ఎం కోటేశ్వరరావు
” కరోనా మహమ్మారి సమయంలో మనకు అత్యంత అవసరమైన తరుణంలో ఎన్95ముఖ తొడుగులు దేశం బయటకు పోతున్నాయి – తరువాత ఏం జరుగుతుంది ?” అనే శీర్షికతో అమెరికాకు చెందిన ” ఫోర్బ్స్ ” పత్రిక విలేకరి డేవిడ్ డిసాల్వో రాసిన విశ్లేషణా వ్యాఖ్య ఏప్రిల్ ఆరవ తేదీన ప్రచురితమైంది. సరిగ్గా అదే రోజు మన ప్రధాని నరేంద్రమోడీ కౌగిలి నేస్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలేకర్లతో మమాట్లాడుతూ తాను కోరిన విధంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపక పోతే భారత్ మీద ప్రతీకార చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. స్నేహంలో ఇలాంటివి మామూలే అన్నట్లుగా మన నరేంద్రమోడీ వ్యవహరించారు.
మన దేశానికి చేసిన బెదిరింపును చూసి అనేక మంది అమెరికా తన అవసరాల కోసం అందుకు తెగిస్తోంది అనుకుంటున్నారు. అది వాస్తవమే, అయితే అదే సమయంలో అమెరికాలో తయారైన వైద్య పరికరాలను ట్రంప్ ఇతర దేశాలకు విక్రయించటానికి అనుమతించాడు, అంతే కాదు, ఇతర దేశాలు ఎక్కడో కొనుక్కున వాటిని దారి మధ్యలో అటకాయించి తీసుకుపోయిన దుండగానికి కూడా ట్రంప్ పాల్పడ్డాడు. ట్రంప్ బెదిరింపులు, మోడీ లొంగుబాటు గురించి మాట్లాడలేని మన మీడియా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతుల గురించి చిలవలు పలవలుగా వర్ణిస్తూ మోడీ భజనకు, తద్వారా మెరుగైన పాకేజీలకు అంటే నీకిది నాకదిగా ఉపయోగించుకుంది అని చెప్పాల్సి వస్తోంది. భజన చేయని కొన్ని మీడియా సంస్ధలకు ఈ విమర్శ వర్తించదన్నది షరా మామూలే.
అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో పైన పేర్కొన్న విలేకరి ఒక రోజు అమెరికాలో వైద్య పరికరాల విక్రయాకొనుగోలు దార్ల , ముఖ్యంగా ఎన్95 ముఖతొడుగుల లావాదేవీల మీద కేంద్రీకరించి పరిశీలించాడు. మార్చి 30వ తేదీన అదే పత్రికలో ఒక కథనాన్ని కూడా రాశాడు. దాని సారాంశం ఇలా ఉంది. ” కొద్ది గంటల్లోనే 28 కోట్ల ముఖతొడుగుల లావాదేవీలు జరగ్గా అత్యధిక భాగం అవి విదేశాల కొనుగోలు దార్లకు సంబంధించినవే. అదే రోజు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం కూడా ముఖతొడుగుల కోసం ఎక్కని -దిగని గుమ్మం లేదు. ఒక్క ఒప్పందం కూడా కుదరలేదు. మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, బ్రిటన్లలో అమ్మకాలకు కోట్లాది తొడుగులు ఉన్నట్లు మధ్యవర్తులు చెప్పారు. డిమాండ్‌ను చూసి విపరీతంగా ధరలను పెంచటంతో కొనుగోలుదార్లు ముఖ్యంగా అమెరికా దేశీయ కొనుగోలు దార్లనుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.ధరలు పెరిగిపోయిన కారణంగా విక్రయాలను గుట్టుగా సాగించటంతో పాటు అప్పటికే కుంభకోణాలు కూడా చోటు చేసుకుంటుండంతో కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఇవి జరిగాయి. తొడుగులు, పరికరాలకు విపరీతమైన డిమాండ్ పెరగటంతో వెంటనే డబ్బు చెల్లిస్తారా లేదా అసలు కొనుగోలు దార్ల దగ్గర డబ్బు ఉందా లేదా అని నిర్ధారించుకొని మరీ విక్రయాలు జరిపారు. నిధులు తమ దగ్గర ఉన్నట్లు రుజువు చూపటంలో ఆలస్యం అయిన సందర్భాలలో గంట వ్యవధిలోనే అప్పటికే ఒకరు కుదుర్చుకున్న వస్తువులను వేరే వారు కొనుగోలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రతి పత్రికా గోష్టిలో పాల్గొన్నవారు ఎన్95 ముఖతొడుగులను ధరించి కనిపించటంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. న్యూజెర్సీ రాష్ట్ర అధికారులు తాము తొడుగుల కోసం ప్రపంచవ్యాపితంగా ప్రయత్నిస్తున్నామని చెప్పిన సమయంలో అక్కడ నాలుగు కోట్ల 30లక్షల తొడుగులు అందుబాటులో ఉన్నాయి. స్ధానికులెవరూ లేకపోవటంతో వాటిని విదేశీ కొనుగోలుదార్లు ఎగరేసుకుపోయారు. ప్రభుత్వ సంస్ధలు కొనుగోలుకు ప్రయత్నించినపుడు ఎక్కువ భాగం ఖరారు కాలేదు. సంప్రదింపులు కొనసాగుతుండగా మధ్యలోనే ధరలు మారిపోయాయి, మధ్యవర్తులు సాధ్యమైన మేరకు సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు.”
అమెరికాలో కరోనా మహమ్మారి విస్తరించటానికి చైనా వారు కారణమని ఇప్పటికీ కొన్ని ఉష్ట్రపక్షులు మాట్లాడుతూనే ఉన్నాయి. లాభాల కోసం ఎంతకైనా తెగించే పెట్టుబడిదారీ వ్యవస్ధ, దాన్ని కాపాడే కావలి కుక్కల వంటి ట్రంప్‌లు తమకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల రక్షణ కోసం ఉపయోగించనంత కాలం ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. లాభాలు ఆర్జించే ఆంబోతులకు స్వేచ్చ ఇచ్చిన ట్రంప్ నిర్వాకం ఇది. ఫోర్బ్స్ పత్రికలో ఈ లావాదేవీల గురించి వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్ సర్కార్ ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. ఇతర దేశాలకు వైద్య పరికరాల నిరాటంకంగా ఎలా వెళ్లిపోయాయో పత్రికలు రాశాయి. చైనా వ్యతిరేక కళ్లద్దాలు పెట్టుకున్న కొన్ని పత్రికలు కరోనా వైరస్‌తో పాటే వందల కోట్ల వైద్యపరికరాలను కూడా చైనా తయారు చేసి సిద్దంగా ఉంచుకుంది అని రాసినవి కూడా లేకపోలేదు. ఈ విషయాలు తెలిసినపుడు వైరస్ నిరోధ చర్యలను ఆయా దేశాలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న ఆ రాతలు రాసే వారికి తట్టలేదు. ప్రమాదం గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించారని విమర్శిస్తే పాలకులు ఎక్కడ కన్నెర్ల చేస్తారో అని భయం.
చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారిందని రాసిన, చెప్పిన నోళ్లతోనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. సాధారణ సమయాల్లో ఇతర దేశాలకు ఎగుమతి కోసం చైనా వైద్య పరికరాలు తయారు చేస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. చైనా కంటే ఎన్నో రెట్లు మహమ్మారి వ్యాపించిన సమయంలో తమకు వెంటిలేటర్లు పెద్ద సంఖ్యలో కావాలని అడిగిన న్యూయార్క్ గవర్నర్‌ను ఎక్కువ చేస్తున్నావంటూ నోరు పారవేసుకున్న ట్రంప్ ఏలుబడిలో అదే సమయంలో అమెరికా నుంచి ఏఏ దేశాలకు వెంటిలేటర్ల ఎగుమతి జరిగిందో చెబుతూ ఇంటర్‌సెప్ట్ అనే పత్రిక రాసింది. అవేవీ రహస్యంగా తరలిపోలేదు, కావాలంటే రికార్డులు తనిఖీ చేసుకోవచ్చు. తైవాన్ వంటి చోట్ల కరోనా వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పటికీ వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించారు. అమెరికా నుంచి స్వేచ్చగా బయటకు పోనిచ్చారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు తీరా అలవికాని పరిస్ధితి ఏర్పడగానే జనాన్ని రక్షించేందుకు ఏమైనా చేస్తా అన్నట్లుగా ట్రంప్ ఫోజు పెట్టాడు. తమ దేశాలకు వస్తున్న వైద్య పరికరాలు, ముఖతొడుగులను బలవంతంగా చైనా నుంచి అనుమానాస్పద స్ధితిలో పక్కదారి పట్టించినట్లు జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ ఆరోపించాయి. తమకు దానం చేసిన 20వెంటిలేటర్లను అమెరికా అధికారులు అడ్డుకున్నట్లు బార్బడోస్ ప్రభుత్వం పేర్కొన్నది. చైనానుంచి బెర్లిన్ రావాల్సిన రెండు లక్షల ఎన్95 ముఖతొడుగులను దారి మధ్యలో థారులాండ్‌కు అక్కడి నుంచి ఏప్రిల్ 3న అమెరికాకు తరలించటం ఆధునిక సముద్రదోపిడీ అని జర్మన్ అధికారులు వర్ణించారు. అదే రోజు ఫ్రెంచి అధికారులు ఒక ప్రకటన చేస్తూ తమ దేశానికి రావలసిన సరఫరాలు షాంఘై విమానాశ్రయంలో రన్‌వే మీద ఉండగానే మూడు రెట్ల అధిక ధరలకు అమెరికా కొనుగోలు దార్లు ఎగరేసుకుపోయారని తెలిపారు. తాము పెట్టిన ఆర్డర్ల ప్రకారం వైద్య పరికరాలు సకాలంలో అందకుండా మధ్యలో అడ్డుపడుతున్నారని బ్రెజిల్ ఆరోపించింది. తాము చేస్తున్నదానిలో తప్పు లేదని ట్రంప్ సమర్ధించుకున్నాడు. తగిన మార్గాల్లో పరికరాలను సేకరిస్తున్నామని చెప్పాడు. ఎం3 అమెరికా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను కెనడా ఇతర దేశాలకు ఎగుమతి చేయటంపై ట్రంప్ సర్కార్ విధించిన నిషేధాన్ని కెనడా ప్రధాని విమర్శించటంతో ట్రంప్ నిషేధాన్ని ఎత్తివేశాడు.
వైద్య పరికరాలకు డిమాండ్ పెరిగిపోవటంతో అమెరికా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఒకదాని మీద మరొకటి విమర్శలకు సైతం దిగాయి. యాభై రాష్ట్రాల మధ్య ఇది ఎలక్ట్రానిక్ వేలంగా ఉందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో వ్యాఖ్యానించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సాయం విషయంలో రాజకీయ ప్రాధాన్యతలను ట్రంప్ ముందుకు తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. కరోనా మహమ్మారి సమయంలో అమెరికా ప్రభుత్వం వైద్యపరికరాల అపహరణకు పాల్పడుతున్నదా అని అమెరికాలోని కాటో సంస్ధ నిపుణుడు క్రిస్ ఎడ్వర్డ్ ప్రశ్న వేసుకొని అలాగే కనిపిస్తున్నదని తానే సమాధానం చెప్పాడు. ప్రభుత్వం చట్టబద్దమైన ఉత్పత్తులకు ఆర్డర్ ఇవ్వకుండా వాటిని స్వాధీనం చేసుకోవటాన్ని మరో విధంగా అపహరించటమే అని చెప్పాల్సి ఉంటుందని లాస్ ఏంజల్స్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.
తమకు వస్తున్న వాటిలో ఓడ నుంచి ఎనిమిది వెంటిలేటర్లు, 50వేల ముఖతొడుగులు, ఇతర వైద్య సరఫరాలను అమెరికా తొలగించటం తీవ్ర ఆశాభంగం కలిగించిందని బ్రిటన్ వలస ప్రాంతమైన కరీబియన్ కేమాన్ దీవుల ప్రధాని ఆల్డన్ మెక్‌లాహిన్ వ్యాఖ్యానించాడు. జమైకా రాయబారి జోక్యం చేసుకోవటం అమెరికా తిరిగి వాటిని ఆ దీవులకు పంపింది.
వైద్యులు సిఫార్సు చేస్తున్న ఔషధాల ఎగుమతుల విలువ ప్రపంచవ్యాపితంగా 2018లో 371.3 బిలియన్ డాలర్లని వరల్డ్ ఎక్స్‌పోర్ట్స్ డాట్‌కామ్ తాజాగా తెలిపింది. 2014 నుంచి సగటున ఎగుమతులు అన్ని దేశాల నుంచి 5.8శాతం చొప్పున ఏటా పెరుగుతున్నాయి. ఎగుమతుల్లో 79.7శాతం ఐరోపా దేశాల నుంచే జరుగుతున్నాయి. వాటి విలువ 295.8 బిలియన్ డాలర్లు. రెండవ స్ధానంలో ఉన్న ఆసియా నుంచి 10.7, ఉత్తర అమెరికా ఖండం నుంచి 8.1శాతం ఉన్నాయి. ఎగుమతులు ఉన్నాయి. ప్రపంచంలో 4.3శాతంగా ఉన్న 3003 ఔషధాలలో రెండు అంతకంటే ఎక్కువ కలసి ఉన్నాయి, మరో 3004 ఔషధాలు అసలేమీ కలవనివి, ఒకటి రెండు కలిసినవి 95.7శాతం ఉన్నాయి.2018లో అగ్రస్ధానంలో ఉన్న పది దేశాల ఎగుమతులు బిలియన్ డాలర్లు, శాతాలలో ఇలా ఉన్నాయి.1.జర్మనీ 62.3(16.8), 2. స్విట్జర్లాండ్ 45.3(12.2), 3.బెల్జియం 27.8(7.5), 4.ఫ్రాన్స్ 25.9(7), 5. అమెరికా 22(5.9), 6.ఐర్లండ్21.7(5.8), 7.బ్రిటన్ 19.7(5.3),8.ఇటలీ 19.6(5.3), 9.నెదర్లాండ్స్ 16.3(4.5), 10 భారత్ 13.1(3.5). మొత్తం ఎగుమతులలో పదిహేను దేశాల వాటా 85శాతంగా ఉంది. 2014 తరువాత వేగంగా ఎగుమతులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతుల పెరుగుదల డెన్మార్క్ 293.4శాతం కాగా స్విడ్జర్లాండ్ 26.7, భారత్ 22.5, జర్మనీ 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో బ్రిటన్ ఎగుమతులు 18.1శాతం తగ్గగా తరువాత అమెరికా 14.3, ఇటలీ 12.4, బెల్జియం 9.6, ఆస్ట్రియా 8.3శాతం తగ్గాయి.
ఇక మన దేశం విషయానికి వస్తే హైడ్రాక్సీ క్లోరో క్విన్ మందు బిళ్లల గురించి నరేంద్రమోడీకి లంకె పెట్టి అదొక ఘనతగా పెద్దఎత్తునప్రచారం చేస్తున్నారు. ఔషధ రంగంలో ముందున్న అన్ని దేశాలలో దీనిని తయారు చేస్తున్నారు. చలితో వచ్చే జ్వరాన్ని తగ్గించేందుకు లాటిన్ అమెరికాలోని పెరూలోని గిరిజనులు(స్ధానికులు) స్ధానికంగా దొరికే సింకోనా చెట్టు బెరడు నుంచి తయారు చేసిన చూర్ణాన్ని వినియోగించే వారు. ఆ ప్రాంతానికి ఐరోపా వారు వలస వచ్చిన తరువాత ఆ చెట్టు మందును తమ దేశాలలో అదే జ్వరం, మలేరియాకు వినియోగించారు. తరువాత సింకోనా నుంచి 1820లో క్వినైన్‌ను వేరు చేసి వినియోగించటం ప్రారంభించారు. 1902లో బ్రిటీష్ వైద్యుడు రోనాల్డ్ రాస్ దోమల నుంచి మలేరియా వ్యాప్తి చెందుతున్నట్లు కనుగొన్నారు. 1934లో జర్మనీకి చెందిన బేయర్ కంపెనీ శాస్త్రవేత్త హాన్స్ అండెర్‌సగ్ నాయకత్వంలోని బృందం క్లోరోక్విన్ తయారు చేసింది. దానికి రిసోచిన్ అని పేరు పెట్టారు. అయితే అది చాలా తీవ్ర విషతుల్యంగా ఉండటంతో మానవ వినియోగానికి పనికి రాదని నిర్ణయించి పట్టించుకోలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దాని మిత్ర దేశాల సైనికులకు మలేరియా సోకింది. క్లోరోక్విన్ నుంచి వేరు చేసిన మిథైల్ క్లోరోక్విన్ దాన్నే సంటోచిన్ అని పిలిచారు. మలేరియా నివారణకు దాన్ని ఉపయోగించారు. ఆ యుద్దంలో జర్మనీ ఓడిపోయినపుడు ట్యునిస్‌లో ఆ ఔషధం అమెరికన్లకు దొరికింది. వారు దాన్ని తమ దేశానికి తీసుకుపోయి మరింత అభివృద్ధి చేసి 1947 నుంచి మలేరియా నివారణకు వినియోగించటం ప్రారంభించారు.
మలేరియా భూమధ్య రేఖకు అటూ ఇటూ ఉండే ఉష్ణమండల దేశాలలో ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో ఎక్కువగా వ్యాపిస్తోంది. వాటిలో మన దేశం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ 2018 నివేదిక ప్రకారం 22.8కోట్ల మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఆఫ్రికాలోనే 21.3 కోట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో కూడా ఆరు దేశాల్లో ప్రపంచంలోని 85శాతం కేసులు నమోదయ్యాయి. వాటిలో నైజీరియాలో 25, కాంగో 12, ఉగాండా 5, కోట్ డి ఐవరీ, మొజాంబిక్, నైగర్‌లో మూడుశాతం చొప్పున ప్రపంచంలోని సగం కేసులు కలిగి ఉన్నాయి.
మన దేశం విషయానికి వస్తే 2001లో 2.08 మిలియన్ కేసులు నమోదు కాగా 2018లో నాలుగు లక్షలకు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నది. ఇప్పటికీ గణనీయంగా ఉన్నందున మన దేశంలో మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సిక్లోరోక్విన్ మందును అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. రెండువందల మిల్లీ గ్రాములుండే ఒక్కోబిళ్ల తయారీకి మూడు రూపాయలు అవుతున్నట్లు అంచనా. దాన్ని ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు. బ్రాండ్, డోసు ఎక్కువ, తక్కువను బట్టి రేట్లలో తేడాలు ఉంటాయి. ఇదే అమెరికాలో 200 మిగ్రా ఒక్కోబిళ్ల తయారీకి ఇరవై నుంచి 70 రూపాయలవరకు ఖర్చు అవుతుంది. బహుశా ఈ కారణంగానే ట్రంప్ మన దేశం నుంచి చౌక ధరలకు ఈ మందు కావాలని మన ప్రధాని నరేంద్రమోడీని బెదిరించి ఉండవచ్చన్నది ఒక కారణం. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులను అధిక ధరలకు ఇతర దేశాలకు విక్రయించి మన దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికా వాణిజ్య కంపెనీలకు రెండు చేతులా లాభాలే లాభాలు. ఇది నగ సత్యం. కరోనా వైరస్ నివారణకు ఈ మందు పని చేస్తుందని ఎవరూ నిర్దారించకపోయినా ట్రంప్ పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించటంతో అమెరికన్లు తుపాకులతో పాటు ఈ ఔషధాన్ని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఎప్పుడైనా పనికి వస్తుందని నిలవ చేసుకుంటున్నట్లు వార్తలు. తుపాకులు ఎందుకు అంటే అమెరికాలో ఏ కారణంతో అయినా సంక్షోభ పరిస్ధితులు ఏర్పడినపుడు చేతిలో తుపాకీ ఉంటే రక్షించుకోవచ్చన్నది అమెరికన్ల నమ్మిక !