Tags

, , ,

KCR Explains About Helicopter Money | CM KCR Press Meet | 11/04 ...

ఎం కోటేశ్వరరావు
గృహబందీ 2.0(లాక్‌డౌన్‌) మే నెల మూడవ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసం దేశంలోని అన్ని తరగతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రుల తరగతిలో తెలంగాణా వజీర్‌ ఆలా కె.చంద్రశేఖరరావు మరింత ఆశాభంగం చెంది ఉండాలి. మీడియా ముందుకు రావటానికి బిడియ పడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పైకి బయట పడకపోయినా పెద్దన్న చెప్పింది జరిగేట్లు చూడమని దేవుళ్లందరినీ గృహబందీ కారణంగా లోలోపల అయినా వేడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్ధిక పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్లు ఉంది మరి.
గృహబందీ పొడిగించటం అని వార్యం అని తేలిపోయి, లాంఛన ప్రకటన వెలువడటమే తరువాయి అన్న దశలో హెలికాప్టర్‌ మనీ అందచేయాలని కెసిఆర్‌ ప్రతిపాదించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఆ ”ఖ్యాతి”లో తన వాటా ఎక్కడ తగ్గుతుందో అన్న తొందరలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సలహా తనదే అని తన భుజాలను తానే చరుచుకున్న విషయం తెలిసిందే. సరే తరువాత ఏమైందో చెప్పుకుంటే అంత బాగోదు. మనోభావాలు దెబ్బతినవచ్చు.
మన కెసిఆర్‌ సార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడక ముందే అమెరికా, జపాన్‌, ఇతర దేశాల పత్రికల్లో ఇతరంగా దీని గురించి చర్చ ప్రారంభమైంది. విలేకర్ల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నోరు మూయిస్తారు గనుక, ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే కెసిఆర్‌ ముందు అవమానాల పాలుకావటంతో పాటు ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ధితి కనుక దాని మంచి చెడ్డలు కెసిఆర్‌ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉండదు.
ప్రస్తుత సంక్షుభిత స్దితిలో దీన్ని ప్రతిపాదిస్తే తాను ఖ్యాతి పొందవచ్చన్న ఆలోచనగానీ లేదా నరేంద్రమోడీ అలాంటి పని చేయవచ్చన్న అత్యాశగానీ కారణాలు ఏమైనా కెసిఆర్‌ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రధాని ప్రసంగం లేదా కేంద్రం నుంచి రెండవ విడత వెలువడుతుందని భావిస్తున్న ఉద్దీపన 2.0గానీ అలాంటి ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు ఉన్న ఉపాధి కోల్పోయి గోచిపాతలతో మిగిలారు. ప్రభుత్వాల సంక్షేమ పధకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ముందస్తు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కరోనా సమయంలోనే మూడేసి రూపాయల పన్ను పెంచి రాబోయే రోజుల్లో మరింతగా పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సర్కార్‌ జనానికి పన్ను పోటు తగ్గిస్తుందని లేదా ధనికుల దగ్గర మూలుగుతున్న సంపదల్లో కొద్ది మొత్తం తీసుకొని కరోనా కష్టకాలాన్ని గట్టెక్కిస్తుందని ఎవరైనా ఊహించగలరా ? మునిగిపోతున్న పడవలో ప్రయాణించే వారికి గడ్డిపోచ కనిపించినా దాన్ని పట్టుకొని బయటపడదామని చూస్తారు. రాష్ట్రాల పరిస్ధితి ఇలాగే ఉంది కనుక చంద్రశేఖరరావు అలాంటి ఆశతో హెలికాప్టర్‌ మనీ కోసం చూస్తున్నారని అనుకోవాలి.
చాలా మంది తెలంగాణా ముఖ్య మంత్రికి ఇలాంటి మహత్తర ఆలోచన ఎలా తట్టిందబ్బా అనుకుంటున్నారు. రెండు విషయాలు జరిగి ఉండవచ్చు. ఒకటి ముఖ్యమంత్రి పత్రికలు లేదా ఇంటర్నెట్లో వార్తలు చదువుతూ ఉండి ఉండాలి.రెండవది ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలు నాకు నివేదించాలి అని అధికార యంత్రాంగానికి పని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి ముందురోజు అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. మరో రూపంలో అంతకు ముందే మన దేశంలో కూడా కొంత మంది ఇలాంటి సూచనలే చేశారు. ఇక జరిగిందేమిటో మీరే ఊహించుకోవచ్చు.
పూర్వం వైద్యులు చేయగలిగింది చేశాం చివరి ప్రయత్నంగా మీకు అంగీకారమైతే గరళ ప్రయోగం చేద్దాం అనేవారని చదువుకున్నాం. అంటే రోగి ఆటో ఇటో అన్నమాట. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభానికి గురైనపుడు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చేతులెత్తేసే స్దితిలో జనానికి చేతి నిండా డబ్బు ఇస్తే ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుందనే ఒక దివాలాకోరు ఆలోచన ఇది. దీనికి హెలికాప్టర్‌ మనీ అని ఎందుకు పేరు పెట్టారు ? హెలికాప్టర్లు, మోటారు వాహనాలు, రైళ్లు లేని రోజుల్లో గనుక ఇలాంటి పరిస్ధితి మీద ఆలోచన వచ్చి ఉంటే దానికి గుర్రపు బండి లేదా గుర్రపు డబ్బు అనే వారేమో. ఎందుకంటే అప్పుడు అదే వేగంగా, కొండలు, గుట్టల మీద ప్రయాణించే సాధనం కనుక.
1969లో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారింది. ఆ సమయంలో వినిమయాన్ని పెంచటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించాలన్న ఆలోచనతో ఆర్ధికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ హెలికాప్టర్ల ద్వారా జన సమూహాలకు డబ్బును జారవిడిచి జనానికి డబ్బు అందించి కొనుగోలుశక్తిని పెంచవచ్చని తొలిసారిగా ఆ పద్దతి, పదప్రయోగం చేశాడు. హెలికాప్టర్లతో వేగంగా డబ్బు సంచులు మోసుకుపోవచ్చు, జనానికి అత్యంత సమీపానికి వాటిని దించవచ్చు.అలాంటిది మరొక సాధనం లేదు. నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించి జనానికి అందచేయటం ఇక్కడ కీలకం, దాన్ని తిరిగి జనం నుంచి వసూలు చేయాలా లేదా అంటే అది ఆయా ప్రభుత్వాల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఉచితంగా ఇవ్వాలన్నదే హెలికాప్టర్‌ మనీ ఉద్ధేశ్యం. అనూహ్యంగా ఈ పని చేయాలని మిల్టన్‌ చెప్పాడు తప్ప చెయ్యలేదనుకోండి !

KCR Explains About Helicopter Money
ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ? ప్రపంచంలో సంక్షోభం ఏర్పడినపుడు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిలో ఎలా పెట్టాలి అన్నది ఒక చర్చ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంటే ఆస్తుల కల్పన ద్వారా ఉపాధి కల్పించి జనం చేతుల్లో డబ్బు ఉండేట్లు చూడటం. దీన్ని కీన్స్‌ సిద్దాంతం అంటారు. గతంలో అమెరికాలో ఇదే చేశారు. పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు, వివిధ సేవలకు భవనాల(ఆసుపత్రులు, పాఠశాలల) వంటి మౌలిక సదుపాయాలు కలిగించటం దానిలో భాగమే. అవే తరువాత అమెరికా అభివృద్దికి ఎంతో తోడ్పడ్డాయి. మన దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం అలాంటిదే. కీన్స్‌కు విరుద్దమైనది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ సిద్దాంతం. మౌలిక సదుపాయాల కల్పన అంటే వెంటనే జరిగేది కాదు. కొంత వ్యవధి పడుతుంది. కనుక ఎటిఎం మిషన్‌లో ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బు వచ్చినట్లు జనానికి డబ్బు ఇచ్చి ఖర్చు చేయించటం ద్వారా వెంటనే వస్తువులకు డిమాండ్‌ పెంచవచ్చు అనే వినిమయదారీ సిద్ధాంతం మిల్టన్‌ది. హెలికాప్టర్‌ మనీ ప్రతిపాదనలు చేసే వారు దీన్ని నమ్ముతున్నారని అర్ధం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.75వేల కోట్ల ఉద్దీపన పధకం ప్రకటించింది. ఇది ఏమూలకూ చాలదు. మన జిడిపి విలువ 2020అంచనా 203 నుంచి 245లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. దీనిలో పైన చెప్పుకున్న మొత్తం0.86 నుంచి 0.7శాతమే. ఇది ఏమూలకూ చాలదు, కనీసం ఐదుశాతం ఉద్దీపనకు కేటాయించాలి అంటే పది నుంచి 12లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అనేక మంది చెబుతున్నారు. దీని కోసం నోట్ల ముద్రణ ఒక మార్గం అయితే, పరిమాణాత్మక సడలింపు అంటే మార్కెట్‌లో డబ్బు సరఫరాను పెంచటం మరొక పద్దతి. దీనిలో కూడా నోట్ల ముద్రణ కొంత మేరకు ఉంటుంది. 2008 సంక్షోభం తరువాత అమెరికాలో ఈ పద్దతిని కొంత మేరకు అమలు జరిపారు గానీ సంక్షోభం పరిష్కారం కాలేదు, త్వరలో మరొక సంక్షోభంలో కూరుకుపోతుందని కరోనాకు ముందే వార్తలు వచ్చాయి.
ముఖ్య మంత్రి కెసిఆర్‌ ప్రతిపాదించిన హెలికాప్టర్‌ మనీ పధకాన్ని కేంద్రం అమలు జరిపితే ఏం జరుగుతుంది ? కొంత సొమ్మును రాష్ట్రాలకు కేటాయిస్తారు. దాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వనవసరం లేదు.రాష్ట్రాలు తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది. ఇది ఒక అంచనా, అభిప్రాయం. అయితే పరిస్ధితులు బాగోలేనపుడు, రేపేం జరుగుతుందో తెలియనపుడు మనవంటి దేశాలలో సహజంగానే జనం తమ ఖర్చులను తగ్గించుకుంటారు, డబ్బును పొదుపు చేసి తమదగ్గరే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో సొమ్మును ఏం చేస్తారో అనే అపనమ్మకం కారణంగా జనం ఇటీవల బ్యాంకుల్లో సొమ్ముదాచుకోవటం లేదనే వార్తల విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే హెలికాప్టర్‌ మనీ పధక లక్ష్యం నీరుకారిపోతుందన్నది ఒక అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి రాలేదు. తమ రిజర్వుసొమ్ము, ఇతర ఖాతాల్లో వారు దాచుకున్నారు. జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది. మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడి నిరుద్యోగం పెరిగింది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది. అది మరింత నిరుద్యోగానికి కారణమైంది. స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది.
పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో పరిస్ధితులు వేరు. ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు. నిరుద్యోగ భృతి వంటి హామీలున్నాయి గనుక అక్కడ జనం అలా తయారయ్యారు. మనకా సామాజిక రక్షణ లేదు. డబ్బు వస్తే ముందు పొదుపు ఎలా చేయాలా అని చూస్తాం. ఈ వైఖరి మన దేశాన్ని ఇప్పటి వరకు రక్షిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు అమెరికా పద్దతికి నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగమే ఎన్ని క్రెడిట్‌ కార్డులు కావాలంటే అన్ని కార్డులు ఇవ్వటం, వాయిదాల పద్దతిలో వస్తువుల అందచేత వంటివి.
మన నరేంద్రమోడీ గారు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల చొప్పున మూడునెలలు ఇస్తామని ప్రకటించారు. డాలర్లలో ఏప్రిల్‌ 16 డాలరు మారకపు విలువ రూ.76.75లో 19.51 డాలర్లు. అదే ట్రంప్‌ నెలకు పెద్ద వారికి 1200 డాలర్లు, పిల్లలకు ఐదు వందల చొప్పున ప్రకటించారు, కానీ పెద్ద వారికి మూడువేలు, పిల్లలకు 1500చెల్లించాల్సిన అవసరం ఉందని గతంలో ట్రంప్‌ వద్ద కొంతకాలం సమాచార అధికారిగా పని చేసిన ఆంథోనీ కారముసి చెప్పాడు. వడ్డీ రేటు సున్నాకు దగ్గరలో ఉన్నందున, మరిన్ని అప్పులను కొనుగోలు చేస్తామని ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) చెప్పిన కారణంగా మరింత సొమ్ము చలామణిలోకి వస్తుందని, గత మూడు వారాల్లో ఒక లక్ష కోట్ల డాలర్లను చలామణిలోకి తెచ్చినట్లు(ఏప్రిల్‌ తొమ్మిది నాటికి మన రూపాయల్లో 76 లక్షల కోట్లు ) కారముసి చెప్పాడు.
హెలికాప్టర్‌ మనీ సరఫరా గురించి ఆలోచించే వారు రాగల ముప్పును కూడా గమనంలోకి తీసుకోవాలనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. జనం దగ్గరకు ఒక్కసారిగా డబ్బు చేరినపుడు డిమాండ్‌ మేరకు సరకులు లేకపోతే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో గృహబందీ సమయంలో జరుగుతున్నది అదే. జనం దగ్గర పరిమితంగానే డబ్బులున్నాయి, అయినా సరకుల రవాణాపై ఆంక్షలున్న కారణంగా ధరలు పెరిగాయి. సరకులు ఉన్నా ఆయాచితంగా ఒక్కసారిగా డబ్బు జనం చేతుల్లోకి వస్తే ధరలు పెరుగుతాయి, దాని పర్యవసానం వేతన పెరుగుదల ఉంటుంది, ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయో కూడా చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికా మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ కూడా ఒకసారి అమలు జరపాలి తప్ప మరోసారి పునరావృతం కాకూడదని కూడా చెప్పాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజాకర్షక రాజకీయవేత్తలు ఇదేదో బాగుందని తాము చేయాల్సిన వాటిని కూడా చేయకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లవైపు పరుగులు తీస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా చేస్తే రిజర్వుబ్యాంకుల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని,ఆర్ధిక అరాచకం పెరుగుతుందని, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని, ఇప్పుడంత అవసరం లేదనే వారు మరికొందరు.

CM KCR about Helicopter Money| KCR Press meet| 4D NEWS #helicopter ...
సార్వత్రిక కనీస ఆదాయ పధకాన్ని ముందుకు తెచ్చిన వామపక్ష భావాలున్న ఆర్ధికవేత్తలు ఇటీవల హెలికాప్టర్‌ మనీని ముందుకు తెచ్చారని దీనివలన ప్రభుత్వాలు చేసే ఖర్చు పడిపోతుందన్నది ఒక విమర్శ. ఈ పధకాన్ని అమలు జరిపితే వనరుల కేటాయింపు, కష్టపడేవారికి ప్రోత్సాహకాలు కరవు అవుతాయన్నది మరొక వాదన. అయితే గతంలో పెదవి విరిచిన వారు కూడా మరొక మార్గం ఏమీ కనిపించక ఏదో ఒకసారికి అయితే సరే అన్నట్లుగా తలూపుతున్నారు. నేరుగా నగదు పంపిణీ చేయకపోతే ఆర్ధిక వ్యవస్ధ మరింత దిగజారుతుందన్నది కొందరి హెచ్చరిక.
చివరిగా చెప్పవచ్చేదేమంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్లుగా కేంద్రం హెలికాప్టర్‌ మనీ అంద చేసే అవకాశాలు దాదాపు లేవు. కరోనా కారణంగా అనేక మంది చెబుతున్నట్లు అభివృద్ధి రేటు తిరోగమనంలోకి దిగిపోయి తిరిగి పైకి లేచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినపుడు గరళం పోయాల్సిన పరిస్ధితి వస్తే తప్ప ఇలాంటి పరిస్ధితి రాదు. అందువలన బంగారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు బీద అరుపులు అరిస్తే, జనాన్ని విస్మరిస్తే అన్ని తరగతుల్లో విస్వసనీయత సమస్య తలెత్తుతుంది. అదే జరిగితే రాజకీయంగా, పార్టీ పరంగా అనూహ్యపరిణామాలకు నాంది అవుతుంది. అలాంటి పరిస్ధితిని కెసిఆర్‌ కొని తెచ్చుకుంటారా ?