Tags

, , , ,

Donald Trump | WHO Coronavirus | US President Donald Trump Latest ...
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌కు అకారణంగా కోపం వచ్చింది. వయసు మీద పడిన ప్రభావం అనుకుందామా ? కొద్ది రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్దను, చైనాను పొగిడి వెంటనే తెగడటాన్ని ఏమనాలి ? ప్రపంచ ఆరోగ్య సంస్ధకు 50కోట్ల డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆంగ్లం మీద, విడిగా మాట్లాడిన అంశాల మీద జోకులు పేల్చినా, పరువు తీసినా నోరు మెదపని చిన్నన్న నరేంద్రమోడీ ఈ పరిణామం మీద మాట్లాడతారని ఎలా అనుకుంటాం ! ప్రపంచ వ్యాపితంగా కరోనా నిరోధ చర్యలను సమన్వయపరచాలని కోరుతున్న మోడీ ఈ ఆపద సమయంలో తన జిగినీ దోస్తు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టకపోయినా మరొక్కసారి ఆలోచించన్నా అని ఎందుకు ప్రాధేయపడలేకపోయారు ? అసలు ఈ చర్యకు ట్రంప్‌ చెబుతున్న కారణం ఎంతమేరకు నిజం ?
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కర్ర ఉన్నవాడిదే గొర్రె. బలమైన దేశాలు బలహీనమైన వాటిని వలసలుగా చేసుకున్నాయి. వలసల ఆక్రమణలో ముందున్న వాటితో వెనుకబడినవి ఏదో ఒక పేరుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని అనేక ప్రాంతీయ యుద్దాలకు తలపడ్డాయి.మన బొబ్బిలి యుద్దం, పక్కనే ఉన్న మైసూరు యుద్దాలు అవే. ఇలాంటివి మరింత ముదిరి బలవంతంగా ప్రపంచాన్ని పంచుకొనేందుకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాంతో సమస్య పరిష్కారం కాలేదు. సంధి ప్రయత్నంగా నానాజాతి సమితి పేరుతో మరో యుద్ధం రాకూడదని ఒక ఏర్పాటు చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజిత దేశాలు తిరిగి పుంజుకొని మరోమారు వాటా కోసం తలపడ్డాయి. ఫలితమే రెండవ ప్రపంచ యుద్దం. దాని పర్యవసానం వలసల ఏర్పాటు సాధ్యం కాకుండా చేసింది. నానాజాతి సమితి స్ధానంలో ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక సంస్ధలు అనుబంధంగా ఏర్పడ్డాయి. ఈ వ్యవస్ధలోనూ విజేతలదే పెత్తనం. అందునా రెండు ప్రపంచ యుద్ధాలలో ప్రత్యక్షంగా లేదా ప్రధాన యుద్ధ రంగాలలో పాల్గొనకుండా అటూ ఇటూ ఆయుధాలను అమ్మి సొమ్ముచేసుకున్న అమెరికా పరోక్షంగా ప్రపంచాన్ని, పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నించింది. సోవియట్‌ యూనియన్‌ అడ్డుకోవటంతో దాని ఆటలు పూర్తిగా సాగలేదు.1970దశకంలో చైనాకు ఐరాసలో స్ధానం కల్పించారు. సోవియట్‌-చైనా మధ్య తలెత్తిన విబేధాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన అమెరికా తీవ్ర ఆశాభంగం చెందింది. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత చైనాను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో చైనా బలపడింది, అమెరికా ఇతర దేశాల ఆశలు నెరవేరలేదు. ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ, ఇతర ప్రపంచ సంస్ధలతో తాము అనుకున్న లబ్ది చేకూరటం లేదు అని అర్దం చేసుకున్న అమెరికా అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఈ సంస్ధలను విమర్శించటం ప్రారంభించింది. అది ఐరాసకే పరిమితం కాలేదు. తాను ఏర్పాటు చేసిన మిలటరీ కూటమి నాటోను కూడా వదల్లేదు. ఐక్యరాజ్యసమితి సంస్ధలకు ఇస్తున్న విరాళాలను తగ్గించేందుకు పూనుకుంది. నాటో ద్వారా తాము ఐరోపాను రక్షిస్తుంటే అందుకయ్యే ఖర్చును పూర్తిగా మేమే ఎందుకు భరించాలి సభ్యదేశాలు కూడా పంచుకోవాలి అని ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు కరోనా సందర్భాన్ని వినియోగించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాడు. దానికి అతకని సాకులు చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ , మిగతా ఐరాస సంస్ధల భవితవ్యం ఏమిటి ? ఈ అంశాలను అర్ధం చేసుకోవాలంటే నేపధ్యంలోకి పోకుండా సాధ్యం కాదు.
ప్రపంచ శాంతి, భద్రతల కోసమే ఐరాసను ఏర్పాటు చేశారు. మార్కెట్లకోసం జరుగుతున్న పోటీలో అవాంఛనీయ పోకడల నివారణకు ఏర్పాటు చేసిందే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ). ప్రపంచీకరణ పేరుతో ఈ వ్యవస్ధ ద్వారా లబ్ది పొందాలనుకున్న ధనిక దేశాలు ఆచరణలో తాము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని గ్రహించగానే ఈ సంస్ధను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయి. ధనిక దేశాలలో 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత వివిధ దేశాలు డబ్ల్యుటిఓతో నిమిత్తం లేకుండా తీసుకున్న రక్షణాత్మక చర్యలు, చేసుకున్న ద్వౌపాక్షిక ఒప్పందాల తీరు తెన్నుల గురించి అలయన్స్‌ అండ్‌ యులెర్‌ హెర్మ్‌స్‌ ఎకనమిక్‌ సంస్ధ గతేడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. అగ్రరాజ్యం అమెరికా 790, జర్మనీ 390,బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌ 262, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు, ఒప్పందాలు చేసుకున్నాయి. ధనిక దేశాల దెబ్బను తట్టుకొనేందుకు వర్ధమాన దేశాల్లో మన దేశం 566, బ్రెజిల్‌ 302, చైనా 256 చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదిక తెలిపింది. గత పన్నెండు సంవత్సరాలలో వాణిజ్య విధానం ఆయా దేశాల లక్ష్యాల సాధనకు ఒక ఆయుధంగా మారింది. జాతీయ భద్రత పేరుతో తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా 2018 మేనెలలో 25,10శాతాల చొప్పున దిగుమతి పన్ను విధించింది. తాము కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటామని హెచ్చరించటంతో ఏడాది తరువాత రద్దు చేసింది. ఐరోపా యూనియన్‌ దేశాలు కూడా మిత్రదేశాలే అయినా 7.5బిలియన్‌ డాలర్ల మేరకు అమెరికా పన్నులు విధించింది. ఇక చైనా గురించి ఏకంగా వాణిజ్య యుద్దమే ప్రారంభించింది.కరోనా కారణంగా అది తాత్కాలికంగా ఆగిపోయింది. చైనా వస్తువుల మీద తాము విధించిన పన్ను దెబ్బకు భయపడిపోయి ఆ మేరకు ధరలు చైనా సంస్ధలు ధరలు తగ్గిస్తాయని ట్రంప్‌ పేరాశలు పెట్టుకున్నాడు. అయితే చైనా కూడా ప్రతి చర్యలు తీసుకుంది. మరోవైపు చైనా వస్తువులపై విధించిన పన్ను మొత్తాలను అధిక ధరల రూపంలో అమెరికా వినియోగదారులే చెల్లించాల్సి రావటంతో ట్రంప్‌ దిక్కుతోచని స్ధితిలో ఉండగా కరోనా వచ్చింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. గత ఏడుదశాబ్దాలుగా ఐరాస, దాని అనుబంధ సంస్ధల కార్యాలయాలు చాలా మేరకు అక్కడే ఉన్నాయి. వాటికయ్యే ఖర్చులో గణనీయ మొత్తం అమెరికా భరిస్తోంది. అయితే తాను ఖర్చు చేసిన ప్రతిడాలరుకు ఎంతలాభం వస్తుందో అమెరికా లెక్కవేసుకుంటుంది. అంతర్జాతీయ సంస్ధల కార్యకలాపాల నిమిత్తం వచ్చే ప్రతినిధి వర్గాలు, దేశాధినేతలు చేసే ఖర్చు, ఐరాస సిబ్బంది చెల్లించే పన్నులు అన్నీ వివిధ ప్రయివేటు సంస్ధలు, న్యూయార్క్‌ నగర ఖజానాలో పడతాయి.వాణిజ్యం, రియలెస్టేట్‌ పెరుగుతుంది. (ఇక్కడ ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధానులు, కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి సాధిస్తామని చెప్పటం, తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పడినపుడు వాటి కార్యాలయాల ఏర్పాటు ప్రాంతాల ఎంపికలో రాజకీయాలను గుర్తు చేయటం సముచితంగా ఉంటుంది)

WHO | Publications
2017లో ఐక్యరాజ్యసమితి ఖర్చు 50బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా పదిబిలియన్‌ డాలర్లు వివిధ రూపాలలో అందచేసింది. ఇంత ఖర్చు ఎంతకాలం భరిస్తాం, అసలు మనం ఎందుకు భరించాలి అనే ప్రశ్నలను ట్రంప్‌ యంత్రాంగం ఆనాడే లేవనెత్తింది. కోత పెట్టాల్సిందే అని ట్రంప్‌ ప్రతిపాదించాడు. ఐరాసలో ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్యరాజ్యం ఎంత సొమ్ము సభ్యత్వరుసుముగా చెల్లించాలో ఒక ఫార్ములా ఉంది. ఆయా దేశాల జాతీయ ఆదాయం, జనాభా, ఇతర మరికొన్ని అంశాలను బట్టి అది నిర్ణయం అవుతుంది.హెచ్చు తగ్గులను బట్టి మారుతూ ఉంటుంది.ఈ మొత్తాలను విధిగా చెల్లించాలి, లేకుంటే ఐరాస నుంచి వెళ్లిపోవాలి. ఈ సొమ్ముతో ఐరాస రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అది గాక ఐరాస చేపట్టే కార్యక్రమాలు అది ఆరోగ్య పధకం కావచ్చు లేదా ఏదైనా దేశంలో శాంతిస్ధాపక కార్యక్రమం వంటివి కావచ్చు. వీటికి దేశాలు, సంస్ధలూ విరాళాల రూపంలో ఐరాసకు అందచేస్తున్నాయి. ఇక్కడే తిరకాసు ఉంది, ట్రంప్‌ ప్రస్తుతం ఈ మొత్తాన్నే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు.
ఒక్కసారి వెనుక్కు చూసుకుంటే ఇరాక్‌లో సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచ మానవాళికి ముప్పు తలపెట్టాడనే తప్పుడు ప్రచారంతో అమెరికా, దాని తైనాతీ దేశాలు ఇరాక్‌ మీద దాడి చేసి ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణుశక్తి సంస్ధను రంగంలోకి దించారు. ఇలాంటి కార్యక్రమాలకు దేశాలు ఇచ్చే విరాళాలను బట్టి అవి నడుస్తాయి. డబ్బు లేకపోతే ఎలాంటి కార్యకలాపాలూ ఉండవు. అందుకే అమెరికా పెద్ద మొత్తంలో విరాళం అందచేసింది. తిరిగి ఆ మొత్తాలను ఐరాస పేరుతో వేతనాలు, ఇతర రూపాల్లో తన సైనికులు, ఇతర అధికారులు, వారి అవసరాల కోసం ఖర్చు చేసింది. 2018లో ఐరాస సాధారణ బడ్జెట్‌లో 22శాతం, శాంతి స్ధాపక కార్యక్రమాల కోసం 28శాతం బడ్జెట్‌ను అమెరికా భరించింది. అయితే 2019లో శాంతికార్యక్రమాలకు 25శాతానికి మించి ఇవ్వలేమని కోత పెట్టింది. సభ్యత్వ రుసుము బకాయి, ఇతర బకాయిలను వాటిలోనే సర్దుకోవాలని చెప్పింది. అంటే శాంతి కార్యక్రమాలకు గణనీయంగా విరాళాన్ని తగ్గించింది. ఇది సంచలనాత్మక అంశం కాదు కనుక మీడియా కూడా పట్టించుకోలేదు. సాధారణ సమయాల్లో ఏవైనా సంచలనాత్మక నివేదికలు, ప్రకటనలు చేస్తే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి కూడా జనానికి, మీడియాకు అంతగా పట్టదు. ఇప్పుడు కరోనా వ్యతిరేక పోరులో అది ముందు ఉంది కనుక, దాని పాత్రను వివాదం చేసి ఆ ముసుగులో ట్రంప్‌ విరాళాన్ని తగ్గించేందుకు అవకాశాన్ని వినియోగించుకున్నాడు కనుక పెద్ద చర్చనీయాంశమైంది.

Donald Trump: 'Disgusted' facial expressions 'help' presidential ...
ముందే చెప్పుకున్నట్లు 2017లో అమెరికా ఐరాసకు అందచేసిన పది బిలియన్‌ డాలర్లలో దాని సభ్యత్వ సొమ్ము 3.5బిలియన్లు కాగా, మిగిలిన సొమ్ము విరాళం. దీనిలో యూనిసెఫ్‌ పేరుతో పిల్లల సంక్షేమానికి, ఆహార కార్యక్రమం, శరణార్ధుల సంక్షేమం ఇతర కార్యక్రమాలకు ఇచ్చే నిధులు ఉన్నాయి. 2018లో ట్రంప్‌ విరాళాల్లో 30 కోట్ల డాలర్ల కోత విధించిన కారణంగా పాలస్తీనా నిర్వాసితుల సంక్షేమాన్ని అమలు చేసే సిబ్బందిలో 250 మందిని తొలగించారు. ఐరోపా, గల్ఫ్‌ దేశాలు అదనంగా ఇచ్చి కొంత మేరకు ఆదుకున్నప్పటికీ అమెరికా కోత ఫలితంగా లక్షా40వేల మందికి ఆహారం, 70వేల మందికి మంచినీరు అందచేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధకు విధిస్తున్న కోత దాని కార్యక్రమాలు అంటే ప్రధానంగా పేద దేశాల్లో, మనవంటి దేశాల్లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాక్సిన్‌ల వ్యాపారంలో పెద్ద వాటా కలిగి ఉన్న బిల్‌గేట్స్‌ తమ సంస్ధ ఇస్తున్న పది కోట్ల విరాళాన్ని 25కోట్ల డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఇలా ఏదో రూపంలో ప్రపంచ ఆరోగ్య సంస్ద కార్యక్రమం కొనసాగుతుందనేది వేరే విషయం, మానవత్వం, మానవతా పూర్వక సాయం గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా ఎందుకు ఇలాంటా అమానవీయ చర్యకు పాల్పడింది ? ఇరవైలక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉన్న దేశానికి 50 కోట్లు ఒక లెక్కలోనివా ? (మిగతా అంశాలు మరో వ్యాసంలో చూద్దాం)