Tags

, , , ,

సత్య
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేక విషం చిమ్మే నాగుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా అవకాశంగా తీసుకొని అదే పని చేసే వారి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా చైనాలో బయటకు కనిపించిన కరోనాను అక్కడి కమ్యూనిస్టులే కట్టడి చేశారన్నది తలలో బుర్రవున్న ప్రతివారికీ స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎలా అదుపు చేస్తోందో జనానికంతటికీ తెలుసు.
కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు పార్టీలు విమర్శలకు అతీతం కాదు. తప్పు చేశారనిపించినా, విధానాలను తప్పు పడుతూ ఎవరైనా విమర్శించే హక్కు కలిగి ఉంటారు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక, సందర్భం, తర్కం ఉండాలి. అవి లేనపుడు మోకాలికీ బోడి గుండుకు ముడివేసేందుకు ప్రయత్నిస్తే వృధా ప్రయాస. గత లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్తగా నరేంద్రమోడీ భజన సమాజంలో చేరిన ఒక తెలుగు పత్రిక సీనియర్‌ జర్నలిస్టు అదేపని చేశారు. పోనీ చేసిన విమర్శ అందరికీ వర్తింప చేస్తే అదొక తీరు. కాదే ! గాజు కొంపలో కూర్చొని కమ్యూనిస్టుల మీద రాళ్లు వేస్తే కుదరదు.
బాబా నరేంద్రమోడీ గారు మండల దీక్షలో సప్తపది పాటించాలని సెలవిచ్చారు. చంద్రబాబా భక్తులుగా కొనసాగుతూనే మోడీ బాబా భజన బృందంలో చేరిన వారు పగలు ఒకరికి, రాత్రి ఒకరికి చెక్కభజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ” విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకుంటున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడటం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే నిర్భయంగా అజయ భవన్‌, గోపాలన్‌ భవన్‌, మఖ్దుం భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు ”.అని ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల గురించి రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడ చిక్కుకుపోయిన వారిని అక్కడే పరిమితం చేశారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు శ్రమ జీవులు కమ్యూనిస్టు పార్టీలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరుకొనే వీలు లేదని తెలియనంత ఆమాయక చక్రవర్తి అయితే కాదు కదా ? ఒక వేళ ఎవరైనా వచ్చి ఉంటే ఏమి చేసి ఉండే వారో మనకు తెలిసేది. అనేక సందర్భాలలో కమ్యూనిస్టుల కార్యాలయాలు ఆశ్రితులకు నిలయాలుగా మారిన చరిత్ర ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక బిజెపిని విమర్శించినట్లు ఉండాలి, మాట అనకుండా ఎంత తెలివిని ప్రదర్శించారో చూడండి.”సంస్ధాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని దాని సభ్యత్వం 18కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్‌ మూలంగా జీవితాలు దుర్భరమైన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపిలో సభ్యులుగా ఉన్నారా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ” అన్నారు. కమ్యూనిస్టుల వెనుక పేదలు లేరని ఇలాంటి వారే వేరే సందర్భాలలో రాస్తారు. బిజెపి లేదా తెలుగుదేశం వంటి పార్టీలకు పేదలు ఓట్లు వేయకుండానే వారు అధికారానికి వచ్చారని చెప్పదలచుకున్నారా ? మరి ఆ పార్టీలకు కమ్యూనిస్టులకంటే పెద్దవి, ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయే, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇక్కడ కమ్యూనిస్టుల మీద రాళ్లేస్తున్న పెద్ద మనిషికి ఒకటే కన్ను పని చేస్తున్నదా ? కష్టకాలంలో శ్రమజీవులకు ఆశ్రయం కల్పించటంలో కమ్యూనిస్టులు, కాని వారు, పార్టీలు, వ్యక్తులు, కమ్యూనిస్టు ఆఫీసులు, ఇండ్లేమిటి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాల్సిందే. అనేక చోట్ల కమ్యూనిస్టులు అలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ రాతలు రాసిన పెద్దమనిషి తన ఇంట్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు? లేదూ తాను పని చేస్తున్న సంస్ధ పేరుతో ప్రభుత్వం నుంచి పొందిన భూములలో కట్టించిన కార్యాలయాల్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సదరు విలేకరి, మీడియా శ్రమజీవులను పట్టించుకోరా లేక పట్టదా ? కరోనా పేరుతో ఎంతోకాలంగా పని చేస్తున్న వారిని ఇండ్లకు పంపిన తమ యాజమాన్య ” ఔదార్యం ” సంగతి ముందు చూడాలి. ఉద్యోగులను ఎవరినీ తొలగించవద్దని చెప్పిన తమ బాబా మోడీ ఉపదేశాలకు ఇచ్చిన విలువ ఏమిటి ? కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తి కొద్దీ చేయాల్సిందేదో చేస్తున్నాయి, వాటికి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తప్ప పార్టీల కార్యాలయాల వైపు తొంగి చూడటమే రాజకీయం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అన్నీ మూతబడ్డాయి. ఇలాంటి సమయాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులను అలాంటి చోట్లకు తరలించి ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులది. తమను స్వస్ధలాలకు పంపాలని ముంబైలోని బాంద్రా రైల్వేష్టేషన్‌కు అంత మంది పేదలు వస్తుంటే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు ? స్టేషన్‌కు చేరకుండానే వెనక్కు ఎందుకు పంపలేదు ? వచ్చిన వారిని నచ్చ చెప్పి పంపాల్సిన యంత్రాంగం లాఠీలకు పని చెప్పటాన్ని ఏమనాలి ?
” చింత చచ్చినా పులుపు చావనట్లు పదవుల కోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించే వారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది ” అని రాయి వేశారు. కమ్యూనిస్టులు కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు. అక్కడ వారేమి చేస్తున్నదీ యావత్‌ ప్రపంచం చూసిందీ. పొలిట్‌ బ్యూరోలో పేదల గురించి చర్చించారు కనుకనే కేరళ పార్టీకి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం కూడా చేయని విధంగా ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయటమే కాదు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూసేందుకు లాక్‌డౌన్‌కు ముందే అనేక రాష్ట్రాల అధికార బృందాలను అక్కడకు రప్పించగలిగారు. లక్షలాది మంది వలస కూలీలను, రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో దాస్తే దాగేది కాదు. నిజాన్ని చూడలేని ఉష్ట్రపక్షుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కమ్యూనిస్టుల గురించి మార్చి 21వరకు నరేంద్రమోడీ, ఆయన మంత్రులు, యావత్‌ యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? నిత్యం వారి చుట్టూ తిరిగే ఆ విలేకరికి అవేమీ కనిపించవా ? పొలిట్‌బ్యూరో కాకపోతే మరో పేరుతో మిగతా పార్టీలకు కమిటీలు లేవా ? అవి సమావేశాలు కావటం లేదా ?
కరోనా సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను రప్పించి భజనలో మునిగిపోయిందెవరో జనానికి తెలుసు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు పడిన పాట్లు దేశమంతటా చూసింది. అనేక చోట్ల నిత్యం చేస్తున్న కుట్రల గురించి ఒంటి కన్ను వారికి నిజంగా కనిపించవు. కమ్యూనిస్టులెక్కడా ఏ ప్రభుత్వాన్ని కూల్చిన లేదా కుట్ర చేసిన దాఖలా లేదు, ఎవరి కాళ్లనూ లాగలేదు. ఇప్పుడు చూడాల్సింది, జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కమ్యూనిస్టులు పొలిట్‌బ్యూరో ఏమి చర్చిస్తున్నారన్నదానికా, పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారో చూడాలా ? కమ్యూనిస్టులైనా, మరొక ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పరిమితం. కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాలు, కానీ పార్టీల ఏకవ్యక్తి నిర్ణయాలూ ఇవాళ కొత్తేమీ కాదు. అసలు ఆ విలేకరి సమస్య ఏమిటి ?
మోడీ సర్కార్‌కు ముందస్తు చూపు, శ్రద్ద ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ ముందునుంచే క్వారంటైన్‌లో పెట్టి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదు. ఒక పక్క మలేషియాలో, మరో వైపు పాకిస్ధాన్‌లో తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వచ్చిన వారు కరోనా వైరస్‌ను అంటించారని తెలిసినా నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు విదేశాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించారో, వైద్య పరీక్షలు చేయకుండా, క్వారంటైన్‌లోకి పెట్టకుండా మార్చినెలలో ఎలా వదలి పెట్టారో, దానికి బాధ్యులెవరో కేంద్రాన్ని, నరేంద్రమోడీని అడిగే దమ్ము సదరు జర్నలిస్టుకు లేదు.ఉన్న ఒక్క కన్నూ కమ్యూనిస్టుల మీద పెట్టారు కనుక కనుక ఇవేవీ కనిపించలేదను కోవాలి.
పదవి ఉన్న కాలంలో తమకు, తమ యాజమాన్యానికి పాకేజ్‌లు ఇచ్చిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తున్నదో ఎలా కాలక్షేపం చేస్తున్నదో సదరు జర్నలిస్టుకు తెలియదను కోవాలా ? కష్టకాలంలో రాష్ట్రం వదలి పారిపోయి హైదరాబాదులో దాక్కున్నారని వైసిపి చేసిన విమర్శలు వినిపించటం లేదా? కనిపించటం లేదా ? చంద్రబాబు నాయుడికీ పొలిట్‌ బ్యూరో ఉంది. ఆయనేమి చేస్తున్నారో తెలుసా ? ఎవరితో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా పని చేస్తున్నారా ? హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదో చెబుతారా ? ఇష్టమైన పార్టీలకు చేసుకొనే భజన మీద కేంద్రీకరించకుండా మధ్యలో కమ్యూనిస్టుల మీద ఇలాంటి అవాకులు చెవాకులు ఎవరిని సంతుష్టీకరించేందుకు చేస్తున్నట్లు ? కరోనా మీద, దాన్ని నిర్లక్ష్యం చేసిన వారి మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా !