్నట్లు ? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ మాదిరి వ్యవహారమేనా మరేదైనా ఉందా ? అమెరికా మీడియాలో భిన్న కథనాలు వెలువడ్డాయి. హైడ్రోక్సీ క్లోరోక్విన్‌తో కలిపి కొందరు వైద్యులు అజిత్రోమైసిన్‌ ఇస్తారు. దీన్ని జెడ్‌ పాక్‌ అంటారు. ఈ యాంటీబయోటిక్‌ బాక్టీరియాను తప్ప వైరస్‌ను నిర్మూలించదు. రెండు వారాల క్రితం ఫ్రెంచి వైద్యుల బృందం కొందరికి దీనితో చికిత్స చేశారు. ఆరు రోజుల తరువాత ఆరుగురికి పరీక్షలో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ విషయం ఒక పత్రికలో ప్రచురితమైంది. అమెరికాలోని ఒక ప్రముఖ వైద్యుడు దీన్ని అందుకొని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చాడు. దాన్నే సలహాగా ట్రంప్‌కు చెప్పాడు. అసలే నిర్లక్ష్యం చేసినట్లు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ ఈ ఔషధంతో అమెరికాలో వైరస్‌ను నిర్మూలించవచ్చని నమ్మినట్లు కనిపిస్తోంది. కానీ అదే ఫ్రెంచి వైద్యుల పర్యవేక్షణలో అదే ఔషధం తీసుకున్న మరో ముగ్గురిని ఆరురోజుల తరువాత పరిస్ధితి విషమించి ఐసియులో చేర్చారు. మరొకరికి చెడు ప్రభావం కనిపించటంతో జెడ్‌ పాక్‌ ఇవ్వటం నిలిపివేశారు. మరొక పేషెంట్‌ ఆరవ రోజున మరణించాడు. ఈ విషయాలను ట్రంప్‌కు వివరించిన వైద్యుడు గానీ, ట్రంప్‌గానీ పట్టించుకోలేదు. కేవలం ఒక ఆరుగురికి వచ్చిన ఫలితాన్ని బట్టి ఒక ఔషధాన్ని వైరస్‌ అనుమానితులు లేదా వ్యాధి గ్రస్తులకు ఇవ్వటం వైద్య చరిత్రలో అరుదు, ఎవరూ అంగీకరించరు. అయినా ట్రంప్‌ హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ చరిత్రను మార్చివేస్తుందంటూ గానాలాపనకు పూనుకున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనది, ఎంతో అందమైనది, స్వర్గం నుంచి వచ్చిన బహుమతి అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలాడు. దాన్లో భాగంగానే మన దేశాన్ని బెదిరించాడు. తాను కూడా స్వయంగా తీసుకోబోతున్నట్లు చెప్పాడు. వైరస్‌ గురించి దాదాపు అన్నీ పచ్చి అబద్దాలు చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు క్లోరోక్విన్‌ గురించి ఎక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వలన ఫలితం ఉండదనే అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పిన వారిని తీసుకొంటే మీకు పోయేదేమిటి అని నోరు మూయిస్తున్నాడు. ఎప్పుడైతే ట్రంప్‌ ఇలా మాట్లాడటం మొదలు పెట్టారో జనాలు తమకు ఉపయోగపడుతుందో లేదో తెలియకపోయినా అవసరం అయినపుడు ఉపయోగించుకోవచ్చని పెద్ద మొత్తంలో క్లోరోక్విన్‌ ఔషధాన్ని కొని నిల్వచేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అమెరికాలో కొరత ఏర్పడింది. అరిజోనా రాష్ట్రంలో చేపల తొట్లలో వేసే క్లోరోక్విన్‌ తీసుకొని భార్యాభర్తలు అస్వస్తతకు గురి కాగా భర్త మరణించాడు.
మరొక ఆసక్తికర విషయం ఏమంటే అమెరికాలో మలేరియాను ఎప్పుడో అరికట్టారు. పదమూడు రాష్ట్రాలలో మాత్రం అక్కడక్కడా చాలా సంవత్సరాల క్రితం కనిపించేది. అయితే ఇప్పటికీ మలేరియా కేసులు అమెరికా ఆసుపత్రుల్లో ఏటా రెండువేల మేరకు నమోదవుతున్నాయి. అవి కూడా విదేశాల నుంచి ముఖ్యంగా దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంత దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే క్లోరోక్విన్‌ మలేరియాతో పాటు లూపస్‌(ముఖచర్మరోగం)కు కూడా బాగా పని చేస్తుంది అందువలన దానికోసం అమెరికాలో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి. అమెరికాలో వ్యూహత్మక నిల్వల కోసం గతనెలలోనే నోవార్తిస్‌ సబ్సిడరీ శాండోజ్‌ కంపెని 2.9 కోట్ల డోసుల హైడ్రోక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ను ప్రభుత్వానికి ఉచితంగా అందచేసింది. మరో కంపెనీ బేయర్‌ పదిలక్షల డోసులు ఉచితంగా అందచేసింది.
హైడ్రోక్సి క్లోరోక్విన్‌ గురించి ట్రంప్‌ హడావుడి చేయటం వెనుక స్వల్ప మొత్తాలలోనే అయినప్పటికీ ట్రంప్‌ కుటుంబ సభ్యులకు ఆర్ధిక ప్రయోజనాలున్నాయని ఆ కారణంగానే ట్రంప్‌, ఆయనకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికే వాటిని రాసింది. పాలక్వెనిల్‌ బ్రాండ్‌ పేరుతో హైడ్రోక్సి క్లోరోక్విన్‌ తయారు చేసే సనోఫి అనే కంపెనీ వాటాలలో ట్రంప్‌ కుటుంబ సభ్యుల మ్యుచ్యువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఉన్నాయని టైమ్స్‌ రాసింది. అయితే అవి వారి ఆస్తులతో పోల్చితే నామమాత్రమే అని వాటి వలన పెద్దగా వచ్చేదేమీ ఉండదని మరికొన్ని పత్రికలు రాశాయి.

Trump threatens payback for U.S. companies that move abroad | PBS ...
ఈ ఉదంతం మొత్తాన్ని చూస్తే ఒక అంశం స్పష్టం అవుతున్నది. ట్రంప్‌ అనుసరించిన నిర్లక్ష్యం కారణంగా నేడు అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది, ఎంత మందికి సోకుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితం వ్యాధి విస్తరణ తీరు తెన్నులను అరికట్టకపోతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది వరకు మరణించే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం అనుమానమే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. జో బిడెన్‌ ఇప్పుడు ట్రంప్‌ ప్రత్యర్ధి అని తేలిపోయింది. అమెరికాలో ఔషధ తయారీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది తప్ప అక్కడ తయారు చేయలేనిదేమీ కాదు. అంటే ట్రంప్‌ ఇక్కడ కూడా ఖర్చు – లాభం చూసుకున్నాడని అనుకోవాలి. ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడల్లో భాగంగా ఎంతకైనా తెగిస్తానని, అమెరికన్ల కోసం ఏమైనా చేస్తానని ప్రదర్శించుకొనేందుకు మన దేశాన్ని బెదిరించినట్లు స్పష్టం కనిపిస్తోంది.
నరేంద్రమోడీ సర్కార్‌ బెదిరింపుల గురించి కనీస నిరసన కూడా తెలియచేయకుండా నాలుగు రోజుల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసి అమెరికాకు ఔషధాన్ని పంపేందుకు నిర్ణయించింది, మరి ఆ 56 అంగుళాల ఛాతికి ఏమైందో, సమాన భాగస్వామ్యం ఎక్కడకు పోయిందో తెలియదు, మరీ ఇంత లొంగుబాటా ? ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తామని చెప్పుకొనే తమ నేత పరువు ప్రపంచ మీడియా వార్తలతో వారణాసిలోని మురికి గంగలో కలసిందని, దానికి ఆయన జిగినీ దోస్త్‌ ట్రంపేనని ఆయన భక్తులు గ్రహిస్తారా ?