Tags

, , ,

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.