ఎం కోటేశ్వరరావు
జగన్‌మోహరెడ్డి ఎరక్కపోయి మరింతగా ఇరుక్కు పోతున్నారా అనే శీర్షికతో మార్చినెల 22న ఒక విశ్లేషణ చేశాను. తాజాగా జరిగిన పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ అమలు చేశారు. గవర్నర్ ఆమోదం పొందిన తరువాత ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్‌గా తుడా కార్యదర్శి ఎస్ రామసుందరరెడ్డి నియామకం కూడా జరిగిపోయింది. కరోనా లక్షణాలు బయట పడటానికి 14 రోజులు పడుతుందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే కరోనా మాటున రహస్యంగా జరిగింది బయట పడింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా ? ఏదైనా ఒకటే, వినేవారు చెవి అందిస్తే దానికి ఇంపైన మాటలతో కంపు చర్యలను కూడా ఎక్కిస్తారు. కమిషనర్ పదవీ కాలం తగ్గింపు, దాని కొనసాగింపుగా తొలగింపు చట్టబద్దమా, విరుద్దమా అన్న చర్చ ప్రారంభమైంది. తెలుగు ప్రాంతాల్లో ఒక లోకోక్తి ఉంది. కొడదామంటే కడుపుతో ఉంది-తిడదామా అంటే అక్క కూతురు అన్నట్లుగా సలహాదారులను ఏమీ చేయలేని స్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. ఏరి కోరి నియమించుకున్నవారాయే ఏ పేరుతో తొలగిస్తారు ? ఏది ఎలా జరిగినా అంతిమంగా ఫలితాన్ని అనుభవించేది జగన్మోహనరెడ్డి మాత్రమే. సలహాదారులకు పోయేదేమీ లేదు, వాళ్లు ఎన్ని తప్పుడు సలహాలు ఇచ్చినా తొలగించలేని నిస్సహాయ స్థితిలోకి ఇప్పటికే జారుకున్నారు. ఎవరినైనా తొలగిస్తే అది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది.
జగన్మోహనరెడ్డి పాలన మీద కేంద్రీకరించటం కంటే తనకు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెడతాయని ఆశపడుతున్న నవరత్నాల అమలు, తన రాజకీయ ప్రత్యర్ధుల మీద, గత పాలనలో వారికి సహకరించిన ఉన్నతాధికారుల మీద కక్ష తీర్చుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. వాటిని ఆరోపణలుగా భావించి వైసిపికి మద్దతు ఇస్తున్న వారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గింపు ఆర్డినెన్స్ ద్వారా దొడ్డి దారిన రమేష్ కుమార్‌ను తొలగించటంతో సిఎం కక్షపూరిత వైఖరిని నిర్ధారించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహనరెడ్డి ఏం చేసినా సమర్ధించే వీర భక్తులకు కొదవ లేదన్నది వేరే అంశం. వారు తమ దేవుళ్లను కాపాడలేరు అని ఇప్పటికే చంద్రబాబు నాయుడి విషయంలో రుజువైంది.
స్ధానిక ఎన్నికలను వాయిదా వేసిన కమిషనర్ నియామకంపై తమ ముఖ్య మంత్రి అనవసరంగా ప్రతిష్టకు పోయి దెబ్బతిన్నారని భావిస్తున్న వైసిపి నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తొలగింపునకు అనుసరించిన పద్దతిని ఉన్నత న్యాయస్ధానాలు అంగీకరించకపోతే తాము ఏ ముఖంతో బయటకు రావలానే ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కారణంగానే గతంలో ఎదురు దెబ్బలు తిన్న అనుభవం గమనంలో ఉంటే ఇప్పుడు ఆ కరోనా మరింత ఉధృతంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యను వైసిపి కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేరు.
ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, నియామకం గురించి స్వతంత్ర విధానాన్ని అనుసరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధికి రమేష్ కుమార్‌ను నియమించింది. అది ముగిసేలోగా ఏ కారణాలతో అయినా నియమిత వ్యక్తులు రాజీనామా చేస్తే లేదా అరవై అయిదు సంవత్సరాలు నిండి వైదొలగాల్సి వస్తే ఆ స్ధానంలో కొత్త వారిని నియమించటం వేరు. లేదా కమిషనర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చినపుడు తొలగించాలంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఏ పద్దతుల్లో తొలగించాలో అదే పద్దతిని పాటించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం అవసరం. అందువల అది అంత తేలిక కాదు కనుక జగన్ సర్కార్ వేరే మార్గాన్ని ఎంచుకుంది. అది చట్టబద్దమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. తన తొలగింపును సవాల్ చేస్తూ రమేష్ కుమార్ కోర్టుకు వెళతారా లేదా అన్నది తెలియదు. ప్రజాప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ ఇతరులు ఎవరైనా కోర్టుకు వెళ్ల వచ్చన్నది ఒక వాదన.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ముఖ్యమంత్రి అయిన తానా లేక ఎన్నికల కమిషనరా అని స్వయంగా జగన్‌మోహనరెడ్డే ప్రశ్నించటమే కాదు, సుప్రీం కోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిని కమిషనర్ నిర్ణయమే సుప్రీం అని నిర్ధారించుకున్నారు.అయితే దాన్ని జీర్ణించుకోలేకపోయారు అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దానికి ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావించినా అది ఇలా, ఈ సమయంలో ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. కరోనా కారణంగా దృష్టి అంతా అటే వైపు ఉంది. దాన్ని అవకాశంగా తీసుకొని కక్ష తీర్చుకోవటానికి పూనుకుంటారని, ఈ సమయంలో కొత్త రాజకీయ వివాదాలకు తెరలేపుతారని ఎవరూ ఊహించలేదు.
అయితే వెనుకటి తేదీ నుంచి అమలు జరిగే నిర్ణయం చట్టబద్దమైతే ఏక్షణంలో అయినా తొలగించేందుకు అవకాశం ఉంది. కరోనా కష్ట కాలంలో ఆర్డినెన్స్ ద్వారా యావత్ రాజకీయ వర్గాలు విస్తుపోయేలా రాజకీయానికి పూనుకోనవసరం లేదు. గాలికిపోయేదాన్ని తలకెత్తుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ఎలాగూ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంటుంది. చర్చ లేకుండానే ఆమోదించే మద్దతు ఎలాగూ ఉన్నారు గనుక ఆ సమయంలోనే ఆర్డినెన్స్ ద్వారా చేసిన దాన్ని బిల్లుద్వారానే చేయవచ్చు.తొందరపడకుండా ప్రజాస్వామ్య బద్దంగానే చేశారనే విమర్శలు రాకుండా చూసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తగ్గేవరకు స్దానిక సంస్ధల ఎన్నికలు ఎలాగూ జరగవు. ఈ లోగా కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేదేమీ ఉండదు.
ఈ నేపధ్యంలో ఇలాంటి చర్యల ద్వారా జగన్మోహనరెడ్డి ఏమి సాధిస్తారు ? ఎలా లబ్ది పొందుతారన్నది ఒక అంశం. రమేష్ కుమార్ తొలగింపు విషయంలో కోర్టుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వెళ్లకపోతే అదొక పెద్ద చర్చ అవుతుంది. తాను తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రమేష్ కుమార్ తన వేటును సవాలు చేయకపోతే బెదిరింపులకు లొంగిపోయినట్లు కనిపించే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని సవరించారు. అది పూర్వపు తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను 2016 ఏప్రిల్ ఒకటవ తేదీన నియమించారు. ఒకసారి నియమించిన తరువాత సదరు వ్యక్తి పదవీకాలం పూర్తి అయిన తరువాతే కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నది ఒక వాదన, కాదు వెనుకటి తేదీ నుంచి కూడా అమలు చేయవచ్చు అన్నది సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషర్ల విషయంలో ఇలాంటి పరిస్ధితి గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. అయితే సమాచార కమిషనర్ల నియామకం, వారి హౌదాల విషయంలో ప్రభుత్వాలు చేసిన చేసిన మార్పులు కొత్తగా నియమించబోయేవారికి తప్ప ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసే సమయానికి పదవుల్లో ఉన్న వారికి గత విధానాలే వర్తిస్తాయని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ తీర్పు ప్రకారం అయితే జగన్‌మోహనరెడ్డికి మరో గట్టిదెబ్బ తగలనుంది. అది కార్యకర్తలు, నేతల్లో జగన్ పట్ల ఉన్న ఆరాధన స్ధానంలో చులకన భావం కలగటానికి నాంది అవుతుంది. ఇప్పటికే మడి కట్టుకొని ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉన్నత న్యాయ స్ధానాలు ఈ వివాదం తమ ముందుకు వస్తే ఏమి తీర్పు ఇస్తాయి అన్నది ఆసక్తికరం. ఇటీవల వెలువడిన కొన్ని తీర్పులను చూస్తే గత తీర్పులను అనుసరిస్తారనేదేమీ లేదు. చట్టానికి చేసే వ్యాఖ్యానాలు మారిపోతున్నాయి. ఒక వేళ వెనుకటి తేదీతో అమలు జరిపే ఆర్డినెన్స్ చెల్లదు అని తీర్పు వస్తే జగన్ పరువు మరింత పోతుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఎన్నికల వాయిదాను రచ్చ చేసి పార్టీ కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టారన్న భావం ఉంది. ఎన్నికల రద్దు నిర్ణయం తరువాత జరిగిన పరిణామాలను చూస్తే కమిషనర్ చర్యే సరైందన్నది స్పష్టం. అయితే అది ప్రభుత్వంతో సంప్రదించి చేసి ఉండాల్సింది అన్నది కూడా కమిషనర్ వైపు నుంచి జరిగిన లోపం అన్నది కూడా నిజమే.
ఒక వేళ ప్రభుత్వ చర్యను ఉన్నత న్యాయస్ధానాలు సమర్ధిస్తే చూశారా మా తడాఖా అని జబ్బలు చరుచుకోవటం తప్ప వైసిపికి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటన్నది అయోమయం. అంతే కాదు అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టంలో జరిగిన దాడులు, బలవంతపు ఉపసంహరణలు, ఇతర అక్రమాల గురించి కొందరు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఉద్వాసనకు గురైన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఫార్సు చేశారు. ఆ అంశాలతో కూడిన ఒక లేఖ కేంద్రానికి కమిషనర్ నుంచి అందినట్ల్లు, అవసరమైనపుడు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరతామని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా లేదా కోర్టు అనుమతిస్తే కొత్త కమిషనర్ గత కమిషనర్ చేసిన సిఫార్సులను రద్దు చేస్తారా ? వచ్చిన ఫిర్యాదుల మీద ఏ చర్య తీసుకుంటారు ? కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖను కూడా ఉపసంహరించుకుంటారా ? అదే జరిగితే కేంద్రం ఏ వైఖరి తీసుకుంటుంది అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి.
ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు జగన్ సర్కార్ కరోనా, పేదలను ఆదుకోవటం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కక్ష తీర్చుకోవటం మీద ఉన్న శ్రద్ద కష్టకాలంలో ఉన్న జనాల మీద లేదనే తీవ్ర విమర్శ, జనాగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.