Tags

,

Food Banks Are Overrun, as Coronavirus Surges Demand - The New ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాతలు చేసే అన్నదానం ఇతర సాయం కోసం మన దేశంలోని పేదలు ఎలా ఎదురు చూస్తున్నారో నిత్యం చూస్తున్నాం. అత్యంత ధనిక దేశమైన అమెరికా పేదలు అదేపని చేస్తున్నారు. మనకు వారికీ తేడా ఏమిటంటే మన పేదలకు కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. అమెరికా పేదలకు విలాసవంతమైన కార్లుంటాయి. అక్కడా ఇక్కడా పేదలు చేయి చాచటం ఒకేవిధంగా ఉంటుంది. మన పిల్లలు అనేక మంది ఇప్పుడు అమెరికాలో చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. వారికి కనీసం దాతలు లేదా ప్రభుత్వం అందచేసే ఆహారం ఏమేరకు అందుతోందో లేదో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. ఆహార కూపన్లకు అర్హులో కాదో కూడా చెప్పలేము. మన దేశంలోని వలస కూలీలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అర్ధం చేసుకుంటే అమెరికా స్ధాయిలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన వారు కూడా ఇలాగే ఉండి ఉంటారు.
మన రైతాంగం పండించిన పంటలను విధిలేక అయినకాడికి అమ్ముకోవటం లేదా కూలీ ఖర్చులు కూడా రాకపోతే పొలాల్లోనే దున్నివేయటం కొత్త కాదు. ఇప్పుడు అమెరికాలో రైతులు అనేక చోట్ల ఇప్పుడు అదే చేస్తున్నారు. చికాగో సన్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15న రాసిన సంపాదకీయం ప్రకారం పితికిన పాలను కొనే వారు లేక రైతులు గోతుల్లో పోస్తున్నారు. కూరగాయల పొలాలను దున్ని పంటను మట్టిలో కలిపివేస్తున్నారు. అమెరికా ఎదుర్కొంటున్న ఈ నూతన సవాలును కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అది కోరింది. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కరోనా మరణాలు లక్షా 65వేలు కాగా ఒక్క అమెరికాలోనే 40వేల మంది చనిపోయారు. ప్రపంచంలో 24లక్షల మంది వైరస్‌బారిన పడితే అమెరికాలో ఏడులక్షల 65వేల మంది ఉన్నారు. తన ఏలుబడిలో ఇంత దారుణం ఎలా జరిగిందో దర్యాప్తు జరిపించాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తమ నిపుణులను చైనా పంపి కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో దర్యాప్తు చేయిస్తానని కబుర్లు చెబుతున్నాడు. అమెరికాలో ఇంతగా పరిస్దితి ఎందుకు దిగజారిందో ఏదో ఒక దేశం కాదు కనీసం ఐక్యరాజ్యసమితి బృందాన్ని అయినా అధ్యక్షుడు అనుమతిస్తాడా !
పరిస్ధితులు బాగున్నాయి అనుకున్నపుడే అమెరికాలో ఆహార భద్రత లేని కుటుంబాలు 1.43కోట్లు ఉన్నట్లు 2018 వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొన్నది. గత నాలుగువారాల్లో నిరుద్యోగులుగా మారామని, భృతి ఇవ్వాలని కోరుతూ 2.2కోట్ల మంది లేదా అమెరికా కార్మికవర్గంలో 13శాతం దరఖాస్తు చేశారు.వీరిలో దాదాపు సగం మంది యజమానులు ఆరోగ్యబీమా కల్పించిన వారే. ఇప్పుడు నిరుద్యోగులు కావటంతో ఆ రక్షణ ఉద్యోగం నుంచి తొలగించిన మూడు నెలలవరకు మాత్రమే ఉంటుంది. తరువాత కొనసాగాలంటే కార్మికులు తమ జేబుల నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలి లేదా బీమా లేకుండా జీవించాలి. భృతి దరఖాస్తుదారుల్లో 59 మంది మహిళలు ఉన్నారంటే నిరుద్యోగం వారి మీద ఎలాంటి ప్రభావం చూపనుందో అర్ధం చేసుకోవచ్చు.రోడె ఐలాండ్‌లోని పదిలక్షల మంది జనాభాలో 1.66లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు నాలుగు వందల దరఖాస్తులు వస్తున్నాయి.
ఆహార భద్రత లేని వారు అమెరికాలో 2019లో 3.7కోట్ల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. వీరిలో కోటీ పదిలక్షల మంది పిల్లలు,54లక్షల మంది వృద్దులు ఉన్నారు. కరోనా కేసుల మాదిరి ఈ సంఖ్యలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. పేదలకు ఆహారం అందచేసే ఫీడింగ్‌ అమెరికా అనే ధార్మిక సంస్థ ఇప్పుడు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అంతే కాదు అవసరమైన ఆహారాన్ని నిల్వచేసేందుకు అది నిర్వహించే ఆహార బ్యాంకులు, ఇతర సామూహిక వంటశాలలకు తగిన విస్తీర్ణం కలిగిన గోడవున్లు కూడా లేవని వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఆహారం కోసం లైన్లలో నిలుస్తున్నవారికి అధిక ధరల్లో ఆహారం కొనాల్సి వస్తోంది. సూపర్‌ మార్కెట్ల నుంచి వచ్చే విరాళాలు నాటకీయంగా పడిపోయాయి. గార్డియన్‌ పత్రిక విలేకర్లు సేకరించిన సమాచారం ప్రకారం పెన్సిల్వేనియా ఆహార బ్యాంకులు వారానికి పదిలక్షల డాలర్లు అదనంగా ఖర్చు చేస్తున్నా వచ్చిన వారందరికీ ఆహారం అందచేయలేకపోతున్నాయి. అనేక కేంద్రాల బడ్జెట్లు తారుమారవుతున్నాయి. బియ్యం ధరలు మూడు రెట్లు పెరిగాయి, అవి బంగారంలా మారాయి, డబ్బాల్లో నిల్వఉండే పండ్లు, కూరగాయలు దొరకటం లేదు.గత సంవత్సరం నాలుగు కోట్ల మంది అమెరికన్లు 200 ఆహార బ్యాంకులు, 60వేల వంటశాలల వండిన ఆహారం లేదా వంట వస్తువులను పొందారు.

Electric car drivers face queues and quarrels
లాస్‌ వేగాస్‌లో విలాసవంతమైన కార్లు వేసుకొని తెల్లవారు ఝామున నాలుగు గంటలకు వచ్చి ఆరుగంటల పాటు వరుసలో ఉండి ఆహారాన్ని తీసుకుపోతున్నవారు ఉన్నారు. గత వారం శాన్‌ ఆంటోనియోలో అసాధారణ రీతిలో పదివేల మంది కార్లలో ఆహారం కోసం వచ్చారు. అదే సాధారణ సమయాల్లో నాలుగు వందల మంది వచ్చే వారు. కంపెనీల్లో లేఆఫ్‌లు పెరగటమే దీనికి కారణం. అనేక చోట్ల ఆహార బ్యాంకుల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇండ్లకే ఆహారం సరఫరా చేస్తున్నారు. సియాటిల్‌ నగరంలోని ఒక ఆహారబ్యాంకు బడ్జెట్‌ ఇప్పటి తీరును బట్టి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్‌ వాణిజ్య యుద్దం కారణంగా ఆహార బ్యాంకులకు 2019లో 0.54 మిలియన్‌ డాలర్లకు వచ్చిన సరకులను కొనుగోలు చేయటానికి 2018లో 1.1మిలియన్‌ డాలర్లు కాగా ఈఏడాది అదే సరకుల విలువ 1.71 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. కరోనాకు ముందు లూసియానాలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఆకలితో ఉంటే ఇప్పుడు ముగ్గురిలో ఒకరు ఉన్నారు.
అమెరికన్లకు పొదుపు అలవాటు లేదు, ఉద్యోగాలు లేదా అప్పులు చేసి అవసరమైనవి కొనుగోలు చేసి బతికే విధంగా తయారయ్యారు. గత ఏడాది వివరాల ప్రకారం అమెరికన్లు 14లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు కలిగి ఉన్నారు. వాటిలో కార్ల రుణాలు 1.3లక్షల కోట్ల డాలర్లు, క్రెడిట్‌ కార్డు బకాయిలు లక్ష కోట్ల డాలర్లు, విద్యా రుణాలు 1.48 లక్షల కోట్లు, 9.4లక్షల కోట్ల తనఖా రుణాలు ఉన్నాయి.కొరత పోషకాహార సహాయ పధకానికి ఆహార కూపన్ల కోసం దరఖాస్తు చేసే వారికి గత డిసెంబరులో ట్రంప్‌ సర్కార్‌ సవరించిన నిబంధనల కారణంగా కనీసం ఏడు లక్షల మంది అనర్హులయ్యారని అంచనా. విధించిన షరతులను బాధితులు రుజువు చేయటం కష్టంగా మారింది. పద్దెనిమిది-49 సంవత్సరాల మధ్య వయస్సు వారు తమ మీద ఎవరూ ఆధారపడిలేరని, తాము వారానికి 20గంటలు పనిచేశామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవి చేసినా వారు మినహాయింపులు పొందిన ప్రాంతాలు, రాష్ట్రాలలో ఉన్నవారై ఉండాలి. దారిద్య్రరేఖ కింద ఉన్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు,నిరుద్యోగ భృతి చెల్లింపును ఎగవేసేందుకు ఈ పని చేశారు.

Rice is like gold': US food banks face shortfalls of millions of ...
అమెరికాలో రోజు రోజుకూ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికి అదుపులోకి వస్తాయో చెప్పలేని స్ధితి. మరోవైపు నవంబరులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి కూరుకుపోతున్నట్లు ఆందోళన పెరుగుతోంది. కరోనాకు ముందు, వ్యాధి తొలి రోజుల్లో ఎన్నికల్లో ట్రంప్‌ విజయం ఖాయం అని భావించిన వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్‌ వైఫల్యం, మూర్ఖత్వం పౌరుల ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున జోబిడెన్‌ అభ్యర్ధిత్వం ఖరారైంది. ప్రస్తుతం దేశమంతా కరోనా కల్లోలంలో మునిగి ఉంది. ముఫ్పైకోట్ల మంది గృహబందీలో ఉన్నారు. ఎప్పుడు తొలగించేది తెలియని స్ధితి. ఒక వైపు ఆకలి మరోవైపు నిరుద్యోగం, ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న స్ధితిలో వాటి మీద కేంద్రీకరించకుండా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ట్రంప్‌ చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద ప్రారంభించిన ప్రచార యుద్దం అతగాడికే ఎదురుతిరిగే అవకాశాలున్నాయన్నది ఒక అంచనా !