Tags
how narendra modi disappointed entire nation, lock down extension, Lock down extension up to May 3rd
ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ కరోనా, గృహబందీ(లాక్‌డౌన్) మూడవ ప్రసంగంలో సప్తపది అనే పదాన్ని వినియోగించారు. ఏడు అంశాలను పేర్కొన్నారు కనుక ప్రాసకోసం ప్రయోగించారని సరిపెట్టుకోవాలా ? నిజానికి అది హిందువుల సంప్రదాయ వివాహ శుభ సందర్భంగా నిర్వహించే ఒక క్రతువు. వివాహంలో సూత్రధారణ తరువాత నవ వధువులు అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడవటాన్ని సప్తపది అంటారు. అయితే విశ్వాసులు ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ క్రతువును పాటించిన వారు కాళ్లపారాణి ఆరక ముందే భార్యలను వదలివేసే భర్తలు, భర్తలను వదలివేసే భార్యలను మనం చూస్తున్నాం. దీనికి ఇంకా ఏమైనా అర్ధాలున్నాయేమో నాకు తెలియదు. వివాహం వేరు, కరోనా లేదా మరొక మహమ్మారి మీద పోరాడటం వేరు. రెండూ పరస్పర విరుద్దమైనవి. మోడీ ప్రసంగం విని, చూసిన వారికి పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం చదివినట్లుగా సప్త పది ప్రయోగం అనిపిస్తే అది వారి తప్పుకాదు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఈ నేపధ్యంలో అనేక మంది గృహబందీ వ్యవధిని పొడిగించాలని సూచించారు, అనేక రాష్ట్రాలు ఏప్రిల్ 30వరకు పొడిగించాలని ముందే నిర్ణయించి ప్రకటించాయి. దీనికి మోడీ గారు కొత్త ట్టిస్ట్ ఇచ్చి మండల దీక్షగా ( అయ్యప్ప, దానికి అనుకరణగా ఇతర దీక్షలు) ధ్వనింప చేస్తూ మే మూడవ తేదీ వరకు 19రోజులు పొడిగించారు. ఇవన్నీ పక్కన పెడదాం.దేశమంతా ఎంతగానో ఎదురు చూసిన మోడీ పలుకుల్లో కొత్తదనం ఏముంది ? జనం లేదా అనేక రంగాలు కోరుతున్న అంశాలను ఎక్కడైనా ప్రస్తావించారా ? ఏమి ప్రస్తావించారు అనేది ముఖ్యం. తెలుగులో ఒక లోకోక్తి లేదా సామెతల గురించి చాలా మంది వినే ఉంటారు. వాటిలో ఒకటి వట్టి మాటలకు కడుపులు నిండుతాయా ? రెండవది వట్టిస్తరి – మంచినీళ్లు. ఇంతకు మించి మోడీగారి ప్రసంగంలో మరొకటి కనిపించలేదు.
మొదటి రెండు ఉపన్యాసాలలో చప్పట్లు, దీపాల వెలిగింపు పిలుపు ఇచ్చారు. మూడవ దానిలో ఇప్పటికే జనమందరూ పాటిస్తున్న అంశాల సప్తపది సుభాషితం తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. దీని గురించి నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. కొందరు హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించారు. రెండో పిలుపు సందర్భంగా దీపాల వెలుగు పేరుతో దీపావళి జరుపుకున్నవారు ఇప్పుడు అలాంటి మరొక అవకాశం రాలేదే అని నిరాశపడి ఉంటారు. ఈనెల 20వరకు మరింత గట్టిగా గృహబందీ అమలు తరువాత ఏమి చేయాలనేది ఆ తరువాత నిర్ణయిస్తారు. ఆ తేదీ నాటికి కొత్త కేసులేవీ నమోదు కానట్లయి బందీ నిబంధనల సడలింపుకు సంబంధించి బుధవారం నాడు మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తామని మోడీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమంలో వెల్లడైన ధోరణి చూస్తే తరువాత ఏమిటి అని అనేక మంది ప్రశ్నించారు.హిందీ సినిమాల్లో మాదిరి ప్రసంగంలో 80శాతం ఏమీ లేదన్నది ఒక వ్యాఖ్య. మిగతా కొన్ని ఇలా ఉన్నాయి. ఆయనెందుకు అలా మాట్లాడారు మనం ఏమన్నా నాలుగేండ్ల పిల్లలమా ? మోడీ చెప్పదలచుకున్న సందేశానికి 30నిమిషాలు అవసరం లేదు. ప్రసంగం మోడీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని మోడీ చెప్పటం మా ఛానల్ చందాదారులుగా చేరండి అని చెప్పిట్లుగా ఉంది. మోడీ ప్రసంగాన్ని ముందుకు జరిపే బటన్ ఇచ్చి ఉండాల్సింది. పావు గంటసేపు అబద్దాలు, చెత్త మాట్లాడారు. పావు గంటసేపు సరకులేకుండా మాట్లాడారు. వాస్తవాలను మరుగుపరచి మాటల జడివాన కురిపిస్తూ ఎలా మాట్లాడవచ్చో నేర్చుకున్నాను. వైద్యులు, వైద్య సిబ్బందికి పిపిఇ కిట్స్ ఏర్పాటు, దేశమంతటా కరోనా పరీక్షల పెంపు, పేదల సంరక్షణ, ఆరోగ్యవసతుల కల్పన, ఆర్ధిక వ్యవస్ద మరియు ఉపాధి పునరుద్దరణ, ఔషధాల కొరత, వలస కార్మికుల గురించి ప్రస్తావన లేకుండా చక్కగా ప్రసంగించారు.
నరేంద్రమోడీ ప్రసంగం గురించి ఇంతకంటే ఎక్కువ రాయనవసరం లేదు. పరీక్షా సమయాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు వ్యవహరించే తీరు తెన్నులను బట్టి జనం స్పందిస్తారు. పొగిడిన నోళ్లతోనే నవ్వుతారు. ఇక మోడీ గారి ‘సప్తపది’ గురించి చూస్తే 1.వృద్దుల సంరక్షణ, 2. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో తయారు చేసిన ముఖతొడుగులు ధరించండి, 3.వ్యాధి నిరోధక చర్యలు తీసుకోండి.4,ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించండి, 5. పేదలను ఆదుకోండి, ఆహారం అందించండి, 6. ఉద్యోగులను ఆదుకోండి, తొలగించవద్దు, 7. ఆరోగ్య సిబ్బంది, పోలీసు తదితర యంత్రాంగ సేవలను అభినందించండి. వీటిలో కొత్త అంశాలేమి ఉన్నాయి గనుక.
కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇస్తూ గృహబందీని మే 25 నుంచి ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో అందరూ చెప్పలేని ఇబ్బందులు పడ్డారు. అయినా ఆరోగ్యం, ప్రాణాలే ముఖ్యం కనుక జనం సర్దుకున్నారు. ఈ 21 రోజుల్లో అనేక సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జనాన్ని, అసలే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవటం గురించి ఎదురు చూసిన వారికి ప్రధాని ప్రసంగం తీవ్ర నిరాశపరచింది. ఇబ్బందులు పడుతున్నవారికి కావాల్సింది ప్రధాని మోడీ మాదిరి కార్చిన కడవల కొద్దీ కన్నీరు, సానుభూతి, జనం ముందు తలవంచటం కాదు. ఇప్పటికే సామాన్యులు, మధ్యతరగతి వారు తమ వంతు త్యాగాలు చేశారు. ఇంకేమాత్రం చేసే స్ధితిలో లేరు.
గతంలో వాజ్‌పేయి పాలించినా, కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల ప్రధానుల ఏలుబడిలో ఉన్నా మన దేశంలో సంపద కొద్ది మంది దగ్గర పోగుపడే విధానాలే అనుసరించారు, ఇప్పుడు నరేంద్రమోడీ కూడా అదే చేస్తున్నారు.కరోనా కష్టాలను తెచ్చింది నిజం. కానీ ఇప్పుడు జనాన్ని ఆదుకొమ్మని చెబుతుంటే రాష్ట్రాల, దేశ ఆర్ధిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నవారికి ఇంతకాలం సంపదలు పోగేసుకున్న వారు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఈ కష్ట కాలంలో వారేమి చేస్తున్నారు, పాలకులు వారి నుంచి వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.2018లో ప్రతి రెండు రోజులకు ఒకరు డాలర్ బిలియనీర్‌గా మారారు. అంటే సంపద కోట్లు దాటటం. ప్రపంచ చరిత్రలో 2016 రెండవ త్రైమాసిక కాలం నుంచి 2018లో అదే సమయానికి ప్రపంచ సంపదల్లో 82శాతం ఒక శాతం మంది చేతిలో ఉన్నాయి. చరిత్రలో ఇంత పెరుగుదల ఎన్నడూ నమోదు కాలేదని ఆక్స్‌పామ్ సంస్ద తెలిపింది. 2006 నుంచి 2015వరకు జరిపిన పరిశీలన ప్రకారం సామాన్య కార్మికుల ఆదాయం ఏడాదికి సగటున రెండు శాతం పెరిగితే బిలియనీర్ల సంపద దానికి ఆరురెట్లు ఎక్కువగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే ఒకశాతం ధనికుల వద్ద 58శాతం పోగుపడింది. ఈ మధ్యకాలంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. 2017 బడ్జెట్ వివరాల ప్రకారం మన దేశంలో ఒక శాతం ధనికులు 73శాతం కలిగి ఉంటే పేదలుగా ఉన్న 67కోట్ల మంది జనం సంపద కేవలం ఒకశాతమే పెరిగింది. బిలియనీర్ల పెరుగుదల ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం తప్ప అభివృద్ధి సూచిక కాదు. ఒక ప్రముఖ పరిశ్రమ సిఇఓ ఏడాదికి పొందుతున్న ఆదాయ స్దాయికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కనీసవేతనాలకు పని చేసే కార్మికుడు చేరాలంటే 941 సంవత్సరాలు పడుతుంది.
కార్పొరేట్ సంస్ధలకు ఏటా లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో ప్రభుత్వం కట్టబెడుతున్నది. వాటికి తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కావాలని ఎగవేస్తుంటే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నది. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కింద మూడు సంవత్సరాల నిఖర లాభాల సగటులో రెండుశాతం మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్దితి అవసరాలకోసం పిఎం-కేర్ (ప్రధాని పౌరసహాయం మరియు ఉపశమన నిధి) నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నివారణను అత్యవసర పరిస్ధితిగా పరిగణిస్తున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ నిధికి కంపెనీలు ఇచ్చే మొత్తాలను సిఎస్‌ఆర్ కింద ఖర్చు చేసినట్లుగానే పరిగణించి ఆ మేరకు మినహాయింపులు ఇస్తారు. అదే కంపెనీలు ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చే మొత్తాలకు ఇది వర్తించదు. అయితే రాష్ట్రాలలో విపత్తు సహాయం లేదా అత్యవసర నిధికి కూడా ఈ మొత్తాలను ఇస్తే మినహాయింపు ఇస్తారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ మీడియాలో ప్రచారం పొందుతున్న బడా కంపెనీలన్నీ ఆ సొమ్మును పిఎం కేర్‌కు బదలాయిస్తున్నాయా లేక నిజంగా విరాళాలు ఇస్తున్నాయా అన్నది తరువాత గానీ బయట పడదు. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు కంపెనీలు సిఎస్‌ఆర్ నిధి నుంచి కార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే మొత్తాలను కూడా ఈ నిధిఖాతాలో రాయవచ్చు. కరోనా సమయంలో తాత్కాలిక, కాజువల్, రోజువారీ కార్మికులకు సాయం చేయవచ్చు. కంపెనీ నిఖర ఆస్ధుల విలువ ఐదు వందల కోట్లు లేదా వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే కంపెనీలు అంతకు ముందు సంవత్సరంలో నిఖరలాభం ఐదు కోట్లు ఉన్నవి సామాజిక బాధ్యత కింద రెండుశాతం మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది.గడచిన ఐదు ఆర్ధిక సంవత్సరాలలో ఈ మేరకు కంపెనీలు 52వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదించాయి.
నరేంద్రమోడీ సర్కార్ ఈ కంపెనీలను విరాళంగా తీసుకున్న మొత్తాలను తన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుగా చూపుతున్నది. నిజానికి ఇలాంటి సందర్భాలలో లక్షల కోట్ల రూపాయల రిజర్వు నిధుల నిల్వలున్న కార్పొరేట్ కంపెనీల నుంచి కొంత శాతం మొత్తాలను విధిగా ప్రభుత్వాలకు జమచేసేట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఆ సొమ్ము కష్టపడి పనిచేసిన కార్మికులదీ, ప్రజలది తప్ప మరొకటి కాదు. అలాంటి ప్రత్యేక పధకాలను ప్రకటిస్తారని అనేక మంది ఎదురు చూశారు. ప్రధాని తన ప్రసంగంలో కొన్ని చెప్పకూడని మాటలు చెప్పారు. కనీసం ఒక్క కరోనా కేసు కూడా మన దేశంలో నమోదు కాక ముందే నివారణకు ఏర్పాట్లు చేసినట్లు మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఇది విమర్శించటానికి తగిన సందర్భం కాదు కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని చెప్పిందే నిజమైతే విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్ ఎందుకు చేయలేదు ? విదేశాల నుంచి నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాలకు రాదలచుకున్న వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్ ఎందుకు చేయలేదు, రోగులకు చికిత్స ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్పాలి. తొలి కేసు జనవరిలోనే నమోదైన విషయం అందరికీ తెలిసిందే మార్చి 22న జనతా కర్ఫ్యూ, 25 నుంచి గృహబందీ ప్రకటించారు.
గత ఇరవై ఒక్క రోజులుగా రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోట్లాది మంది వలస కార్మికులు అనేక చోట్ల చిక్కుకు పోయారు, వారు తమ ఇండ్లకు వెళ్లే అవకాశాలు ఈనెల 20వ తేదీవరకు ఉండవు. తరువాత ఉంటాయో లేదో తెలియదు. వారి అవసరాలను ఎవరు చూడాలి? వారుంటున్న ప్రాంతాలలో పారిశుధ్యం,తదితరాల పరిస్ధితి ఏమిటి? అందుకు కేంద్రం వద్ద ఉన్న పధకాలేమిటి ? రాష్ట్రాలు తమకున్న పరిమిత వనరులతో వారిని ఆదుకోగలవా ? పోనీ అప్పోసప్పో చేసి ఖర్చు చేస్తే కేంద్రం భరిస్తుందా ? అదనపు ఖర్చు భరిస్తున్న రాష్ట్రాలకు పరిస్ధితి తీవ్రతను బట్టి కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదా ? అప్పులు తీసుకొనేందుకు అడ్డువస్తున్న నిబంధనలను కూడా కేంద్రం, రిజర్వుబ్యాంకు సవరించలేదనే అంశాల గురించి పట్టించుకోవనవసరం లేదా ? వైద్య పరికరాల సరఫరాను కేంద్రం పర్యవేక్షించాల్సిన అగత్యం లేదా ? చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్రం చేసే సాయం ఏమిటి ? కార్మికులను తొలగించవద్దని సలహా చెబితే సరిపోతుందా ? ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లేదా కనీసం ప్రస్తావన అయినా ఉంటుందనుకున్న వారిని ప్రధాని తీవ్ర నిరాశకు గురిచేయలేదా ?