Tags

, , , ,

Donald Trump 'imitates Indian Prime Minister Narendra Modi's ...

ఎం కోటేశ్వరరావు
అమెరికా పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నాడు, యావత్‌ ప్రపంచాన్ని అలవికాని ఆర్ధిక బాధల్లోకి నెడుతున్నాడు. ఈ వైఫల్యాన్ని, నేరాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థను, చైనాను దెబ్బతీసేందుకు పూనుకున్నాడు. ఈ వ్యాఖ్యతో ప్రారంభించిన ఈ రాతలో ఇంకేమి ఉంటుందిలే అని చప్పరించే వారు తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదని మనవి. ప్రాణ, విత్త, మానభంగములందు అసత్యాలు చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. ట్రంప్‌ దానికి ఎన్నికలను కూడా జోడించాడు. నవంబరులో జరగాల్సిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు ట్రంప్‌ ఎంతకైనా తెగించేందుకు సిద్దపడుతున్నాడని వేరే చెప్పనవసరం లేదు.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్ధలు ఏ ఒక్కరి సొత్తో కాదు. వాటిని ప్రారంభించే రోజు సంస్ధాపక సభ్య దేశాలలో కొన్నింటికి దురాలోచనలు మరికొన్నింటికీ దూరాలోచనలు ఉన్నాయి. ఎన్ని లోపాలున్నా అంతకంటే మెరుగైన ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనే వరకు ఉన్నవాటిని రక్షించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు అనుకూలంగా పని చేస్తోందని లేదా చైనా ఆ సంస్ధ మీద పెత్తనం చేస్తోందని నిజంగా నమ్మేవారు 1945 నుంచి 1971 వరకు చైనాను ఐక్యరాజ్యసమితి, దాని సంస్ధల గడప తొక్కనివ్వలేదని, చైనా పేరుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా పరిగణిస్తూ అమెరికా మోకాలడ్డిందని, ఐరాసలో అనుమతించినా 2000 సంవత్సరం వరకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు భాగస్వామ్యం కల్పించలేదని కూడా తెలుసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే పెత్తనం చేసింది. ఈ రోజు చైనా పెత్తనం చేస్తోందంటూ బుడిబుడి రాగాలు తీస్తోంది. ఇంతకాలం అమెరికా తప్పుడు పనులు చేసింది కనుకనే ఐరాసలో దానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, అదేపని చైనా లేదా మరొక దేశం చేస్తే వాటికీ అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు చైనా అలాంటి తప్పులు చేస్తోందా? ఉదాహరణలు ఉంటే ఎవరైనా చెప్పాలి మరి !
ఐక్యరాజ్యసమితికి రూపకల్పన చేసిన సమయానికి అమెరికా అగ్రరాజ్యం. నిబంధనల కూర్పులో దానిదే పైచేయి. ఇప్పుడు వాటినే అది ప్రశ్నిస్తోంది. ఐరాస, దాని సంస్దలు సమర్ధవంతంగా లేదా ప్రజాస్వామ్య బద్దంగా పని చేయాలంటే సంస్కరణలు తేవాలి. దానికి బదులు అమెరికా వంటి దేశాలు అర్ధంతరంగా నిధులు నిలిపివేస్తే నష్టపోయేది మన వంటి లేదా ఇంకా దరిద్రంలో ఉన్న దేశాలే. ఇలాంటి చర్యలకు బ్లాక్‌మెయిల్‌ లేదా బెదరింపు అని తప్ప మరొక భావం, అర్ధం లేదు. పెద్దన్న బెదరింపులను నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించటం లేదో తెలియదు. మన ప్రయోజనాలను రక్షించుకోవటమే దేశభక్తి అని అంగీకరిస్తే ఆచరణలో అది కనిపించాలి కదా ! అమెరికా మెడలు వంచి గత ఆరు సంవత్సరాలలో మనం సాధించిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పని చేస్తున్నట్లు ?
అమెరికా తన ఆయుధాలను అమ్ముకొనేందుకు అనేక చోట్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలను రెచ్చగొడుతోంది. గతంలో మన మీద పాకిస్ధాన్‌ను ఎగదోసింది, ఇప్పుడు మనలను దాని మీదకు ఎగదోస్తోంది. రెండు దేశాలకూ అవసరమైన ఆయుధాలను అందిస్తోంది, డాలర్లను జేబులో వేసుకుంటోంది. మనం ప్రాణాలను కాపాడే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు ఇస్తే దానికి బదులు ప్రాణాలు తీసే ఆయుధాలను మనకు అమెరికా అందచేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన వెంటిలేటర్ల బదులు ఇతర దేశాల్లో ప్రాణాలు తీసే ఆయుధ తయారీకే ట్రంప్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో నాటి సోవియట్‌ యూనియన్‌ పలుకుబడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ల పేరుతో మత ఉ గ్రవాదులను తయారు చేసింది. సోవియట్‌ ఉపసంహరణ తరువాత వారు ఏకుమేకై అమెరికాకే తలనొప్పిగా తయారయ్యారు. అక్కడ తన సైన్యాన్ని నిర్వహించటం పెద్ద భారంగా మారింది, చివరకు ఉపసంహరణకు ఆ తాలిబాన్లతోనే చర్చలు జరపాల్సిన దుర్గతి ట్రంప్‌కు పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌, ప్రపంచ సంపదలు, మిలిటరీ రీత్యా వ్యూహాత్మక ప్రాంతాల మీద పట్టు సాధించటం అమెరికా కార్పొరేట్ల అసలు లక్ష్యం. అక్కడి అధ్యక్షులందరూ వాటి కాపలాదారులు, సేవకులే.
బడ్జెట్‌ను సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్న ట్రంప్‌ అధికారంలోకి రాగానే పొదుపు చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అంద చేస్తున్న నిధుల కోత పెట్టాలని ప్రతిపాదించాడు. తరువాత అన్ని ఐరాస కార్యక్రమాలకు సగం కోత కోయాలని పార్లమెంట్‌ను కోరాడు.శాంతి పరిరక్షక కార్యకలాపాలకు కేటాయించే నిధుల మీద ఉన్న ఆంక్షలను 2001లో తొలగించారు. ట్రంప్‌ ప్రతిపాదనలను చర్చించిన పార్లమెంట్‌ శాంతిపరిరక్షక కార్యకలాపాల మొత్తాలకు తిరిగి పరిమితి విధించింది. దాంతో వాటికి అమెరికా అందచేస్తున్న మొత్తం 28 నుంచి 25శాతానికి తగ్గిపోయింది. ఆమొత్తం 2019లో 20 కోట్ల డాలర్లు. ఇదే సమయంలో రానున్న పది సంవత్సరాల కాలంలో శాంతి పరిరక్షక కార్యకలాపాలకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని చైనా నిర్ణయించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేస్తున్న దేశాలకు చేస్తున్న సాయానికి కూడా కోత పెట్టాలని ట్రంప్‌ కార్యాలయం ప్రతిపాదించింది.
ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 19నాటికి 1095 రోజుల్లో ఆడిన అబద్దాల సంఖ్య 16,241 అని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణలో వెల్లడించింది. నోరు తెరిస్తే రోజూ ఏదో ఒక అబద్దం ఆడిన అధ్యక్షుడు అమెరికా చరిత్రలో మరొకరు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు నిలిపివేసేందుకు ఆడిన అబద్దాలు ఎన్నో ! చైనా చెప్పినట్లు చేస్తోంది, చైనా దాచిన సమాచారాన్ని సమర్ధించింది. ఊహాన్‌లో కరోనా వ్యాప్తి పెద్ద సమస్య కాదని చెప్పిందట, అమెరికా సరిహద్దులను చైనాకు తెరిచి ఉంచాలని తొలుత సలహా ఇచ్చిందట. ఆరోగ్య సంస్ధ ఒక వేళ చెప్పిందే అనుకుందాం, మాకంటే మొనగాండ్లు లేరని విర్రవీగే సిఐఏ, ఎఫ్‌బిఐ తెలివి తేటలు ఏమయ్యాయి. చైనా సమాచారాన్ని దాచిందే అనుకుందాం, నష్టపోయేది వారే కదా ! ఎదుటి వాడు తొడకోసుకుంటే తెలిసి ఎవరైనా మెడకోసుకుంటారా ? అమెరికా, ఐరోపా దేశాలు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ద చెప్పిన వాటిని పెడచెవిన పెట్టి తమ పౌరుల ప్రాణాల మీదకు తేవటాన్ని ఏమనాలి ?
అసలేమి జరిగిందో చూద్దాం. కరోనా వైరస్‌ నిర్ధారణ గాక ముందు డిసెంబరు 31న చైనా ఒక ప్రకటన చేస్తూ ఊహాన్‌ నగరంలో న్యుమోనియా కేసులు అసాధారణంగా నమోదైనట్లు వెల్లడించింది. జనవరి ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నూతన కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చినట్లు నిర్ధారించింది. పన్నెండవ తేదీనాటికి దాని పూర్తి జన్యువును నిర్ధారించింది. తొమ్మిది రోజుల తరువాత తన తొలి శాస్త్రవేత్తల బృందాన్ని ఊహాన్‌ నగరానికి పంపింది. జనవరి 30న ఏక కాలంలో అనేక మందికి సోకే అంటువ్యాధిగా ప్రజారోగ్యానికి ప్రమాదం వచ్చిందని, అంతర్జాతీయ సమాజం అత్యవసరమైన అంశంగా పరిగణించాలని ప్రకటించింది. అయితే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించుతుందని స్పష్టమైన ఆధారాలు లేవని చైనా చేసిన ప్రకటనను జనవరి 14న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ట్వీట్‌ చేసింది. తరువాత వచ్చిన సమాచారం మేరకు ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.కానీ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికాను లేదా ప్రపంచాన్ని గానీ తప్పుదారి పట్టించలేదు. నిజానికి ఐరోపా ధనిక దేశాలు, ట్రంప్‌, యావత్‌ అమెరికా యంత్రాంగం ఆ హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ద ప్రకటనలను పట్టించుకోనవసరం లేదని జనవరి 22న ట్రంప్‌ చెప్పాడు. ఫిబ్రవరి పదవ తేదీన న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నాటికి వాతావరణం వేడెక్కుతుంది, కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యకరంగా అదృశ్యం అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి 26న విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఫ్లూ, ఫ్లూ వంటిది, అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది ఫ్లూతో మరణిస్తుంటారని తెలియదా అన్నాడు. మార్చి తొమ్మిదవ తేదీన కరోనాను తాము సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించాడు. అత్యధిక కేసులు, మరణాలో అమెరికాలో మరణ మృదంగం మోగుతుంటే ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధను తప్పుపడుతున్నాడు. తన తప్పిదం లేదని జనాన్ని నమ్మించేందుకు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నాడు. కట్టుకథలను మీడియాకు అందిస్తున్నాడు.

Ingram Pinn's illustration of the week: 'A beautiful timeline ...
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్‌ గురించి ఒక వైద్యుడు ముందే హెచ్చరించాడన్నది ఒక అంశం. అది నిజమై ఉండవచ్చు.ఒక ప్రాంతంలో తలెత్తిన ఒక ప్రమాదకర వైరస్‌ను ఎవరో ఒకరు లేదా ఒక బృందం ముందుగా అనుమానించటం లేదా కనుగొనటం సహజమే. అయితే అది యావత్‌ సమాజాన్ని భయాందోళనకు గురిచేసేది అయితే ముందుగా ప్రభుత్వంతో సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోకుండా, ఏర్పాట్లు చేయకుండా బయటకు వెల్లడిస్తే సమాజం అల్లకల్లోలం అవుతుంది. సదరు వైద్యుడు తాను అనుమానించిన అంశాన్ని నిర్దారిస్తూ సోషల్‌ మీడియాలో తన సహచరులతో పంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్‌ ఆసుపత్రిలో తగిన రక్షణ పరికరాలు లేవని, పోలీసుల ప్రవర్తన సరిగా లేదని తప్పుపట్టటం, మంత్రులతో సహా ఎవరూ పట్టించుకోవటం లేదని బహిరంగంగా చేసిన విమర్శను సహించని ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంది. అలాంటిది ఒక వైరస్‌ భయంకరమైనదని ఒక బృందం లేదా సంస్ధ నిర్దారించకుండా ఒక వైద్యుడు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఏ సర్కార్‌ అయినా ఎలా తీసుకుంటుంది ? తప్పుపడుతూ చైనా సర్కార్‌ ఆ వైద్యుడిపై చర్య తీసుకుంది. అతను చెప్పింది నిజమైంది గనుక తరువాత తన చర్యను సరిదిద్దుకుంది. ఒక వేళ అవాస్తవం అయి ఉంటే ?
2009, 10 సంవత్సరాలలో స్వైన్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. అది 1918-19లో ప్రపంచాన్ని వణికించి లక్షల మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ప్లూ హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ తాలుకు కొత్త రకం .పక్షులు, పందులు, మనుషుల నుంచి పునర్వర్గీకరణం చెందింది. ఇది పందుల నుంచి వ్యాపించిన వైరస్‌ కావటంతో దాన్నీ స్వైన్‌(పంది)ఫ్లూ అని పిలిచారు.ఇది కనీసం 70 నుంచి 140 కోట్ల మందికి సోకిందని అంచనా వేశారు. అయితే మరణించిన వారు 1.5లక్షల నుంచి 5.75లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించిన మేరకు 67లక్షల 24,149 మందికి వ్యాధి సోకగా మరణించిన వారి సంఖ్య 19,654 మాత్రమే. ప్రతి ఏటా ప్రపంచంలో ఫ్లూ(జలుబు) కారణంగా మరణించే వారు రెండున్నర నుంచి ఐదు లక్షల మంది వరకు ఉంటారని, దీనితో పోల్చుకుంటే స్వైన్‌ ప్లూతో మరణించిన వారు తక్కువే అని కొందరు పోలిక చెప్పారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కరోనాకు చైనాయే కారణమైతే ఏటా లక్షల మందిని బలిగొంటున్న ఫ్లూ వైరస్‌ను ఎవరు వదులుతున్నట్లు ?
స్వైన్‌ ఫ్లూ తొలుత మెక్సికోలోని పందుల ఫారాల నుంచి సోకి 2009 మార్చి తొమ్మిదవ తేదీన ఒక ఐదు సంవత్సరాల బాలుడిలో బయటపడింది. ఏప్రిల్‌ చివరిలో 50 రోజుల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే అంటువ్యాధిగా ప్రకటించింది. అంత సమయం ఎందుకు తీసుకున్నట్లని ఎవరూ ఆనాడు సంస్ధను తప్పుపట్టలేదు. నిధులు నిలిపివేయలేదు. అన్ని అంశాలను నిర్ధారించుకున్న తరువాతే ఒక బాధ్యతాయుత సంస్ధ వ్యవహరిస్తుంది. తాము అనేక నివారణ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఆ రోజుల్లో గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్టోబరు 24న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించాడు. అన్ని నెలలు ఎందుకు ఆలస్యం చేసినట్లు ? మరణాల సంఖ్య అధికార రీత్యా ప్రకటించిన మేరకు తక్కువే అయినా అగ్రస్ధానంలో అమెరికాయే ఉంది. ఇక మన దేశం విషయానికి వస్తే అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వైన్‌ ఫ్లూను మోసుకు వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో మే 13వ తేదీన గుర్తించారు, ఆగస్టు నాటికి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికులు 937 మంది మరణించగా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏలుబడిలో గుజరాత్‌ 488 మరణాలతో రెండవ స్ధానంలో నిలిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా మీద ఆధారపడింది అనటం ఎంతవరకు వాస్తవం ? ప్రపంచ ఆరోగ్య సంస్దకు మేము ఏటా 40 నుంచి 50 కోట్ల డాలర్లు అందచేస్తున్నాము, అదే చైనా నాలుగు కోట్ల డాలర్లు, అంతకంటే తక్కువే ఇస్తోంది. ఒక ప్రధాన ప్రాయోజిత దేశంగా ఉన్న తమకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి జవాబుదారీగా ఉండాలని కోరే హక్కు మాకుంది అని ట్రంప్‌ సెలవిచ్చాడు. అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నంత మాత్రాన అమెరికా చెప్పినట్లు ఏ సంస్ధ అయినా నడవాలా ?
అంటు వ్యాధుల నివారణ సమాచారం ఎవరి దగ్గర ఉంటే ఆ దేశాల మీద ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆధారపడటం సహజం. ప్రజారోగ్యం విషయంలో చైనా ప్రత్యేక చర్యలు, 2003లో కరోనా తరగతికి చెందిన సారస్‌ను చైనాలో సమర్దవంతంగా అరికట్టిన చరిత్ర, దానికి సంబంధించి వారి దగ్గర ఉన్న సమాచారం మరొక దేశం దగ్గర లేదు. కనుకనే కరోనా నిర్దారణ కాగానే చైనా సమాచారం మీద ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధారపడింది తప్ప నిధులు ఎక్కువ పొందో లేక మరొక ప్రలోభంతోనో కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఐరోపా యూనియన్‌ అమెరికాతో ఉంటుంది తప్ప చైనా మిత్రపక్షం కాదు. అలాంటిది నిధులు నిలిపివేయాలన్న ట్రంప్‌ చర్యను ఖండిస్తూ తీవ్ర విచారం ప్రకటించింది. నిందల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. వైరస్‌కు సరిహద్దులు లేవు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యేకించి నిధుల లేమితో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్దను బలపరచాలి, వాక్సిన్ల తయారీ పరీక్షల అభివృద్ధికి తోడ్పడాలని జర్మన్‌ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ వ్యాఖ్యానించాడు.
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ట్రంప్‌ చైనా మీద, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద నిందలు వేశాడు. ఐక్యరాజ్యసమితి సంస్ధలను తన రాజకీయాలు, దుర్మార్గ చర్యలకు ఉపయోగించుకోవటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వాటిని తన కనుసైగలతో నడిపించిన అమెరికా ఇప్పుడు ప్రాభవం కోల్పోతుండటంతో ఇతర దేశాలు అలాగే వ్యవహరిస్తున్నాయనే అనుమానపు జబ్బుకు గురైంది.
మన కళ్ల ముందే ఇరాక్‌లో ఏం జరిగిందో చూశాము. ఇరాన్‌కు వ్యతిరేకంగా పని చేసినంతకాలం ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుసేన్‌కు అన్ని రకాల ఆయుధాలను అందించి పదేండ్ల పాటు యుద్దం చేయించటంలో అమెరికా పాత్ర బహిరంగ రహస్యం. తరువాత అదే సద్దామ్‌ అమెరికా వ్యతిరేకిగా మారటంతో సద్దామ్‌ను వదిలించుకొనేందుకు ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశారని అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రచారం ప్రారంభించాయి. అమెరికా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న సద్దామ్‌ కువైట్‌పై దాడి చేసి అమెరికా సైనిక జోక్యానికి అవకాశం కల్పించాడు.
భద్రతా మండలిలో తీర్మానం చేయించి ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్ద ప్రతినిధి బృందాన్ని పంపారు.దానితో పాటు అమెరికా ప్రతినిధులు కూడా వెళ్లారు. దానిలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని అప్పుడే వార్తలు వచ్చాయి.రెండు బృందాలు కలసి రెండు సంవత్సరాల పాటు ఇరాక్‌లో తిష్టవేసి వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసి 1,625 మంది 1,700 స్దలాలను వెతికి చివరికి ప్రకటించిందేమంటే ఎలాంటి ఆయుధ ఆనవాళ్లు లేదా జీవ, రసాయన ఆయుధ కార్యక్రమాలు లేవని తేల్చారు. బుష్‌ విచారం వ్యక్తం చేశాడు. అయితే తమ చర్యను సమర్దించుకొనేందుకు ఆ కార్యక్రమాలను రద్దు చేసిన ఆనవాళ్లు దొరికాయని ప్రకటించి అమెరికా, ఇతర దేశాల యుద్ద నేరాలను కప్పిపుచ్చారు. ఆ పేరుతో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా సేనలు చివరకు సద్దామ్‌ హుసేన్‌ను ఉరితీసి తమ తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అమెరికా దాడి కారణంగా లక్షా తొమ్మిదివేల మంది మరణించినట్లు వికీలీక్స్‌ బయటపెట్టిన అమెరికా పత్రాల్లో ఉండగా మరో అంచనా ప్రకారం పదిలక్షల మంది ఇరాకీయులు అమెరికా కారణంగా మరణించారు. ఆల్‌ ఖైదాకు ఇరాక్‌ పాలకులకు ఎలాంటి సంబంధం లేదని సిఐఏ రహస్య పత్రాలు వెల్లడించాయి. అమెరికా చెప్పిన వన్నీ అబద్దాలే అని తేలిపోయింది. అలాంటి అమెరికా చైనా,ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే నమ్మటం ఎలా ?

ఊహాన్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్యను సవరించినట్లు చైనాయే స్వయంగా ప్రకటించింది. దీన్ని చూపి చూశారా చైనా నిజాలను దాచిందని మేం ముందే చెప్పాం అంటూ అమెరికా లేదా ఎవరైనా వాదించవచ్చు. వివిధ కారణాలతో కోటి మంది జనాభా ఉన్న ఊహాన్‌లో రోజూ అనేక మంది మరణిస్తుంటారు. అధికార యంత్రాంగం కరోనా మరణాలను కొన్నింటిని సహజ మరణాలుగా నమోదు చేసి ఉండవచ్చు. తరువాత విచారణలో కాదని తేలినందున అంకెలను సవరించారు. అదేమీ నేరం కాదే. మరణాలు, శ్మశానాల్లో అస్ధికలశాల సంఖ్య గురించి పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. నిజంగా వాటిని అక్కడి ప్రభుత్వాలు, పాలకులు నమ్మితే, పెద్ద సంఖ్యలో మరణించినట్లు చెబుతున్నదానికి ఆధారాలుంటే, అలాంటి ప్రమాదకారి కరోనా కట్టడికి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పిన వారు లేరు. పాత చింతకాయ పచ్చడినే కొత్తగా వండి వడ్డిస్తున్నారు.
ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీదనే కాదు అనేక సంస్ధల మీద ట్రంప్‌ సర్కార్‌ దాడి చేసింది. అదిరించి బెదిరించి లొంగదీసుకోవాలని చూసింది. ఆప్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అమెరికన్ల మీద , ఇతర దేశాలపై అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలపై విచారణ జరుపుతున్న అంతర్జాతీయ నేర కోర్టు న్యాయమూర్తులు, సిబ్బందిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జాన్‌ బోల్టన్‌ బెదిరించాడు. అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనల గురించి నిత్యం ఇతర దేశాలపై దుమెత్తిపోసే అమెరికా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్ధ నుంచి వైదొలిగిన తొలి దేశంగా చరిత్రలో నమోదైంది. అమెరికాలో దారిద్య్రం గురించి ఒక నివేదికను రూపొందించేందుకు ధైర్యం చేసిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ ఆల్‌స్టన్‌ను ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ విమర్శించాడు. ప్రపంచవ్యాపితంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసపోవటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అసలు అమెరికా అంటేనే వలస వచ్చిన వారితో కూడిన దేశం, అలాంటిది ప్రపంచ వలసల చర్చల నుంచి అమెరికా వైదొలిగింది. యునెస్కో నుంచి వైదొలిగి శాశ్వత పరిశీలక దేశంగా ఉంటానని ప్రకటించింది. వాతావరణ మార్పులు, యూదుల పట్ల వ్యతిరేకత, వారి మీద జరిగిన మారణకాండ వంటి అంశాల మీద యునెస్కో పని చేయటం, దానిలో అమెరికా పాత్ర బయటకు రావటం సహించలేని అమెరికా ఈ చర్యకు పాల్పడింది. పాలస్తీనియన్లు, ఇతర చోట్ల నిర్వాసితులుగా మారిన వారి సహాయ చర్యలు చేపట్టే సంస్ధకు తామింకేమాత్రం నిధులు అందచేసేది లేదని ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇలాంటి చర్యలను చూసిన తరువాత అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితిని అమెరికా మిత్రునిగా చూస్తోందో శత్రువుగా భావిస్తోందా అన్నవే అవి. ఇదంతా ఇంటర్నెట్‌లో వెతికితే ఎవరికైనా దొరికే సమాచారమే !
ఇటీవలి కాలంలో ఏమి చేసినా చివరికి ప్రధాని నరేంద్రమోడీని అవమానించినా అమెరికా, ట్రంప్‌ను బలపరిచే, గుడ్డిగా వెనకేసుకు వచ్చే, చైనా మీద బురద చల్లే ఒక అనాలోచిత ధోరణి మన దేశంలో వెల్లడి అవుతోంది. అమెరికాను నమ్మితే కుక్కతోకను బట్టి గోదావరిని దాటే యత్నం లాంటిదే. నరేంద్రమోడీని లేదా మరొకరిని వ్యక్తిగా లేదా ఒక రాజకీయవేత్తగా విమర్శిస్తే దాని సంగతి వారు చూసుకుంటారు. ప్రధాని పదవిలో ఉన్నపుడు అవమానాలు పాలుకావటం అంటే దేశ వ్యవస్ధనే అవమానించటంతో సమానం. అమెరికా పౌరుడు బిల్‌ గేట్సే తమ ప్రభుత్వ చర్యను విమర్శించాడు. కానీ మన పాలకపక్షాలకు ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. ముందు కరోనా నివారణకు మన ప్రాధాన్యత అని మన ప్రభుత్వ ప్రతినిధి ఒక ముక్తాయింపు ఇచ్చారు. మిగతా దేశాలకు ఆ మాత్రం తెలియక విమర్శించినట్లా ?

Who's Ready to Die for Trump's Ego? | Common Dreams Views
ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు ఆగిపోతే నష్టపోయేది మనవంటి దేశాలే అని గుర్తించటం అవసరం. అమెరికా, ఇతర ఐరోపా దేశాలలోని బహుళజాతి ఔషధ గుత్త సంస్ధలు ప్రజారోగ్యం, మహమ్మారులకు సంబంధించిన సమాచారంపై గుత్తాధిపత్యంతో ఔషధాలు, వాక్సిన్ల తయారీకి పూనుకోవటం తెలిసిందే. మన వంటి వర్ధమాన దేశాలకు అవసరమైన సలహాలు, సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి మాత్రమే పొందగలం. నిధులు లేక దాని కార్యకలాపాలు కుంటుపడితే నష్టపోయేది మన దేశం, మన ఔషధ కంపెనీలే అని గుర్తించాలి. కామెర్ల ఔషధం మన దేశ సంస్ధలు తయారు చేయక ముందు విదేశీ రకాలకు ఎంత ధర చెల్లించామో తెలిసినదే. మన వంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎంతగానో తోడ్పడుతోంది. అందువలన ట్రంప్‌ చర్యను యావత్‌ సభ్య సమాజం నిరసించాలి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఎన్నో కేసులను దాఖలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటివి ఎన్నో చూడాల్సి రావచ్చు. అందుకే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచ సంస్ధలను కాపాడుకొనేందుకు పూనుకోవాలి. ట్రంప్‌ను ఏ విధంగా సమర్ధించినా అది దేశద్రోహం తప్ప దేశభక్తి కాదు !

(అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -2 ముగింపు)